కమాండ్ కంట్రోల్ సెంటర్ లోనే చోరీ.. తెలంగాణలో భద్రత జాడేదీ!
posted on Jun 11, 2022 @ 3:01PM
తెలంగాణలో శాంతి భద్రతల పరిస్థితి పేరు గొప్ప ఊరు దిబ్బ చందంగా ఉన్నాయనడానికి తాజా తార్కానం బంజారాహిల్స్ లో నిర్మాణంలో ఉన్న పోలీస్ కమాండ్ కంట్రోల్ భవనంలో చోరీ. హైదరాబాద్ లోని అణువణువుపై నిఘా, ఎక్కడ ఏ చిన్న అవాంఛనీయ సంఘటన జరిగినా క్షణాల్లో పసిగట్టే అత్యాధునిక పరిజ్ణానంతో కమాండ్ కంట్రోల్ సెంటర్ భవన నిర్మాణం జరుగుతోంది. అలాంటి భవనంలోనే చోరీ జరగడం, దీనిపై ఈ ప్రజెక్టు మేనేజన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రాష్ట్రంలో భద్రతా వైఫల్యం కొట్టొచ్చినట్లు బయటపడింది.
శాంతిభద్రతల పరిరక్షణలో దేశానికే తెలంగాణ ఆదర్శం అంటూ తన భుజాలను తానే తడుముకుంటూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సమయం దొరికినా దొరకకపోయినా రాష్ట్ర పోలిసింగ్ గొప్పతనాన్ని ఘనంగా చాటుకుంటూ ఉంటారు. తెలంగాణలో అందునా హైదరాబాద్ లో పోలీసులు స్కాట్ లాండ్ యార్డ్ పోలీసులకే ఆదర్శంగా నిలుస్తుంటారని గొప్పలు కూడా చెప్పేసుకుంటూ ఉంటారు. అంతటితో ఊరుకోకుండా తెలంగాణ పోలిసింగ్ గొప్పతనాన్ని చాటుకుంటూ జాతీయ స్థాయి పత్రికలు, ఛానెళ్లలో కోట్ల రూపాయల వ్యయంతో ప్రకటనలు కూడా జారీ చేశారు.
‘తెలంగాణా రాష్ట్రంలో శాంతి భద్రతల నిర్వహణ అత్యంత అమోఘంగా ఉంది. గడచిన ఆరేళ్లలో రాష్ట్రంలో ఎక్కడ కూడా శాంతి భద్రతల సమస్య ఉత్పన్నం కాలేదు. ఆయా భాగస్వామ్య పక్ష్యాల సమన్వయంతో రాష్ట్రంలో ఎక్కడ కూడా అవాంచనీయ సంఘటనలు జరుగకుండా చూడటంలో రాష్ట్ర పోలీసులు పూర్తిగా సఫలమయ్యారు. దానికి అవసరమైన రీతిలో క్రియాశీలక చొరవ ప్రదర్శించారు. ప్రజల రక్షణ, శాంతి భద్రతలు కాపాడే విషయంలో రాష్ట్ర పోలీస్ విభాగం కమ్యూనిటీ పోలీసింగ్ కు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నది. హైదరాబాద్ తో పాటుగా రాష్ట్రంలోని అనేక ప్రధాన నగరాలు, పట్టణాలలో లక్షలాది సి.సి.టి.వి. కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా ఎంతోమంది నేరస్తులను అరెస్ట్ చేయడానికి వీలైంది.
నేరానికి పాల్పడితే కటకటాలు తప్పవనే సందేశం నేరస్తులకు వెళ్ళేలా చేయడానికి ఇది చాలా ఉపయోగపడింది. టి.ఎస్. కాప్, హాక్ ఐ, సైబర్ క్రైం డిటెక్షన్ టూల్స్ వంటి అత్యాధునిక సాంకేతిక అప్లికేషన్లను వినియోగించుకుంటూ, బాధితులకు సత్వర న్యాయం అందించే ప్రయత్నాలు కూడా ఎంతగానో సఫలీకృతమయ్యాయి.’ అన్నది ఆ ప్రకటన సారాశం.
అయితే ఈ భుజకీర్తులన్నీ.. సొంత డబ్బా కొట్టుకోవడానికేననీ, వాస్తవంలో హైదరాబాద్ లో భద్రత డొల్ల అనీ తాజాగా కమాండ్ కంట్రోల్ సెంటర్ భవనంలో చోరీ ఘటన మరోసారి నిర్ద్వంద్వంగా నిరూపించేసింది. హైదరాబాద్ వ్యాప్తంగా ఏర్పాటు చేసిన సీసీ కెమేరాలు వాటి అనుసంధానం 24x7 నిఘా వంటి మాటలూ, ప్రకటనలూ ఇవన్నీ కోటలు దాటిన మాటలేననీ, ఆచరణ గడప కూడా దాటలేదనీ నిరూపించే స్థాయిలో నేరాలు, ఘోరాలు యథేచ్ఛగా సాగిపోతున్నాయని, నేరస్తుల అనుపానులు క్షణాల్లో కనుగొని వారిని అరెస్టు చేయడానికీ, అసలు నేరం జరగక ముందే నిరోధించడానికి అవసరమైన అత్యాధునిక పరిజ్ణానంతో ఏర్పాటు చేస్తున్నామని ప్రభుత్వం ఘనంగా చెప్పుకుంటున్న కమాండ్ కంట్రోల్ సెంటర్ భవనంలో శుక్రవారం(నిన్న) రాత్రి 38 బండిల్స్ కాపర్ వైర్ చోరీ సంఘటన మరోసారి సందేహానికి తావు లేని రుజువుగా నిలిచింది.
నగర వ్యాప్తంగా ఎక్కడ ఏ సంఘటన జరిగినా క్షణాల్లో తెలుసుకుని అక్కడ పోలీసులు వాలిపోయేందుకు అనువు అయిన పరిజ్ణానంతో ఏర్పాటు అవుతున్న భవనానికే దొంగలు కన్నం వేసి చోరీ చేసి దర్జాగా జారుకోగలిగారంటే పోలీసులు ఇక నగరం మొత్తంలో నేరాలను కంట్రోల్ చేస్తామంటే నమ్మేదెలా? అని సామాన్య జనం సైతం ఇప్పుడు ప్రశ్నలు గుప్పిస్తున్నారు. అయినా రాష్ట్రంలో, హైదరాబాద్ నగరంలో శాంతి భద్రతలు ఎంత ఘనంగా ఉన్నాయో చెప్పడానికి గత వారం రోజులుగా నగరంలో జరిగిన వరుస సామూహిక అత్యాచార ఘటనలే చాలు.
అలాగే జూబ్లీ హిల్స్ హై ప్రొఫైల్ రేపు కేసులో నిందితులను రక్షించడానికి పోలీసులు పడిన తాపత్రేయం వారు ఎందు కోసం ఎవరి కోసం పని చేస్తున్నారో తేటతెల్లం చేసేసింది. కమాండ్ కంట్రోల్ సెంటర్ భవనంలో చోరీ, రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ నేరాలను అరికట్టడంలో ఎంత ‘అప్రమత్త’తతో ఉందో లోకానికి తెలియజేసేసింది. ఒక వైపు తెలంగాణ సర్కార్ దేశంలోనే శాంతి భద్రతల విషయంలో తెలంగాణ సేఫెస్ట్ ఫేస్ అని చెప్పుకుంటుంటే.. వరుసగా జరుగుతున్న సంఘటనలు మాత్రం బాలికలకు, మహిళలకు మోస్ట్ అన్ సేఫ్ సిటీ హైదరాబాదే అని నిరూపిస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.