కరోనా అనంతర సమస్యలతో ఆసుపత్రిలో సోనియా.. రేపు ఈడీ ఎదుట రాహుల్ హాజరు
posted on Jun 12, 2022 @ 6:36PM
కాంగ్రెస్ అధినేదత్రి సోనియాగాంధీ ఆసుపత్రి పాలయ్యారు. ఇటీవల ఆమెకు కరోనా సోకిన సంగతి విదితమే. దీంతో ఆమె ఐసోలేషన్ లో ఉండి చికిత్స పొందారు. కరోనా నుంచి కోలుకున్నప్పటికీ కరోనా అనంతర సమస్యలతో బాధపడుతుండటంతో ఆమె ఆదివారం ఆసుపత్రిలో చేరారు. గంగారాం ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతున్నారు. కాంగ్రెస్ అధికార ప్రతినిథి రణదీప్ సుర్జేవాలా ఈ మేరకు ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. సోనియా గాంధీకి నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 8న ఆమె ఈడీ ఎదుట హాజరు కావాల్సి ఉంది. అయితే కరోనా సోకి ఐసోలేషన్ లో ఉండటంతో ఆమెకు ఈడీ కొంత సమయం ఇచ్చి జూన్ 23న విచారణకు రావాలని మరోమారు సమన్లు పంపింది. ఆమె కుమారుడు, కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి కూడా ఇదే కేసులో ఈడీ సమన్లు పంపిన సంగతి తెలిసిందే. ఆ సమన్ల మేరకు ఈ నెల 2న ఆయన ఈడీ ఎదుట హాజరు కావాల్సి ఉంది. అయితే విదేశాలలో ఉన్న కారణంగా ఆయన ఈడీ ఎదుట విచారణకు హాజరు కాలేదు.దీంతో ఈ నెల 13న హాజరు కావాలని ఈడీ ఆయనకు మరో మారు సమన్లు పంపింది. దీంతో ఇప్పటికే విదేశాల నుంచి వచ్చిన ఆయన రేపు అంటే 13న ఈడీ ఎదుట హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇలా ఉండగా సోనియా గాంధీ కూడా ఈడీ ఎదుట హాజరై తీరుతారని కాంగ్రెస్ అధికార ప్రతినిథి పేర్కొన్నారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఈడీ హెరాల్డ్ కేసులో తమ పార్టీ నేతలకు సమన్లు జారీ చేసిందని ఆయన ఆరోపించారు. నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసును రాజకేయంగా ఉపయోగించుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదలా ఉంటే నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కాంగ్రస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈడీ ముందు హాజరయ్యే సమయంలో దేశవ్యాప్తంగా మోడీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించినట్లు తెలుస్తోంది.
కాగా, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అనారోగ్యం కారణంగా, 8వ తేదీన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట హాజరు కాలేదు. నిజానికి పక్షం రోజుల క్రితమే, జూన్ 8 న విచారణకు హాజరు కావాలని, ఈడీ ఆమెకు సమన్లు జారీచేసింది. అయితే, ఇటీవల ఆమెకు కరోనా సోకినా నేపధ్యంలో విచారణకు మూడు వారాలు గడవు కోరారని, కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఇటీవల కరోనా బారిన పడిన సోనియా.. ఇంకా కోలుకోని కారణంగా ఈ మేరకు విజ్ఞప్తి చేసినట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం కరోనా అనంతర సమస్యలతో గంగారాం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
మరోవంక ఇదే కేసులో, సమన్లు అందుకున్న కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, కూడా విదేశాలలో ఉన్న కారణంగా, జూన్ 2 న విచారణకు హాజరు కాలేదు. అయితే అయన అభ్యర్ధన మేరకు ఈడీ విచారణను జూన్ 13కు వాయిదా వేసింది. మరో వంక ఇదే కేసు విచారణలో భాగంగా ఇటీవలే కాంగ్రెస్ సీనియర్ నేతలు మల్లికార్జున్ ఖర్గే, పవన్ బన్సల్‌ను కూడా ఈడీ ప్రశ్నించింది. మరోవంక నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి కాంగ్రెస్, బీజేపీల మధ్య ఆరోపణల జుగల్ బందీ నడుస్తోంది. సోనియా, రాహుల్ గాంధీలకు ఈడీ సమన్లు జారీ చేయదాన్నికాంగ్రెస్ పార్టీ తీవ్రంగా తప్పుపట్టింది. నేషనల్ హెరాల్ద్ కేసు విషయంలో సోనియా, రాహుల్ ఎలాంటి తప్పు చేయలేదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సూర్జేవాలా పేర్కొన్నారు.
బీజేపే ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే, ‘నేరం చేసిన వారు ఎవరైనా నేరం చేశామని అంగీకరిస్తారా? అంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. తల్లీ కొడుకులు నేరం చేయందే నిజం అయితే ఆ ఇద్దరూ విచారణకు హాజరై, తమ నిజాయతీని నిరూపించుకోవాలని నడ్డా కాంగ్రెస్ నేతలకు సవాలు విసిరారు. ఇదలా ఉంటే కాంగ్రెస్ నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ ఎదుట హాజరు కావాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నిర్ణయించుకున్నారని, ఈ విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తున్నారు. మరో వంక ఈనెల 13న ఈడీ విచారణకు హజరుకావాలని రాహుల్ గాంధీ నిర్ణయం తీసుకున్నారు. రాహుల్ హజరయ్యే రోజు.. దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని కాంగ్రెస్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ విషయమై పార్టీ నేతలు సమావేశమై చర్చలు జరుపుతున్నారు. ఈ సమావేశానికి పార్టీ ప్రధాన కార్యదర్శులందరినీ పిలిచినట్లు తెలుస్తోంది.
ఈ సమావేశంలో రాహుల్ గాంధీ హాజరు అంశంపై చర్చించనున్నారు. రాహుల్ ఈడీ ఎదుట విచారణకు హాజరైన రోజు.. దేశ వ్యాప్తంగా భారీగా నిరసన కార్యక్రమాలను నిర్వహించే యోచనలో ఉంది కాంగ్రెస్. సోనియా, రాహుల్ ఈడీ విచారణకు హాజరు అయ్యే అంశంపై పార్టీ సినియర్ నేతలు చర్చించినట్లు ఏఐసిసి వర్గాల వెల్లడించాయి. గురువారంవర్చువల్‌గా జరిగిన భేటీకి అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, రాష్ట్రాల ఇన్‌ఛార్జులు ఏఐసీసీ ఆదేశాలమేరకు హాజరయ్యారు.
సో.. నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసు రాజకీయ మలుపు తీసుకోవడం ఖాయంగా కనిపిస్తుందని పరిశీలకులు అంటున్నారు. అయితే, న్యాయస్థానాల్లో తేల్చుకోవలసిన అంశాన్ని వీధుల్లోకి తీసుకురావడం వలన కాంగ్రెస్ పార్టీకి ఆశించిన ప్రయోజనం దక్కుతుందా లేక అది కూడా బూమరాంగ్ అవుతుందా అనే విషయంలో కాంగ్రెస్ వర్గాల్లోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది.