ఏనుగు కోపం.. వృద్ధురాలిపై దాడి చేసి చంపి.. ఆపై చితి నుంచి లాగి తొక్కి..
posted on Jun 13, 2022 6:47AM
కోపం, పగ, కక్ష మనుషుల్లోనే కాదు జంతువుల్లోనూ ఉంటాయి. అందులోనూ మనుషులతో అటాచ్ మెంట్ ఒకింత ఎక్కువగా ఉండే కుక్కలు, ఏనుగుల్లో అవి మరింత ఎక్కువగా ఉంటాయి. అందుకు నిదర్శనంగా తాజాగా ఒడిశాలో జరిగిన ఒక సంఘటనను చెబుతున్నారు అటవీ అధికారులు. ఒడిశాలోలోని రాయ్ పాల్ గ్రామంలో ఒక వృద్ధురాలిపై ఏనుగు దాడి చేసి తొక్కి చంపేసింది.
రాయ్ పాల్ గ్రామానికి సమీపంలోని అటవీ ప్రాంతం నుంచి పనిగట్టుకు వచ్చి మరీ ఏనుగు వృద్ధురాలిపై దాడి చేసింది. ఆ సమయంలో ఆమెకు దగ్గరగా ఉన్న వారికి ఎలాంటి హానీ చేయలేదు. అదే రోజు వృద్దురాలికి అంత్యక్రియలు జరుగుతున్న సమయంలోనూ ఆ ఏనుగు మరో సారి దాడి చేసింది. ఈ సారి కూడా ఆ వృద్ధురాలి మృతదేహంపైనే దాడి చేసింది కానీ అంత్యక్రియలకు హాజరైన వారెవరికీ ఎటువంటి హానీ చేయలేదు.
చితిపై ఉన్న వృద్థురాలి మృతదేహాన్ని తొండంతో చితిపై నుంచి కిందకు లాగి కాళ్లతో తొక్కి ఆ తరువాత తాపీగా అటవీ ప్రాంతంలోనికి వెళ్లిపోయింది. దీనిపై అటవీ అధికారులు ఆ వృద్ధురాలిపై ఏనుగుకు ఏదో కోపం ఉందని అంటున్నారు. ఏనుగులు సాధారణంగా సాధు స్వభావులనీ, తమకు హాని జరిగితేనే అవి కోపం పెంచుకుంటాయని అంటున్నారు. ఆ వృద్ధురాలి కారణంగా ఆ ఏనుగుకు ఏదో హాని జరిగి ఉంటుందనీ, అందుకే కోపం పెంచుకుని అదును చూసి దాడి చేసిందని చెబుతున్నారు. ఆ ఏనుగు వృద్దురాలిపై, ఆ తరువాత ఆమె మృతదేహంపై దాడి చేసిన రెండు సందర్భాలలోనూ పక్కన ఉన్న మరెవరికీ ఎలాంటి హానీ చేయకపోవడాన్ని అటవీ అధికారులు ఎత్తి చూపుతున్నారు.
ఆ ఏనుగు ఆ వృద్ధురాలిపై మాత్రమే దాడి చేసిందనీ, మరెవరికీ హాని చేయలేదనీ, దీనిని బట్టే ఆ ఏనుగు ఆ వృద్ధురాలిపై ఎందుకో కోపం పెంచుకుందని పేర్కొంటున్నారు. అటవీ ప్రాంతానికి అతి సమీపంలో ఉన్న గ్రామం కనుక ఏదో సందర్భంగా ఆ వృద్ధురాలి కారణంగా ఆ ఏనుగుకు ఏదో హాని, ఇబ్బంది కలిగి ఉంటుందని, అందుకే కోపం పెంచుకుని ఉంటుందని అంటున్నారు.