జగన్ ఎమ్మెల్యేలు, ఎంపీలకు బీజేపీలో నో ఎంట్రీ!

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో జగన్ పార్టీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాలకు గాను కేవలం 11 స్థానాలలోనే వైసీపీ విజయం సాధించింది. అలాగే పాతిక లోక్ సభ స్థానాలకు గాను కేవలం నాలుగంటే నాలుగు చోట్ల మాత్రమే విజయం సాధించింది. ఇప్పుడు వైసీపీ నుంచి విజయం సాధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలూ పార్టీ నుంచి దూకేయడానికి దారులు వెతుక్కుంటున్నారు.  అధికారంలో ఉండగా తాము చేసిన తప్పిదాలు, అక్రమాలకు ఫలితం అనుభవించాల్సి ఉంటుందన్న భయంతో వణికి పోతున్నారు. కేసుల నుంచి తప్పించుకోవడానికి బీజేపీని శరణు జొచ్చాలన్న భావనలో ఉన్నారు. ఇప్పటికే కడప లోక్ సభ స్ధానం నుంచి విజయం సాధించిన వైఎస్ అవినాష్ రెడ్డి ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు రాజకీయవర్గాలలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో జమ్మలమడుగు నుంచి బీజేపీ అభ్యర్థిగా విజయం సాధించిన ఆదినారాయణ రెడ్డి అటువంటి పప్పులుడకవని కుండబద్దలు కొట్టేశారు.  వైసీపీ నుంచి గెలుపొందిన కొద్ది మంది ఎమ్మెల్యేలు, ఎంపీలూ బీజేపీలోకి మారిపోదామని ప్రయత్నాలు చేస్తున్నారనీ, ప్రణాళికలు రచ్చిస్తున్నారనీ అయితే ఆ పప్పేలేమీ ఉడకవనీ, వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలను ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీలోకి తీసుకోబోమనీ కుండబద్దలు కొట్టేశారు. బీజేపీ అగ్రనాయకత్వం ఇందుకు అంగీకరించే ప్రశక్తే లేదని అన్నారు. ఎందుకంటే అటువంటి నేతలను పార్టీలో చేర్చుకోవడం చంద్రబాబుకు ఆగ్రహం తెప్పింస్తుందనీ, అది బీజేపీకి నష్టం అని వ్యాఖ్యానించారు.   కేంద్రంలోని బీజేపీ సర్కార్ పూర్తిగా తెలుగుదేశం ఎంపీల మద్దతుపై ఆధారపడి ఉందని గుర్తు చేశారు.  ఆదినారాయణరెడ్డి సోమవారం అమరావతిలో పర్యటించి, అక్కడ జరుగుతున్న పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్ ఘోర పరాజయానికి అమరావతి రైతుల చారిత్రాత్మక పోరాటం ఒక ప్రధాన కారణమని చెప్పారు. అమరావతి రైతులు జగన్ కు సరైన గుణపాఠం చెప్పారన్నారు. అతి త్వరలో జగన్ పార్టీ కనుమరుగైపోవడం ఖాయమని జోస్యం చెప్పారు.  

చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి జగన్ బాధిత కుటుంబాలకు ఆహ్వానం!

జగన్ సర్కార్ అరాచకానికి రాష్ట్రంలో ఎందరో బాధితులుగా మారిపోయారు. ఇంకెంతో మంది ప్రాణాలు కోల్పోయి వారి కుటుంబాలు అనాథలుగా మిగిలాయి. ప్రాణం పోయినా, పీక కోసినా జగన్ అరాచక పాలనకు దాసోహం అనడానికి నిరాకరించి, జగన్ అధ్వానపాలనను వ్యతిరేకించి, ధిక్కరించి ఎన్నో కుటుంబాలు నిలువనీడను కోల్పోయాయి. అయినా అదరక బెదరక జగన్ పాలనకు వ్యతిరేకంగా నిలబడ్డాయి. జగన్ పోవాలి అని నినదించాయి. రాష్ట్రంలో మళ్లీ సుపరిపాలన రావాలని, అలా రావాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం ఒక్కటే మార్గమని తలచి ఆయన వెంట నడిచాయి. తెలుగుదేశం జెండా ఎత్తాయి.  అలా జగన్ పాలనలో  ఇబ్బందులు ఎదుర్కొని, నానా బాధలూ పడిన బాధిత కుటుంబాలకు చంద్రబాబు ప్రమాణస్వీకారోత్సవానికి ప్రత్యేకంగా ఆహ్వానాలు వెళ్లాయి.   రాష్ట్ర వ్యాప్తంగా 104 జగన్ బాధిత కుటుంబాలకు తెలుగుదేశం నుంచి ప్రత్యేక ఆహ్వానం అందింది. ఈ కుటుంబాలలో జై జగన్ అనడానికి నిరాకరించి జై చంద్రబాబు అని నినదిస్తూ వైసీపీ మూకల దాష్టీకారిని బలైన మాచర్లకు చెందిన చంద్రయ్య కుటుంబానికీ, అలాగే ఎమ్మెల్సీ అనంతబాబు  హత్య చేసి మృతదేహాన్ని డోర్ డెలివరీ చేసిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబానికీ కూడా తెలుగుదేశం అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానం అందింది. వీరందరి కోసం ప్రమాణ స్వీకార వేదిక సమీపంలో ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటు చేస్తున్నారు.  రాష్ట్రంలో రాక్షస పాలన అంతం కావడానికి కష్టాల్, నష్టాల్ ఎదురైనా వెరవకుండా ధైర్యంగా నిలబడి సత్యాగ్రహాన్నిప్రదర్శించిన వారిని గుర్తించి, చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ప్రత్యేకంగా ఆహ్వానించడం ద్వారా ఆ కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందన్న సందేశాన్ని ఇవ్వడం ముదావహమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.    

రామ్మోహన్‌కి రైల్వే శాఖ... పెమ్మసానికి వైద్య ఆరోగ్యం?

