తెలంగాణలోని 16 జిల్లాల్లో భారీ వర్షాలు...ఎల్లో అలర్ట్ జారీ
నైరుతి రుతుపవనాలు తెలంగాణ అంతటా విస్తరిస్తున్నాయి. ఈనెల 5న రుతుపనాలు ఉమ్మడి మహబూబ్‌నగర్ నుంచి తెలంగాణలోకి ప్రవేశించగా.. ప్రస్తుతం రాష్ట్రం అంతటా విస్తరించింది. వీటి ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా రెండ్రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. నేడు, రేపు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని చెప్పారు.
తెలంగాణ రాష్ట్రంలో నేడు 16 జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ ప్రకటించింది. నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్త గూడెం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, సిద్దిపేట, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షం పడొచ్చని పేర్కొంది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. గురువారం ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో పలు చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిశాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలోని బొమ్మల రామారంలో అత్యధికంగా 6.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సిద్దిపేట జిల్లా తొగుట మండలం వెంకట్రావ్‌పేటలో 6.5, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి మండలం పీర్జాదీగూడలో 6.5, మెదక్ జిల్లా ఎల్దుర్తిలో 6, తుప్రాన్ మండలం ఇస్లాంపూర్‌లో 5.8, శంకరంపేటలో 5.1 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మరోవైపు, సిద్దిపేట, మెదక్ జిల్లాల్లో ఇద్దరు రైతులు పిడుగుపాటుకు మృతి చెందారు.