అప్పుడు సరే మరి ఇప్పుడైనా..?
posted on Jun 12, 2022 @ 4:36PM
సరే.. అప్పుడు జరిగి పోయిందేదో జరిగిపోయింది. ఆధ్రప్రదేశ్ ప్రజల దురదృష్టం కొద్దీ కేంద్రంలో బీజేపీ/ఎన్డీఎ కూటమికి సంపూర్ణ మెజారిటీ వచ్చింది. ఆ విధంగా, కేంద్రం మెడలు వంచే అవకాశం వైసేపీకి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి లేకుండా పోయింది. రాష్ట్రంలో వైసీపీ బంపర్ మెజారిటీ (151/175) అధికారంలోకి వచ్చినా, 25కు22 ఎంపీ సీట్లు వైసీపీకే వచ్చినా విభజన హామీలు అమలుకు కేంద్రాన్ని అడిగేందుకే వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలకు నోరు పెగల్లేదు. ప్రత్యేక హోదా, సహా విభజన చట్టంలోని ఇతర హామీల అమలుకు, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం మీద వత్తిడి తేలేక పోయారు. అప్పుడప్పుడు ఓ రిక్వెస్ట్ చేయడమే కానీ, గట్టిగా ప్రధాని మోడీ మెడలు వంచే అవకాశం జగన్ రెడ్డికి లేకుండా పోయింది. అందుకే గడచిన మూడేళ్ళలో ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్ళినా, మోడీ పాదాలే కానీ, మెడ వైపు చూడలేదు.
సరే ..అయిపోయిందేదో అయిపోయింది ... ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నికలలో బీజేపీకి వైసీపీ అవసరం ఏర్పడింది. వైసీపీ, బిజూ జనతాదళ్ దయ తలిస్తేనే, ఎన్డీఎ రాష్ట్రపతి అభ్యర్ధి గెలిచి, గుర్రం బగ్గీలో రాష్ట్రపతి భవన్’ చేరుకుంటారు. బిజూ జనతాదళ్ ఏమి చేస్తుంది, ఏమి చేయదు అనే విషయం పక్కన పెడితే, వైసీపీ ఏమి చేస్తుంది? మోడీ మెడలు వంచుతుందా? మాకిది ఇస్తేనే, మీకు మా ఓటు ఇస్తాం అని గట్టిగా చెప్పగలుగుతుందా? క్విడ్ ప్రో క్వో’పద్దతిలో బేరమాడ గలదా? విభజన హామీల అమలుకు పట్టు పడుతుందా? లేక ఎప్పటిలా, రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెడుతుందా? జీ .. హుజూర్ అంటుందా? అడగక ముందే, మామోటు మీకే ..అంటూ వైసీపీ నేతలు కేంద్ర నాయకుల ముందు సాగిల పడతారా? ఇదే, ఇప్పడు.,ఏపీ రాజకీయాల్లో ఆసక్తి రేకిస్తోంది. రాజకీయ మెఇఅ వర్గాల్లో హాట్ హాట్’గా చర్చ జరుగుతోంది.
నిజానికి, ఒక్క వైసీపీనే కాదు, రాష్ట్ర ప్రయోజనాల దృష్టా, టీడీపీకూడా వైసీపీతో కలిసి కేంద్రం పై వత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తే, కేంద్రానికి మరింత గట్టి సెగ తగులుతుంది. దాంతో ముగిసిన అధ్యాయం అంటూ మూలకు తోసిన ప్రత్యేక హోదా ఫైల్ మళ్ళీ తెరుచుకునన్నా తెరుచు కుంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. రాష్ట్రపతి ఎన్నికల ఎలెక్టోరల్ కాలేజీలో ఎపీకి గట్టి బలమే వుంది. రెండు పార్టీలకు కలిపి 175 మంది ఎమ్మెల్యేలు, 25 మంది లోక్ సభ సభ్యులు, 11 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు, వీరందరికీ రాష్ట్రపతి ఎన్నికలో ఓటు హక్కుంది. జనాభా ప్రాతిపదికన లెక్కిస్తే మొత్తం 175 మంది ఎమ్మెల్యేల ఓటు విలువ 27,825 అయితే, 36 మంది ఎంపీల ఓటు విలువ మొత్తం 25,488.. ఆవిధంగా ఆంధ్ర ప్రదేశ్ ఎమ్మెల్యేలు, ఎంపీల మొత్తం ఓటు విలువ: 27,825 + 25,488 = 53,313. ఇదేమి తక్కువ అంకె కాదు. రాష్ట్రపతి ఫలితాలను తారు మారు చేయగల సత్తా, ఏపీ ఎంపీ, ఎమ్మెల్యేలకు ఉందని గణాంకాలే కాదు, రాజకీయ విశ్లేషణలు కూడా సూచిస్తున్నాయి. నిజానికి బీజేపే గెలుగ్పు ఓటములను నిర్ణయించే సత్తా ఏపీ ఒతుకుందని అంటున్నారు.
అయితే, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అంత సాహసం చేస్తారా... కేంద్రంతో క్విడ్ ప్రో క్వో’ గేమ్ ఆడతారా? అంటే , నో ఛాన్స్ అంటున్నారు వైసీపీ నేతలు.. నిజానికి, రాష్ట ప్రయోజనాలే కీలకం అనుకుంటే, కేంద్రం పై వత్తిడి తెచ్చేందుకు ఇంకా చాలా మార్గాలున్నాయి. పార్లమెంట్’ దిగువ సభలో 22, ఎగువ సభలో 9 మంది వైసీపీ ఎంపీ లున్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయ దలచుకుంటే, ఈ సంఖ్య సరి పోతుంది.
అయినా ఈ మడు సంవత్సరాలలో ఎప్పుడూ ఆ ప్రయత్నం జరగ లేదు, పైగా వివాదస్పద బిల్లులు సభ ఆమోదంకోసం అవసరం అయిన ప్రతి సందర్భంలోనో కేంద్రానికి వైసీపీ అందగానే ఉంటూ వచ్చింది. అలాగే, ఇప్పడు అందివచ్చిన సువర్ణ అవకాశం కూడా జరవిడుచుకుంటే, ఏపీ ప్రజలు ఎప్పటికీ, వైసీపీని క్షమించరు.అంతకంటే ముఖ్యంగా ఎనిమిదేళ్ళుగా అన్యాయం వెంట అన్యాయానికి గురవుతున్న ఏపీ ప్రజలకు ఇంకో అన్యాయం తోడవుతుందని, అంటున్నారు.