యూపీఏను దించేస్తాం: మమత
posted on Nov 18, 2012 @ 10:32AM
యూపీఏ 2 ప్రభుత్వాన్ని పడగొట్టి తీరతామని తృణమూల్ నేతలు తొడగొడుతున్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల వ్యవహారంలో గుర్రుగా ఉన్న తృణమూల్ అధినేత్రి మమత కేంద్ర ప్రభత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు శక్తిని కూడగట్టుకుంటున్నారు.
పార్టీలన్నీ మద్దతిస్తే యూపీఏ 2 ప్రభత్వం కూలిపోవడం ఖాయమని మమత జోస్యం చెబుతున్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ విషయంలో ఇప్పటికే వామపక్ష నేతలతో సంప్రదింపులు జరిపిన మమతా దీదీ బీజేపీ సపోర్ట్ ని కూడా తీసుకునేప్రయత్నం చేస్తున్నారు.
వేల కోట్ల రూపాయల అవినీతి కుంభకోణాల్లో చిక్కుకు పోయిన యూపీఏ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటూ దేశాన్ని అమ్మేస్తోందని తృణమూల్ అధినేత్రి మమత ఆరోపించారు. అవిశ్వాసంపై మమత తీవ్రంగా స్పందించినా కాంగ్రెస్ నేతలు మాత్రం లైట్ తీస్కుంటున్నారు. 2014 వరకూ యూపీఏ ప్రభుత్వం అధికారంలో కొనసాగడం ఖాయమని తేల్చి చెబుతున్నారు.