మన్మోహన్ తో కావూరీ భేటీ - తీరని అలక
posted on Nov 14, 2012 @ 3:05PM
కేంద్రమంత్రివర్గ విస్తరణలో తనని నిర్లక్ష్యం చేసినందుకు అలిగి రాజీనామా చేసిన ఏలూరు ఎంపీ కావూరి సాంబశివరావ్ ఏమాత్రం వెనక్కి తగ్గడానికి ఇష్టపడడంలేదు. రాజీనామా విషయమై కావూరిని బుజ్జగించేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
కావూరితో భేటీ అయిన ప్రథాని ఎన్నో విధాలుగా నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కావూరి మాట వినలేదు. ప్రథాని మన్మోహన్ దగ్గర తన మనస్తాపాన్ని ఆయన పూర్తిగా బైటపెట్టారని పార్టీవర్గాలు చెబుతున్నాయ్. ప్రథానితో సమావేశానికి సంబంధించిన వివరాల్ని తాను బైటికి చెప్పలేనంటూ కావూరి మాట దాటేశారు.
భవిష్యత్ కార్యాచరణపై కావూరి ఇంకా ఓ నిర్ణయం తీసుకోనప్పటికీ కాంగ్రెస్ అధిష్ఠానంపై ఈ సారి చాలా గట్టిగానే అలిగినట్టు తెలుస్తోంది. ఎన్నోఏళ్లుగా పార్టీకి అండగా నిలబడ్డ తనని కాదని జూనియర్లకి పెద్దపీట వేయడమేంటని కావూరి నేరుగా ప్రథానమంత్రిని ప్రశ్నించినట్టు సమాచారం.
తనకి మంత్రిపదవి దక్కకపోవడంకంటే ఎన్టీఆర్ తనయ పురధేశ్వరికి స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన కేంద్రమంత్రి పదవిని ఇవ్వడం కావూరికి ఎంతమాత్రమూ నచ్చలేదన్నది పార్టీలో సీనియర్ల మాట. పార్టీకి కష్టకాలంలో అండగా నిలబడినందుకు చాలా మంది బహుమతే లభించిందంటూ కావూరి సన్నిహితుల దగ్గర అసంతృప్తిని వెళ్లగక్కిన విషయం తెలిసిందే.