డిశంబరులోగా ఆంధ్రాలో పంట రుణాల మాఫీ?

  ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి కొంచెం మెరుగుగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అదేవిధంగా ఆంద్రప్రదేశ్ తో పోలిస్తే ఆ రాష్ట్రానికి వ్యవసాయ రుణభారం కూడా చాలా తక్కువే. అందువలన అధికార తెరాస పార్టీ తను ఎన్నికలలో ఇచ్చిన హామీ ప్రకారం, అధికారం చెప్పట్టగానే మొత్తం రుణాలను తక్షణమే మాఫీ చేస్తుందని ఆశించడం సహజమే. కానీ ఇంతవరకు రుణాల మాఫీ జరగలేదు. ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చే నెల మొదటి వారంలో దాదాపు రూ.10, 000 కోట్ల పంట రుణాలను మాఫీ చేసేందుకు సిద్దం అవుతుంటే, తెలంగాణా ప్రభుత్వం మాత్రం మొదటి దశలో కేవలం రూ. 4, 250 కోట్లు మాత్రమే మాఫీ చేసేందుకు జీ.ఓ. జారీ చేయడం, దానిని అమలు చేయడానికి ఇంకా మీనమేషాలు లెక్కిస్తుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది.   అంతే కాదు. ఈ అంశంపై బీజేపీ తెలంగాణా అధ్యక్షుడు కిషన్ రెడ్డి చేస్తున్న విమర్శలపై మంత్రి హరీష్ రావు స్పందిస్తూ ‘తమ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలా రుణమాఫీకి ఎటువంటి షరతులు మెలికలు పెట్టలేదని’ చెప్పడం కూడా చాలా ఆశ్చర్యకరంగానే ఉంది. తెలంగాణా ప్రభుత్వం కూడా రుణమాఫీ వ్యవహారం అధ్యయనం చేసేందుకు ఒక కమిటీని వేసింది. తీవ్ర ఆర్ధిక సమస్యలను ఎదుర్కొంటున్న ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఇంటికి లక్షన్నర చొప్పున రుణమాఫీ చేస్తామని, ఇప్పటికే రుణాలు చెల్లించిన వారికి కూడా మాఫీ చేస్తామని, డ్వాక్రా, బంగారు రుణాలను సైతం మాఫీ చేస్తామని హామీ ఇస్తుంటే, ఆంద్రప్రదేశ్ తో పోలిస్తే అన్ని విధాల మంచి స్థితిలో ఉన్న తెలంగాణా ప్రభుత్వం మాత్రం కేవలం లక్ష రూపాయలు మాత్రమే మాఫీ చేస్తామని, బంగారు వస్తువులపై తీసుకొన్న రుణాలను మాఫీ చేయబోమని ఖరాఖండిగా చెపుతోంది. పైగా ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం కంటే తమ ప్రభుత్వానికే చాల చిత్తశుద్ధి ఉన్నట్లు చెప్పుకోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది.   తెలంగాణా ప్రభుత్వం కొన్ని రోజుల క్రితం విడుదల చేసిన జీ.ఓ.ప్రకారం ఈరోజు అంటే సెప్టెంబర్ 26న రూ. 4, 250 కోట్ల రుణమాఫీ జరగాల్సి ఉంది. కానీ ఇంతవరకు లబ్దిదారుల గుర్తింపు ప్రక్రియే పూర్తి కాలేదని తెలుస్తోంది. అందువల్ల ఈ మొదటిదశ రుణమాఫీ ఎప్పటి నుండి మొదలుపెడుతుందో ఇంకా తెలియదు. కానీ ఈ విషయంలో ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం మొదటి నుండి కూడా చాలా ఖచ్చితమయిన ప్రణాళికతో ముందుకు సాగుతోంది. తీవ్ర ఆర్ధిక ఇబ్బందుల నడుమ కూడా ఈ మూడు నెలల కాలంలో వివిధ ఆదాయ మార్గాల ద్వారా రూ.10, 000 కోట్లు పొదుపు చేసి, దానిని వచ్చే నెల మొదటి వారంలో మొదటి విడత రుణమాఫీకి వినియోగించేందుకు పక్కనపెట్టింది. లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ కూడా దాదాపు పూర్తి చేసినట్లు తెలుస్తోంది.   అంతేకాక మిగిలిన పంట రుణాలను కూడా ఈ ఏడాది డిశంబరు లోగానే మాఫీ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా పట్టుదలగా ఉన్నట్లు సమాచారం. అందుకోసం నిధులు సమీకరించేందుకు ఆయన సుజనా చౌదరి నేతృత్వంలో ఇప్పటికే ఒక కమిటీని వేసారు. ఆ కమిటీ కూడా వివిధ ఆదాయ మార్గాల కోసం తీవ్రంగా అన్వేషిస్తోంది. అవసరమయితే ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక తాత్కాలిక కార్పోరేషన్ ఏర్పాటు చేసి దాని ద్వారా ఏదో విధంగా పంట రుణలను మొత్తం మాఫీ చేయాలని భావిస్తున్నట్లు సుజనా చౌదరి తెలిపారు. డిశంబరులోగా మొత్తం రుణాల మాఫీ సాధ్యమా కాదా అనే విషయాన్ని పక్కనబెడితే, ఆ ఆలోచన రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధికి అద్దం పడుతోంది.      అందువల్ల ఈ వ్యవహారంలో ఆంద్రప్రదేశ్ ప్రభుత్వ చిత్తశుద్ధిని శంఖించడానికి ఏమీ లేదనే చెప్పవచ్చును. ఒకవేళ ఆంద్రప్రదేశ్ ప్రభుత్వమే ముందుగా రుణాలను మాఫీ చేసినట్లయితే, అప్పుడు తెలంగాణా ప్రభుత్వంపైనే మరింత ఒత్తిడి పెరగడం తధ్యం. కనుక సున్నితమయిన ఈ అంశంపై ఒకరినొకరు విమర్శించుకొనే బదులు, రైతులకిచ్చిన తమ హామీని ఏవిధంగా నిలబెట్టుకోవాలనే విషయం గురించి ఆలోచిస్తే మంచిది.

భారత్-అమెరికా సంబంధాలను పునర్నిర్వచించనున్న మోడీ పర్యటన

    రేపటి నుండి భారత ప్రధాని నరేంద్ర మోడీ ఐదు రోజుల పాటు అమెరికాలో పర్యటించనున్నారు. నిరుటి సం.వరకు మోడీకి వీసా నిరాకరిస్తూ వచ్చిన అమెరికా ప్రభుత్వమే ఇప్పుడు ఆయనకు ఎర్ర తివాచీ పరిచి ఆయన రాక కోసం వేయి కళ్ళతో ఎదురుచూడటం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. అయితే దేశ భవిష్యత్ అవసరాలను, ప్రపంచ దేశాలతో బలమయిన సంబంధాలు కలిగి ఉండాల్సిన అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని పాత విషయాలను పక్కనబెట్టి మోడీ అమెరికా పయనమయ్యారు.   భారతదేశాన్ని అభివృద్ధి పధంలోకి వేగంగా పరుగులు తీయించాలని మోడీ ఆత్రుతను అమెరికా ప్రభుత్వం అక్కడి పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు కూడా గమనిస్తూనే ఉన్నారు ముఖ్యంగా దేశంలో వివిధ రంగాలలోకి విదేశీ పెట్టుబడులను రప్పించేందుకు చట్ట సవరణలు చేయడం, బులెట్ రైళ్ళు, దేశంలో కొత్తగా ఆధినిక రైల్వే లైన్ల నిర్మాణం, దేశ వ్యాప్తంగా వంద స్మార్ట్ సిటీల నిర్మాణం, ఉన్నత విద్యా సంస్థల ఏర్పాటు, యువతకు శాస్త్ర, సాంకేతిక నైపుణ్యం మెరుగుదల వంటి ఆయన ఆలోచనలు అమెరికా ప్రభుత్వానికి, అక్కడి పెట్టుబడిదారులను, పారిశ్రామికవేత్తలను, ఉన్నత విద్యా సంస్థలను భారతదేశంలో భారీగా పెట్టుబడులు పెట్టి తమ కార్యకలాపాలు మొదలుపెట్టేందుకు ప్రేరేపించేవిగా ఉన్నాయి. మోడీ తన ఈ అమెరికా పర్యటనలో ‘ఫార్ట్యూన్-500’ కంపెనీల సి.ఈ.ఓ.లతో సమావేశం కాబోతుండటం ఈ అంచనాలకు బలం చేకూర్చేవిగా ఉన్నాయి. గుజరాత్ కు చెందిన తనలో వ్యాపారం సహజంగానే ఇమిడి ఉందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపినందున ఈ అమెరికా పర్యటనలో ఆయన తన వ్యాపార దక్షతను అంతా కనబరిచి దేశానికి భారీ పెట్టుబడులు సాధించే అవకాశం ఉందని ఆర్ది నిపుణులు భావిస్తున్నారు.   భారత్-అమెరికాల మధ్య సత్సంబంధాలు ఉన్నప్పటికీ అవి ఉండవలసినంత బలంగా, ప్రయోజనకరంగా మాత్రం లేవని అందరూ అంగీకరిస్తారు. అందుకు ప్రధాన కారణం ఇంతవరకు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీకి బలమయిన విదేశీవిధానం లేకపోవడమేనని చెప్పక తప్పదు. కానీ మోడీ ప్రభుత్వం అధికారం చేప్పట్టిన తరువాత చైనా, పాకిస్తాన్ దేశాలతో వ్యవహరించిన తీరులో ఇరుగుపొరుగు దేశాలయిన భూటాన్, నేపాల్, శ్రీలంక వంటి దేశాలతో వ్యవహరించిన తీరులో గల స్పష్టమయిన తేడాను గమనించినట్లయితే మోడీకి ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ తగ్గాలో బాగా తెలుసునని స్పష్టమవుతోంది.   ఇంతకాలం అమెరికా గడ్డపై కాలుమోపేందుకు తనకు అనుమతించనప్పటికీ మోడీ దేశ విశాల హితాన్ని దృష్టిలో ఉంచుకొని ఆ విషయాన్ని పక్కనబెట్టి అమెరికాకు పయనమయ్యారు. అయినప్పటికీ అమెరికా ప్రభుత్వంతో ధీటుగానే వ్యవహరిస్తూ ఉభయదేశాల సంబంధాలను పునర్నిర్వచించవచ్చును. భారత్ అవసరాలకు, అభిప్రాయాలకు అనుగుణంగా అమెరికా స్పందించలేకపోయినట్లయితే, చైనా, జపాన్ దేశాలతో జత కట్టడానికి వేనుకంజవేయబోమని మోడీ ప్రభుత్వం ఇప్పటికే చెప్పకనే చెప్పింది. కనుక అమెరికా కూడా భారత్ తో స్నేహ సంబంధాలు మరింత బలపరుచుకోనేందుకే గట్టిగా కృషి చేయవచ్చును.   ఇంతవరకు భారత్ అంటే దరిద్రం, బీదరికం, లంచగొండితనం వంటి సకల అవలక్షణాలకు పుట్టినిల్లు వంటిదని భావిస్తున్న ప్రపంచ దేశాలు, ఇప్పుడు 125కోట్ల జనాభా గల భారతదేశం ప్రపంచంలో కెల్లా అతిపెద్ద మార్కెట్ అని అర్ధం చేసుకోవడంతో భారత్ పట్ల వారి దృష్టి కోణం కూడా మారింది. ఇందుకు అమెరికా కూడా మినహాయింపు కాదు కనుక ఈసారి మోడీ పర్యటనలో భారత్ కు భారీగా పెట్టుబడులు, ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం వచ్చే అవకాశం ఉందని భావించవచ్చును.

