అన్ని వేళ్లూ సజ్జల వైపే..!
posted on Jun 12, 2022 @ 2:27PM
ఒక్కో సారి తెరవెనుక ఉండాల్సిన వ్యక్తులు తెర ముందుకు వచ్చి నాటకాన్ని రక్తి కట్టిస్తుంటారు. కొండకొచో ఆ వ్యక్తులే నాటకం రసాభాస కావడానికి కారకులౌతారు. మంచి జరిగినా, చెడు జరిగినా అటువంటి వ్యక్తులకు వచ్చేదీ ఉండదు, పోయేదీ ఉండదు. కానీ అన్నిటిలో వారి వేలో కాలో పెట్టకు తప్పదు. అటువంటి వారినే ప్రభుత్వంలో అయితే రాజ్యాంగేతర శక్తులు అంటారు. సరిగ్గా జగన్ సర్కార్ లో సజ్జల రామకృష్ణారెడ్డి అటువంటి పాత్రే పోషిస్తున్నారు. ఆయనే ప్రభుత్వ నాటకాన్నిరక్తీ కట్టిస్తారు, రసాభాస చేస్తారు. అందుకే ఆయనను విపక్షాలే కాదు, పార్టీ శ్రేణులు కూడా రాజ్యాంగేతర శక్తిగానే అభివర్ణిస్తున్నాయి.
సకల శాఖల మంత్రి అంటూ భుజకీర్తులు తగిలిస్తున్నారు. ఏపీలో సజ్జల ఇప్పుడొక బ్రాండ్ అయిపోయారు. ఇదేదో గొప్ప బిరుదో, భుజకీర్తో అనుకోవద్దు. జగన్ ప్రభుత్వంలో వైఫల్యాలన్నిటికీ మంత్రులూ, ఎమ్మెల్యేలే కారణమని నేత జగన్ చెబుతున్నారు. ప్రభుత్వం అన్ని ఫ్రంట్ లలోనూ బ్రహ్మాండంగా ఉందనీ, ప్రస్తుతం ప్రజా వ్యతిరేకత అంతా ఎమ్మెల్యేలూ, మంత్రులపైనేననీ ముఖ్యమంత్రి చెబుతున్నారు. ఇదేదో అధికారుల సమావేశాల్లోనో, సమీక్షల్లోనో కాదు.. సదరు ఎమ్మెల్యేలూ, మంత్రుల సమక్షంలోనే వారు చెబుతున్నవేవీ వినకుండా.. అంతా మీరు చేశారు అంటున్నారు. అయితే మంత్రులూ, ఎమ్మెల్యేల వెర్షన్ మాత్రం మరోలా ఉంది.
జగన్ కు నోరూ, చెవులూ, కళ్లూ అన్నీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డేననీ, మంత్రులను, ఎమ్మెల్యేలనూ డమ్మీలను చేసిన ఘనత ఆయనదేననీ అంటున్నారు. జగన్ సజ్జల నోటితో మాట్లాడతారనీ, సజ్జల కళ్లతో చూస్తారనీ, సజ్జల చెవులతో వింటారనీ అంటున్నారు. ఇప్పుడు ప్రభుత్వంలో శక్తి మంతుడు ఎవరంటే మాత్రం వైసీపీలో లీడర్ నుంచి కేడర్ వరకు అందరూ తమ చూపుడు వేలును సజ్జల రామకృష్ణారెడ్డి వైపే చూపిస్తున్నారు. జగన్ అధికారంలోకి వచ్చింది మొదలు.. ఇప్పటి వరకూ జగన్ తీసుకున్న నిర్ణయాలన్నిటి వెనుకా ఉన్న బ్రెయిన్ సజ్జల వారిదేనని అంటున్నారు. అలా అనడమంటే జగన్ నిమిత్త మాత్రుడు.. అమాయకుడు, ఆయనకు ఏమీ తెలియదు అని కాదు. తాను చేయాల్సింది, చెప్పాల్సింది అంతా సజ్జనతో చెప్పిస్తారు, చేయిస్తారు.
