ఎన్టీఆర్ బొమ్మతో రూ.100 నాణెం!
posted on Jun 11, 2022 @ 10:30PM
ఆయన ఆంధ్రుల ఆరాధ్యదైవం. సినీ తెర మీద భగవంతుడై యావత్ ప్రేక్షక భక్తులకూ వీనుల విందు చేసిన మహానటుడు. ప్రజాసంక్షేమం లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చి అప్పటివరకూ వున్న రాజకీయ దురం ధరులను కంగారుపెట్టించిన ఘనుడు. తెలుగు దేశం పార్టీ పేర పార్టీ ఆరంభించి దేశ రాజకీయాల్లో తన ప్రత్యేకతను చాటిన నిష్కల్మష నేత. ఆయనే నందమూరి తారక రామారావు. సినీ వీరాభిమానుల ఎన్టీవోడు, మనస్పూర్దిగా అనుసరించినవారికి తారకరాముడు, రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేవారికి, నిజా యితీగా నడుచుకోమని, ప్రాంతీయతను చాటుతూనే జాతీయాభివృద్ధిలో పాలుపంచుకోమని చాటిన మహానేత! ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు జరుగుతున్న ఈ తరుణంలో యావత్ తెలుగు ప్రజలకూ రిజర్వు బ్యాంక్ అత్యంత ఆనందకర వార్త అందించింది. అదేమంటే ఆయన బొమ్మతో వందరూపాయల నాణెం త్వరలో తెచ్చేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
అసలు పార్టీతో, పార్టీ సిద్ధాంతాలతో, వృత్తితో పనిలేకుండా యావత్ తెలుగు ప్రజలు ప్రేమించిన గొప్ప వ్యక్తి రామా రావు. ఆయనపేరు తలచుకుంటే మనసులో అదో ఆనందం. స్వచ్ఛమయిన మనసున్న వ్యక్తిని, చక్కటి చిరునవ్వుతో కనిపించే ఆజానుబాహుడిని మనసులో నిలుస్తాడు. అవినీతిపరులు ఆయ నకు ఆమడ దూరం లోనే నిలిచిపోయే విధంగా పరిపాలనలో స్వచ్ఛతను ప్రదర్శించిన రాజ కీయవేత్త.
ఎన్టీఆర్ జీవితం, రాజకీయ జీవితం గురించి ఎందరు ఎంత గొప్పగా చెప్పుకున్నా, మరెంతగా విమర్శిం చినా ఆయన ఎప్పుడూ తొణకలేదు. ఆయన స్థితప్రజ్క్షుడు. విమర్శించేవారిని అజ్ఞానంతో మాట్లాడుతు న్నారని దూరంగా పెట్టారేగాని ద్వేషించి తన స్థాయి తగ్గించుకోలేదు.
ఎన్టీఆర్‌కు భారత రత్నరావాలని యావత్ తెలుగు ప్రజలూ ఆకాంక్షించారు. ఆయనకు దేశ అత్యంత ప్రతిష్టాత్మక అవార్డును ఇవ్వాలని ఆయన అభిమానులు అంతా కోరుకున్నారు. దీన్ని గురించి కేంద్ర ప్రభుత్వానికి పార్టీలతో సంబంధం లేకుండా తెలుగు రాజకీయనాయకులు అందరూ కేంద్రంలో ఏ ప్రబు త్వం వున్నా సూచనలు చేస్తూనే వున్నారు. కానీ ఇప్పటివరకూ అది సంభవించలేదు. అయితే ఇప్పుడు మోదీ ప్రభుత్వం ఎన్టీఆర్ బొమ్మతో వందరూపాయల నాణాన్ని ముద్రించేందుకు ఆలోచిం చింది. రిజర్వుబ్యాంకు కొంత ఆలస్యం చేసినా అందుకు ఆమోదముద్ర వేయడం యావత్ తెలుగు ప్రజల ఆనందానికి అంతే లేదు. ఇది ఆశించిన తెలుగు ఘనకీర్తి.
ఎన్టీఆర్‌ను మరవడం దుర్లభం. తరాలు మారినా, ఎన్ని పరిణామాలు సంభవించినా తెలుగువారు ఎప్ప టికీ గుర్తుచేసుకునే ఏకైక నటుడు, నేత ఎన్టీఆర్. అయితే భారత రత్న కూడా ఇచ్చి వుంటే తెలుగు ప్రజలు మరింత ఆనందించేవారు. ప్రభుత్వానికి జీవితాంతం కృతజ్ఞతలు తెలిపేవారు.