పేరులో ‘నేముంది’.. అదే జిందాల్ కు చిక్కులు తెచ్చింది!
posted on Jun 13, 2022 7:15AM
పేరులో ఏముంది.. వ్యక్తిత్వమే మనిషిని నిలబెడుతుంది అంటారు పెద్దలు. కొన్ని సార్లు ఆ పేరే చిక్కులు తెచ్చిపెడుతుంది. ప్రముఖ పారిశ్రామిక వేత్త నవీన్ జిందాల్ ఇకు ఇప్పుడు ఆ పేరే చిక్కులు తెచ్చి పెట్టింది. కొన్ని మీడియా సంస్థలు ఆయన పొటో వేసి మరీ విమర్శనాత్మక వ్యాసాలూ, వార్తలూ ప్రచురించేస్తున్నాయి. ప్రసారం చేసేస్తున్నాయి. అయితే ఆ ప్రచురణలు, ప్రసారాలు, విమర్శలు ఆయనను ఉద్దేశించి కాదు. ఆయన పేరే ఉన్న మరో వ్యక్తిని ఉద్దేశించి.
కానీ ఫొటో మాత్రం పారిశ్రామిక వేత్తది ఉండటంతో చిక్కులు తప్పడం లేదు. అసలు జరిగిందేమిటంటే.. మహ్మద్ ప్రవక్తపై బీజేపీ నేత నవీన్ కుమార్ జిందాల్ అనుచిత వ్యాఖ్యలు చేసి దేశ వ్యాప్తంగా అప్రదిష్ట మూటగట్టుకున్నారు. ఆయపై బీజేపీ బహిష్కరణ వేటు కూడా వేసింది. ఇందుకు సంబంధించి వార్తలు ప్రచురించే, ప్రసారం చేసే క్రమంలో నవీన్ కుమార్ జిందాల్ ఫొటో బదులుగా కొన్ని మీడియా సంస్థల్లో పారిశ్రామిక వేత్త నవీన్ జిందాల్ ఫొటోలు వాడేస్తున్నారు. క్రాస్ చెక్ చేసుకోకుండా పేరును బట్టి ఒకరి ఫొటో బదులు మరొకరి ఫొటో వాడేస్తుండటంతో పారిశ్రామిక వేత్త నవీన్ జిందాల్ కు తిప్పలు తప్పడం లేదు.
సమాజిక మాధ్యమంలో కూడా బీజేపీ బహిష్కృత నేత నవీన్ కుమార్ జిందాల్ ఫొటోకు బదులుగా నవీన్ జిందాల్ ఫొటో పెట్టి ట్రోలింగ్ చేసేస్తూ నెటిజన్లు పోస్టులు పెట్టేస్తున్నారు. దీంతో జిందాల్ స్టీల్స్ అండ్ పవర్ సంస్థ అగ్గిమీద గుగ్గిలం అయిపోతోంది. సరిగ్గా సరి చూసుకోకుండా ఇష్టారీతిన ఫొటోలు వాడేయడమేమిటని ఫైరైపోతోంది. సామాజిక మాధ్యమంలో నెటిజన్లు కూడా నవీన్ కుమార్ జిందాల్ ను ట్రోల్ చేస్తూ, నవీన్ జిందాల్ ఫోటో పెట్టి తమ చైర్మన్ ఖాతాలను ట్యాగ్ చేస్తున్నారనీ, వెంటనే వాటన్నిటినీ డిలీట్ చేయాలని కోరుతోంది. నవీన్ కుమార్ జిందాల్ వేరనీ, నవీన్ జిందాల్ వేరనీ వివరణలు ఇస్తోంది.