కువైట్‌లో అగ్ని ప్రమాదం.. 40 మంది భారతీయులు మృతి
posted on Jun 12, 2024 @ 5:40PM
కువైట్‌లోని ఒక భవనంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 41 మంది మరణించారు. వీరిలో 40 మంది భారతీయులే. జీవనోపాధి కోసం భారతదేశం నుంచి వచ్చిన వీరందరూ ఒక కంపెనీలో పనిచేస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. కువైట్‌లోని దక్షిణ మంగాఫ్ నగరంలోని ఆరు అంతస్తుల భవనంలో బుధవారం ఉదయం 6 గంటల సమయంలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో ఆ భవనంలో మొత్తం 160 మంది వున్నారు. భవనంలోని కిచెన్‌లో ప్రారంభమైన మంటలు క్షణాల్లోనే భవనమంతా వ్యాపించినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో 35 మంది అక్కడికక్కడే మరణించగా, ఆరుగురు చికిత్స పొందుతూ మరణించారు. ఈ ప్రమాదంలో మరో 50 మందికి పైగా గాయపడ్డారు. వారిలో 30 మంది భారతీయులే. ప్రమాదం జరిగిన సమయంలో అందరూ నిద్రలో వుండటం వల్ల మృతుల సంఖ్య పెరిగింది. కువైట్ అగ్నిప్రమాద ఘటనపై భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. బాధితులకు సహకారం అందించాలని కువైట్‌లోని భారత రాయబారిని ఆదేశించామని ఆయన తెలిపారు.