తెలుగుదేశం పార్టీకి చెందిన కింజరాపు రామ్మోహన్ నాయుడు, డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఆదివారం నాడు కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరికి ఏ శాఖలు కేటాయిస్తారా అనే సస్పెన్స్ నెలకొని వుంది. ఈ సస్పెన్స్‌.ని కొంచెం సడలిస్తూ కొన్ని వార్తలు వస్తున్నాయి. రామ్మోహన్ నాయుడికి కేబినెట్ మంత్రిగా రైల్వే శాఖ, పెమ్మసానికి వైద్య ఆరోగ్య శాఖ సహాయమంత్రిగా బాధ్యతలు అప్పగించనున్నట్టు తెలుస్తోంది. కేంద్ర కేబినెట్‌లో రైల్వే శాఖ అత్యంత కీలకమైన శాఖ.. అలాగే ఒత్తిడి ఎక్కువగా వుండే శాఖ కూడా. ప్రస్తుతం సంస్కరణల మార్గంలో ప్రయాణిస్తున్న రైల్వే శాఖకు భవిష్యత్తును కొత్తగా దర్శించగల నాయకుడి అవసరం వుంది. ఆ నాయకత్వ బాధ్యతను రామ్మోహన్ నాయుడు సమర్థంగా నెరవేరుస్తారనే దానిలో ఎలాంటి సందేహం అవసరం లేదు. ఈ నమ్మకంతోనే ప్రధాని మోడీ రామ్మోహన్‌కి ఈ బాధ్యత అప్పగించనున్నారని తెలుస్తోంది. సాధారణంగా రైల్వే శాఖ అనగానే బీహార్ వాళ్ళో, బెంగాల్ వాళ్ళో సొంతం చేసుకుంటూ వుంటారు. దక్షిణాది మంత్రికి రైల్వే శాఖ లభించడం ఇది తొలిసారి అవుతుంది. రామ్మోహన్ నాయుడు రైల్వే శాఖ అందితే, విశాఖ రైల్వే జోన్ డిమాండ్ కూడా ఒక కొలిక్కి వస్తుందన్న అభిప్రాయాలు వున్నాయి. ఇక పెమ్మసానికి వైద్య ఆరోగ్య శాఖ సహాయ మంత్రిగా పదవి లభించడం అనేది సరైన వ్యక్తికి సరైన పదవి అవుతుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

జగనూ, ఆరా మస్తానూ.. ముంచేశారు కదయ్యా...

వైసీసీ బంపర్‌గా గెలుస్తుందని సర్వే రిపోర్టు ఇచ్చిన ఆరా మస్తాన్ అనే సెఫాలజిస్టు అర్జెంటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిచి పారిపోతే మంచిది. అలా పారిపోయే ప్రయత్నంలో వుండగా... ఎవరైనా గుర్తుపట్టి, ‘మీరు ఆరా మస్తాన్ గారు కదూ?’ అని ప్రశ్నిస్తే, కాదు.. కాదు.. నాపేరు... దారినపోయే దానయ్య అనో, పొరుగూరు పుల్లయ్య అనో చెప్పి అక్కడి నుంచి జారుకుంటే ఆరోగ్యానికి మంచిది. ఎందుకంటే, రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు ఈ ఆరా మస్తాన్ అనేవాడు ఎక్కడ కనిపిస్తాడా.. బుర్ర రాంకీర్తన పాడించాలా అని ఎదురుచూస్తున్నారు. పొరపాటున ఆరా మస్తాన్ ఎవరికైనా దొరికాడంటే ఏ కీలుకు ఆ కీలు ఊడదీసేలా పరిస్థితి వుంది మరి. 2019 ఎన్నికల సందర్భంలో లగడపాటి రాజ్‌గోపాల్ టీడీపీ గెలుస్తుందని సర్వే రిపోర్టు ఇచ్చారు. ఆయన సర్వేలకు వున్న క్రెడిబిలిటీ గురించి తెలిసినవాళ్ళు అలాగే జరుగుతుందని అనుకున్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళకి చేతి దురద ఆగక ‘టీడీపీ గెలుస్తుంది’ అని భారీ సంఖ్యలో బెట్టింగ్ కట్టారు. ఆ తర్వాత టీడీపీ ఓడిపోయింది. బెట్టింగ్‌ కట్టిన వేలమంది కట్టుబట్టలతో మిగిలారు. 2024లో కూడా అలాంటి పరిస్థితే ఎదురైంది. కాకపోతే, ఆ పరిస్థితి ఇప్పుడు వైసీపీ వాళ్ళకి ఎదురైంది. పోలింగ్ ముగిసిన తర్వాత వైసీపీలో వున్న బెట్టింగ్ రాయుళ్ళు తమ పార్టీ మీద బెట్టింగ్ కడదామా... వద్దా.. అనే సందిగ్ధంలో వుండగా, జగన్ సార్ ఐప్యాక్ ఆఫీసుకి వెళ్ళి ‘వైనాట్ 175’ అనేశారు. దాంతో వైసీపీ వర్గాల్లో ఉత్సాహం వచ్చింది. ఇంకా ఏమైనా సపోర్టింగ్ దొరుకుతుందా అని చూస్తున్న సమయంలో ఆరా మస్తాన్ తన అమూల్యమైన సర్వే బయటపెట్టారు. ఈసారి వైసీపీ ఇరగ్గొట్టేస్తుంది అని ఆయన తన సర్వే వెల్లడించారు. అంతే, అప్పటి వరకు వెనుకా ముందు ఆలోచిస్తూ వున్న వైసీపీ వర్గాలు రెచ్చిపోయి వైసీపీ గెలుస్తుందని బెట్టింగులు పెట్టేశారు. జూన్ 4 తర్వాత పరిస్థితి ఏమైందో అందరికీ తెలిసిందే. 2019లో బెట్టింగులకు దిగినవాళ్ళు కట్టు బట్టలతో అయినా మిగిలారు.. ఇప్పుడయితే వేలాదిమంది వైసీపీ నాయకులు కట్టుబట్టలు కూడా లేకుండా మిగిలారు. అలాంటివాళ్ళందరూ ఇప్పుడు జగన్ మీద ఎలాగూ ఆగ్రహం వ్యక్తం చేసే సీన్ లేదు కాబట్టి, ఆరా మస్తాన్ మీద ఆగ్రహంగా వున్నారు. ఆదివారం సాయంత్రం తిరువూరు నియోజకవర్గ వైసీపీ నాయకుల ముఖ్య సమావేశం జరిగింది. తిరువూరులో ఓడిపోయిన నల్లగట్ల స్వామిదాసుతోపాటు సమావేశంలో పాల్గొన్న అందరి నోటి వెంట ఇదే లబోదిబో! మనల్ని ఒకవైపు జగన్ ముంచేస్తే, మరోవైపు ఆరా మస్తాన్ ముంచేశాడు అని! సమావేశం జరిగినంతపూ ఆరా మస్తాన్ నామస్మరణతో ఆ సమావేశం మార్మోగింది. ఇక్కడే కాదు.. ఎక్కడ వైసీపీ నాయకుల సమావేశం జరిగినా, జగన్‌ని గుర్తు చేసుకున్నా చేసుకోకపోయినా, ఆరా మస్తాన్‌ని గుర్తు చేసుకుని, అతన్ని మనసారా తిట్టుకుని శాంతిస్తున్నారు.

బాక్సాఫీసులో బాంబు.. రాజకీయాల్లో రాంబో... మన బాలయ్య!

