జగన్ ఆరాటమంతా రైతన్నల కోసమేనా?
posted on Jun 9, 2014 @ 9:57PM
జగన్మోహన్ రెడ్డి తనను తాను విశ్వసనీయతకు నిలువెత్తు సజీవ రూపంగా వర్ణించుకొంటారు. కానీ సరిగ్గా అదే ఆయనలో లోపించింది. ఆ కారణం చేతనే ఓటమి పాలయ్యారు. అయినా దానిని ఆయన అంగీకరించేందుకు సిద్దంగా లేరు. చంద్రబాబు భూటకపు హామీలను ప్రజలు గుడ్డిగా నమ్మడం వలననే తాను ఓడిపోయానని సర్ది చెప్పుకొంటున్నారు. తనను తాను దీనజన బాంధవుడిగా, రైతన్నల నేస్తంగా వర్ణించుకొనే జగన్మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు రైతుల, డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేయాలని మనస్పూర్తిగా కోరుకొని ఉంటే అందరూ మెచ్చుకొని ఉండేవారు. కానీ ఆయన చంద్రబాబు నాయుడు రుణాలు మాఫీ చేయలేక చేతులెత్తేయాలని, అప్పుడు తను ఆయనను ప్రజల మధ్య నిలబెట్టి చీల్చి చెండాడేసి, తన ఓటమికి ఆయనపై ప్రతీకారం తీర్చుకోవాలని తహతహలాడిపోతున్నారు.
రైతులు సంక్షేమం కోసం రుణాలు మాఫీ అవ్వాలని ఆరాటపడవలసిన జగన్మోహన్ రెడ్డి, ఈవిధంగా చంద్రబాబు నాయుడు విఫలం అవ్వాలని కోరుకోవడం గమనిస్తే ఆయన విశ్వసనీయత ఏపాటిదో అర్ధం అవుతోంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకముందే రుణాల మాఫీ అంతా ఒక డ్రామా అని తేల్చి చెప్పిన జగన్మోహన్ రెడ్డి, నిన్న చంద్రబాబు మొట్ట మొదట రుణాల మాఫీ ఫైలుపైనే తొలి సంతకం చేయడం, వెంటనే ఒక కమిటీని వేసి 45రోజుల్లో మొత్తం అన్ని రుణాల గురించి పూర్తి వివరాలు, వాటి మాఫీకి విధివిధానాలు చెప్పమని ఆదేశించడంతో కంగు తిన్నారు.
ముఖ్యమంత్రి అయిన తరువాత కూడా రుణాలమాఫీ చేయడానికి కమిటీ ఎందుకని ప్రశ్నిస్తూ చంద్రబాబుకి ఒక బహిరంగలేఖ వ్రాసారు. వెంటనే రైతుల రుణాలన్నీ మాఫీ చేయకపోతే వారు కొత్త రుణాలు తీసుకోవడానికి వీలుపడదని ఆందోళన పడిపోతున్నారు. ఆయన ఈ తపనంతా రైతుల సంక్షేమం కోసమే అయితే నిజంగా అందరూ మెచ్చుకొనేవారు. కానీ అది కేవలం చంద్రబాబుని ప్రజలలో దోషిగా నిలబెట్టేందుకేనని అర్ధమవుతూనే ఉంది.
చంద్రబాబు నిన్ననే ప్రమాణ స్వీకారం చేసారు. కానీ ఇంకా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించలేదు. మంత్రులకు శాఖలు కేటాయించలేదు. కనీసం ఆర్ధికమంత్రిని కూడా ఇంకా నియమించలేదు. అందువల్ల ఇంకా తొలి మంత్రివర్గ సమావేశం కూడా నిర్వహించలేదు. జగన్మోహన్ రెడ్డికి ఇదంతా తెలిసి ఉనప్పటికీ, తెలియనట్లుగా నటిస్తూ, ఇప్పటికిప్పుడు వెంటనే ప్రభుత్వం రుణాలు మాఫీ చేసేయాలని లేకపోతే ప్రజలను మోసం చేస్తునట్లేనని తేల్చి చెప్పడం చూస్తే ఆయన చంద్రబాబుపై ఎంతగా రగిలిపోతున్నారో, ఆయనను అప్రదిష్టపాలు చేయడానికి ఎంతగా తహతహలాడిపోతున్నారో అర్ధమవుతుంది.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేలాది రైతులు, వివిధ బ్యాంకుల ద్వారా తీసుకొన్న వేలకోట్ల అప్పుల గురించి ఏ వివరాలు తెలుసుకోకుండా వాటిని ప్రభుత్వం మాత్రం ఏవిధంగా మాఫీ చేయగలదు? ఏ ఏ బ్యాంకుకు ఎంత మొత్తం అప్పులు తిరిగి చెల్లించాలి? దాని అసలెంత? వడ్డీ ఎంత? ముందుగా బ్యాంకులు రైతుల రుణాలను మొత్తం మాఫీచేసి, ఆ తరువాత వాటిని ప్రభుత్వం తిరిగి వాయిదా పద్దతుల ద్వారానో లేదా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల హామీ ఇవ్వడం ద్వారానో లేదా ప్రభుత్వ బాండ్లు వంటివి సమర్పించడం ద్వారానో తిరిగి చెల్లించే వెసులుబాటు కల్పిస్తాయా? వంటి అనేక వివరాలు సేకరించవలసిన అవసరముంటుంది.
నిరక్షరాస్యులయిన రైతులకు ఇటువంటి సాంకేతిక అంశాలు గురించి తెలియదు గనుక చంద్రబాబు రుణమాఫీ చేయకుండా తప్పించుకోనేందుకే కమిటీ వేసారని టాంటాం చేస్తూ జగన్మోహన్ రెడ్డి రైతన్నలను కూడా తప్పు దారి పట్టించే ప్రయత్నం చేస్తున్నట్లు కనబడుతోంది. రైతుల సంక్షేమం కోసం పోరాడుతున్నానని చెప్పుకొంటున్న జగన్మోహన్ రెడ్డి తన మాటలు, చేతల ద్వారా వారికి దైర్యం చెప్పకపోగా వారిలో నిరాశ, నిస్పృహలు కలిగిస్తున్నారు. రైతన్నల సంక్షేమం కంటే, తన రాజకీయ శత్రువు చంద్రబాబుపై పైచేయి సాధించడమే ముఖ్యమనుకోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.
కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణాలో రైతన్నల రుణాలమాఫీపై వెనకడుగు వేసినా ఆయనను పల్లెత్తు మాటనలేదు. పైగా ఆయన అడగకుండానే ఆయన ప్రభుత్వానికి అంశాల వారిగా మద్దతు ఇస్తానని జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. కానీ చంద్రబాబు రుణాల మాఫీ చేస్తూ ఫైలుపై సంతకం చేసినప్పటికీ, ఆయనపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్న ఈ ద్వంద వైఖరి గమనిస్తే ఆయన విశ్వసనీయత ఎంత గొప్పదో అర్ధమవుతుంది. బహుశః దీనినే ఆయన విశ్వసనీయత అనుకొంటున్నారేమో!