అందుకే తాజా మాజీలంతా తమ పదవులు పోవడానికి కారణం సజ్జలేనంటూ ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే. అంటే వైఫల్యాలను ఎమ్మెల్యేలు మంత్రులకు అంటగట్టడానికీ, ఘనతను తన సొంతం చేసుకోవడానికి జగన్ కు అన్ని విధాలుగా దోహదం చేస్తున్నది సజ్జల అన్న మాట. ఆ క్రమంలోనే హోం మంత్రి పదవి హుళక్కి అయిన తర్వాత.. మేకతోటి సుచరిత అనుచరులు.. ఈ సజ్జల వారిపై ఓ రేంజ్‌లో తిట్ల దండకం అందుకున్న సంగతి తెలిసిందే. ఇక జగన్ ప్రభుత్వంలో సజ్జల రామకృష్ణ రెడ్డి పనితనం చూసే.. ఆయనకు సకల శాఖల మంత్రి గారంటూ ప్రతిపక్ష నేతలు కితాబు ఇచ్చేసిన విషయం కూడా తెలిసిందే. అయితే అధికార పార్టీలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న వారిలో ఈ సజ్జల రామకృష్ణారెడ్డి అగ్రస్థానాన్ని ఆక్రమించారనే ఓ చర్చ వెలగపూడి సచివాలయం సాక్షిగా చాలా రసవత్తరంగా సాగుతోంది.
జగన్ ప్రభుత్వంలో సలహాదారుడి పేరుతో సజ్జల రామకృష్ణారెడ్డి బ్రోకరిజం చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జగన్ పార్టీలోని ఓ ఎమ్మెల్యేకి జగన్ కెబినెట్‌లో చోటు కల్పిస్తానని మాట ఇచ్చి.. ఆ తర్వాత ఆయనకు సజ్జల హ్యాండ్ ఇచ్చారనే ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. అంతేకాదు.. జగన్ మలి కేబినెట్‌లో పలువురు తాజా ఎమ్మెల్యేలకు చోటు దక్కిందంటే అదీ సజ్జల వారి చలవేననే ఓ టాక్ కూడా నేటికీ గట్టిగానే నడుస్తోంది.
ఇక జగన్ ప్రభుత్వంలో ఇసుక, లిక్కర్.. వగైరా వగైరాలో కమిషన్లు దండుకొంటూ సజ్జల ఓ పెద్ద కమీషన్ ఏజెంట్ అవతారం ఎత్తారనే ఆరోపణలు కూడా అధికార పార్టీలోనే ఓ రేంజ్ లో వెల్లువెత్తుతున్నాయి. గుడివాడ క్యాసినో వ్యవహారంలో అప్పటి మంత్రి కొడాలి నాని నుంచి సజ్జలకు కమిషన్ ముట్టిందని.. అలాగే పోలవరం కాంట్రాక్ట్ అవినీతిలో కూడా ఈ సజ్జలకు పాత్ర ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
జగన్ ప్రభుత్వం తీసుకున్న ఏదైనా నిర్ణయంపై మాట్లాడాలంటే.. అటు మంత్రులు కానీ.. ఇటు ఉన్నతాధికారులు కానీ ప్రెస్ మీట్ పెట్టి వివరించే ప్రయత్నం చేయరు. అలాగే జగన్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలకు పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరూ స్పందించరు. ప్రభుత్వం నిర్ణయంపై వివరణ ఇవ్వాలన్నా, విపక్షాల విమర్శలకు కౌంటర్ ఇవ్వాలన్నా సజ్జల రామకృష్ణారెడ్డే. సకల రోగాలకూ ఒకటే మందు జిందా తిలిస్మాత్ అన్నట్లు.. వైసీపీ పార్టీలో కానీ వైసీపీ ప్రభుత్వంలో కానీ ఏ అంశంపైనైనా స్పందించాలన్నా మాట్లాడాలన్నా తెరమీదకు వచ్చేది సజ్జల మాత్రమే. అయితే వైసీపీపై ఈగవాలినా వెంటనే స్పందించి కౌంటర్లిచ్చే సజ్జల తనపై వచ్చిన ఆవినీతి ఆరోపణలపై నోరెందుకు ఎత్తడం లేదని అధికార పార్టీలోనే కేడర్ నుంచి లీడర్ల వరకూ ఓ రేంజ్ లో చర్చించుకుంటున్నారు.