అరుణగ్రహంపై భారత్ తొలి సంతకం

  భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన మంగళ యాన్ ప్రయోగం విజయవంతమయింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన మార్స్ ఆర్బిటర్ (మామ్) విజయవంతంగా అరుణగ్రహ కక్షలో ప్రవేశపెట్టడం, అది కూడా భారత్ తన తొలి ప్రయత్నంలోనే సాధించడంతో భారత శాస్త్రవేత్తల అపూర్వ మేధస్సును, దేశ సాంకేతిక పరిజ్ఞానాన్ని యావత్ ప్రపంచానికి మరొకసారి చాటి చెప్పినట్లయింది.   పది నెలల పాటు దాదాపు 65 లక్షల కిమీ దూరం అవిశ్రాంతంగా సాగిన ఈ మంగళ యాన్ యాత్ర నేడు విజయవంతంగా ముగిసింది. ఇక నుండి మామ్ అరుణగ్రహంపై పరిశోధనలు మొదలుపెట్టి ఆ గ్రహం గురించి విలువయిన సమాచారం, ఫోటోలు బెంగళూరులో ఉన్న అంతరిక్ష కేంద్రానికి పంపుతుంటుంది. ఈరోజు మధ్యాహ్నం పన్నెండున్నర గంటల తర్వాత మార్స్ గ్రహ తొలి ఫొటో భూమికి చేరవచ్చును. ఇది అరుణగ్రహంపై భారత్ చేసిన తొలి సంతకంగా చెప్పుకోవచ్చును.   ఇప్పటికే భారత అంతరిక్ష సంస్థ ఇస్రో ఇతరదేశాలకు చెందిన అనేక రకాల ఉపగ్రహాలను అంతరిక్షంలో ప్రవేశపెడుతూ దేశానికి భారీ ఆదాయ వనరుగా నిలుస్తోంది. ఇప్పుడు ఈ అనన్య సామాన్యమయిన విజయవంతంతో ఇకపై మరిన్ని దేశాలు భారత్ అంతరిక్ష సమస్త సేవలను ఉపయోగించుకొనేందుకు ముందుకు రావచ్చును. అంతే కాక వివిధ దేశాలు ఇకపై ఇస్రోతో అంతరిక్ష పరిశోధనలకు ఆసక్తి చూపవచ్చును.   అందుకు ప్రధానంగా మూడు కారణాలు చెప్పుకోవచ్చును. 1. భారత శాస్త్రవేత్తల సమర్ధత. 2. సక్సస్ రేట్ ఎక్కువగా ఉండటం.3. అమెరికాలో నాసా వంటి సంస్థలతో పోలిస్తే చాలా చవకలో విజయవంతంగా ఉపగ్రహాలను అంతరిక్షంలో ప్రవేశపెట్టగలగడం.ఇదే ప్రయోగానికి నాసా దాదాపు రూ. 6,000 కోట్లు ఖర్చు చేస్తే భారత శాస్త్ర వేత్తలు కేవలం రూ.450 కోట్లలో పని పూర్తి చేసారు. అందువలన ఈ మంగళ యాన్ విజయం భారత అంతరిక్ష పరిశోధనలకు, అంతరిక్ష వ్యాపారానికి నాంది పలుకుతుందని ఆశించవచ్చును.

మరీ అంత ‘ఫాస్ట్’ పనికిరాదు స్మీ!

  తెలంగాణాలో మొదటిసారిగా అధికారం చేప్పట్టిన తెరాస తన తీరు, జోరు ఇంకా వదులుకోలేక అదే దూకుడు ప్రదర్శిస్తూ తరచూ బోర్లాపడుతోంది. పాలనలో ఆ దూకుడు ఉండాలి కానీ దానికీ ఒక లెక్క ఉండాలి. ఉద్యమం నడిపినట్లే ప్రభుత్వం కూడా నడుపుదామని ప్రయత్నిస్తే కోర్టుల చేత మొట్టికాయలు తప్పవని నిన్న మరోమారు రుజువయింది.   విద్యార్ధుల ఫీజు రీఇంబర్స్ మెంటు విషయంలో అందరూ ఎంత వారించినా, విమర్శించినా తెలంగాణా ప్రభుత్వం మొండిగా ముందుకే వెళ్ళి ఫాస్ట్’ జీ.ఒ. జారీ చేసింది. పురుషులందు పుణ్య పురుషులు వేరయా అన్నట్లు విద్యార్ధులందు తెలంగాణా విద్యార్ధులు వేరయా అంటూ తమ ప్రభుత్వం కేవలం తెలంగాణా విద్యార్థులకే ఫీజు రీఇంబర్స్ మెంటు చేస్తుందని ప్రకటించింది. అందుకోసం 1956సం. ఆధారంగా స్థానికతను నిర్దారించింది.   ఇదెక్కడి అన్యాయం అని ప్రశ్నిస్తే దానికి తెరాస నేతలు తమ మాటకారితనంతో చక్కగా సమాధానం చెప్పారు. విద్యార్ధుల జీవితాలతో ఆడుకోవద్దని అందరూ చెప్పిన హితవును పెడచెవిన పెట్టారు. ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకొందామని, రాష్ట్ర విభజన సందర్భంగా అన్నిటినీ 52:48నిష్పత్తిలో ఏవిధంగా పంచుకోన్నామో అదేవిధంగా దీనిని కూడా భరిద్దామని ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ప్రతిపాదనను అవహేళన చేసారు.   తీరాచేసి తెరాస ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి తెలంగాణా విద్యార్ధులకు మాత్రమే ఆర్ధిక సహాయం అందించే ఉద్దేశ్యంతో జారీ చేసిన ‘ఫాస్ట్’ జీ.ఒ. దేశ సమగ్రతను దెబ్బతీసే విధంగా ఉందని, తెలంగాణా భారతదేశంలో అంతర్భాగమని గుర్తుంచుకోమని హైకోర్టు తెలంగాణా ప్రభుత్వానికి గట్టిగా మొట్టి కాయలు వేసింది. ఇటువంటి జీ.ఒ.లు ఎంతమాత్రం అంగీకారయోగ్యం కావని దానిని పునః పరిశీలించుకోమని హైకోర్టు నిష్కర్షగా తేల్చి చెప్పింది. బహుశః అధికార తెరాస నేతలు కోర్టు తీర్పు ఇంకా తమ చేతికి అందలేదని, ఈ విషయంపై న్యాయ నిపుణులతో సంప్రదిస్తామంటూ పడికట్టు పదాలతో స్టాండర్డ్ సమాధానం చెప్పవచ్చును. కానీ కనీసం ఇప్పుడయినా ఉద్యమాన్ని నడపడానికీ, ప్రభుత్వం నడపడానికీ చాలా తేడా ఉందని గ్రహించి తన దూకుడు తగ్గించుకొంటే ఇటువంటి అవమానకర పరిస్థితులు పునరావృతం కాకుండా నివారించుకోవచ్చును.   తప్పులు చేయడం తప్పు కాదు. కానీ అవి తప్పులని అందరూ చెపుతున్నప్పటికీ వాటిని సరిదిద్దుకోకపోవడం తప్పు. నేటికీ తెలంగాణాలో రెండు మీడియా చానళ్ళపై నిషేధం కొనసాగుతూనే ఉంది. ఈ వ్యవహారంలో కూడా అందరూ తెలంగాణా ప్రభుత్వ తీరును తప్పు పడుతున్నప్పటికీ, జరిగిన తప్పును సరిదిద్దుకోకపోగా దానిపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించిన తీరుపై దేశంలో యావత్ మీడియా ఇప్పుడు తెలంగాణా ప్రభుత్వాన్ని తప్పు పడుతోంది.   ప్రభుత్వం అంటే దానిని నడుపుతున్న వ్యక్తి ఏకచక్రాధిపత్యం వహించవచ్చనే అపోహా చాలా రాజకీయ పార్టీలకుంది. కానీ అలా కుదరదని కోర్టులు తేల్చి చెపుతున్నాయి. ఎన్నికలలో ప్రజలు కూడా రుజువు చేసి చూపుతున్నారు. అయినప్పటికీ జ్ఞానోదయం కలుగకపోతే ఈవిధమయిన భంగపాటు తప్పదు.

అధికార పార్టీని నిందించడం కోసమే కాంగ్రెస్ సమావేశాలు

    కాంగ్రెస్ పార్టీకి కంచుకోట వంటి ఆంద్రప్రదేశ్ రాష్ట్రం నుండి ఎందుకు పూర్తిగా తుడిచిపెట్టుకు పోయిందో అందరికి తెలుసు. అదేవిధంగా ఆ పార్టీలో లోపాల గురించి కాంగ్రెస్ నేతలకి కూడా చాలా బాగా తెలుసు. అందువలన ఇప్పుడు వారు ఆత్మవిమర్శ చేసుకొని, లోపాలను సవరించుకొని పార్టీని మళ్ళీ బలోపేతం చేసుకొంటారని ఎవరయినా భావిస్తారు. కానీ అధికార పార్టీని నిందించడం కోసమే కాంగ్రెస్స్ పార్టీ సమావేశాలు నిర్వహిస్తునట్లు కనబడుతోంది. రఘువీరా రెడ్డి పేరుకి పీసీసీ అధ్యక్షుడయినప్పటికీ పార్టీలో సీనియర్ల ముందు జూనియర్ లాగ కనబడుతుండటంతో పార్టీలో ఆయన మాట వినేవారెవరూ లేకపోవడంతో ఆయన తనకు తోచినట్లుగా పార్టీకి శల్యసారధ్యం చేసుకు పోతున్నారు. అందుకే పార్టీకి దిశా నిర్దేశం చేయలేక అధికార తెదేపాను నిందిస్తూ కాలక్షేపం చేస్తున్నారు.   అంతటితో ఆగితే పరవాలేదు. కానీ ఇటీవల జరిగిన నందిగామ ఉప ఎన్నికల ఫలితాలను ఆయన ప్రతీ సభలో ప్రధానంగా ప్రస్తావిస్తు పార్టీ ఓడిపోయినప్పటికీ తమ ఓటింగ్ శాతం పెరిగిందని జబ్బలు చరుచుకోవడమే ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ ఉపఎన్నికలలో వైకాపా పాల్గొనకపోవడం వల్ల దానికి పడవలసిన తమ ఖాతాలో పడ్డాయనే సంగతిని దాచిపెట్టి, అది తెదేపా పరిపాలన పట్ల ప్రజలలో పెరిగిన వ్యతిరేఖతకు నిదర్శనమంటూ అందరినీ నమ్మించే ప్రయత్నం చేయడం వలన నష్టపోయేది కాంగ్రెస్ పార్టీయే.   పార్టీకి రాష్ట్రంలో విస్త్రుతమయిన క్యాడర్ ఉంది, బలమయిన నాయకులు ఉన్నారు. వారందరినీ ఒక్క త్రాటిపైకి తేగలిగితే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో మళ్ళీ కోలుకొనే అవకాశాలున్నాయి. కానీ ఆ పనిచేయగల సమర్దుడయిన నాయకుడే పార్టీకి లేడు.   ఇక తెలంగాణా రాష్ట్రంలో ఇంతకంటే భిన్నమయిన పరిస్థితి లేదు. అక్కడా కాంగ్రెస్ నేతల ఎంతసేపు పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యను ఏవిధంగా కుర్చీలోనుండి దింపేసి అందులో తాము కూర్చోవాలా ఆలోచనలు చేస్తున్నారు తప్ప నానాటికి బలహీనపడుతున్న తమ పార్టీని పట్టించుకొనే పరిస్థితిలో లేరు. తత్ఫలితంగానే ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని పోటీ చేసిన మెదక్ ఉపఎన్నికలలో ఓడిపోవలసి వచ్చింది. ఈ విధంగా అటు కేంద్రంలో, ఇటు రెండు రాష్ట్రాలలో కూడా కాంగ్రెస్ పార్టీ చాలా దయనీయమయిన స్థితిలో ఉందిప్పుడు.   కాంగ్రెస్ అధిష్టానం కూడా తన రాష్ట్ర నేతలకు దిశా నిర్దేశం చేసే స్థితిలో లేదు. ప్రధానమంత్రి అయిపోదామనుకొన్న రాహుల్ గాంధీ సార్వత్రిక ఎన్నికలలో తమ పార్టీ ఓడిపోయిన తరువాత పార్లమెంటరీ నాయకత్వ బాధ్యతలు కూడా స్వీకరించడానికి వెనుకంజ వేసారు. ఇటీవల దేశ వ్యాప్తంగా 9 రాష్ట్రాలలో జరిగిన ఉపఎన్నికలలో పార్టీ తరపున ప్రచారం చేసేందుకు కూడా వెనుకాడారు. ఆయన ప్రచారం చేయకపోయినా పార్టీ మంచి ఫలితాలు రాబట్టడం గమనార్హం. ఆ ఫలితాలను కూడా ప్రజలలో మోడీ పాలన పట్ల పెరుతున్న వ్యతిరేఖతకు నిదర్శనమని కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించేసి చేతులు దులుపుకొంది. అదే నిజమయితే వచ్చే నెల 15న కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలయిన మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ ఘన విజయం సాధించి తన అధికారం నిలబెట్టుకోవలసి ఉంటుంది. లేకుంటే కాంగ్రెస్ పతనాన్ని ఎవరూ కూడా ఆపలేరని స్పష్టమవుతుంది.మరి ఇప్పటికయినా కాంగ్రెస్ నేతలు వారి అధిష్టానం మేల్కొంటుందో లేదో చూడాలి.