తాను పట్టిందల్లా బంగారమే అన్నంతగా ప్రస్తుతం నటసింహం నందమూరి బాలకృష్ణ టైం నడుస్తుంది. సినిమా అయినా, రాజకీయమైనా తన విజయపరంపరను కొనసాగిస్తూ.. తనకి తానే సాటి అనిపించుకుంటున్నారు బాలయ్య. అందుకే ప్రస్తుతం తెలుగునాట ఆయన పేరు మారుమోగిపోతోంది. 60 ఏళ్ళ వయసులోనూ 'అఖండ', 'వీరసింహారెడ్డి', 'భగవంత్ కేసరి' సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ అందుకొని.. యంగ్ హీరోలకు సైతం సవాల్ విసురుతున్నారు బాలకృష్ణ.  అలాగే రాజకీయాలలో కూడా వరుసగా మూడు సార్లు హిందూపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై హ్యాట్రిక్ విజయాలు అందుకున్నారు.   2014 ఎన్నికల్లో హిందూపురం నుంచి టీడీపీ తరపున పోటీ చేసి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన నందమూరి నట సింహం.. 2019 లో  తెలుగుదేశంకు ఎదురుగాలి వీచినా వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచి సత్తా చాటారు.  ఇక ఇప్పుడు ముచ్చటగా మూడోసారి హిందూపురంలో గెలుపు జెండా ఎగురవేశారు. పైగా ప్రతి ఎన్నికకు తన మెజారిటీని పెంచుకుంటూ రావడం విశేషం. 2014లో 16 వేల ఓట్ల తేడాతో విజయం సాధించిన బాలయ్య..  2019లో 18 వేల మెజారిటీతో గెలుపొందారు. ఇక ఇప్పుడు ఈ 2024 ఎన్నికల్లో ఏకంగా 32 వేల మెజారిటీతో బాలకృష్ణ విజయబావుటా ఎగరవేశారు.  మొత్తానికి అటు సినిమాల్లోనూ, ఇటు రాజకీయాల్లోనూ బాలయ్య హ్యాట్రిక్ విజయాలతో దూసుకుపోవడం పట్ల నందమూరి అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు. (బాలకృష్ణ జన్మదినం సందర్భంగా..)

