తల్లి శోకం తీరాలి
posted on Jun 11, 2022 @ 10:15PM
ఇంట్లో పిల్లలు ఆడుకుంటూంటే అదో అందం, ఆనందం. పాకే పిల్లలు అలా పారాడుతూ ఆడుతూ తల్లి చుట్టూ తిరుగుతూంటే ఆ తల్లి ఆనందానికి అంతే వుండదు. అలాంటి ఆనందం అందరికీ వుంటుంది. పిల్లలు పెద్దయినా అలాంటివి తల్లులు గుర్తు పెట్టుకుంటూంటారు. పిల్లలు ఎదిగినా అపుడపుడూ వారికి అప్పటి గోల, ఏడుపులు, మొండితనం, చిరుకోపాలు గుర్తుచేస్తు ఆట పట్టిస్తుంటారు. దాన్ని వివరించడమూ కష్టమే. అలాంటి పసిపిల్లలు ఆడుతూ పాడుతూ తిరుగుతూనే హఠాత్తుగా ఏ ప్రమాదానికో లోనయితే ఆ తల్లి బాధను ఎవరు ఎలా తీర్చగలరు పిల్లలు ఇంటి ఆవరణ దాటి నీటికుంటలో పడవచ్చు, కాలవల్లో పడవచ్చు,
బోరుబావి గోతిలోనూ పడిపోవచ్చు. బోరుబావి గోతులు చాలా లోతుగా వుంటాయి. చిన్నపిల్లలు ఆడుతూ పొరపాటున అటుగా వెళ్లి అందులోకి పడిపోవచ్చు. అది చాలా దారుణం, ప్రాణాలతో బయటపడేంతవరకూ తల్లిదండ్రులకు గుండె కోత!శుక్రవారం చత్తీస్‌ఘడ్, జంజ్‌గీర్ చంపా జిల్లాలోని పిరిద్ గ్రామంలో ఇదే జరిగింది. రాహుల్ అనే పదేళ్ల పిల్లాడు తన ఇంటి వెనుక ఆడుతూ అక్కడే వున్న పాత బోరుబావి గోతిలో పడిపోయాడు. గది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించారు.
వెంటనే జిల్లా ఎస్పీ విజరు అగర్వాల్ ఆధ్వర్యంలో సహాయక చర్యలో ప్రారంభించారు. జాతీయ విపత్తు నిర్వహణ విభాగం(ఎన్డీఆర్ ఎఫ్)తో పాటు రాష్ట్ర విపత్తు నిర్వహణ బృందం(ఎస్ డీఆర్ ఎఫ్) కూడా రంగలోకి దింగింది. తల్లిదండ్రులకు, బంధువులకు, చుట్టుపక్కలవారికీ క్షణం క్షణం ఆందోళనకరంగా వుంది. ఇప్పటిదాకా కళ్లముందు కనిపించినవాడు అమాంతం ఆ బోరుబావి నోటిలో ఎలా పడ్డాడా బతికి వస్తాడా అని భయం భయంగా అందరినీ చూస్తున్నారు. గోడు పెడుతున్నారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే వున్నాయి.
బాలుడు పడిపోయిన బోరుబావి సుమారు 80 అడుగుల లోతు వుంటుందని అంచనా. ఇప్పటివరకూ 50 అడుగులు తవ్వారు. 65 అడుగుల వరకూ తవ్వితే తర్వాత బాలుడు వున్న ప్రదేశానికి సమాంతరంగా మరో టన్నల్ తవ్వితే బాలుడిని బయటికి తీయడానికి వీలుంటుంది. ప్రస్తుతం బాలుడు సజీవంగా వున్నట్టు సమాచారం. పరిస్థితిని కలెక్టర్ పర్యవేక్షిస్తున్నారు. బాలుడు కుటుంబ సభ్యులతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతు వారికి ధైర్యం చెబుతున్నారు.
ఇది ఒక్క చత్తీస్‌ఘడ్‌లోనే కాదు, ఇది ఒక్క రాహుల్ సంగతే కాదు, దేశంలో చాలా ప్రాంతాల్లో ఇలాంటి సంఘటనలు వింటూనే వున్నాం. కొందరు చనిపోవడం కూడా వింటున్నాం.
ఇలాంటి పరిస్థితులకు ప్రభుత్వ అధికారులది, బోరుబావులు తవ్వి నిర్లక్ష్యంగా వదిలేస్తున్నవారు బాధ్యత వహించాలి. అలాంటి వాటిని వెంటనే పూడ్చేయాలి. అందులో నివాస ప్రాంతాల్లో వున్నవాటి గురించి అక్కడి అధికారులు, వారి సిబ్బంది పట్టించుకోవాలి. లేకుంటే పిల్లలకు ప్రాణాంతకంగా మారుతున్నాయి. అలాంటివి ఎక్కడ వున్నవీ గుర్తించి వెంటనే వాటిని పూడ్చేసే చర్యలు చేపడితేనే పిల్లల తల్లిదండ్రులకు, బంధువులకు భయాందోళనలు తొలగుతాయి. పిల్లల భవిష్యత్తును, జీవితాన్ని వూహించని విధంగా బోరుబావులు మింగేస్తుంటే ఆ కుటుంబ గుండె కోతను మాన్పగలిగేదెవరు రాహుల్ ప్రాణాలతో బోరుబావి నుంచి బయటికి వచ్చి తల్లిదండ్రులకు బంధువులకు మళ్లీ ఆనందం పంచాలని అందరం ఆశిద్దాం.