విజయవాడ మెట్రో రైలు మార్గం ఖరారు

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వైజాగ్, విజయవాడ మరియు తిరుపతి నగరాలలో మూడు మెట్రో రైల్ ప్రాజెక్టులు నిర్మించ తలపెట్టింది. అందుకోసం మెట్రో రైల్ నిర్మాణంలో ఉండే సాధకబాధకాల గురించి బాగా ఎరిగిన శ్రీధరన్ న్ను సలహాదారుగా నియమించుకొంది. ఆయన డిల్లీలో మెట్రో రైలు ప్రాజెక్టు సకాలంలో విజయవంతంగా పూర్తిచేసి అందరి మన్ననలు అందుకొన్నారు. అటువంటి అనుభవజ్ఞుడు, దీక్షాదక్షతలు గల వ్యక్తిని సలహాదారుడిగా నియమించుకోవడం ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా దూరదృష్టి కనబరిచారు. ఆయన నిర్ణయం తప్పు కాదని శ్రీధరన్ తన తొలి పర్యటనలోనే నిరూపించారు. ఈరోజు విజయవాడ, మంగళగిరి, తాడేపల్లిగూడెం పరిసర ప్రాంతాలలో స్థానిక అధికారులతో కలిసి పర్యటించిన ఆయన అన్ని విషయాలు చాలా నిశితంగా పరిశీలించిన తరువాత, మీడియాతో మాట్లాడుతూ చాలా ఆసక్తికరమయిన విషయాలు తెలిపారు.   1. ప్రపంచ వ్యాప్తంగా నడుస్తున్న మెట్రో రైళ్ళు ఏవీ కూడా లాభాలలో నడవటం లేదు. కేవలం సేవా భావంతోనే నడుపుతున్నారు. కనుక ఈ ప్రాజెక్టుపై కూడా ఏవో లాభాలు వస్తాయని అశించవసరం లేదు.   2. మెట్రో రైలును నగరాలలో అంతర్గత రవాణా మాధ్యమంగానే చూడాలి తప్ప, వివిధ నగరాలు పట్టణాల మధ్య రవాణాకుపనికిరాదు. కారణం ఒక్క కిమీ మెట్రో రైలు నిర్మాణానికి దాదాపు రూ.400కోట్లు ఖర్చుతాయి. అందువల్ల ఈ మెట్రో ప్రాజెక్టు ఆర్ధికంగా చాలా భారమయినదే. కనుక విజయవాడ-గుంటూరు-మంగళగిరి-తెనాలి (వీ.జీ.టీ.యం.)ప్రాంతాలను కలుపుతూ స్థానిక అధికారులు సిద్దం చేసిన మెట్రో ప్రతిపాదనలు ఆచరణ సాధ్యం కానివని తేల్చి చెప్పారు.   3. విజయవాడలో చెప్పట్టబోయే మెట్రో రైలు ప్రాజెక్టు రెండు దశలలో, కేవలం మూడు సం.లలో పూర్తి చేసేందుకు కృషి చేస్తాము. మొదటి దశలో కానూరు వద్ద సిద్దార్ధ ఇంజనీరింగ్ కళాశాల నుండి నెహ్రూ బస్టాండ్ వరకు అక్కడి నుండి మళ్ళీ రామవరప్పాడు మీదుగా హైవే రోడ్డు వరకు మొత్తం 26కిమీ. మెట్రో రైల్ నిర్మిస్తామని తెలిపారు. మొదటి దశ పూర్తయిన తరువాత రెండవ దశ గురించి ఆలోచిస్తామని తెలిపారు.   4. నగరం మధ్యగా సాగే ఈ ప్రాజెక్టు కోసం అతి తక్కువ భూసేకరణతో పని పూర్తి చేస్తామని తెలిపారు. ప్రతీ ఒక కిమీకు ఒక మెట్రో స్టేషన్ ఉండేలా ఏర్పాటు చేస్తామని తెలిపారు.   5. ఈ ప్రాజెక్టుపై పూర్తి నివేదిక(డీ.పీ.యస్.)ను 2015 జనవరి నెలాఖరులోగా రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించి, ప్రభుత్వ ఆమోదం తీసుకొన్న తరువాత దానిని కేంద్ర ప్రభుత్వానికి సమర్పించి దాని ఆమోదం పొందిన తరువాత ఐదారు నెలలలోనే నిర్మాణపనులు మొదలు పెట్టి మూడేళ్ళలోనే ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కృషి చేస్తామని ఆయన తెలిపారు.   6. వైజాగ్, తిరుపతి నగరాలలో కూడా త్వరలోనే పర్యటించి ఇదే విధంగా ప్రాధమిక నివేదిక ప్రభుత్వానికి అందజేస్తామని తెలిపారు.   ఈ ప్రాజెక్టులను సాధ్యమయినంత త్వరగా మొదలు పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనను కోరినట్లు శ్రీధరన్ మీడియాకు తెలిపారు. శ్రీధరన్ తన తొలి పర్యటనలోనే వీ.జీ.టీ.యం. పరిధిలో నాలుగు ప్రాంతాలను కలుపుతూ మెట్రో నిర్మిస్తే అది ప్రభుత్వానికి గుదిబండగా మారుతుందని హెచ్చరించడం వలన విలువయిన ప్రజాధనం వృధా కాకుండా అరికట్టగలిగారు. అదే విధంగా మెట్రో నిర్మాణం లాభాప్రధం కాదనే సంగతిని ఆయన చాల నిష్కర్షగా చెప్పడం విశేషమే. అందువలన ఇకపై ప్రభుత్వం కూడా కొత్తగా మెట్రో రైల్ నిర్మాణం గురించికా, ప్రత్యామ్నాయ రవాణా వ్యవస్థలను ఏర్పాటు చేసేందుకు తగు ప్రణాళికలు సిద్దం చేసుకోగలుగుతుంది. రాజధాని నిర్మాణం కోసం మాష్టర్ ప్లాన్ సిద్దమయిన తరువాతనే రెండవ దశ మెట్రో రైలు మార్గం ఖరారు చేసుకోవడం మంచిదనే ఆయన సూచన చాలా ఆలోచించదగ్గదే.

హైదరాబాద్ మెట్రో రైలుకు బ్రేకులెన్నో

    హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుపై ఇంకా గొడవ సద్దుమణగక ముందే, అంతకంటే మరో గంభీరమయిన సమస్య తలెత్తింది. రెండు దశలుగా చేప్పట్టిన ఈ ప్రాజెక్టులో మొదటి దశలో పెద్దగా ఇబ్బందులు లేకుండానే పూర్తవుతోంది. కానీ రెండవ దశ పనులలో అడుగు ముందుకు వేయలేని పరిస్థితి నెలకొంది. అందుకు ప్రధాన కారణం దారుల్-షిఫా నుండి ఫలక్ నూమా వరకు సాగే ఈ రెండవ దశ మెట్రో రైల్ ప్రాజెక్టు హైదరాబాద్ పాతబస్తీ గుండా సాగవలసిరావడమే.   మెట్రో ప్రాజెక్టు చేప్పట్టవలసిన ఈ ప్రాంతంలో అనేక మశీదులు, దర్గాలు, అశూర్ ఖానాలు, అనేక వేల భవనాలు ఉన్నందున వాటినన్నిటినీ తొలగిస్తే తప్ప ప్రాజెక్టు పనులు చెప్పట్టడం సాధ్యం కాదు. అయితే మశీదులను దర్గాలను కూల్చడం అసాధ్యమనే సంగతి అందరికీ తెలుసు. అందుకే మజ్లిస్ పార్టీ ఈ రెండవ దశ ప్రాజెక్టు దారుల్-షిఫా నుండి పక్కకు మరల్చి మూసీ నది ఒడ్డు పక్కగా పురానా ఫూల్ వరకు సాగేలా మార్చమని ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తోంది. అయితే దాని గోడు, అభ్యంతరాలను రాష్ట్ర విభజన హడావుడిలో పడి ఇంతకాలం ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు మొదటి దశ పనులు ఒక కొలిక్కి వస్తున్నాయి కనుక త్వరలోనే రెండవ దశ పనులు మొదలు పెట్టాల్సి ఉంటుంది. కనుక మజ్లిస్ పార్టీ మళ్ళీ మరోసారి తెలంగాణా ప్రభుత్వానికి తన అభ్యంతరాలను గట్టిగా తెలియజేసి ప్రాజెక్టు డిజైన్ మార్చాలని కోరింది.   అయితే ఇప్పటికే ఒకసారి ప్రాజెక్టు డిజైన్ లో మార్పులు చేసినందుకు ఈ ప్రాజెక్టును వదులుకొని వెళ్లిపోతామని యల్.యండ్.టీ. సంస్థ ప్రభుత్వానికి వ్రాసిన లేఖ మీడియాలో బహిర్గతం అవడంతో జరుగుతున్నరభసతో తలపట్టుకొన్న ప్రభుత్వానికి మజ్లిస్ ప్రతిపాదనకు ఊ కొట్టడం సాధ్యం కాదు. కానీ మజ్లిస్ పార్టీ చేస్తున్న అభ్యర్ధన అభ్యర్ధనలా కాక దానిని ఒక ఆజ్ఞగా భావించక తప్పనిసరి పరిస్థతి ఏర్పడింది.   ఎందుకంటే వచ్చే డిశంబరు నెలలో గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్ ఎన్నికలు జరగనున్నాయి. హైదరాబాదులో జరిగే ఆ ఎన్నికలలో తెరాస గెలవాలంటే మజ్లిస్ సహకారం తప్పనిసరి. కానీ అందుకోసం మజ్లిస్ పార్టీ నేతలు కోరిన విధంగా రెండవ దశ ప్రాజెక్టు డిజైన్ మార్చాలంటే యల్.యండ్.టీ. సంస్థ తట్టా బుట్టా సర్దుకొని వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. అలాగని మొండిగా పనులు మొదలు పెట్టి పాతబస్తీలో మశీదులు, దర్గాల జోలికి వచ్చినట్లయితే ఏమవుతుందో ఎవరయినా తేలికగానే ఊహించగలరు.   మొదటి నుండి ఈ ప్రాజెక్టుకు వ్యతిరేఖంగా పోరాడుతున్న ఒక ప్రజాసంఘం అందుకు ఒక గొప్ప తరుణోపాయం చెప్పింది. రెండవ దశ ప్రాజెక్టును పూర్తిగా రద్దు చేయడమే దీనికి మంచి పరిష్కారమని ఆ సంస్థ ప్రతినిధులు వాదిస్తున్నారు. ఆవిధంగా చేసినట్లయితే ప్రభుత్వం రాజకీయ సమస్యలను అధిగమించడమే కాక, పాత గాంధీ ఆసుపత్రి సమీపంలో ఒక పెద్ద ఆర్.టీ.సి. బస్సు కాంప్లెక్స్ నిర్మించాలనే ప్రభుత్వ ఆశయం కూడా నెరవేరుతుందని వారి వాదన.   ఈ ప్రతిపాదన వినడానికి బాగానే ఉంది. కానీ, ఈ మెట్రో ప్రాజెక్టుపై రభస జరిగినప్పుడు, రెండు రోజుల క్రితమే తెలంగాణా ప్రభుత్వం, యల్.యండ్.టీ.సంస్థ రెండూ కూడా మీడియా ముందుకు వచ్చి ఈ ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లో కూడా సకాలంలో పూర్తి చేసి తీరుతామని భీషణ ప్రతిజ్ఞ చేసారు కనుక ఇప్పుడు ఆ ప్రతిజ్ఞని ఉపసంహరించుకోవడం కష్టమే. అలాగని ముందుకు వెళ్ళినా కష్టమే. డిజైన్ మార్చడమూ కష్టమే. ఈ ప్రాజెక్టు నిర్మాణం తెలంగాణా ప్రభుత్వానికి ఒక అగ్ని పరీక్షగా తయారయినట్లు కనిపిస్తోంది.   అయితే దీనికి మెట్రో గరువుగారు శ్రీధరన్ గారే సరయిన పరిష్కారం చూపవచ్చును. ఎందుకంటే ఆయన ఇంతకంటే క్లిష్టమయిన పరిస్థితుల్లో డిల్లీలో మెట్రో రైలు ప్రాజెక్టును అనుకొన్న సమయం కంటే ముందుగానే విజయవంతంగా పూర్తి చేసి ప్రభుత్వానికి అప్పగించారు. బహుశః అందుకే తెలంగాణా ప్రభుత్వం ఛలో డిల్లీ అంటోందిపుడు.

హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుపై రాజకీయలేల

    హైదరాబాద్ మెట్రో రైలుపై చెలరేగుతున్న దుమారం ఇప్పుడు అందరికీ చాలా ఇబ్బందికరంగా మారింది. ఈ ప్రాజెక్టు చేప్పట్టిన యల్.యండ్.టీ.సంస్థ, వివిధ కారణాలచేత దానిని మధ్యలో వదిలిపెట్టి వెళ్లిపోతామంటూ తెలంగాణా ప్రభుత్వానికి వ్రాసిన లేఖ మీడియా ద్వారా బహిర్గతం కావడంతో తెలంగాణా ప్రభుత్వానికి ఊహించని తలనొప్పులు తెచ్చిపెట్టింది. ఇది తమ ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీయడానికి కొన్ని ఆంధ్రా పత్రికలూ, పార్టీలు చేస్తున్న కుట్ర అని అభివర్ణించడం ద్వారా తెలంగాణా ప్రభుత్వం ఈ సమస్య నుండి బయటపడే ప్రయత్నం చేసింది.   అయితే తెదేపా తెలంగాణా నేత రేవంత్ రెడ్డి దానిని త్రిప్పికొట్టే ప్రయత్నంలో ప్రముఖ పారిశ్రామిక వేత్త రామేశ్వరరావు (నందగిరి హిల్స్ దొర) మరియు ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. రామేశ్వర రావుకు మేలు చేకూర్చేందుకే కేసీఆర్ ప్రభుత్వం మెట్రో రైలు మార్గం మార్చమని యల్.యండ్.టీ.సంస్థపై ఒత్తిడి చేసిందని, అందుకే ఆ సంస్థ ఈ ప్రాజెక్టు నుండి తప్పుకోవాలనుకొంటోందని ఆయన ఆరోపించారు. అయితే ఆయన చేసిన ఆరోపణలతో తెరాస ప్రభుత్వానికి జవాబు చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడినప్పటికీ, ఈ వ్యవహారం తిరిగి తిరిగి తెదేపా తెలంగాణా నేతల మధ్య చిచ్చుపెడుతోంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్న నందగిరి హిల్స్ దొర, తెదేపా సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావుకు అత్యంత సన్నిహితుడని తెలుస్తోంది. కనుక సహజంగానే ఎర్రబెల్లికి కూడా ఇది ఇబ్బందికరమయిన అంశంగా మారింది. ఇప్పటికే తెలంగాణా ప్రభుత్వం నుండి ఈ వ్యవహారంలో విమర్శలు ఎదుర్కొంటున్న తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఈ వ్యవహారంలో జోక్యం చేసుకొనేందుకు ఆసక్తి చూపకపోవడంతో ఈ వ్యవహారం రేవంత్ రెడ్డి, ఎర్రబెల్లి మధ్య ప్రచ్చన్నయుద్దానికి తెరలేపినట్లయింది. ఇది చివరికి ఎక్కడికి దారి తీస్తుందో ఎవరికీ తెలియదు.   ఇక ఈ మెట్రో రైలు ప్రాజెక్టుకు ఎన్ని ఇబ్బందులు ఎదురయినప్పటికీ యల్.యండ్.టీ.సంస్థ సకాలంలో పూర్తి చేయకపోయినా, దానినుండి అర్దాంతరంగా వైదొలగినా అది ఆ సంస్థ ప్రతిష్టను దెబ్బ తీస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. అంతేకాక ఆ ప్రభావంతో ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో వైజాగ్, విజయవాడ, తిరుపతి నగరాలలో నిర్మించనున్న మూడు మెట్రో రైలు ప్రాజెక్టులకు ఆ సంస్థ అనర్హురాలు అయ్యే ప్రమాదం కూడా ఉంది.   ఏమయినప్పటికీ ప్రజలకు ఉపయోగపడే ఇటువంటి ప్రాజెక్టులపై రాజకీయాలు చేయడం ఎవరికీ మంచిది కాదు. కనుక ఇందులో ఎవరు తప్పులు చేసినా వాటిని వెంటనే వాటిని సరిద్దికోవడం విజ్ఞతగా ఉంటుంది. లేకుంటే ప్రజలలో చులకనవడం తధ్యం.

భారత్-చైనాల మధ్య సత్సంబంధాలు సాధ్యమయ్యే పనేనా?

  మూడు రోజుల భారత్ పర్యటనకు వచ్చిన చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ కు భారత్ ఘనస్వాగతం పలికింది. సాధారణంగా ఇటువంటి విదేశీ అతిధులను భారత ప్రభుత్వం డిల్లీకే ఆహ్వానించి అక్కడే వారికి స్వాగత సత్కారాలు చేస్తుంది. కానీ చైనాతో మరింత బలమయిన సంబంధాలు నెలకొల్పుకోవాలని భావిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ ఆ ఆచారాన్ని పక్కనబెట్టి చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ను అహ్మదాబాదుకు ఆహ్వానించి, అక్కడ ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ రోజు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ డిల్లీ చేరుకొని రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతిని కలుస్తారు. అక్కడ కూడా ఆయనకు యదోచిత మర్యాదలు జరుగుతాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన భారత్ పర్యటన సందర్భంగా రెండు దేశాల మధ్య మూడు ఒప్పంద పత్రాలు సంతకాలు చేశారు. ఈరోజు మరి కొన్ని చేయవచ్చును.   రెండు దేశాల అభివృద్ధికి, సంబంధాలు మెరుగుపడటానికి ఇటువంటివన్నీ చాలా ఉపయోగపడతాయి. కానీ సరిగ్గా ఇదే సమయంలో జమ్మూ కాశ్మీరు రాష్ట్రంలో లఢక్‌లోని చుమర్‌ అనే సరిహద్దు ప్రాంతంలోకి చైనా సైనిక దళాలు దాదాపు 4-5కి.మీ చొచ్చుకు వచ్చి గత రెండు మూడు రోజులుగా అక్కడే తిష్ట వేసాయి. వారిని వెనక్కు వెళ్లిపొమ్మని భారత సైనికదళాల హెచ్చరికలను ఖాతరు చేయడం లేదు. పైగా చైనాకు చెందిన కొన్ని సంచార జాతుల వారిని భారత్ భూభాగంలో శిబిరాలు వేసుకొనేందుకు తోడ్పడుతున్నారు. పాకిస్తాన్ మన దేశంలోకి ఉగ్రవాదులను ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తుంటే, చైనా సంచార జాతులను భారత భూభాగంలో స్థిరపడేందుకు ప్రయత్నిస్తోంది. రెంటికీ తేడా ఏమిటంటే, పాకిస్తాన్ ఉగ్రవాదులు భారత్ లో బాంబు ప్రేలుళ్ళకు పాల్పడి ప్రజల ప్రాణాలు తీస్తుంటే, చైనా సంచార జాతులను భారత భూభాగంలో ప్రవేశపెట్టి వారిని అక్కడ స్థిరపడేలా చేయడం ద్వారా ఆ భూభాగంపై తన హక్కును ప్రకటించుకొనే ప్రయత్నం చేస్తోంది.   మోడీ ప్రమాణ స్వీకారానికి పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ను ఆహ్వానించి, ఆదేశంతో సత్సంబంధాలు నెలకొల్పుకోవాలని భారత ప్రభుత్వం భావించింది. కానీ పాకిస్తాన్ అనుసరించిన భారత వ్యతిరేఖ వైఖరి వల్ల, మళ్ళీ రెండు దేశాల మధ్య దూరం పెరిగింది. ఇప్పుడు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ భారత్ తో స్నేహ సంబంధాలు పెంపొందించుకొనే ప్రయత్నంలో భారత్ లో పర్యటిస్తుంటే, మరో పక్క సరిహద్దుల వద్ద చైనా సైనిక దళాలు ఈవిధంగా చొరబడి కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో రెండు దేశాల మధ్య సత్సంబంధాలు, ఒకరిపట్ల మరొకరిని నమ్మకం ఏర్పడటం సాధ్యమయ్యే పనేనా? చైనా అనుసరిస్తున్న ద్వంద వైఖరి చూస్తుంటే మళ్ళీ పాక్ తో ఎదురయిన చేదు అనుభవమే పునరావృతం అయ్యేలా కనిపిస్తోంది. అదే జరిగితే ప్రస్తుతం రెండు దేశాల నేతల మధ్య జరుగుతున్న సమావేశాలకి, చర్చలకు అర్ధం ఉండదు.

పట్టాలు తప్పుతున్న మెట్రో రైలు ప్రాజెక్టు

  ఇంతవరకు శరవేగంతో సాగిన హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు తీరాచేసి పట్టాలెక్కే సమయానికి ఇక ముందుకు కదలనని మొరాయిస్తోంది. రాష్ట్ర విభజన, ఆ కారణంగా హైదరాబాదులో మారిన ఆర్ధిక, రాజకీయ, భౌగోళిక మార్పులు, తెలంగాణాలో కొత్తగా అధికారం చేప్పట్టిన తెరాస ప్రభుత్వం మెట్రో రైలు మార్గంలో సూచిస్తున్న కొన్ని మార్పులు తదితర అంశాల కారణంగా తాము తప్పుకోవాలని భావిస్తున్నట్లు ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్న యల్.యండ్.టీ. సంస్థ డైరక్టర్ వివేక్.బీ.గాడ్గిల్ హైదరాబాద్ మెట్రో రైల్ యండీ యాన్.బీ.యస్. రెడ్డికి ఒక పెద్ద లేఖ వ్రాశారు. ప్రభుత్వం తరపున ఎదురవుతున్న అడ్డంకుల కారణంగా నిర్ణీత సమయంలో ఈ ప్రాజెక్టును పూర్తిచేసే పరిస్థితులు లేవని, దానివలన నిర్మాణ వ్యయం ఊహించిన దానికంటే చాలా పెరిగిపోయిందని ఆయన తన లేఖలో పేర్కొన్నారు.   ఇంతవరకు హైదరాబాద్ తో అనుసంధానమయిన 23జిల్లాలలో ప్రజలు, పరిశ్రమలు, వ్యాపార సంస్థలు, పోర్టులు తదితరాలన్నిటినీ రాష్ట్ర విభజన కారణంగా హైదరాబాద్ పోగొట్టుకొని ఒక అతి చిన్న రాష్ట్రానికి రాజధానిగా మిగిలిపోయిందని, అదే నిష్పత్తిలో ఈ మెట్రో ప్రాజెక్టుపై ఆదాయం కూడా తగ్గిపోతుందని, అందువల్ల మెట్రో నిర్వహణ లాభసాటి కాదని భావిస్తున్నందున తాము ఈ ప్రాజెక్టు నుండి తప్పుకోవాలనుకొంటున్నామని వ్రాసారు. ఇవి కాక అనేక ఇతర అంశాలను తమ ఈ నిర్ణయానికి కారణాలుగా లేఖలో పేర్కొన్నారు.   తాము రాష్ట్ర విభజన జరుగుతుందని ఊహించలేదని, ఒకవేళ జరిగినా హైదరాబాద్ నగరాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా ఉంటుందని భావించామని, కానీ ఆవిధంగా జరగకపోవడంతో ఇప్పుడు ఈ ప్రాజెక్టు నిర్మించి, కేవలం టికెట్ల అమ్మకాలపైనే పూర్తిగా ఆధారపడి దానిని నడపడం తమ వల్ల కాదని యల్.యండ్.టీ. సంస్థ వ్రాయడం చాలా వివాదస్పదం కానుంది. ఇంతకాలం శరవేగంతో సాగిన ప్రతిష్టాత్మకమయిన మెట్రో ప్రాజెక్టు ఈవిధంగా అర్దాంతరంగా ముగిస్తే, తెరాస అధికారం చేప్పట్టిన తరువాత హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిందని అనే ప్రతిపక్షాల వాదనలకు బలం చేకూరుస్తున్నట్లవుతుంది. పైగా యల్.యండ్.టీ. సంస్థ రాష్ట్ర విభజన, దాని వలన నష్టాల గురించి మాట్లాడటం, రాష్ట్రంపై తీవ్ర వ్యతిరేఖ ప్రభావం చూపే ప్రమాదం ఉంది.   సహజంగానే తెరాస ప్రభుత్వానికి ఆగ్రహం కలిగించవచ్చును. బహుశః ప్రభుత్వం కూడా దీనిపై అంతే ఘాటుగా స్పందించవచ్చును. ఇంత భారీ ప్రాజెక్టుని నిర్మిస్తున్న యల్.యండ్.టీ.సంస్థ ఈ ప్రాజెక్టు ద్వారా లాభాలు ఆశించడంలో ఎటువంటి తప్పూ లేదు. కానీ అందుకోసం అది చెపుతున్న కారణాలు, వాటి పరిష్కారాలు తెలంగాణా ప్రభుత్వం చేతిలో కూడా లేవనే సంగతి ఎవరయినా అంగీకరిస్తారు.   రాష్ట్ర విభజన జరుగుతుందని తాము ఊహించలేదని, ఒకవేళ జరిగినా హైదరాబాద్ కేంద్రపాలితంగా ఉంటుందని భావించామని ఆ సంస్థ చెప్పడం కూడా చాలా ఆహేతుకంగా ఉంది. లాభార్జనతో పనిచేసే వ్యాపార సంస్థ-యల్.యండ్.టీ. ఎటువంటి ముందు చూపు లేకుండా ఈ ప్రాజెక్టు చేసేందుకు గుడ్డిగా ఒప్పుకొందని భావించడం చాలా అసంబద్ధంగా ఉంది. అంటే తన నిర్ణయానికి ఆ సంస్థే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది తప్ప ఇప్పుడు ప్రభుత్వాన్ని నిందించడానికి లేదు.   ఒకవేళ ఈ ప్రాజెక్టు నిర్మాణంలో ప్రభుత్వ పరంగా అడ్డంకులు ఎదురయితే వాటిని ప్రభుత్వంతో చర్చించి పరిష్కరించు కోవలసి ఉంటుంది. మారిన పరిస్థితుల్లో ఈ ప్రాజెక్టు లాభదాయకం కాదని భావిస్తే, ప్రభుత్వం సహాయ, సహకారాలు కోరవచ్చును. కానీ ఇటువంటి భారీ ప్రతిష్టాత్మకమయిన ప్రాజెక్టు నుండి అర్ధాంతరంగా తప్పుకొంటే అది ఆ సంస్థకే కాదు తెలంగాణా రాష్ట్రానికి, ప్రభుత్వానికీ కూడా చాలా నష్టం కలిగిస్తుంది. ఆ సంస్థపై, రాష్ట్ర ప్రభుత్వంపై కూడా వ్యతిరేఖ ప్రభావం తప్పక ఉంటుంది. కనుక రాష్ట్ర ప్రభుత్వం, యల్.యండ్.టీ. సంస్థ రెండూ కూడా ఈ విషయంలో పట్టువిడుపులు కనబరుస్తూ, ఈ సమస్యలకు ప్రత్యామ్నాయ పరిష్కారాలు కనుగొని ఎట్టిపరిస్థితుల్లో ఈ ప్రాజెక్టును పూర్తి చేయడం అన్నివిధాల అందరికీ మంచిది.

