ఆ నలుగురూ...
posted on Jun 4, 2014 8:22AM
రాజకీయనేతల అందరి రాజకీయ జీవితాలలో ఒడిడుకులు సహజమే. కానీ ఒకేసారి రివ్వున పైకెదిగి, అంతే వేగంగా పడిపోయిన వారి సంఖ్య వ్రేళ్ళ మీద లెక్కబెట్టవచ్చును. అటువంటి వారిలో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, డిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీల పేర్లను ప్రముఖంగా చెప్పుకోవచ్చును.
ఎవరూ ఊహించని విధంగా ముఖ్యమంత్రి పదవి దక్కించుకొన్న కిరణ్ కుమార్ రెడ్డి, తన మూడేళ్ళ పాలనలో ఒక వెలుగు వెలిగారు. తన మంత్రి వర్గ సహచరులను కానీ, ప్రతిపక్ష నేతలను గానీ ఎన్నడూ ఖాతరు చేయలేదు. ఆయన మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డిని అనుకరించబోయి వాతలు పెట్టుకొన్నారు. తన మూడేళ్ళ పాలనలో పార్టీలో వారిని, బయట వారినీ, చివరికి అధిష్టానాన్ని అందరినీ కూడా శత్రువులుగా మార్చుకొన్న ఘనత ఆయనకే స్వంతం. అయితే ఆయన రాష్ట్ర విభజన అంశం తలకెత్తుకొన్నాక ప్రజలలో కొంత మంచి పేరు సంపాదించిన మాట వాస్తవం. కానీ, ఆయనే అధిష్టానానికి సహకరిస్తూ దగ్గరుండి రాష్ట్ర విభజన చేస్తూ, ప్రజలను మభ్య పెట్టాలని ప్రయత్నించడం మొదలు పెట్టిన నాటి నుండి ఆయన ప్రతిష్ట పూర్తిగా మసకబారింది. ఆ సంగతి గమనించకుండా పార్టీ పెట్టి ఉన్న పరువు కూడా తీసుకొన్నారు. ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నారో ఎవరికీ తెలియదు. ఏమి చేస్తున్నారో అంతకంటే తెలియదు.
ఇక జగన్మోహన్ రెడ్డి సీబీఐ కేసులు, జైలు జీవితం అనుభవించినప్పటికీ ఆయనకు ప్రజాధారణ తరగలేదు. స్వర్గీయ వైయస్సార్ చేప్పట్టిన సంక్షేమ కార్యక్రమాలే జగన్ కు శ్రీరామరక్షగా నిలిచాయి. ఆయన ఆకస్మిక మరణంతో ప్రజలలో జగన్ పట్ల సానుభూతి పొంగిపొరలింది. దానిని జగన్ బాగానే ఒడిసిపట్టి, చాలా భద్రంగా ఐదేళ్ళు కాపాడుకొచ్చినప్పటికీ, ఎన్నికలలో ఆ సానుభూతిని ఓట్లుగా మలుచుకోవడంలో విఫలమయ్యారు. పోలింగ్ జరిగేరోజు వరకు కూడా అన్ని సర్వేలు వైకాపాయే భారీ మెజార్టీతో గెలుస్తుందని బల్లగుద్ది చెప్పినప్పటికీ వైకాపా ఓడిపోయింది. అందుకు కారణాలు అనేకం. అవేమిటో ప్రజలకు బాగానే తెలుసు. భారీ మెజార్టీతో ఎన్నికలలో గెలిచి ముఖ్యమంత్రి అయ్యి కేంద్రం మెడలు వంచుతానని ప్రగల్భాలు పలికిన జగన్మోహన్ రెడ్డి, మోడీ ప్రధాని బాధ్యతలు చెప్పట్టగానే ఆయనను మంచి చేసుకోవడానికి డిల్లీకి పరుగులు పెట్టడం చూస్తే జాలి కలుగుతుంది. ఇక మరో ఐదేళ్ళు తన పార్టీని, తనను తాను కాపాడుకోవడం జగన్మోహన్ రెడ్డికి కత్తి మీద సామువంటిదే.
