రైతుల రుణమాఫీలపై కూడా రాజకీయాలేనా?
posted on Jun 5, 2014 @ 9:40AM
రాజకీయ పార్టీలు ప్రజలను ఆకట్టుకొని ఎన్నికలలో గెలిచేందుకు అనేక వాగ్దానాలు చేయడం పరిపాటి. గతంలో అయితే వాటిని ప్రజలు కూడా అంతగా పట్టించుకొనేవారు కాదు గనుక రాజకీయ పార్టీలు అధికారంచెప్పట్టగానే తమ హామీలను చెత్తబుట్టలో పడేసేవి. కానీ, ఇప్పుడు ప్రజలలో రాజకీయ చైతన్యం బాగా పెరిగింది. పైగా డజన్ల కొద్దీ న్యూస్ ఛానళ్ళు అధికార పార్టీ చేసిన వాగ్దానాల సాధ్యాసాధ్యాల గురించి చాలా లోతయిన విశ్లేషణలు చేస్తూ ప్రజలను, ప్రభుత్వాలను, ప్రతిపక్షాలను కూడా మరింత అప్రమత్తం చేస్తున్నాయి. అంతేగాక అవి ప్రభుత్వాలను నీడలా వెంటాడుతూ వాటిని అమలు చేయకపోయినా, వాటిపై వెనక్కి తగ్గినా ప్రజా సమక్షంలో తూర్పారబడుతున్నాయి.
ఇక ఎన్నికలలో ఓటమిపాలయిన పార్టీలు ఆ దుగ్ధతో అధికారం చేపట్టిన పార్టీని ఇబ్బంది పెట్టేందుకు ప్రజలకు ఇచ్చిన హామీలను అన్నిటినీ అమలుచేయాలని గట్టిగా ఒత్తిడి తెస్తున్నాయి. జవాబుదారీతనం అలవాటులేని మన రాజకీయ వ్యవస్థలో ఈ మార్పు ప్రజలకు మేలుచేసే ఒక శుభపరిణామంగా భావించవచ్చును. అందువల్ల ఇకముందు రాజకీయ పార్టీలు నోటికి వచ్చిన హామీలు గుప్పించే సాహసం చేయడానికి వెనుకంజవేయవచ్చును.
అధికారం దక్కించుకొనేందుకు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం ఎంత కష్టమో మొట్టమొదటిసారిగా అధికారం చేప్పట్టిన కేసీఆర్ ప్రభుత్వానికి ఇపుడిపుడే అర్ధమవుతోంది. ఎన్నికల ప్రచారంలో రైతుల రుణాలు మొత్తం మాఫీ చేస్తానని వాగ్దానం చేసిన కేసీఆర్, ఇప్పుడు కేవలం 2013-14సం.లలో తీసుకొన్న లక్ష రూపాయలలోపు వ్యవసాయ రుణాలను మాత్రమే మాఫీ చేస్తామని, వ్యవసాయం కోసం రైతులు బంగారు వస్తువులు బ్యాంకులలో తాకట్టుపెట్టి తెచ్చిన రుణాలను మాఫీ చేయలేమని చేతులెత్తేసారు. ఈ సరికొత్త షరతులతో కేసీఆర్ ప్రభుత్వం కనీసం ఏడెనిమిది వేల కోట్ల రూపాయల రుణభారం తగ్గించుకోవాలని ప్రయత్నిస్తోంది. అందుకు అప్పుడే ప్రతిపక్షాలు, మీడియా కేసీఆర్ ప్రభుత్వాన్ని దుమ్మెత్తి పోయడం ఆరంభించాయి. మిగులు బడ్జెట్ ఉన్నప్పటికీ కేసీఆర్ ప్రభుత్వం ఈవిధంగా ప్రయత్నించడంతో ఆ విమర్శలు మరింత ఎక్కువయ్యాయి. నిజానికి కేసీఆర్ ప్రభుత్వం తలుచుకొంటే మొత్తం రుణాలు మాఫీ చేయడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ అందుకు ఇష్టపడలేదు. అందుకే విమర్శలు ఎదుర్కొంటోంది.
మిగులు బడ్జెట్ తో ఉన్నతెలంగాణా ప్రభుత్వమే ఆవిధంగా వెనకాడుతునప్పుడు, ఇక ఉద్యోగులకు జీతాలు కూడా ఈయలేని పరిస్థితుల్లో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం ఏవిధంగా రూ.54,000 కోట్ల రుణాలను మాఫీ చేయగలరు? అనే ప్రశ్న తలెత్తడం సహజం. అందుకే చంద్రబాబు ప్రభుత్వం ఎప్పుడెపుడు అధికారం చేపడుతుందా?రుణాల మాఫీపై చంద్రబాబుని ఏవిధంగా ఇరుకున పెడదామా? అని వైకాపా అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి, వైకాప నేతలు కూడా చాలా ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. చంద్రబాబుకి ఇక ‘కౌంట్ డౌన్’ మొదలయిందని జగన్ అనడం చూస్తే, ఈవిషయంలో ఆయన ఎంత ఆత్రంగా ఉన్నారో అర్ధమవుతోంది.
తెలంగాణాలో అయినా, ఆంధ్రప్రదేశ్ లో అయినా ప్రభుత్వాలు అన్నదాతలను ఆదుకోవాలని ప్రయత్నించాలి. అందుకు ప్రతిపక్షాలు కూడా అన్నివిధాల సహకరించాలి. ఎన్నికలలో ఓడిపోయిన రాజకీయ పార్టీలు, మీడియా ముందుకు వచ్చి ఇకపై నిర్మాణాత్మకమయిన ప్రతిపక్షంగా వ్యవహరిస్తామని ఇచ్చిన హామీని మరిచిపోయి, అధికారా పార్టీ ఇచ్చిన హామీల గురించి నిలదీయడం మొదలుపెడతాయి. రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్నాకూడా ప్రజాసంక్షేమం కోసం నిర్మాణాత్మక పాత్ర పోషించాలి తప్ప, ఆపేరుతో రాజకీయాలు చేయడం సమర్ధనీయం కాదు. ప్రబుత్వాలు తమ హామీలను నిలబెట్టుకోవడంలో విఫలమవుతున్నప్పుడు, బాధ్యతగల ప్రతిపక్షం పార్టీగా ముందుగా ప్రభుత్వానికి తగిన సలహాలు సూచనలు ఇవ్వాలి. అప్పటికీ ప్రభుత్వం హామీలను అమలు చేయడంలో వెనుకంజ వేస్తే, అప్పుడు తప్పకుండా నిలదీయవచ్చును. కానీ ప్రభుత్వాలు తమ హామీలను నిలబెట్టుకోవడంలో విఫలమయితే చాలు, వాటిని ఇరుకున పెట్టి ప్రజల ముందు దోషులుగా నిలబెట్టి తామేదో ఘనకార్యం సాధించినట్లు సంతోషపడాలనుకోవడం వికృతానందమే తప్ప మరొకటి కాదు. అన్నదాతల సమస్యలను మానవతా దృక్పధంతో చూడకపోగా, వాటిని కూడా రాజకీయం చేసి లబ్దిపొందాలనుకోవడం పైశాచిక (సాడిస్ట్) ఆలోచనే.