తెలంగాణా సాధనలో తెరాసది కేవలం ప్రేక్షక పాత్ర మాత్రమే: కాంగ్రెస్

  తెలంగాణా సాధనలో తెరాసది కేవలం ప్రేక్షక పాత్ర మాత్రమే: కాంగ్రెస్ తెలంగాణా రాష్ట్రం ఏర్పాటుతో ఎన్నికలలో అవలీలగా విజయం సాధించవచ్చని ఆశపడిన కాంగ్రెస్ పార్టీ పరిస్థితి తెలంగాణాతో బాటు ఆంధ్రాలో కూడా ఓడిపోవడంతో రెంటికీ చెడిన రేవడిలా తయారయింది. అందువల్ల పార్టీ కొద్దిగా బలంగా ఉన్న తెలంగాణాలో ముందుగా పార్టీని బలోపేతం చేసుకొనే ప్రయత్నంలో నిన్న కాంగ్రెస్ నేతలు అందరూ హైదరాబాదులో సమావేశమయ్యారు. గమ్మతయిన విషయం ఏమిటంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఈ దుర్గతి పట్టడానికి ప్రధాన కారకుడయిన దిగ్విజయ్ సింగ్ అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించడం. ఇక ఈ సమావేశంలో ఆయనతో సహా కాంగ్రెస్ నేతలందరూ చెప్పిన విషయాలు కూడా చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. తెలంగాణా పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ తెరాస అధ్యక్షుడు కేసీఆర్ తెలంగాణా కోసం పోరాటాలు మొదలుపెట్టక ముందు నుండే కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు కట్టుబడి ఉందని అన్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీ తన మాట నిలబెట్టుకొంటూ తెలంగాణా ఇచ్చిందని అన్నారు. ఈ విషయాన్ని ప్రజలకు అర్ధమయ్యేలా వివరించాల్సి ఉందని ఆయన అన్నారు.   మాజీ కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణా సాధనలో తెరాసది కేవలం ప్రేక్షక పాత్ర మాత్రమేనన్నారు. వారి మాటలే నిజమనుకొంటే తెరాస ఉద్యమించక ముందే తెలంగాణా ఎందుకు ఏర్పాటు చేయలేదు? తెరాస నేతృత్వంలో ఏకధాటిగా పదేళ్ళపాటు జరిగిన తెలంగాణా ఉద్యమాల మాటేమిటి? ఒకవేళ తెరాస ఉద్యమించకుండా ఉంటే, కాంగ్రెస్ ఎన్నడయినా తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు గురించి ఆలోచన అయినా చేసేదా? తెరాస చేసిన ప్రజా ఉద్యమాల కారణంగానే కాంగ్రెస్ తెలంగాణా ఏర్పాటు చేయవలసి వచ్చిందని అందరికీ తెలుసు. కానీ, కాంగ్రెస్ అధిష్టానం ఆ ప్రయోజనం కేవలం తనకే దక్కాలనే దురాశకు పోయి, అతి తెలివితేటలు ప్రదర్శించుతూ ఆఖరినిమిషంలో తెరాసను పక్కన బెట్టి, టీ-కాంగ్రెస్ నేతలను ముందుకు తీసుకువచ్చి కేవలం వారి ఒత్తిడి కారణంగానే తెలంగాణా ఇస్తున్నట్లు నాటకం ఆడింది. కానీ వారు ఆ నాటకాన్ని సరిగ్గా రక్తి కట్టించలేక చతికిలపడటంతో తెలంగాణా ప్రజలు ఆ నాటకానికి ఊహించని ముగింపు ఇచ్చి కాంగ్రెస్ పార్టీకి తగిన విధంగా గుణపాఠం నేర్పారు. కానీ కాంగ్రెస్ నేటికీ ఆ గుణపాఠం నేర్చుకోలేదని కాంగ్రెస్ నేతల ప్రసంగాలతో స్పష్టమవుతోంది.

మణిపూర్ గొడవలకి రాజకీయ రంగు?

  మణిపూర్ నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఉన్నత విద్య అభ్యసిస్తున్న తెలుగు విద్యార్ధులపై స్థానిక విద్యార్ధులు దాడి చేసి, వారిని వారి గదుల్లో నుండి బయటకు రాకుండా నిర్బందించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే అందుకు ముక్తాయింపుగా వినబడుతున్న వార్తలు మాత్రం చాలా ఆలోచన రేకెత్తిస్తున్నాయి. విద్యాసంస్థలలో విద్యార్ధుల మధ్య ఇటువంటి ఘర్షణలు సర్వ సాధారణం. స్వరాష్ట్రంలోగల విశ్వవిద్యాలయాలలోనే చదువుకొంటున్న విద్యార్ధులు కులం, రాజకీయ పార్టీల ప్రభావానికి లోనయి ఘర్షించుకొంటుంటే, ఇతర రాష్ట్రాలలో విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్ధుల మధ్య ప్రాంతీయతత్వం కారణంగా అప్పుడప్పుడు ఇటువంటి ఘర్షణలు ఏర్పడుతుంటాయి, కానీ వాటిని సదరు విద్యాసంస్థల యాజమాన్యాలు సమర్ధంగా పరిష్కరించినపుడు అవి సమసిపోతుంటాయి. కానీ ఇప్పుడు మణిపూర్ లో విద్యార్ధుల మధ్య జరిగిన ఘర్షణలకు తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరికలను అన్వయిస్తూ వార్తలు రావడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది.   కేసీఆర్ ఇటీవల మీడియాపై చేసిన దురుసు వ్యాఖ్యలపై ప్రస్తుతం తీవ్ర దుమారం చెలరేగుతుండటం, కేసీఆర్ మరియు తెలంగాణా ప్రభుత్వంపై మీడియా, అన్ని రాజకీయ పార్టీలు విమర్శలు గుప్పించడం అందరూ గమనిస్తూనే ఉన్నారు. కేసీఆర్ వ్యాఖ్యల వల్ల తెలంగాణా ప్రభుత్వం ఇబ్బందిపడుతున్న ఈ తరుణంలో ఆయన హెచ్చరికలను అన్వయిస్తూ మణిపూర్ విద్యార్ధులు కూడా, "తెలుగు విద్యార్ధులు ఇక్కడ ఉండదలిస్తే తమకు అణిగిమణిగి ఉండాలని" హెచ్చరించారని వార్తలు రావడం చూస్తుంటే, దీనికి ఎవరో రాజకీయ రంగు పులిమే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది.   మణిపూర్ లో తెలుగు విద్యార్ధులపై దాడి జరిగినట్లే, కొన్ని వారాల క్రితం డిల్లీలో అస్సాం, మణిపూర్ తదితర ఈశాన్య రాష్ట్రాల విద్యార్ధులపై కూడా ప్రాంతీయతత్వం ముసుగులో చాలా దాడులు జరిగాయి. అప్పుడు వారందరూ కూడా రోడెక్కి తమ నిరసనలు తెలియజేసారు కూడా. కానీ అప్పుడు ఈ విషయాన్ని ఎవరూ కూడా అంత సీరియస్ గా తీసుకోలేదు. అప్పుడు ఇటువంటి హెచ్చరికలు వినిపించలేదు కూడా. నేటికీ డిల్లీలో అటువంటి సంఘటనలు తరచూ పునరావృతం అవుతూనే ఉన్నాయని నిన్న రాత్రి డిల్లీలో బాబు లాల్ చౌక్ వద్ద లైత్ గోలాయిన్, బోయలిన్ అనే ఇద్దరు మణిపూర్ విద్యార్ధులపై ముగ్గురు స్థానికులు చేసిన దాడి స్పష్టం చేస్తోంది.   భావి భారతపౌరలయిన యువ విద్యార్ధులలో జాతీయ దృక్పధం కొరవడి క్రమంగా ప్రాంతీయతత్వం ప్రభలుతుండటం చాలా ఆందోళనకరమయిన విషయం. అటువంటి సున్నితమయిన సమస్యకు రాజకీయ రంగులు కూడా అద్దినట్లయితే చివరికి అదెక్కడికి దారి తీస్తుందో ఎవరూ ఊహించలేరు. అందువలన విద్యార్దుల మధ్య తలెత్తిన ఈ గొడవలను మరింత పెరగకుండా అందరూ కలిసి కృషి చేస్తే వారికీ దేశానికి అందరికీ మంచిది.

రాష్ట్రాభివృద్ధితోనే దేశాభివృద్ధి: చంద్రబాబు

    నిన్న తిరుపతిలో జరిగిన 14వ ఆర్థిక ప్రణాళికా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రాష్ట్ర విభజన తరువాత ఆంద్రప్రదేశ్ రాష్ట్ర దుస్థితిని సభ్యులకు కళ్ళకు కట్టినట్లు వివరించారు. అంతే కాదు...గత పదేళ్ళ కాంగ్రెస్ పాలనలో రెండు ప్రాంతాలలో అభివృద్ధి ఏవిధంగా కుంటుపడిందో వివరించి, తమ ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధికి చెప్పట్టబోయే ప్రణాళికలను సభ్యుల ముందు ఉంచి, ఇప్పుడు రాష్ట్రానికి కేంద్రం చేయూత చాలా అవసరమనే విషయం వారు కూడా అంగీకరించేలా చేయగలిగారు. తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్న రాష్ట్రానికి సహాయపడితే తమ ప్రభుత్వం వచ్చే ఐదేళ్ళలో రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసి, ఆ అభివృద్ధి ఫలాలను తిరిగి దేశానికి అందించగలదని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడం సభ్యులను ఆకట్టుకొంది. కేంద్రం నిధులిస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకొంటామని ఆయన చెపుతున్నప్పటికీ, దాని వలన యావత్ దేశానికి ప్రయోజనం కలుగుతుందని చెప్పడం ఆయన రాజనీతికి మంచి ఉదాహరణగా చెప్పుకోవచ్చును.   అయితే ముఖ్యమంత్రి గత ప్రభుత్వాలను తిట్టిపోయాడానికే సమయం అంతా వృధా చేశారని రాష్ట్రంలో కాంగ్రెస్, వైకాపాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. రాష్ట్రానికి భారీగా నిధులు రాబట్టుకోవాలంటే ప్రణాళికా సంఘ సభ్యులకు ఈ పరిస్థితులకు గల బలమయిన కారణాలను చెప్పకుండా కేవలం ‘రాష్ట్రాభివృద్ధి చేసుకొంటాము...నిధులు ఇవ్వండి’ అని చంద్రబాబు నాయుడు కోరి ఉండి ఉంటే వారు కూడా ఆయన విజ్ఞప్తిని తేలికగా తీసుకొనే ప్రమాదం ఉంది. అందుకే ఆయన అంత లోతుగా వివరించవలసి వచ్చింది. నిజానికి కాంగ్రెస్, వైకాపా ప్రతినిధులు కూడా ఆర్థిక ప్రణాళికా సభ్యులను కలిసి రాష్ట్రానికి ఉదారంగా నిధులు మంజూరు చేయమని కోరి ఉండి ఉంటే ప్రజలు కూడా హర్షించేవారు. కానీ వారు ఆపని చేయకుండా, ఆ పని చేసిన రాష్ర్ట ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు అధికార పార్టీ ఏమి చేసినా దానిని గుడ్డిగా వ్యతిరేఖంచాలనే సిద్దాంతం పట్టుకు వ్రేలాడుతున్న కాంగ్రెస్, వైకాపాలు ఇంత కంటే ఎక్కువ దూరం ఆలోచించలేవని వాటి విమర్శలతో స్పష్టమయింది.   ఇంతకు ముందు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా ఆర్థిక ప్రణాళిక సంఘంతో ఇటువంటి సమావేశాలలో పాల్గొన్నాయి. కానీ అవి ఏవో మొక్కుబడిగా ప్రతిపాదనలు చేసి నిధులు ఆశించడమే తప్ప ఈ విధంగా తమ భవిష్యత్ ప్రణాళికల గురించి ఎన్నడూ సమర్ధంగా వివరించక పోవడం వలన, కేంద్రంలో రాష్ట్రంలో రెండు చోట్ల కాంగ్రెస్ ప్రభుత్వాలే అధికారంలో ఉన్నప్పటికీ ప్రణాళిక సంఘం ఎప్పుడూ కూడా రాష్ట్రానికి ఉదారంగా నిధులు కేటాయించలేదు. ఇప్పుడు కూడా ప్రణాళిక సంఘం చంద్రబాబు కోరినట్లుగా రాష్ట్రానికి తగినన్ని నిధులు కేటాయిస్తుందో లేదో తెలియదు. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు తన ప్రయత్నలోపం లేకుండా గట్టిగా కృషి చేసారని చెప్పవచ్చును.   ఇప్పటికే ఆయన మూడు సార్లు డిల్లీ వెళ్లి కేంద్రమంత్రులు అందరినీ కలిసి రాష్ట్రానికి సహాయం చేయమని అర్ధించారు. అందుకు వారు కూడా చాలా సానుకూలంగా స్పందించారు. కనుక ఇప్పుడు ఆయన ఆర్థిక ప్రణాళికా సంఘం సభ్యుల ముందు చాలా సమర్ధంగా చేసిన వాదనలు, వారికి సమర్పించిన ప్రభుత్వ ప్రణాళికలు చాలా మేలు చేస్తాయని భావించవచ్చును. చంద్రబాబు తమ ప్రభుత్వ స్వల్పకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలను ఆర్థిక ప్రణాళికా సంఘం ముందు ఉంచారు. కనుక వాటిలో అన్నిటికీ కాకపోయినా ముందుగా వాటిలో అత్యంత ప్రాధాన్యతగల వాటికయినా ప్రణాళికా సంఘం నిధులు కేటాయించే అవకాశం ఉంది.

మెదక్ ఉప ఎన్నికలకే అంత ప్రాధాన్యత ఎందుకు?

  రేపు తెలంగాణాలో మెదక్ లోక్ సభకు, ఆంధ్రాలో నందిగామ శాసనసభకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్ర విభజన తరువాత రెండు రాష్ట్రాలలో కొత్త ప్రభుత్వాలు ఏర్పడి, నూరు రోజుల పరిపాలన పూర్తి చేసుకొన్న తరువాత జరుగుతున్న తొలి ఎన్నికలివి. కనుక సహజంగానే ఈ ఉప ఎన్నికలు ఆంధ్ర, తెలంగాణా ప్రభుత్వాల పనితీరుపై ప్రజలు తీర్పునిచ్చే ఎన్నికలుగా భావించడం సహజం. కానీ మెదక్ ఉప ఎన్నికలకు కనిపిస్తున్న ప్రాధాన్యత నందిగామ ఉపఎన్నికలకు కనబడటం లేదు. ఒక్క కాంగ్రెస్ పార్టీ తప్ప రాష్ట్ర ప్రజలు కానీ, ఇతర రాజకీయ పార్టీలు గానీ నందిగామ ఉప ఎన్నికలను అంత సీరియస్ గా తీసుకోలేదు. అంతే కాదు ఈ ఉప ఎన్నికల ఫలితాలు చంద్రబాబు ప్రభుత్వ పనితీరుపై ప్రజల తీర్పు అని కూడా భావించడం లేదు. కానీ తెలంగాణాలో మాత్రం మెదక్ ఎన్నికలను అటు ప్రభుత్వం, ఇటు ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వ పనితీరుపై ప్రజల ఇవ్వబోయే తీర్పుగానే భావించడం విశేషం.   అందుకు బలమయిన కారణమే ఉంది. గత ఆరు దశాబ్దాలుగా తెలంగాణాను పాలించిన ఆంధ్రా పాలకులు తెలంగాణాను దోచుకోవడానికే ప్రాధాన్యం ఇచ్చారు తప్ప దానిని అభివృద్ధి చేయలేదని, అందువల్లనే ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించవలసి వచ్చిందని తెరాస అధినేత కేసీఆర్ చాలా సార్లు చెప్పారు. తమ పార్టీకే ఓటేసి గెలిపిస్తే తెలంగాణాను అభివృద్ధి చేసి చూపిస్తామని కేసీఆర్ ప్రజలకు హామీ ఇచ్చి తెలంగాణాలో అధికారంలోకి వచ్చేరు. కనుకనే మెదక్ ఉప ఎన్నికలు అందరి దృష్టిని ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి. అందుకే తెలంగాణా ప్రభుత్వం కూడా ఈ ఉప ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని భారీ మెజార్టీతో గెలిచి ప్రజలు తమవైపే ఉన్నారని నిరూపించుకొనేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది.   అయితే తెలంగాణాలో తెరాస అధినేత కేసీఆర్ వాగ్దానాలు చేసినట్లే ఆంధ్రాలో తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కూడా రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసి చూపుతానని వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చేరు. అయినప్పటికీ నందిగామ ఉప ఎన్నికలకు ప్రజలు, ప్రత్యర్ధ పార్టీలు కూడా ఎందుకు అంత ప్రాధాన్యం ఇవ్వడం లేదు? ఈ ఎన్నికల ఫలితాలను చంద్రబాబు ప్రభుత్వ పనితీరుపై ప్రజల తీర్పుగా ఎందుకు భావించడం లేదు? అనే సందేహాలు కలగడం సహజం.   అందుకు ప్రధాన కారణం రాష్ట్ర విభజన తరువాత దయనీయంగా మారిన రాష్ట్ర పరిస్థితులేనని చెప్పక తప్పదు. తెలంగాణాలో అధికారం చేప్పట్టిన తెరాసకు వడ్డించిన విస్తరి వంటి ప్రభుత్వం దక్కితే, ఆంధ్రాలో అధికారం చేప్పట్టిన తెదేపాకు కనీసం విస్తరి కూడా లేదు. రాష్ట్రాన్ని నడిపించే ముఖ్యమంత్రికే కార్యాలయం లేదు. ప్రభుత్వ కార్యాలయాలను రాష్ట్రానికి తరలించేందుకు అవసరమయిన భవనాలను వెతుకోవలసిన దుస్థితి. ఇక ప్రభుత్వాన్ని నడిపించేందుకే నిధులు లేని పరిస్థితిలో రాజధాని నిర్మాణం, రాష్ట్రాభివృద్ధికి నిధుల సమీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం ఆధారపడక తప్పనిసరి పరిస్థితి. కేంద్రం నిధులు విదిలిస్తే తప్ప రాష్ట్ర ప్రభుత్వం అడుగు ముందుకు వేయలేని దుస్థితిలో ఉన్న సంగతి ప్రజలందరికీ తెలుసు. అదేవిధంగా వ్యవసాయ రుణాల మాఫీ కోసం అధికార తెదేపా ఇచ్చిన హామీని నిలబెట్టుకొనేందుకు చేస్తున్న ప్రయత్నాలను ప్రజలు నిశితంగా గమనిస్తూనే ఉన్నారు. ఈ సమస్యలలో ఒక్క వ్యవసాయ రుణాల మాఫీ వ్యవహారం తప్ప మిగిలినవి అన్నీకేవలం రాష్ట్ర ప్రభుత్వం వల్లనే తీరేవి కావని అందరికీ తెలుసు. ఇవన్నీ వందరోజుల్లో తీర్పునిచ్చే అంశాలు కావని ప్రజలకి తెలుసు. అందువలన చంద్రబాబు ప్రభుత్వ పనితీరుపై ప్రజలు తీర్పు చెప్పేందుకు ఇది తగిన సమయం కాదని ప్రజలు భావిస్తునందునే ఈ నందిగామ ఉపఎన్నికలను పట్టించుకోవడం లేదని చెప్పవచ్చును. అదీగాక తెదేపా శాసనసభ్యుడు తంగిరాల ప్రభాకర్ ఆకస్మిక మృతి కారణంగా ఈ నందిగామ ఉప ఎన్నికలు జరుగుతున్నందున, ఆయన మృతి పట్ల ప్రజలు సానుభూతి చూపుతున్నారు తప్ప మిగిలిన అంశాలను పెద్దగా పట్టించుకోవడం లేదు.

మీడియాపై ఆంక్షలు ఇంకా ఎన్నాళ్ళు?

  ఆంద్రజ్యోతి, టీవీ-9 న్యూస్ చానళ్ళపై గత మూడు నెలలుగా కొనసాగుతున్న అప్రకటిత నిషేధంపై ఇంతవరకు ఎంతమంది ఎన్ని విధాల పోరాడినా ఫలితం లేకుండాపోయింది. తెలంగాణా ప్రభుత్వం ఈ నిషేదంలో తన ప్రమేయం లేదంటూనే దానిని ఎత్తివేసేందుకు ఎటువంటి ప్రయత్నం చేయకుండా ప్రేక్షక పాత్ర పోషిస్తూ దానిపై తన వైఖరిని చెప్పకనే చెపుతోంది. మూడు నెలలుగా ఆ రెండు న్యూస్ చానళ్ళపై నిషేధం కొనసాగుతున్నప్పటికీ గవర్నరు, కేంద్రం, కోర్టులు గానీ ఏమీ చేయలేకపోవడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది. వారి ఈ నిర్లిప్తత ప్రజాస్వామ్య వ్యవస్థకు గొడ్డలిపెట్టు వంటివని చెప్పక తప్పదు.   ఆ కారణంగానే యం.యస్.ఓ.లు కూడా కేంద్ర సమాచార ప్రసార శాఖా మంత్రి ప్రకాష్ జవదేకర్ విజ్ఞప్తులను, హెచ్చరికలను బేఖాతరు చేయగలుగుతున్నారని చెప్పక తప్పదు. ఆ కారణంగానే గత మూడు నెలలుగా ఆ రెండు న్యూస్ చానళ్ళు తమ ప్రసారాలు పునరుద్దరణకు చేస్తున్నపోరాటం ఫలించడం లేదని చెప్పవచ్చును. ఆ కారణంగానే తెలంగాణా ప్రభుత్వం కూడా ఉదాసీనత చూపుతోందని భావించవలసి ఉంటుంది.   అయితే మొన్న హైదరాబాదులో తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ క్యాంపు కార్యాలయం ముందు మౌనంగా నిరసన తెలిపేందుకు వచ్చిన మహిళా జర్నలిస్టులపై పోలీసులు పాశవికంగా వ్యవహరించడం, ఆ తరువాత నిన్న వరంగల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియాపై చేసిన దురుసు వ్యాఖ్యలతో యావత్ మీడియా లోకం ఒక్కసారిగా ఉలిక్కిపడి మేల్కొంది. యావత్ మీడియా, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు అన్నీకూడా మీడియాపై ఆయన చేసిన వ్యాఖ్యలని, మీడియాపై నిషేధాన్ని ముక్త కంఠంతో ఖండించాయి.   ప్రజాస్వామ్య వ్యవస్థలో అతి ముఖ్యమయిన వ్యవస్థలయిన ప్రభుత్వం, మీడియా మధ్య ఇటువంటి ఘర్షణ వాతావరణం రెంటికీ మంచిది కాదు. ఇదింకా కొనసాగినట్లయితే ఇదొక దుసంప్రదాయంగా మారే ప్రమాదం కూడా ఉంది. మీడియా తప్పు చేసిందని తెలంగాణా ప్రభుత్వం ఆగ్రహించడం సహజమే. కానీ మీడియాపై నిషేధం కొనసాగిస్తే అది కూడా తప్పే అవుతుంది. అదేవిధంగా మీడియా కూడా మీడియా స్వేచ్చ పేరిట హద్దులు మీరకుండా స్వీయ నియంత్రణ పాటించడం కూడా అత్యవసరం. కనుక తెలంగాణా ప్రభుత్వం ఇకనయినా మీడియాపై నిషేధం ఎత్తివేసేందుకు చొరవ చూపితే అందరూ హర్షిస్తారు.

