ఎవరికి వారే యమునా తీరేనా?: రాష్ట్రపతి ఎన్నికలకు విపక్షాల ఉమ్మడి అభ్యర్థి
posted on Jun 14, 2022 @ 2:26PM
దేశంలో మోడీ సర్కార్ విద్వేష పూరిత వాతావరణాన్ని ప్రోత్సహిస్తోందనీ, విచ్ఛిన్న రాజకీయాలు నెరపుతోందనీ బీజేపీయేతర పార్టీలన్నీ ఆరోపణలతో దుమ్మెత్తి పోస్తున్నాయి. అయితే మోడీ సర్కార్ కు వ్యతిరేకంగా ఏకతాటిపైకి వచ్చే విషయంలోనే ఆ పార్టీల యత్నాలు ఒకడుగు ముందుకు మూడడుగులు వెనక్కు అన్నట్లుగా సాగుతోంది. రాష్ట్రపతి ఎన్నికకు బీజేపీయేతర పార్టీల ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్లే విషయంలో చర్చలకు మమతా బెనర్జీ ఆహ్వానానికి స్పందన అంతంత మాత్రంగా ఉండటంతో బీజేపీకి రాష్ట్రపతి ఎన్నిక విషయంలో ఎలాంటి టెన్షన్ లేని వాతావరణం నెలకొంది.
విపక్షాల ఉమ్మడి అభ్యర్థి ఎంపికపై విపక్షాలనే ఏకతాటిపైకి తీసుకురావడానికి మమతా బెనర్జీ చేస్తున్న ప్రయత్నాలు ఫలించేలా కనిపించడంలేదు. ఈ విషయంపై చర్చకు రావాల్సిందిగా మమతా బెనర్జీ 22 మంది విపక్షాల నేతలకు ఆహ్వానం పంపిన సంగతి విదితమే. కేసీఆర్ సహా పలువురు నేతలు ఈ సమావేశానికి హాజరు కావడం లేదని తెలిసింది. కేసీఆర్ మాత్రం పూర్తిగా గైర్మాజర్ అనుకోకుండా తన బదులుగా, లేదా తన ప్రతినిథిగా కేకేను పంపిస్తున్నారు. ఏది ఏమైనా మమతా బెనర్జీ ఆధ్వర్యంలో రేపు హస్తిన వేదిక గా జరగనున్న విపక్ష నేతల భేటీ విపక్షాల అనైక్యతకు మరో ఉదాహరణగా మిగిలిపోనున్నదని పరిశీలకులు అంటున్నారు.
ఎందుకంటే పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దూరంగా ఉండనున్నారు. అనారోగ్యం కారణంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా ఈ సమావేశానికి హాజరు కావడం లేదు. ఈడీ విచారణ, అందుకు కాంగ్రెస్ నిరసనలతో కాంగ్రెస్ తరఫు నుంచి ఈ సమావేశానికి ఎవరైనా హాజరౌతారా అన్నది అనుమానమే. ఇక కేసీఆర్ హాజరు కాబోవడం లేదని తేలిపోయింది. మహాముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే, ఝార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ల హాజరుపై ఇప్పటి వరకూ స్పష్టత లేదు.
అలాగే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ల హాజరుపై కూడా ఎటువంటి సమాచారం లేదు. మమతా బెనర్జీ నిర్వహిస్తున్న ఈ సమావేశానికి దూరంగా ఉండాలని పలు వామపక్ష నేతలు కూడా భావిస్తున్నారు. ఇలా ఉండగా విపక్షాల ఉమ్మడి అభ్యర్థి ఎంపిక విషయంలో కాంగ్రెస్ తన వంతు ప్రయత్నాలను విడిగా చేస్తున్నదా అన్న సందేహాలు కలుగుతున్నాయి.
ఎందుకంటే రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై వివిధ పార్టీల నేతలతో చర్చించేందుకు ఇప్పటికే సోనియా గాంధీ మల్లిఖార్జున్ ఖర్గేకు బాధ్యతలు అప్పగించారు. అందుకు తగ్గట్టే మమతా బెనర్జీ కూడా తాను నిర్వహించే సమావేశానికి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆహ్వానం పంపలేదు. ఇక పోతే రాష్ట్రపతి ఎన్నికకు జూన్ 29న నోటిఫికేషన్ విడుదల కానుంది. జూలై 18న ఎన్నిక జరుగుతుంది.