సామాజిక బాధ్యత.. చంద్రబాబు దార్శనికతే బొద్దులూరి యశస్వి ఆయుధాలు

ఏపీలో ఐదేళ్ల‌పాటు సీఎంగా జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అరాచ‌క పాల‌న‌కు ప్రజ‌లు న‌ర‌క‌యాత‌న అనుభ‌వించారు. అడుగ‌డుగునా ఇబ్బందుల‌ను ఎదుర్కొన్నారు. ఇదేమ‌ని ప్ర‌శ్నించిన వారిపై వైసీపీ గూండాలు దాడులు చేయ‌డం, పోలీసులు అక్ర‌మ కేసుల‌తో జైళ్ల‌కు పంపించ‌డం.. మ‌రీ ప్ర‌శ్నిస్తే చంపేయ‌డం. ఇదీ ఐదేళ్లు జ‌గ‌న్ పాల‌న తీరు. దీంతో వైసీపీ ప్ర‌భుత్వంపై నోరెత్తేందుకు కూడా ప్ర‌జ‌లు వణికిపోయారు. అలాంటి స‌మ‌యంలో  తెలుగుదేశం ప్ర‌జ‌ల త‌ర‌పున గొంతెత్తింది. జ‌గ‌న్ అరాచ‌క పాల‌న‌పై పోరాడేందుకు దైర్యాన్ని ఇచ్చింది. ఈ విషయంలో తెలుగుదేశం కార్యకర్తలు  దాడుల‌కు గుర‌య్యారు, పోలీసుల లాఠీదెబ్బ‌లు తిన్నారు,  జైళ్ల‌కు వెళ్లారు. అయినా, జ‌గ‌న్ అరాచ‌కాల‌కు ఎదురొడ్డి పోరాటం చేసి ప్ర‌జ‌ల‌కు అండ‌గా నిల‌బడ్డారు. జ‌గ‌న్ చేసేది త‌ప్పు అంటూ ప్ర‌జ‌ల్లో చైత‌న్య నింపారు. అలాంటి వారిలో ఎన్ఆర్ఐ టీడీపీ నాయకుడు బొద్దులూరి యశ‌స్వి (య‌ష్‌) ముందువరుసలో నిలిచారు. జ‌గ‌న్ ప్ర‌భుత్వం దుర్మార్గ‌  పాల‌నపై ప్ర‌జ‌ల‌కు ఎప్ప‌టిక‌ప్పుడు తెలియజేస్తూ వారిలో చైత‌న్య జ్వాలను ర‌గిల్చారు. త‌ద్వారా ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు ఓటు ద్వారా వైసీపీని పాతాళానికి తొక్క‌డంలో య‌శ‌స్విది కూడా కీలక పాత్ర‌ అనడంలో అతిశయోక్తి ఇసుమంతైనా లేదు.    తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్‌ఐ నాయకుడు బొద్దులూరి య‌శ‌స్వి ఉన్న‌త విద్యావంతుడు. తెనాలిలో జ‌న్మించిన య‌శ‌స్వి.. తెలంగాణ‌లో త‌న విద్యాభ్యాసం  పూర్తి చేశారు.  ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో సీఎం చంద్ర‌బాబు నాయుడు ఐటీ రంగాన్ని అభివృద్ధి చేయడం, ఆయన కృషితో హైదరాబాద్ కు తరలివచ్చిన వేలాది ఐటీ కంపెనీలు యువతకు అపార ఉద్యోగావకాశాలు కల్పించడం తెలిసిందే. ఆ సమయంలోనే యశస్వి కూడా ఉద్యోగస్తుడయ్యారు. అలా ఐటీ ప్రొఫెషనల్ గా కెరీర్ ప్రారంభించిన  యశస్వి 21 దేశాలు తిరిగి చివరికి అమెరికాలో స్థిరపడ్డారు.  విద్యార్థి దశ నుంచే రాజకీయాలలో చురుకుగా ఉండే యశస్వి 2014లో ఉమ్మడి రాష్ట్ర విభజన తరువాత చంద్రబాబుకు, తెలుగుదేశం కు మద్దతుగా స్వరాష్ట్రానికి వచ్చి బ్రింగ్ బ్యాక్ బాబు, జాబు కావాలంటే బాబు రావాలి క్యాంపెయిన్ లో చురుకుగా పాల్గొన్నారు. ఆ సమయంలో కుటుంబాన్ని వదిలి ఆంధ్రప్రదేశ్ లో దాదాపు ఆరు నెలల పాటు ఎన్నికల ప్రచారంలో చురుకుగా పాల్గొన్నారు. అందులో భాగంగా దాదాపు 116 నియోజకవర్గాలలో విస్తృతంగా ప్రచారం చేశారు. 2014 ఎన్నికలలో తెలుగుదేశం విజయం సాధించి చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాతే తిరిగి అమెరికా వెళ్లారు.  సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు అన్న తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ మాటలను విశ్వసించి తూచా తప్పకుండా ఆచరించే యశస్వి తన సంపాదనలో కొంత భాగం పేదల కోసం వ్యయం చేయడం ఒక అలవాటుగా మార్చుకున్నారు. కోవిడ్ సమయంలో తల్లిదండ్రులను కోల్పోయిన పలువురు పిల్లల విద్య బాధ్యతను తీసుకుని వారిని చదివిస్తున్నారు. అమెరికాలో ఉన్నా ఆయనకు సొంత రాష్ట్రంపై ప్రేమ ఎక్కువ.   ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాల‌ని కోరుకునే వ్య‌క్తుల్లో య‌శ‌స్వి ముందు వ‌రుస‌లో ఉంటాడు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ విడిపోయిన త‌రువాత తొలి ఐదేళ్లు చంద్ర‌బాబు హ‌యాంలో ఏపీ అన్నిరంగాల్లో దూసుకెళ్లేందుకు ముంద‌డుగు వేసింది. కానీ, 2019లో జ‌గ‌న్ సీఎం అయిన త‌రువాత ఏపీ ప‌త‌నం ప్రారంభ‌మైంది. జ‌గ‌న్ క‌క్ష‌పూరిత రాజ‌కీయాల‌తో అరాచ‌క పాల‌న‌ను సాగించారు. ప్ర‌శ్నించిన వారిపై దాడులు చేయ‌డం, చంద్ర‌బాబు హ‌యాంలో ఏపీలో పెట్టుబ‌డులు పెట్టిన కంపెనీల‌ను త‌రిమేయ‌డంతో యువ‌త‌కు క‌నీసం ఉపాధి అవ‌కాశ‌లుకూడా లేకుండా చేశారు. దీంతో ఏపీ ప్ర‌జ‌లు ఉపాధికోసం ఇత‌ర రాష్ట్రాల‌కు వెళ్లాల్సి వ‌చ్చింది. ఈ ప‌రిస్థితిని చూసి చలించిపోయిన యశస్వి  అమెరికాలో ఉంటూనే ఏపీలో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అరాచ‌క పాల‌న‌పై ప్ర‌జ‌ల్లో చైత‌న్యం నింపేందుకు   ప్ర‌య‌త్నించారు. ఎప్ప‌టిక‌ప్పుడు జ‌గ‌న్ పాల‌నా విధానాల‌ను సోష‌ల్ మీడియాలో ఎండ‌గ‌డుతూ వ‌చ్చారు. వాస్తవానికి వైసీపీ ప్రభుత్వ అరాచకాలపై మొట్టమొదట గళమెత్తినది యశస్వే.  జగన్ వేధింపులు, వైసీపీ మూకల అరాచకాలు, దాడులు, దౌర్జన్యాలపై తెలుగుదేశం పోరు మొదలు పెట్టడానికి ముందే   అమెరికాలో ఉంటూనే ఏపీలో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అరాచ‌క పాల‌న‌పై ప్ర‌జ‌ల్లో చైత‌న్యం నింపేందుకు య‌శ‌స్వి ప్ర‌య‌త్నించారు. ఎప్ప‌టిక‌ప్పుడు జ‌గ‌న్ పాల‌నా విధానాల‌ను సోష‌ల్ మీడియాలో ఎండ‌గ‌డుతూ వ‌చ్చారు.  ఈ క్ర‌మంలో.. ప్ర‌శ్నించిన వారిని చిత్ర‌హింస‌లుపెట్టే జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి దృష్టి య‌శ‌స్వి వైపు మ‌ళ్లింది.. దీంతో ఆయనను ఇబ్బందులు పెట్టేందుకు ప్ర‌భుత్వం అనేక ప్ర‌య‌త్నాలు చేసింది.  ఏపీలోని ఆయన ఇంటిపై దాడులు చేసింది. చేయించింది. ఇంటిని ధ్వంసం చేసింది. దీంతో య‌శ‌స్వీ త‌న త‌ల్లిదండ్రుల‌ను హైద‌రాబాద్ కు మకాం మార్పించారు.  జగన్ ప్రభుత్వం య‌శ‌స్వీపై పగపట్టినట్లు వ్యవహరించింది. లుక్ అవుట్ నోటీసులు  జారీ చేసింది.  ఆర్థిక నేర‌గాళ్లు, ఉగ్ర‌వాదాలను వెంటాడినట్లు వెంటాడింది. వేటాడింది.   ప్ర‌భుత్వ ప్ర‌జావ్య‌తిరేక పాల‌న‌ను ప్ర‌శ్నించినందుకు జ‌గ‌న్ ప్ర‌భుత్వం య‌శ‌స్వీకి లుక్ అవుట్ నోటీసులు ఇచ్చిందంటే ఏ స్థాయిలో కక్షపూరితంగా వ్యవహరించిందో, ఆయనను ఇబ్బందులు పెట్టేందుకు ఎంతకు తెగించిందో అర్దం చేసుకోవచ్చు. చివ‌రికి..  ఏపీలో ఉంటున్న త‌న త‌ల్లి ఆరోగ్యం బాగా లేక‌పోవ‌టంతో చూసేందుకు  వ‌చ్చిన య‌శ‌స్విని  ఏపీ సీఐడీ పోలీసులు శంషాబాద్ విమానాశ్ర‌యంలో అర్ద‌రాత్రి   అదుపులోకి తీసుకొచి గుంటూరు సీఐడీ కార్యాల‌యానికి త‌ర‌లించారు. నాలుగు గంట‌ల త‌రువాత 41ఏ నోటీసు ఇచ్చి వ‌దిలి పెట్టారు.  అయితే అలా వదిలిపెట్టడానికి జగన్ సర్కార్ ఉదారత ఏమీ కారణం కాదు. యశస్విని అదుపులోనికి తీసుకోవడానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశ వ్యాప్తంగా, దేశ విదేశాల్లో వెల్లువెత్తిన నిరసనలే కారణం. సామాజిక మాధ్యమంలో జగన్ ప్రభుత్వ చర్యను వ్యతిరేకిస్తూ నెటిజనులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ఆ కారణంగానే యశస్విని అనివార్యంగా, గత్యంతరం లేక జగన్ సర్కార్ వదిలింది. లేకుంటే రఘురామకృష్ణం రాజును చిత్రహింసలు పెట్టినట్లే యశస్విని కూడా ట్రీట్ చేసి ఉండేది.  ఇక యశస్విపై జారీ చేసిన లుక్ ఔట్ నోటీసును హైకోర్టు   ర‌ద్దు చేసింది. ఇక యశస్వి జగన్ సర్కార్ వేధింపులు, బెదరింపులు, అక్రమ అరెస్టులకు ఇసుమంతైనా బెదరలేదు.  ఆ త‌రువాత కూడా య‌శ‌స్వి ఏపీ ప్ర‌భుత్వం అవ‌లంబిస్తున్న ప్ర‌జా వ్య‌తిరేక  విధానాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేస్తూ వారిలో చైత‌న్యం నింపుతూ వ‌చ్చారు. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఘోర ఓట‌మిని చ‌వి చూడ‌బోతున్నారని య‌శ‌స్వి  ఎన్నిక‌ల‌కు ఐదు నెల‌ల ముందునుంచే చెబుతూ వ‌చ్చారు. య‌శ‌స్వి చెప్పిన‌ట్లుగా వైసీపీ ఘోర ప‌రాభ‌వం పాలైంది.    సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో జ‌న‌సేన‌, తెలుగుదేశం, బీజేపీ క‌లిసి పోటీ చేయాల‌ని, అలా జ‌రుగుతుంద‌ని మొద‌టి నుంచి య‌శ‌స్వి నమ్మకంగా ఉన్నారు. అదే చెబుతూ వచ్చారు.  తెలుగుదేశం ఒంట‌రిగా బ‌రిలోకి దిగితే 110 నుంచి 120 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో విజ‌యం సాధిస్తుంద‌నీ.. కానీ, వైసీపీని ఏపీలో పూర్తిగా పాతాళానికి తొక్కేయాలంటే తెలుగుదేశం, జ‌న‌సేన క‌ల‌వాల‌ని, దీనికి  బీజేపీ కూడా తోడైతే  వైసీపీకి 10 నుంచి 14 స్థానాల‌కంటే ఎక్కువ రావ‌ని ఎన్నిక‌లకు ఐదారు నెలల ముందే య‌శ‌స్వి అంచ‌నా వేశారు.ఆయన అంచనాకు తగ్గట్టుగానే ఏపీలో తెలుగుదేశం, జ‌న‌సేన‌, బీజేపీ క‌లిసి పోటీ చేశాయి. వైసీపీ కేవ‌లం 11 స్థానాల‌కే ప‌రిమితం అయింది. అయితే, య‌శ‌స్వి ఓ ఇంట‌ర్వ్యూలో మ‌రో విష‌యాన్నికూడా చెప్పుకొచ్చారు. ఎన్నిక‌ల త‌రువాత వైసీపీ క‌నుమ‌రుగ‌వుతుంద‌ని, వైసీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిపోతార‌ని అన్నారు. వైసీపీ నేత‌ల తీరు చూస్తుంటే ఆ ప్ర‌క్రియ‌ కూడా ప్రారంభ‌మైన‌ట్లే క‌నిపిస్తోంది. మొత్తానికి ఏపీలో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అరాచ‌క పాల‌న‌కు ఎదురొడ్డి పోరాడిన వారిలో  టీడీపీ ఎన్ఆర్ఐ  నాయకుడు య‌శ‌స్వి ముందు వరుసలో ఉంటారనడంలో సందేహం లేదు.  తెలుగుదేశం పార్టీ పట్ల యశస్వి బొద్దులూరి అంకిత భావం, పార్టీ కోసం ఆయన చేసిన కృషి, పడిన శ్రమను పార్టీ అధిష్ఠానం పలు సందర్భాలలో ప్రత్యేకంగా ప్రస్తావించి ప్రశంసించింది. చంద్రబాబు సంస్కరణలు, దార్శనికత కారణంగా ఉన్నత స్థానాలకు ఎదిగిన యశస్విలాంటి యువత పార్టీకి అవసరమైన ప్రతి సందర్భంలోనూ ముందుకు వచ్చి పని చేయడం ముదావహం.