వ్యవసాయ రుణాల మాఫీపై ఉద్యమానికి వైకాపా ఆలోచన!

    వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గత ఐదేళ్ళలో తన పార్టీని గ్రామస్థాయి నుండి బలోపేతం చేసుకొని ఉండి ఉంటే ఎన్నికలలో ఫలితాలు మరోలా ఉండేవేమో? కానీ ఆయన నేరుగా ఆ పని చేయకుండా ఓదార్పు యాత్రలు, సమైక్యాంధ్ర ఉద్యమాల ద్వారా ఆ పనిని చక్కబెట్టాలని ప్రయత్నించడంతో వ్రతం చెడ్డా ఫలితం దక్కకుండా పోయింది. కానీ ఇప్పుడు కూడా ఆయన ముందుగా గ్రామ స్థాయి నుండి పార్టీని బలంగా నిర్మించుకోకుండా వ్యవసాయ రుణాల మాఫీపై ఉద్యమించేందుకు సిద్దం అవుతుండటం గమనిస్తే ఆయన మళ్ళీ అదే పొరపాటు చేసేందుకు సిద్దం అవుతున్నట్లు కనబడుతోంది.   జగన్ అధ్యక్షతన హైదరాబాదులో జరిగిన పార్టీ నేతల సమావేశంలో వ్యవసాయ, డ్వాక్రా రుణాల రద్దు హామీలపై ప్రభుత్వాన్నినిలదీసేందుకు వచ్చేనెలలో గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ఉద్యమించాలని ఒక కార్యాచరణ ప్రణాళిక కూడా సిద్దం చేసుకొన్నారు. ఆ సందర్భంగా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించి ప్రజావేదిక ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని నిర్ణయించుకొన్నట్లు సమాచారం.   సాధారణంగా ప్రతిపక్ష పార్టీలకి ప్రజల తరపున నిలబడి ప్రభుత్వ వైఫల్యాలను, తప్పులను ఎత్తిచూపుతూ దానిని నిరంతరం అప్రమత్తంగా ఉంచే బాధ్యత ఉంటుంది. వైకాపా కూడా ఆ పాత్ర పోషిస్తే అందరూ హర్షిస్తారు. కానీ జగన్ ఈ అంశాన్ని తీసుకొని ఉద్యమించి తద్వారా తన పార్టీని గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు రాజకీయంగా బలోపేతం చేసుకోవాలని భావిస్తున్నారు.   రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రుణాల మాఫీ చేయడానికి చాలా ఇబ్బందులు పడుతున్నప్పటికీ రైతులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని విశ్వప్రయత్నాలు చేస్తోంది. అది ప్రజలు కూడా గమనిస్తూనే ఉన్నారు. ప్రభుత్వం వ్యవసాయ, డ్వాక్రా రుణాల రద్దుకు అవసరమయిన నిధులు సమీకరించుకొని, ఈనెలాఖరు నుండి దశలవారిగా రుణాల మాఫీ అమలుచేయడానికి సిద్దపడుతోంది. ఈ సంగతి వైకాపాకు కూడా తెలుసు. కానీ ప్రభుత్వం ఒకేసారి మొత్తం వ్యవసాయ రుణాలన్నిటినీ మాఫీ చేసే పరిస్థితిలో లేదని గ్రహించిన జగన్, రైతులను ప్రేరేపించి వారితో కలిసి ఈ అంశంపై ఉద్యమించి, తద్వారా  గ్రామ స్థాయి నుండి తన పార్టీని బలోపేతం చేసుకోవాలని భావిస్తునట్లున్నారు. ఆయన చేస్తున్న ప్రయత్నాలను కూడా ప్రజలు నిశితంగా గమనిస్తూనే ఉన్నారు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే రుణ మాఫీ కార్యక్రమం మొదలుపెడితే వైకాపాకు ప్రజలలో భంగపాటు తప్పకపోవచ్చును.   జగన్మోహన్ రెడ్డి తన పార్టీని గ్రామస్థాయి నుండి బలోపేతం చేసుకోదలిస్తే ముందుగా గ్రామ స్థాయి నుండి పార్టీ నిర్మాణం చేసుకొంటే ఫలితం ఉండేది. కానీ ఆయన ఆ పని చేయకుండా ఉద్యమిస్తే స్వంత సైన్యం లేకుండా కిరాయి సైన్యంతో యుద్దానికి బయలుదేరినట్లవుతుంది. ఈ విషయం ఇటీవల జరిగిన ఎన్నికలలో నిరూపితమయింది. కానీ అది గ్రహించకుండా వైకాపా మళ్ళీ అదే పొరపాటు చేయదలిస్తే మళ్ళీ అవే ఫలితాలు పునరావృతం అవుతుంటాయి తప్ప ఏమీ సాధించేది ఉండబోదని వైకాపా గ్రహించాల్సిన అవసరం ఉంది.

మోడీ ప్రతిపాదనలో మర్మమేమిటో

  జమ్మూ మరియు కాశ్మీరు రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తడంతో ప్రధాని నరేంద్ర మోడీ తక్షణం సహాయ చర్యలకు ఆదేశించారు. అది కేవలం ఆ రాష్ట్రానికి సంబంధించిన సమస్యగా కాక జాతీయ విపత్తుగా భావిస్తున్నానని తెలిపారు. అంతే కాదు పాకిస్తాన్ కోరితే పాక్ ఆక్రమిత కాశ్మీరులో కూడా తమ ప్రభుత్వం సహాయచర్యలు చేప్పట్టేందుకు సిద్దంగా ఉందని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. కొద్ది రోజుల క్రితమే ఇరుదేశాల విదేశాంగ కార్యదర్శుల సమావేశాన్నిఏకపక్షంగా రద్దు చేసుకొన్న భారత్, మళ్ళీ ఈవిధంగా స్పందించడంలో మర్మమేటని పాకిస్తాన్ తో సహా ప్రతిపక్ష పార్టీలు కూడా తలపట్టుకొన్నాయి.   ఇటువంటి క్లిష్ట సమయంలో భారత్ చేసిన ఈ ప్రతిపాదనను రాజకీయాలతో ముడిపెట్టడం సమజసం కాదని అందరూ అంగీకరిస్తారు. కానీ పాక్ అధీనంలో ఉన్న భారత భూభాగంలో భారత్ సహాయ చర్యలు చెప్పట్టడం కోసం పాకిస్తాన్ అనుమతి కోరడం అంటే దానిపై పాక్ సార్వభౌమత్వం అంగీకరించినట్లే కదా? ఇంత కాలంగా ఆ భూ భాగాన్ని ‘పాక్ ఆక్రమిత భారత భూభాగమని’ చెప్పుకోవడమే కాకుండా భారతదేశ మ్యాపులో కూడా దానిని భారత్ అంతర్భాగంగా చూపిస్తున్నపుడు, మోడీ ప్రభుత్వం ఆ ప్రాంతంలో సహాయ చర్యలు చేప్పట్టేందుకు పాక్ ప్రభుత్వ అనుమతి కోరడం లేదా పాకిస్తాన్ కు అటువంటి ప్రతిపాదన చేయడం చర్చనీయాంశం అయింది. అయితే ఆ ప్రతిపాదనను రెండు దేశాల మధ్య సంబంధాలు మళ్ళీ పునరుద్దరించుకొనే ప్రయత్నంలో చేసినవే తప్ప వేరేగా చూడరాదని మరి కొందరి వాదన.   ఏమయినప్పటికీ మోడీ ప్రభుత్వం చేసిన ఈ ప్రతిపాదనకు ఏవిధంగా స్పందించాలో తెలియక పాకిస్తాన్ కూడా తికమక పడినట్లే ఉంది. అందుకే దానికి అవునని కానీ కాదని కానీ స్పష్టంగా సమాధానం చెప్పకుండా 'భారతప్రభుత్వం కోరితే దాని అధీనంలో ఉన్న కాశ్మీరు ప్రాంతంలో తమ బృందాలు సహాయ చర్యలు చెప్పట్టగలవని' గడుసుగా బదులిచ్చింది. అదెలా ఉందంటే ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతానన్నట్లుంది. ప్రజల తిరుగుబాటు కారణంగా ఏ క్షణంలో కుప్ప కూలుతుందో తెలియని పరిస్థితిలో ఉన్న పాక్ ప్రభుత్వం, ముందు తన కుర్చీ క్రింద అంటుకొన్న మంటలను ఆర్పుకోలేకపోయినా, మేకపోతు గాంభీర్యం, అనవసర లౌక్యం ప్రదర్శిస్తూ భారత భూభాగంలో సహాయ చర్యలు చేపడతానని చెప్పడం హాస్యాస్పదం. అయితే దాని భయాలు దానికీ ఉన్నాయి.   ఒకవేళ భారత సహాయ బృందాలను ఆక్రమిత భూభాగంలోకి ప్రవేశించేందుకు అనుమతిస్తే, ఆ వంకతో భారత్ గూడచారులు అక్కడ మాటు వేసిన పాక్ ఉగ్రవాదుల గుట్టు బట్టబయలు చేస్తారనే భయం ఉండి ఉండవచ్చును. అందుకే భారత్ ప్రతిపాదనకు సూటిగా సమాధానం చెప్పకుండా లౌక్యం ప్రదర్శించిందనుకోవాల్సి ఉంటుంది. అయితే కాశ్మీరులో సహాయ చర్యలు చెప్పట్టేందుకు భారత్ కు పాకిస్తాన్ సహాయం అవసరం లేదనే సంగతి దానికీ తెలుసు. ఒకవేళ భారత ప్రభుత్వం పాక్ బృందాలను కాశ్మీరులోకి అనుమతిస్తే, ఆ వంకతో పాక్ ఉగ్రవాదులు దేశంలో చొరబడే ప్రమాదం ఉంది కనుక భారత్ కూడా పాక్ ప్రతిపాదనపై స్పందించలేదు.   ప్రస్తుతం రెండు దేశాల నడుమ సాగుతున్న ఈ వ్యవహారం, మోడీ ప్రభుత్వానికి నిర్దిష్టమయిన విదేశాంగ విధానం కానీ దానిపై సరయిన అవగాహన కానీ లేదని విమర్శిస్తున్న కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ మోడీ ప్రభుత్వంపై విరుచుకుపడేందుకు మరో అవకాశం కల్పించినట్లయింది.   భారత్-పాక్ ల మధ్య సత్సంబంధాలు నెలకొని ఉండటం చాలా అవసరమేనని అందరూ అంగీకరిస్తారు. కానీ పాక్ ప్రభుత్వంపై సైన్యం, మత ఛాందసవాదులు కర్ర పెత్తనం చేస్తునంత కాలం అది ఎన్నటికీ సాధ్యం కాదనే సంగతి అందరికీ తెలుసు. కనుక మోడీ ప్రభుత్వ ప్రతిపాదనలో మంచి చెడ్డల గురించి చర్చించుకోవడం తప్ప కొత్తగా జరిగేది, ఒరిగేదీ ఏమీ ఉండబోదని ఖచ్చితంగా చెప్పవచ్చును.   

