కోనసీమ అల్లర్లెవరి పనో తేలిపోయింది!
posted on Jun 15, 2022 6:48AM
పచ్చటి కోనసీమలో అల్లర్ల చిచ్చు ఎవరి పనో తేలిపోయింది. కోనసీమ అల్లర్ల కేసులో పోలీసులు అరెస్టు చేసిన వారంతా వైసీపీ కార్యకర్తలే. వీరిలో మంత్రి పినిపె విశ్వరూప్ అనుచరులు సైతం ఉన్నారు. ఈ అల్లర్లలో మంత్రి పినిపె విశ్వరూప్ నివాసం దగ్ధమైన సంగతి విదితమే. పోలీసులు అల్లర్ల కేసులో అరెస్టు చేసిన వారిలో అత్యధికులు ఆ మంత్రిగారి అనుచరులే ఉండటం చూస్తుంటే నిర్ద్వంద్వంగా అల్లర్ల వెనుక ఉన్నది వైసీపీయే అన్న విషయం తేటతెల్లం అవుతుంది.
ఇప్పటి వరకూ కోనసీమ అల్లర్లకు సంబంధించి పోలీసులు అరెస్టు చేసిన వారు రెండు వందల మందికి పైనే ఉన్నారు. వారంతా వైసీపీ కార్యకర్తలే. కోనసీమ సాధన సమితి నేతలనూ పోలీసులు అరెస్టు చేసి కేసులు పెట్టారు. వారు కూడా పినిపై విశ్వరూప్ అనుచరులే. ఈ అరెస్టులను బట్టే వైసీపీ కుట్రతోనే కోనసీమలో చిచ్చు పెట్టిందని అవగతమౌతోంది. వాస్తవం ఇలా ఉండగా... ఇప్పటి వరకూ కోనసీమ విధ్వంసంపై ఒక్క మాట కూడా మాట్లాడని సీఎం జగన్ అనంతపురంలో మంగళవారం కోనసీమలో విపక్షాలు చిచ్చు పెట్టాయంటూ ఆరోపణలు చేశారు.
ఏకంగా మంత్రి ఇంటిని దగ్ధం చేశారు అంటూ తెలుగుదేశం, జనసేనలపై విమర్శలు గుప్పించారు. అల్లర్ల వెనుక ఉన్నది వైసీపీయేనంటూ పోలీసులు అరెస్టుల సాక్షిగా తేటతెల్లమైపోతుంటే.. జగన్ మాత్రం ఆ అల్లర్ల వెనుక ఉన్నది విపక్షాలేనంటూ జనం సానుభూతి పోందేందుకు ప్రయత్నిస్తున్నారు. అల్లర్లు జరిగి ఇన్ని రోజులైనా.. ఆ విధ్వంసంలో ఏకంగా మంత్రి నివాసం దగ్ధమైనా జగన్ ఇప్పటి వరకూ మంత్రిని పరామర్శించిన పాపాన పోలేదు. దీనిని బట్టి కోనసీమ విధ్వంసాన్ని విపక్షాలపై విమర్శలు చేసి రాజకీయంగా లబ్ధి పొందాలన్న యావే కానీ.. వాస్తవాలు బయటపడుతున్నా, అరెస్టయిన వారంతా అధికార పార్టీ అనుచరగణం అని తేలిపోయినా అంగీకరించేందుకు మాత్రం వైసీపీ కానీ జగన్ కానీ సిద్ధంగా లేరని అవగతమౌతోంది.
వర్గాలు, కులాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి పబ్బం గడుపుకోవడమే జగన్ సర్కార్ ధ్యేయంగా కనిపిస్తున్నది. జగన్ సర్కార్ ఓట్ల వేటలో కోనసీమ జిల్లాలో చిచ్చు రగిల్చింది. అసలు జగన్ సర్కార్ తన విధానాలతో రాష్ట్రంలో ప్రశాంతతకు తావు లేకుండా చేసింది. రాష్ట్రంలో ఎక్కడ చూసినా అశాంతి, ఆందోళనలతో రాష్ట్రం అట్టుడికి పోతోంది.అందులో భాగంగానే ప్రశాంతతకు మారు పేరైన కోససీమలో కుల చిచ్చు రేపి పబ్బం గడుపుకోవాలన్న జగన్ సర్కార్ యత్నం.. బూమరాంగ్ అయ్యింది. అల్లర్ల వెనుక ఉన్నది వైసీపీయే అన్న విషయం తేటతెల్లమయ్యేలా అల్లర్ల కారకులంటూ పోలీసులు అరెస్టు చేసిన వారంతా వైసీపీ కార్యకర్తలే ఉన్నారు,
వారిలోనూ మంత్రి అనుచరుల సంఖ్యే ఎక్కువ. అసలు కోనసీమలో చిచ్చు పెట్టడం కోసమే కొత్త జిల్లాల ఏర్పాటు ప్రకటించిన సమయంలోనే పలు దళిత సంఘాలు కోనసీమకు డాక్టర్ బి. ఆర్. అంబేడ్కర్ పేరు పెట్టాలని కోరాయి. అప్పడు వాటి వినతిని పెడచెవిన పెట్టి కోనసీమ జిల్లాగా నామకరణం చేసింది. అంతే కాదు నిర్ణయం తీసేసుకున్నాం ఇక మార్పు లేదంటూ ప్రభుత్వ పెద్దలు ఘనంగా ప్రకటనలు కూడా చేసేశారు. ఆ తరువాత హఠాత్తుగా కోనసీమ జిల్లా పేరును బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా మారుస్తే ప్రభుత్వం ప్రకటించింది.
దీంతో వైసీపీ కార్యకర్తలే ఆ మార్పును వ్యతిరేకిస్తూ ఆందోళనలు, అల్లర్లకు దిగారని విశ్లేషకులు అంటున్నారు. అసలు మొదటే జిల్లా పేరును బీఆర్ అంబేడ్కర్ కోనసీమ అని పేరు పెట్టి ఉంటే ఎలాంటి ఆందోళనలకూ తావుండేది కాదనీ, కానీ అలా చేస్తే వైసీపీకి పొలిటికల్ మైలేజీ ఉండదన్న ఉద్దేశంతోనే సర్కార్ కోనసీమలో కులచ్చిచ్చును ప్రేరేపించేలా కుట్రపన్నిందనీ అప్పట్లోనే విమర్శలు వెల్లువెత్తాయి. ఇప్పడు అల్లర్ల కారకులంతా వైసీపీవారేనని పోలీసుల అరెస్టులతో తేటతెల్లమవ్వడంతో కోనసీమ విధ్వంసంలో దోషి ప్రభుత్వమేనని పరిశీలకులు అంటున్నారు.