బీజేపీలోకి దూకడానికి అవినాష్‌రెడ్డి రెడీ!

‘అనుబంధం, ఆత్మీయత అంతా ఒక బూటకం.. ఆత్మతృప్తికై మనుషులు ఆడుకునే నాటకం.. వింత నాటకం..’ అని ఒక సినిమా కవి పాట పాడినట్టు... వైఎస్ జగన్, వైఎస్ అవినాష్ రెడ్డి మధ్య వున్న ఆత్మీయత, అనుబంధాలు ముగింపు దశకు చేరుకున్నాయి. ‘చిన్న పిల్లోడు.. అమాయకుడు’ అని సర్టిఫికెట్ ఇచ్చి, బాబాయ్ మర్డర్ కేసు నుంచి అవినాష్ రెడ్డిని జగన్ తప్పిస్తూ వచ్చారు. ఇప్పుడు అదే అవినాష్ రెడ్డి జగనన్నకు జలక్ ఇవ్వడానికి రెడీ అయ్యారు. మంచి ముహూర్తం చూసుకుని బీజేపీలోకి జంప్ అవ్వడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు వుండరని అంటూ వుంటారు.. శాశ్వత బంధువులు కూడా వుండరని అవినాష్‌రెడ్డి మరోసారి ప్రూవ్ చేయబోతున్నారు. తన ఎంపీ సీటు కోసం సొంత బాబాయ్‌ వివేకానందరెడ్డి గొడ్డలితో ముద్దాడి పైకి పంపించాడనే ఆరోపణలు అవినాష్ రెడ్డి మీద వున్నాయి. అలాంటిది తన స్వార్థం కోసం జగన్నన్నకు జలక్ ఇవ్వకుండా ఎలా వుంటారు? అవినాష్ రెడ్డి కోసం జగన్ ఎన్నో త్యాగాలు చేశారు. ప్రజలకు దూరమయ్యారు.. కుటుంబానికి దూరమయ్యారు.. ఎన్నో నిందలు భరించారు.. కానీ, నీ త్యాగం నీదే.. నా దారి నాదే అంటూ జగనన్నకి అవినాష్ రెడ్డి నమ్మక ద్రోహం రుచి చూపించబోతున్నారు. తమ్ముడూ తమ్ముడూ అని పాకులాడిన జగన్‌కి తన కుమ్ముడు ఏ రేంజ్‌లో వుంటుందో అవినాష్ అనుభవంలోకి తీసుకురాబోతున్నారు. లెక్కప్రకారం ఈసారి ఎన్నికలలో కడప ఎంపీ నియోజకవర్గం నుంచి అవినాష్‌రెడ్డి ఖాయంగా ఓడిపోవాల్సినవాడే. షర్మిల పుణ్యామా అని ఓట్లు చీలిపోయి టీడీపీ అభ్యర్థి ఓడిపోయాడు. షర్మిలే కనుక పోటీ చేయకుంటే అవినాష్ రెడ్డి ఈసారి ఎంపీగా గెలిచేవాడు కాదు. అయినప్పటికీ, అవినాష్ రెడ్డి జైలుకు వెళ్ళకుండా ఎంపీ సీటు కాపాడలేదు. ఎందుకంటే, ఇంతకాలం అవినాష్‌రెడ్డిని కాపాడుకుంటూ వచ్చిన జగనన్న రెక్కలు తెగిన పక్షిలా పక్కన పడి వున్నాడు. ఇక జగన్ని నమ్ముకుంటే, తన పని శ్రీకృష్ణ జన్మస్థానమే అని అర్థం చేసుకున్న అవినాష్, తనను తాను కాపాడుకునే ఆత్మరక్షణ మార్గాలను వెతుక్కోవడం ప్రారంభించారు. అందులో చాలా ముఖ్యమైనది బీజేపీ తీర్థం పుచ్చుకోవడం.  ఈసారి ఎన్నికలలో వైసీపీ మొత్తం నాలుగు ఎంపీ స్థానాల్లో గెలిచింది. రాజంపేట నుంచి పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, తిరుపతి నుంచి డాక్టర్ మద్దిల గురుమూర్తి, అరకు నుంచి డాక్టర్ గుమ్మా తనూజారాణి వైసీపీ అభ్యర్థులుగా గెలిచారు. నిన్నటి వరకు జగనన్నకి జై కొట్టిన ఎంపీ మిథున్ రెడ్డి కేంద్రంలో తనకున్న పరిచయాలను ఉపయోగించుకుని తనతోపాటు తిరుపతి, అరకు ఎంపీలను కూడా బీజేపీలోకి తీసుకెళ్ళడానికి సిద్ధంగా వున్నారు. ఇక అవినాష్ రెడ్డి స్వయానా జగన్‌కి తమ్ముడు కాబట్టి, రాముడి వెంట లక్ష్మణుడిలా వుంటారని అవినాష్ రెడ్డి జోలికి రాలేదు. అయితే, నేను కూడా మీవెంటే బీజేపీలోకి వస్తానని అవినాష్ రెడ్డే స్వయంగా మిథు‌న్ రెడ్డిని రిక్వెస్ట్ చేశారని, ఈ విషయాన్ని మిథున్ రెడ్డి బీజేపీ అగ్రనాయకత్వం దృష్టికి తీసుకెళ్ళడంతో, అక్కడ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు సమాచారం. జాతీయ స్థాయిలో తన పార్టీని మోయడానికి ‘ఆ నలుగురు’ ఎంపీలైనా వున్నారని ఊరట చెందుతున్న జగన్మోహన్‌రెడ్డి వెంట ఇప్పుడు ‘ఆ నలుగురు’ కూడా వుండరని అర్థమైపోయింది. ఇప్పటికే మిగతా ముగ్గురూ జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి ఫోన్ వెళ్తే లిఫ్ట్ చేయడం లేదన్నట్టు తెలుస్తోంది. ఇక తమ్ముడు అవినాష్ మాత్రం.. ఇంతకంటే నాకు వేరే మార్గం లేదు జగనన్నా అని క్లియర్‌గా చెప్పినట్టు సమాచారం. కాకపోతే, అవినాష్‌రెడ్డిని పార్టీలోకి తీసుకుని, అతనికి వివేకా మర్డర్ కేసు నుంచి రక్షణ కల్పించడం వల్ల భారతీయ జనతా పార్టీ ప్రజల నుంచి విమర్శలు ఎదుర్కోక తప్పదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ఎవరిదీ ‘ఓపెన్ టాక్ సర్వే’?