కేంద్ర సహాయం కోరేందుకు బేషజాలెందుకు

    తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ డిల్లీ పర్యటన విజయవంతమయిందని తెరాస నేతలతో సహా అందరూ సంతృప్తి వ్యక్తం చేసారు. అంటే మోడీ ప్రభుత్వం కేసీఆర్ అభ్యర్ధనలకు సానుకూలంగా స్పందించినట్లు వారు కూడా ద్రువీకరించినట్లేననుకోవచ్చును. ఇంతకాలంగా వివిద అంశాలపై తెలంగాణా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణ వైఖరి అవలంభిస్తూ దానిని కలిసేందుకు విముఖత ప్రదర్శిస్తూ వచ్చింది. దానిని తెలంగాణా ప్రభుత్వం సమర్ధించుకోవచ్చును. కానీ ఆ తరువాత అవే అంశాలపై తెలంగాణా ప్రభుత్వం పట్టువిడుపులు ప్రదర్శించినందునే కేంద్రం కూడా సానుకూలంగా స్పందించిందని భావించవచ్చును. అదేవిధంగా గవర్నరు చొరవతో కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో కూడా సమావేశమయిన తరువాత నుండే రెండు రాష్ట్రాల మధ్య కొంత సహృద్భావ వాతావరణం ఏర్పడిన సంగతి అందరికీ స్పష్టంగా కనబడుతూనే ఉంది.   ప్రధానితో సహా కేంద్ర మంత్రులు కేసీఆర్ బృందానికి ఇచ్చిన హామీల గురించి ఇప్పటికే పత్రికలలో, న్యూస్ చానళ్ళలో వార్తలు వచ్చాయి గనుక మళ్ళీ దానిపై ఇప్పుడు వాటిని ఇక్కడ సమీక్షించనవసరం లేదు కనుక కేసీఆర్ డిల్లీ పర్యటన గురించి మాత్రమే చెప్పుకొంటే సరిపోతుంది.   “కేసీఆర్ ఈ పని మొదటే చేసి ఉంటే బాగుండేదని, కనీసం ఇప్పుడయినా డిల్లీ వెళ్ళి మంచి పనిచేసారని, ఆయన అభ్యర్ధనలకు కేంద్రం సానుకూలంగా స్పందించడం బట్టి కేంద్రం తెలంగాణా ప్రభుత్వం పట్ల ఎటువంటి వివక్ష చూపడం లేదని స్పష్టమయిందని” తెలంగాణా బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆలోచింపదగ్గవే. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ విధానాలు, ప్రాధాన్యతలు, సమస్యలు, ఒత్తిళ్ళు దానివి దానికి ఉంటాయి. అందువలన రాష్ట్ర ప్రభుత్వాల అధినేతలో కనీసం వారి ప్రతినిధులో కేంద్రాన్ని తరచూ కలుస్తూ తమ రాష్ట్రాలకు రావలసినవి రాబట్టుకోక తప్పదు. చంద్రబాబు నాయుడు ఆపని ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చెప్పట్టక ముందు నుండే చేస్తున్నారు. అయినప్పటికీ కేంద్రం ఏవో కొన్ని విద్యుత్ కేటాయింపులు వంటివి తప్ప ఇంతవరకు రాష్ట్రానికి పెద్దగా ఇచ్చిందేమీ కనబడటం లేదు. అందుకే ఆయన తరచూ డిల్లీ పర్యటనలు చేస్తూ కేంద్రం సహాయం కోసం నిరంతరం ఒత్తిడి చేస్తున్నారు.   “కేసీఆర్ ఇంతవరకు తమ సహాయం కోరలేదని, కోరి ఉంటే కేంద్రం తప్పక సహాయం చేసేందుకు సిద్దంగా ఉందని” కేంద్ర విద్యుత్ మంత్రి పీయూష్ గోయల్ కొద్ది రోజుల క్రితం చేసిన వ్యాఖ్యలు ‘అడగందే అమ్మయినా అన్నం పెట్టదనే’ నానుడిని జ్ఞప్తికి తెచ్చేవిగా ఉన్నాయి. ఇప్పుడు కేసీఆర్ కేంద్రాన్ని నోరు తెరిచి అడిగారు కనుక కేంద్రం కూడా అనేక హామీలు ఇచ్చింది. అయితే ఆ హామీలు కార్యరూపం దాల్చాలంటే కేసీఆర్ బృందం బహుశః మరికొన్నిసార్లు డిల్లీ పర్యటించవలసి ఉంటుందేమో.   గతంలో యూపీయే ప్రభుత్వం ఏనాడు కూడా తమ స్వంత పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల పట్ల కూడా ఇంత సానుకూలంగా స్పందించిన దాఖలాలు లేవు. ఎందువలన అప్పుడు కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కర్ర పెత్తనం చేస్తుండేవారు. అందువలన అప్పటి ముఖ్యమంత్రులందరూ ప్రధానిని కలవకుండా సోనియా ప్రాపకం కోసం ఆమె ఇంటి చుట్టూ ప్రదక్షిణాలు చేసేవారు. వారి పర్యటనలు, అధినేత్రితో చర్చలు తమ స్వంత, తమ పార్టీ రాజకీయ ప్రయోజనాలను కాపాడుకోవడానికే ప్రధానంగా పరిమితమయ్యేవి కనుక రాష్ట్రాల, రాష్ట్ర ప్రభుత్వాల పరిస్థితి కూడా ‘ఎక్కడి గొంగళి అక్కడే’ అన్నట్లుండేది.   కానీ మోడీ ప్రభుత్వం అందుకు పూర్తి భిన్నంగా దేశంలో అన్ని రాష్ట్రాలు సమానంగా అబివృద్ధి చెందాలనే తన విధానానికి అనుగుణంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు సహాయపడేందుకు సంసిద్దత వ్యక్తం చేస్తోంది. కనుక ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదేనని చెప్పక తప్పదు. కనుక రాష్ట్రాభివృద్ధి కోరుకొనే ముఖ్యమంత్రులు తమ అహాన్ని, బేషజాలను, రాజకీయ వైరాలను, తమ వ్యతిరేకతను అన్నిటినీ పక్కన పెట్టి, డిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తూ రాష్ట్రానికి రావలసినవన్నీ రాబట్టుకోక తప్పదు.

వ్యూహాత్మకంగా వ్యవహారించిన ముఖ్యమంత్రి కేసీఆర్, తుమ్మల

  ఊహించినట్లే తెదేపా సీనియర్ నేత తుమ్మల నాగేశ్వర రావు తన అనుచరులతో కలిసి తెరాస అధ్యక్షుడు కేసీఆర్ సమక్షంలో ఆ పార్టీలో నిన్న జేరిపోయారు. బహుశః త్వరలోనే ఆయనకు మంత్రి పదవి కూడా దక్కవచ్చును. రాజకీయ నేతలు పార్టీలు మారడం, ఆ సందర్భంగా నాలుగు ముక్కలు మాట్లాడటం చాలా సహజమే కనుక ఈ సందర్భంగా వారిరువురూ మాటలు కూడా ఆ కోవకే చెందినవని అందరూ అనుకోవచ్చును. కానీ వారిరువురు ఈ సందర్భంగా వ్యవహరించిన, మాట్లాడిన తీరు వారి రాజకీయ పరిణతికి, ఆశలకు అద్దం పట్టేవిగా ఉన్నాయి.   ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ‘నిజానికి ఆయన స్థాయి నేతకు ఈవిధంగా తెలంగాణాలో భవన్ లో కాక నిజాం కాలేజీ మైదానంలో పెద్ద సభను ఏర్పాటు చేసి స్వాగతం పలకాల్సి ఉందని’ అనడం, అదేవిధంగా తుమ్మలతో తన అనుబంధం జ్ఞప్తికి తెచ్చుకొని ఆయన తన చిరకాల మిత్రుడు, ఆప్తుడని అందరి ముందు చెప్పడం గమనిస్తే కేసీఆర్ తను ఆయనకు చాలా ప్రాధాన్యం ఇస్తున్నానని, తుమ్మలకే కాక తన పార్టీ నేతలకు, కార్యకర్తలకు, చివరికి తెదేపా నేతలకు కూడా కేసీఆర్ ఒక సందేశం ఇచ్చినట్లు అర్ధమవుతోంది. తద్వారా మున్ముందు మరింతమంది తెదేపా నేతలు తెరాసలోకి ఆకర్షింపబడే అవకాశం కూడా ఉంది.   తుమ్మలకు జిల్లా సమస్యలు, వనరులు, రాజకీయాలపై మంచి అవగాహన ఉందని, జిల్లాలో తెదేపా, తెరాస నేతలు, కార్యకర్తలతో మంచి సంబంధాలు ఉన్నందున, ఆయనకే ఖమ్మం జిల్లా బాధ్యతలు అప్పగించాలని తను భావిస్తున్నట్లు ప్రకటించడం కూడా వ్యూహాత్మకమే. ఎందువలన అంటే మొదటి నుండి ఖమ్మం జిల్లా తెదేపాకు కంచుకోటలా నిలబడి ఉంది. దానిలోకి ప్రవేశించాలని తెరాస చేసిన ప్రయత్నాలేవీ ఇంతవరకు ఫలించలేదు. కానీ ఇప్పుడు జిల్లాలో మంచి బలమయిన నాయకుడిగా పేరున్న తుమ్మల తెరసలోకి చేరడంతో ఇప్పుడు ఆ కంచుకోటను బ్రద్దలు కొట్టేందుకు కేసీఆర్ కు అవకాశం దొరికినట్లయింది. అందుకే ఆ కోటపై పట్టున్న తుమ్మలకే ‘ఆ పని’ అప్పగిస్తున్నట్లు అర్ధమవుతోంది. అందుకే ఆయనకు తను చాలా ప్రాధాన్యం ఇస్తున్నట్లు విస్పష్టంగా తెలియజేసారు.   ఈ సందర్భంగా ఆయన త్వరలోనే ఖమ్మం జిల్లాను రెండుగా విడదీయాలనుకొంటున్నట్లు ప్రకటించడం కూడా గమనార్హమయిన విషయమే. తమ పార్టీ అధికారం చేప్పట్టిన తరువాత ప్రస్తుతం ఉన్న 10 జిల్లాలను పరిపాలనా సౌలభ్యం కోసం 20 జిల్లాలుగా మార్చుతామని కేసీఆర్ ఇదివరకే చాలాసార్లు చెప్పారు. చెప్పడమే కాకుండా అప్పుడే ఆ దిశలో ప్రయత్నాలు కూడా మొదలుపెట్టారు. కానీ ఈ సందర్భంగా ఆయన ఖమ్మం జిల్లాను రెండుగా విడదీయలనుకొంటున్నట్లు చెప్పడం మాత్రం కేవలం పరిపాలనా సౌలభ్యం కోసమే కాక, ఆ జిల్లాపై మంచి పట్టున్న తెదేపా, నామ నాగేశ్వరరావు తదితర నేతల పరిధిని, వారి ప్రభావాన్ని కుచింపజేసి, అక్కడ తుమ్మల సారధ్యంలో తెరాసను బలోపేతం చేయడం కూడా ఒక లక్ష్యంమని భావించవచ్చును. ఇకపై తాను తరచూ ఖమ్మం జిల్లాలో పర్యటిస్తానని కేసీఆర్ ప్రకటించడం గమనిస్తే ఆ సంగతి అర్ధమవుతుంది.   ఇక తుమ్మల నాగేశ్వరావు ఖమ్మం జిల్లాను అభివృద్ధి చేసుకొనేందుకు, తెలంగాణా అభివృద్ధికి కృషి చేస్తున్న కేసీఆర్ కు అండగా నిలబడేందుకే తాను తెరాసలో చేరుతున్నానని ప్రకటించినప్పటికీ అసలు కారణాలు వేరని అందరికీ తెలుసు. ఆయనకు జిల్లాలో నామా నాగేశ్వరరావుతో అభిప్రాయబేధాలు తత్సంబంధిత కారణాల వల్లనే ఆయన తెదేపాను వీడి తెరాసలో చేరారని అందరికీ తెలుసు. ఆయన పరిస్థితిని గమనించిన తెరాస అధ్యక్షుడు కేసీఆర్, ఇదే అదునుగా ఆయనను పార్టీలోకి ఆహ్వానించడం, మంత్రి పదవి కూడా ఇవ్వబోతున్నట్లు వార్తలు వగైరాల పరిణామాలన్నీ తుమ్మలను తెరసవైపు నడిపించాయని చెప్పవచ్చును. తెదేపాలో తనకు ప్రాధాన్యత తగ్గిపోయిందని భావిస్తున్న సమయంలో కేసీఆర్ నుండి ఆహ్వానం రావడంతో తుమ్మల పార్టీ మారారు తప్ప, పార్టీ మారేందుకు ఆయన చెపుతున్న ఇతర కారణాలు నిజం కాదని అర్ధమవుతోంది.   ఏమయినప్పటికీ తుమ్మల తెరాసలో చేరడం వలన ఖమ్మం జిల్లాలో తెరాస బలపడే అవకాశం ఉంటే, అధికార తెరాస పార్టీలో చేరడం వలన తుమ్మల కేవలం మంత్రి పదవి పొందడమే కాకుండా, జిల్లాలో మళ్ళీ చక్రం తిప్పగలుగుతారు. కనుక ఇది ఉభయతారకమని చెప్పవచ్చును. అయితే ఈ గడ్డు పరిస్థితిని తెదేపా ఏవిధంగా ఎదుర్కొంటుందో వేచి చూడాల్సి ఉంది.