ఇక ఆమాద్మీ పార్టీ పెట్టిన ఏడాదిలోనే డిల్లీ ముఖ్యమంత్రి పీఠం అధిరోహించిన అరవింద్ కేజ్రీవాల్, కేవలం 49రోజులలోనే తనంతట తానే అధికారం వదులుకొన్నారు. ఉట్టి కెగరలేనమ్మ స్వర్గానికి ఎగురతాననట్లు డిల్లీని పాలించలేని ఆయన దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలలో పోటీచేసి దేశాన్ని ఏలేందుకు సిద్దమవడం ప్రజలు ఆమోదించలేకపోయారు. అందుకే ఆయన ప్రజల చేతిలో చెంపదెబ్బలు తిన్నారు, అనేక అవమానాలు ఎదుర్కొన్నారు. ఎన్నికలలో భంగపడ్డారు. ఆ తరువాత మళ్ళీ డిల్లీ పీఠం ఎక్కే ప్రయత్నం చేసారు. కానీ కాంగ్రెస్ మద్దతు నిరాకరించడంతో ఆ ప్రయత్నమూ ఫలించలేదు.
అప్పుడే ఆయన తనకు జ్ఞానోదయం అయినట్లుగా “ప్రజలు అప్పగించిన అధికారం అర్దాంతరంగా వదిలిపెట్టినందుకు డిల్లీ ప్రజలకు క్షమాపణలు చెప్పుకొని, మళ్ళీ అధికారం ఇస్తే ఈసారి ఐదేళ్ళు పాలిస్తానని” వేడుకొన్నారు. దానికి డిల్లీ ప్రజల నుండి కనీస స్పందన కూడా కరువయింది. ఈ అవమానాలు చాలవన్నట్లు బీజేపీ నేత నితిన్ గడ్కారీపై చేసిన అవినీతి ఆరోపణలు చేసినందుకు కోర్టు గడప ఎక్కాల్సి వచ్చింది. అప్పుడు కూడా ఆయన వివేకం ఏమయిపోయిందో తెలియదు. కోర్టు ఆయనకు రూ.10 వేలు పూచీకత్తుపై బెయిలు మంజూరు చేసేందుకు సిద్దపడినా, ఆయన నిరాకరించి తీహార్ జైలు చిప్పకూడు రుచి చూసిన తరువాత కోర్టు ఆదేశాల మేరకు పూచీకత్తు చెల్లించి బెయిలు తీసుకోవడం నవ్వు తెప్పిస్తుంది.
ఎన్నికలలో ఆమాద్మీ పార్టీ ఓటమి తరువాత పార్టీలో లుకలుకలు మొదలయ్యాయి. పార్టీలో సీనియర్ నేతల రాజీనామాల పర్వం కొనసాగుతోంది. బహుశః మరి కొద్ది రోజులలలో ఆమాద్మీ పార్టీలో అరవింద్ కేజ్రీవాల్ ఒక్కరే మిగిలినా ఆశ్చర్యం లేదు. వాపును చూసి బలుపు అనుకోవడం వలన తిప్పలే ఇవ్వనీ.
ఇక యువరాజవారు రాహుల్ గాంధీకి అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉన్నట్లు, కాశ్మీరు నుండి కన్యాకుమారి వరకు మాజీ ప్రధాని మాన్మోహన్ సింగుతో సహా కాంగ్రెస్ పార్టీ నేతలందరూ ఆయనకు దాసోహం అన్నప్పటికీ, కాంగ్రెస్ స్వీయ తప్పిదాల కారణంగా ఎన్నికలలో ఓడిపోయింది. దేశానికి ప్రధానమంత్రి కావాలని కలలుగన్న ఆయన, ఆ నిర్ణయం తీసుకోవడంలో ఏకంగా 10 ఏళ్ళు జాప్యం చేయడంతో ఘోర తప్పిదం చేసారు. దేశానికి ప్రధాని కావాలనుకొన్న ఆయన ఇప్పుడు కనీసం పార్లమెంటులో పార్టీకి నాయకత్వం వహించేందుకు కూడా వెనకాడటం చూస్తే ఆయన ఎటువంటి దయనీయ పరిస్థితిలో ఉన్నారో అర్ధమవుతుంది. ఒకవేళ ప్రధాని నరేంద్ర మోడీ దేశాన్ని సమర్ధంగా అభివృద్ధిపధంలో నడిపించగలిగితే, ఇక రాహుల్ రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్ధకంగా మారడం తధ్యం.