వైవాహికేతర సంబంధం: సిఐఎ చీఫ్ రాజీనామా

 

వైవాహికేతర సంబంధంపై సిఐఎ డైరెక్టర్ డేవిడ్ పెట్రాయెస్ రాజీనామా చేశారు. తన ప్రవర్తన అంగీకారయోగ్యం కాదంటూ ఆయన రాజీనామా చేశారు. అత్యున్నత నిఘా సంస్థ చీఫ్ పెట్రాయెస్ తన రాజీనామాను అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు శుక్రవారం సమర్పించారు. వివాహమైన 37 ఏళ్ల తర్వాత తాను వైవాహికేతర సంబంధం పెట్టుకోవడమనేది సరి కాదని అభిప్రాయపడుతున్నట్లు తెలిపారు.

 

ఒక భర్తగా, సంస్థ అధిపతిగా తన ప్రవర్తన సరైంది కాదని అనుకుంటున్నట్లు ఆయన చెప్పారు. పెట్రాయెస్ రాజీనామాను బరాక్ ఒబామా అంగీకరించి, పెట్రాయెస్ చేసిన సేవలను ప్రశంసించినట్లు తెలుస్తోంది. పెట్రాయెస్ వైవాహికేతర సంబంధం గురించి ఎఫ్‌బిఐ దర్యాప్తులో తేలినట్లు సమాచారం. పెట్రాయెస్ రాజీనామా నిఘా, రాజకీయ వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.



పెట్రాయెస్ సేవలను ఒబామా ప్రశంసించారు. దశాబ్దాల పాటు పెట్రాయెస్ అసాధారణమైన సేవలు అందించారని, అమెరికా రక్షణకు, పటిష్టతకు సేవలు అందించారని అన్నారు. సిఐఎ డిప్యూటీ డైరెక్టర్ మైఖెల్ మోరెల్ యాక్టింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తారని చెప్పారు. సిఐఎ తన కృషిని కొనసాగించడంలో ముందుంటుందని ఆశిస్తున్నట్లు ఒబామా అన్నారు.

Teluguone gnews banner