ఇప్పుడొకసారి ఆంధ్రప్రదేశ్ ఎగ్జిట్ పోల్స్ గురించి ఒక టాపిక్ ప్రస్తావనకు తెస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి... జగన్ పార్టీ ఓడిపోయింది.. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. 12న కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం కూడా చేయబోతోంది. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ ఎగ్జిట్ పోల్ సర్వే గురించి ప్రస్తావన అవసరమా అనే సందేహం రావచ్చు.. కానీ ఇప్పుడైనా ఈ ప్రస్తావన తీసుకురాకపోతే, నిజమైన ప్రతిభకు గౌరవం దక్కనట్టే అవుతుంది.  జూన్ 1న ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. మొత్తం 40 ఎగ్జిట్ పోల్ సర్వేలు వెలువడితే, వాటిలో 35 సర్వేలు తెలుగుదేశం కూటమి అధికారంలోకి రాబోతోందని చెబితే, 5 సర్వేలు వైసీపీ అధికారంలోకి రాబోతోందని చెప్పాయి. కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పిన కేకే సర్వే, వైసీపీ అధికారంలోకి వస్తుందని చెప్పిన ఆరా మస్తాన్ సర్వే గురించి రాష్ట్ర వ్యాప్తంగా భారీ స్థాయిలో చర్చ జరిగింది. ఎందుకంటే, ఆరా సర్వే జగన్ పార్టీకి చెందిన ప్రముఖ చానల్లో ముఖాముఖి రూపంలో ప్రసారమైతే, కేకే సర్వే ఇంకో ప్రముఖ ఛానల్లో ప్రెజెంటేషన్ రూపంలో ప్రసారమైంది. అందుకే, ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత కేకే సర్వేని ఆకాశానికి ఎత్తేస్తే, ఆరా మస్తాన్ సర్వే మీద సెటైర్లు వేస్తూ ఛానళ్ళలో, సోషల్ మీడియాలో వేలాది కథనాలు వెలువడ్డాయి. ఈ హడావిడిలో ఒక సర్వేని మాత్రం ఎవరూ పట్టించుకోలేదు. ఈ సర్వే కూటమి 164 స్థానాల్లో గెలుస్తుందని, వైసీపీ 11 స్థానాల్లో మాత్రమే గెలుస్తుందని చెప్పింది. ఆ సర్వే పేరు ‘ఓపెన్ టాక్ సర్వే’. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత కూటమి వస్తుందని చెప్పిన సర్వేల సంస్థలు ‘మేం ముందే చెప్పాం’ అని జబ్బలు చరుచుకుంటే, వైసీపీ వస్తుందని సర్వేలు ఇచ్చిన సంస్థలు ‘ఎక్కడో ఏదో తేడా జరిగింది’ అని సమర్థించుకున్నాయి. అయితే, నూటికి నూరుశాతం కరెక్ట్ సర్వే ఫలితాలను ఇచ్చిన ‘ఓపెన్ టాక్ సర్వే’ సంస్థ ప్రతినిధులు ఎవరూ బయట కనిపించలేదు. పని చెయ్.. ఫలితాన్ని ఆశించకు అనే కర్మసిద్ధాంతాన్ని నమ్మినట్టున్నారు.. అందుకే, వాళ్ళెవరూ బయట కనిపించలేదు. అయినప్పటికీ ఆ అజ్ఞాత సంస్థకు, ఆ సంస్థ అజ్ఞాత ప్రతినిధులకు అభినందనలు.

