బొమ్మై కన్నీరు కథేంటో ..?
posted on Jun 15, 2022 9:21AM
కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై కన్నీరు పెట్టుకున్నారు. ఒక విధంగా ఆయన ఏడ్చేశారు. అయితే, ఆయన కన్నీరు పెట్టుకుంది, రాజకీయంగా ఏదో ఇబ్బంది వచ్చికాదు. అవును గతంలో అప్పటి ముఖ్యమంత్రి కుమారా స్వామి, సంకీర్ణ ప్రభుత్వ సారధ్య కష్టాలు తట్టుకోలేక అనేక పర్యాయాలు కన్నీరు మున్నీరుగా విలపించారు. చివరకు శాసన సభలో కూడా సంకీర్ణ భాగస్వామ్య పక్షం, తనను అడుగడుగునా అడ్డు తగులుతూ, అవమానాలకు గురి చేస్తోందని ఆయన సభలో కన్నీరు పెట్టుకున్నారు.అయితే, పిట్ట పోరు పిట్టపోరు పిల్లి తీర్చింది అన్నట్లుగా, బీజేపీ కాంగ్రెస్, జేడీ (ఎస్) సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చేసి, గద్దె నెక్కి కూర్చుంది, అనుకోండి అది వేరే విషయం.
అయితే, ప్రస్తుత ముఖ్యమంత్రి బొమ్మైకు కూడా రాజకీయ కష్టాలు లేక పోలేదు. ఆయన అధికార పగ్గాలు చేపట్టి ఇంకా నిండా సంవత్సరం అయినా పూర్తి కాలేదు. అయినా, ఇప్పటికే ఆయన కుర్చీ కిందకు నీళ్లోచ్చాయనే వార్తలు తరచూ వినిపిస్తూనే ఉన్నాయి. మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ అగ్రనేత యడ్యూరప్ప ముఖ్యమత్రి బొమ్మైకి పక్కలో బల్లెమై కూర్చున్నారు. కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారని, బొమ్మై వర్గీయులు కేంద్ర నాయకత్వానికి ఫిర్యాదులు చేయడం, విచారణలు జరగడం వంటి క్రతువంతా జరిగింది, జరుగుతూనే వుంది. అయితే, బొమ్మై కన్నీరుకు రాజకీయాలు కారణం కాదు.
ఒక సినిమా, అందులో కుక్క పాత్ర అయన చేత కన్నీరు పెట్టించాయి. ఒకే సారి ఐదు భాషల్లో విడుదలైన, ‘777 చార్లీ’ సినిమా చూసి ఆయన ఉద్వేగానికి గురయ్యారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, ఈ చిత్రం ఆయనకు, ఒక సంవత్సరం క్రితం చనిపోయిన తన పెంపుడు కుక్కను గుర్తుచేసింది. ఆ ఉద్వేగంలోనే ఆయన కన్నీరు పెట్టుకున్నారు.
ఇటీవల విడుదలైన కన్నడ చిత్రం ‘777 చార్లీ’ చిత్రం ఒక్క బొమ్మైని మాత్రమే కాదు, ఆ సినిమా చుసిన చాలామంది చేత కంటతడి పెట్టిస్తోంది. నిజానికి, కుక్కలంత విశ్వాసపాత్రమైన జంతువూ మరొకటి ఉండదని అంటారు. అది చాలా మందికి అనుభవంలో ఉన్న విషయమే, ఇప్పుడు ఈ సినిమా కథ కూడా అదే. ఒక మనిషి, కుక్కకు మధ్య అనుబంధాన్ని చక్కగా తెరకెక్కించిన చిత్రం ‘777 చార్లీ’. అందుకే ఈ చిత్రం ప్రేక్షకులను విరీతంగా ఆకర్షిస్తోంది. ఈ చిత్రాన్ని ముఖ్యమంత్రి బొమ్మై కూడా వీక్షించారు.
‘కుక్కల మీద ఎన్నో చిత్రాలు వచ్చాయి.కానీ ఈ చిత్రంలో ఒక జంతువులో ఉండే ఎమోషన్‌ను బాగా చూపించారు.అది కళ్లతోనే తన భావాలను పలికించింది.ఇది అందరూ వీక్షించాల్సిన చిత్రం. మనుషుల ప్రేమ కంటే కుక్క మనిషి పట్ల చూపే ప్రేమ షరతులు లేని ప్రేమ. అది స్వచ్ఛమైంది’ అంటూ ఆయన ఉద్వేగానికి గురయ్యారు. తన పెంపుడు కుక్క స్నూబీ గుర్తుకు రావడంతో కన్నీరు పెట్టుకున్నారు. ఆయన ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి కొద్దిరోజుల ముందు అది మరణించింది. ఆ కుక్కతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని, ఆయన కన్నీరు పెట్టుకున్నారు.
అయితే, ఆయన ఎందుకు కనీరు పెట్టుకున్నా, బొమ్మై కన్నీరు మీద సోషల్ మీడియాలో , ‘మంచి నటుడే’ వంటి పొలిటికల్ కామెంట్స్ కూడా రాకపోలేదు. అయితే, ఈ సినిమా ఒక్క బొమ్మైని మాత్రమే కాదు, భూతదయ ఉన్న ఎవరినైనా ఈ సినిమా కన్నీరు పెట్టిస్తుందని అంటున్నారు. అయితే మాత్రమేంటి, రాజకీయాలకు కాదేదీ అనర్హం, అనే కదా అంటారు.