తా చెడ్డ కోతి వనమంతా చెరిచింది..!
posted on Jun 15, 2022 8:34AM
తాచెడ్డ కోతి వనమెల్లా చెరిచింది.. అన్నట్లుంది తెలంగాణ ప్రభుత్వ తీరు. ఇటీవల టీఎస్ ఆర్టీసీ బస్ ఛార్జీలను పెంచింది. కొద్ది నెలల క్రితమే చార్జీల మోత మోగించిన ప్రభుత్వం ఇంతలోనే మరో సారి చార్జీలు పెంచి, ప్రయాణీకుల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కుంటోంది. బస్సెక్కిన ప్రతి ప్రయాణీకుడు, చివరకు తెరాస అభిమానులు, కార్యకర్తలు కూడా సర్కార్ ను చీవాట్లు పెడుతున్నారు. ఇందుకేనా తెలంగాణ తెచ్చుకుంది అనే వరకు వెళుతున్నారు. దీంతో, సర్కార్ కు సెగ తగిలిందో ఏమో కానీ, చలనం అయితే వచ్చింది. అయితే, ప్రయాణీకులు, ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న విధంగా పెంచిన ధరలను తగ్గించే ఆలోచన చేస్తోందని అనుకుంటే అది పొరపాటే. టీఎస్ ఆర్టీసీ బాటలోనే ఇతర రాష్ట్రాలలోనూ చార్జీలు పెంచాలని, తెలంగాణ ప్రభుత్వం కోరుకుంటోంది.
నిజానికి ఒక విధంగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన తెలంగాణ ప్రభుత్వం ఇటీవల కాలంలో ఒకటొకటిగా వడ్డనలు మొదలు పెట్టింది. ప్రజల పై భారం వేసేందుకు ఏ చిన్న అవకాశం చిక్కినా చటుక్కున అందుకుంటోంది. చార్జీలు పెంచేందుకు ఏమాత్రం వెనకాడడం లేదు. అప్పులు పెరిగి ఆదాయం తరిగిన నేపధ్యంలో వడ్డన మార్గాన్ని తెరాస ప్రభుత్వం ఎంచుకుంది. మరో వంక మూలిగే నక్కపై తాటికాయ పడినట్లుగా, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల అప్పులను నియంత్రించేందుకు ఆంక్షలు విధించింది.ఈ పరిస్థితిలో ఆదాయం చాలక అప్పులు పుట్టక, చివరకు ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వలేని స్థితికి ధనిక రాష్టం పరిస్థితి దిగజారింది. అందుకే రాష్ట ప్రభుత్వం వరస పెట్టి చార్జీలు పెంచుకుంటూ పోతోంది. ఈ మధ్య కాలంలోనే ప్రభుత్వం మద్యం ధరలు పెంచింది.
అంతకు ముందే విద్యుత్ చార్జీలు పెంచింది. మరో వంక పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్ర ప్రభుత్వం కొంతమేర తగ్గించినా, రాష్ట్ర ప్రభుతం మాత్రం పైసా తగ్గించేది లేదని కరాఖండిగా చెప్పేసింది. దీంతో ఇరుగు పొరుగు రాష్ట్రాలకంటే రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలు అధికంగా ఉండడంతో. ప్రజల నుంచి నిరసన సెగలు తగులు తున్నాయి. నిత్యావసర సరకులు, వంట నూనెలు, కూరగాయలు ఒకటనేమిటి, అన్నిటి ధరలు పెరిగి సామాన్య ప్రజలు ఏం కొనేట్టు లేదు ఏం తినేట్టు లేదని వాపోతున్నారు. నిజమే కావచ్చును ధరల పెరుగుదల సమస్య దేశం అంతటా వుంది, కానీ, తెలంగాణ ప్రభుత్వం ప్రజలపై అదనంగా భారం మోపడంతో, ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
అదలా ఉంటే, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం, తాచెడ్డ కోతి ... సామెతను గుర్తుచేస్తూ ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచి తెలంగాణకు బస్సులు నడిపించే ఆయా రాష్ట్రాలు కూడా బస్సు చార్జీలు పెంచాలని, టీఎస్ ఆర్టీసీ ద్వారా సర్క్యులర్ జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ బస్ ఛార్జీలను పెంచడంతో ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచి రాష్ట్రానికి వచ్చి పోయే ప్రయాణికులు ఇతర రాష్ట్రాల ఆర్టీసీ బస్సులను ఆశ్రయిస్తున్నారు. దీంతో అసలే నష్టాల ఊబిలో కూరుకు పోయిన టీఎస్ ఆర్టీసీ ఆదాయానికి భారీగా గండి పడింది. ఈ నేపధ్యంలో ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు బస్సులు నడిపించే ఆర్టీసీ సంస్థలకు టీఎస్ ఆర్టీసీ సర్క్యులర్ జారీ చేసింది. అంతర్రాష్ట్ర రవాణా సంస్థల ఒప్పందం ప్రకారం... ఆయా రాష్ట్రాల మధ్య తిరిగే బస్సు ఛార్జీలు ఒకేలా ఉండాలనే నిబంధన ఉందని టీఎస్ ఆర్టీసీ అధికారులు తెలిపారు.
అందులో భాగంగానే మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లకు సర్క్యులర్‌లను పంపించినట్టు టీఎస్ ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వచ్చి వెళ్లే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులు పెరగడంతో ఏపీఎస్‌ఆర్టీసీకి సైతం సర్క్యూలర్ పంపించారు.అయితే, ఏపీ సహా ఇరుగు పొరుగు రాష్ట్రాలు ఏవీ కూడా టీఎస్ ఆర్టీసీ సర్క్యులర్’ ను సీరియస్’’గా తీసుకున్నట్లు లేదు. అందుకే సానుకూలంగా స్పందించలేదు. ఇలా ఇరుగు పొరుగు రాష్ట్రాలలో కంటే తెలంగాణలో పెట్ర్రోల్, డీజిల్ మొదలు,ఆర్టీసీ చార్జీల వరకు అన్నీ ఎక్కవే కావడంతో ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత రోజురోజుకు పెరుగుతోందని, ఒక విధంగా ప్రతిపక్ష పార్టీలకు ప్రభుత్వమే బలమైన ఆయుధం అందించిందని అధికార తెరాస ఎమ్మెల్యేలు నాయకులు ఆందోళన వ్యక్త పరుస్తున్నారు.