నరేంద్ర మోడీ మంత్రివర్గం సమగ్ర స్వరూపం

భారత ప్రధానిగా నరేంద్ర మోడీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. జవహర్లాల్ నెహ్రూ రికార్డును సమం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన చేత ప్రమాణం స్వీకారం చేయించారు. ఆ తర్వాత మోడీ మంత్రివర్గ సహచరులు 71 మంది చేత కూడా ప్రమాణ స్వీకారం చేయించారు. 71 మంది మంత్రులలో 30 మంది కేబినెట్ హోదా వున్న మంత్రులు. 5 మంది ఇండిపెండెంట్ ఛార్జ్ వున్న మంత్రులు. 36 మంది సహాయ మంత్రులు. ఏ మంత్రికి ఏ పోర్టుఫోలియో ఇచ్చేదీ తర్వాత ప్రకటిస్తారు.  కేంద్ర మంత్రివర్గంలో 27 మంది ఓబీసీలు వున్నారు. 10 మంది ఎస్సీలు, ఐదుగురు ఎస్టీలు, ఐదుగురు మైనారిటీ వర్గాలకు చెందినవారు ఉన్నారు. అలాగే 18 మంది సీనియర్ మంత్రులు ప్రధాన మంత్రిత్వ శాఖల బాధ్యతలను నిర్వర్తించనున్నారు.  బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, హర్యానా మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్, 6 సార్లు ఎంపీగా గెలిచిన జుయల్ ఓరం, బీజేపీ గుజరాత్ అధ్యక్షుడు సీఆర్ పాటిల్ మోదీ కేబినెట్‌లో కొత్తగా చేరారు. ఉత్తరప్రదేశ్ సర్కారులో మంత్రిగా ఉన్న జితిన్ ప్రసాద్, కర్ణాటక మాజీ మంత్రి సోమన్న సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇంకా వీరితో పాటు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, జైశంకర్, నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్, ప్రహ్లాద్ జోషి, జ్యోతిరాదిత్య సింధియా, అశ్వినీ వైష్ణవ్, కిరణ్ రిజిజు, ధర్మేంద్ర ప్రధాన్, సర్బానంద సింగ్, భూపేందర్ రాజ్ యాదవ్, షెకావత్, కిషన్ రెడ్డి, బండి సంజయ్, ప్రమాణ స్వీకారం చేసిన వారిలో ఉన్నారు. ఎన్డీయే మిత్రపక్ష పార్టీల నుంచి మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారిలో ఎల్‌జేపీ (రామ్‌విలాస్‌ పాశ్వాన్) అధినేత చిరాగ్‌ పాశ్వాన్‌, జేడీ (ఎస్‌) నాయకుడు కుమారస్వామి, హిందుస్థాన్‌ అవామ్‌ మోర్చా అధ్యక్షుడు జితన్‌ రామ్‌ మాంఝీ, జేడీ (యూ) నాయకుడు రాజీవ్‌ రంజన్‌ అకా లలన్‌ సింగ్‌, తెలుగుదేశం పార్లమెంట్ సభ్యుడు కింజరాపు రామ్మోహన్ నాయుడు కేబినెట్ హోదా కలిగిన మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇంకా, జితేంద్ర సింగ్, రాందాస్ అథవాలే, నిత్యానందరాయ్, అర్జున్‌రామ్ మేఘ్వాల్, శ్రీపాద్ నాయక్, రావ్ ఇంద్రజిత్ సింగ్, క్రిషన్ పాల్ గుర్జార్ సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. బుల్దానా పార్లమెంట్ సభ్యుడు ప్రతాప్‌రావు జాదవ్‌, తెలుగుదేశం పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్‌, ఆర్ఎల్‌డీ చీఫ్ చీఫ్ జయంత్ చౌదరి, అప్నాదళ్ ఎంపీ అనుప్రియా పటేల్ కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి మొత్తం ఐదుగురు కేంద్రమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు, గుంటూరు ఎంపీ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, నరసాపురం ఎంపీ శ్రీనివాస వర్మ ప్రమాణస్వీకారం చేశారు. తెలంగాణ రాష్ట్రం నుంచి బీజేపీ ఎంపీలు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. మోడీ ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరయ్యారు. రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా వున్న తనకు ఈ కార్యక్రమానికి హాజరవడం తన బాధ్యత అని ఆయన అన్నారు. అయితే తృణమూల్ కాంగ్రెస్, వామపక్షాలకు చెందిన పలువురు ప్రతిపక్ష పార్టీల నేతలకు ఆహ్వానాలు అందినప్పటికీ వారి హాజరు కాలేదు. మోడీ ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవానికి ఏడు దేశాల అధినేతల అతిథులుగా హాజరయ్యారు. బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవులు, భూటాన్, నేపాల్, మారిషస్, ఫిలిప్పీన్ దేశాల నుంచి ఆయా దేశాల నాయకులు వచ్చారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవంలో 8,000 మంది అతిథులు పాల్గొన్నారని అంచనా వేస్తున్నారు. 

బాబు కేబినెట్ కూర్పు కొలిక్కి! జనసేన చేరేనా?

ఏపీలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు ముహూరం ఫిక్సైంది. బుధవారం (మే12)న చంద్రబాబు  తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణం చేయనున్నారు. తన కేబినెట్  కూర్పుపై చంద్రబాబు ఇప్పటికే కసరత్తు మొదలెట్టేశారు.  ఢిల్లీలో ఎన్డీయేతో చర్చలు, కేంద్ర క్యాబినెట్‌పై కసరత్తులో ఓ వైపు క్షణం తీరిక లేకుండా ఉన్నప్పటికీ చంద్రబాబు  ఈనాడు అధినేత రామోజీరావు కు నివాళులర్పించి, ఆయన అంత్యక్రియలకు హాజరై పాడె కూడా మోశారు. ఇంతటి తీరిక లేని సమయంలోనూ చంద్రబాబు  తన క్యాబినెట్ కూర్పుపై కసరత్తు చేసినట్లు చెబుతున్నారు.    ఇప్పటికే తన కేబినెట్ లో ఎవరెవరికి ఏ శాఖ కేటాయించాలన్నదానిపై ఒక నిర్ణయానికి వచ్చిన చంద్రబాబు.. జనసేన కేబినెట్ లో చేరుతుందా? లేదా? అన్న విషయంపై క్లారిటీ కోసం ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే కేంద్రంలో మోడీ కేబినెట్ లో చేరేందుకు జనసేన పెద్దగా ఆసక్తి చూపలేదు. కేంద్ర కేబినెట్ లో చేరకుండా దూరంగా ఉంది. అదే విధంగా ఏపీలో కూడా మంత్రివర్గంలో చేరే అవకాశాలు లేవన్న చర్చ కూడా జరుగుతోంది. ఒక ఆంగ్ల చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏపీలో ప్రభుత్వంలో చేరే విషయంలో ఆసక్తి ఉందని జనసేనాని చెప్పినప్పటికీ, గత కొద్ది రోజులుగా జనసేనలో విస్తృతంగా జరుగుతున్నచర్చ మాత్రం జనసేన రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర పోషించేందుకే మొగ్గు చూపుతోందని పించేలా ఉంది.  దీంతో ప్రభుత్వంలో చేరే విషయంపై జనసేనాని నుంచి క్లారిటీ వస్తే తప్ప ఆ పార్టీకి చంద్రబాబు కేబినెట్ లో ఎన్ని బెర్తులు దక్కుతాయి అన్న విషయంపై స్పష్టత రాదు.  ఇక బీజేపీకి చంద్రబాబు కేబినెట్ లో రెండు బెర్తులు దక్కడం ఖాయమని తెలుస్తోంది.  చంద్రబాబు కేబినెట్ లో ఉత్తరాంధ్ర నుంచి ముగ్గురికి అవకాశం దక్కు అవకాశం ఉంది. జిల్లాకు ఒకటి చొప్పున శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం లకు చెందిన తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఒక్కొక్కరికి చంద్రబాబు క్యాబినెట్ లో స్థానం లభించనున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇక తూర్పు గోదావరి జిల్లా నుంచి ఇద్దరు, పశ్చిమగోదావరి జిల్లా నుంచి ముగ్గురికి  చంద్రబాబు కేబినెట్ లో  స్థానం దక్కుతుందని చెబుతున్నారు. అదే విధంగా కృష్ణా , గుంటూరు జిల్లాల నుంచి ఇద్దరిద్దరు చొప్పున చంద్రబాబు కేబినెట్ లో ఉంటారని అంటున్నారు. అదే విధంగా ప్రకాశం జిల్లా నుంచి ఒకరికి, నెల్లూరు జిల్లా నుంచి ఒకరు లేక ఇద్దరు చిత్తూరు నుంచి ఒకరికి చంద్రబాబు తన కేబినెట్ లో చోటు కల్పిస్తారని చెబుతున్నారు. ఇక కడప జిల్లా నుంచి మాధవీరెడ్డికి బెర్త్ ఖాయమని చెబుతున్నారు. ఇక కర్నూలు జిల్లా నుంచి కూడా ఇద్దరికి చంద్రబాబు కేబినెట్ లో స్థానం దక్కే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే జనసేన కూడా ప్రభుత్వంలో చేరే పరిస్థితి వస్తే మాత్రం తెలుగుదేశం మూడు బెర్తులను త్యాగం చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు.  ఇప్పటి వరకూ జనసేన వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు జగన్ మళ్లీ రాజకీయంగా తలెత్తకుండా చేయాలంటే, అలాగే జనసేన సొంతంగా రాష్ట్రంలో బలోపేతం కావాలంటే కేబినెట్ లో చేరకుండా ఉండటమే మేలని జనసేనాని భావిస్తున్నారు. ఇప్పుడో ఇహనో ఈ విషయంలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.  

