కాంగ్రెస్ ముందస్తు ఎన్నికల కసరత్తు
ప్రతిపక్షాల్ని అదనుచూసి దెబ్బతీసేందుకు ముందస్తు ఎన్నికలే సరైన మార్గమని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్టుగా హస్తినలో ప్రచారం జరుగుతోంది. ఢిల్లీలో వేగంగా మారిపోతున్న పరిణామాలుకూడా ముందస్తు ఎన్నికలకు సంబంధించిన సూచనలు చేస్తున్నాయని రాజకీయ వర్గాలు చెప్పుకుంటున్నాయ్.
ములాయం, మాయావతిలపై ఎక్కువకాలం ఆధారపడడం మంచిదికాదని భావిస్తున్న యూపీయే అధినేత్రి సోనియా ముందస్తు ఎన్నికల కసరత్తుని మొదలుపెట్టేశారని పార్టీ వర్గాల్లో కూడా చర్చ జరుగుతోంది. ములాయం ముందస్తుగా లోక్ సభ ఎన్నికలకు తన పార్టీ అభ్యర్ధుల్ని ప్రకటించడంతో హడావుడి మరింత ఎక్కువయ్యింది.
రాహుల్ గాంధీ త్వరలోనే అతి పెద్ద బాధ్యతని చేపడతారంటూ దిగ్విజయ్ సింగ్ చేసిన ప్రకటనకూడా ముందస్తు ఎన్నికల సన్నాహాల్ని తలపిస్తోంది. పార్టీ తరఫున కీలక బాధ్యతల్ని స్వీకరించేందుకు రాహుల్ సన్నద్ధం చేస్తున్న సీనియర్లు, సోనియా తనయుడిని ప్రథాని కుర్చీలో కూర్చోబెట్టడమే ధ్యేయంగా పనిచేస్తున్నారు.
వచ్చే ఏడాది రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్, ఢిల్లీ శాసన సభలకు జరగబోయే ఎన్నికలతోపాటుగా లోక్ సభ ఎన్నికలుకూడా జరిపితే బాగుంటుందన్న ఆలోచన కాంగ్రెస్ అధినేత్రి సోనియా చేస్తున్నట్టు సమాచారం. పరిస్థితిని అంచనా వేసేందుకు, గెలుపు గుర్రాల్ని నిర్ణయించేందుకు ఇప్పటికే 50 మంది సభ్యుల రాహుల్ సేన దేశవ్యాప్తంగా విస్తృత స్థాయిలో సర్వే చేపట్టింది.