జగన్ కు అమ్మ విజయమ్మ ఓదార్పు

ఎన్నికలలో గతంలో ఎవరికీ దక్కనంత ఘోరమైన ఓటమి ఈ సారి జగన్ నాయకత్వంలోని వైసీపీకి దక్కింది. కనీసం ప్రతిపక్షహోదాకి కూడా నోచుకోని గొప్ప పరాజయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయనకు కట్టబెట్టారు. ఒక్క చాన్స్ అంటూ 2019 ఎన్నికలలో జగన్ అధికారంలోకి రావడానికి దోహదపడిన అనేక అంశాలలో ఆయన చేపట్టిన ఓదార్పు యాత్ర కూడా ఒకటి. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణాన్ని తట్టుకోలేని గుండె ఆగి మరణించిన వారి కుటుంబాలను పరామర్శించడం కోసం ఆయన చేపట్టిన ఓదార్పు యాత్ర సుదీర్ఘంగా సాగింది. మందీ మార్బలంతో ఆయన ఆ యాత్రను విడతల వారీగా ఏళ్ల తరబడి కొనసాగించారు. సరే అది పక్కన పెడితే.. 2014 ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయం తరువాత జగన్ కు సొంత పార్టీ నుంచే అండ కరవైంది. నిన్న మొన్నటి దాకా వంధిమాగధులుగా మెలిగిన కీలక మంత్రులు, నేతలు సైతం ఇప్పుడు ఓటమికి పూర్తి బాధ్యత జగన్ దే అంటూ మీడియా ముందుకు వస్తున్నారు. మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్ ఇలా ఒకరి తరువాత ఒకరు వచ్చి జగన్ తప్పిదాలను ఎత్తి చూపుతూ, పార్టీ ఘోర పరాజయానికి ఆయనే కర్త, కర్మ, క్రియ అంటూ నిందిస్తున్నారు.  ఈ తరుణంలో తల్లి విజయమ్మ జగన్ కోసం ఆయన ఇంటికి వచ్చి ఒకింత ఓదార్పు ఇచ్చారు. పోలింగ్ కు సరిగ్గా ఒక్క రోజు ముందు తల్లి విజయమ్మ తన కుమార్తెకు మద్దతు పలుకుతూ అమెరికా నుంచి ఓ వీడియో సందేశం పంపిన సంగతి తెలిసిందే. దీంతో కన్న తల్లి కూడా జగన్ కు మద్దతుగా నిలవడం లేదని పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయం తరువాత.. తల్లి మనసు ఆగలేదు. ఆమె అమెరికా పర్యటన ముగించుకుని నేరుగా జగన్ నివాసానికి చేరుకున్నారు.  కుమార్తెను గెలిపించమని వీడియో సందేశం ద్వారా పోలింగ్ ముందు రోజు కడప ప్రజలకు పిలుపునిచ్చిన విజయమ్మ.. ఆ సందర్భంగా కుమారుడి గురించి ఒక్కటంటే ఒక్క మాట కూడా మాట్లాడలేదు.  ఎన్నికల ముందు లండన్ వెళ్లిన విజయమ్మ, అక్కడ షర్మిల కొడుకు రాజారెడ్డి దగ్గర ఉన్నారు.   అయితే కుమారుడు ఘోరంగా పరాజయం పాలై ముఖ్యమంత్రి పదవి కోల్పోయి పుట్టెడు దుఖంతో ఉండటంతో తల్లిమనసు తల్లడిల్లి అమెరికా నుంచి నేరుగా కుమారుడి వద్దకు వెళ్లి ఓదార్పునిచ్చారు. 

ఏడుగురు మాజీ సీఎంలు ఇప్పుడు కేంద్ర మంత్రులు

కేంద్రంలో ముచ్చటగా మూడో సారి నరేంద్రమోడీ ప్రభుత్వం కొలువుదీరింది. మోడీ కేబినెట్ లో ఏడుగురు మాజీ ముఖ్యమంత్రులు ఉండటం విశేషం. ఆదివారం ప్రమాణ స్వీకారం చేసిన కేంద్ర మంత్రులలో ఏడుగురు మాజీ మంత్రులు ఉన్నారు. వారిలో కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్,  ఉత్తర ప్రదేశ్ మాజీ సీఎం రాజ్ నాథ్ సింగ్ ఉన్నారు. అలాగే హరియాణా మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, అసోం మాజీ సీఎం సర్బానంద సోనోవాల్ ఉన్నారు.  అలాగే బీహార్ మాజీ ముఖ్యమంత్రి జితన్ రాం మాంఝీ ఉణ్నారు. ఈ ఏడుగురు మాజీ సీఎంలలో ఐదుగురు బీజేపీకి చెందిన వారే కాగా మిగిలిన ఇద్దరూ ఎన్డీయే భాగస్వామ్య పక్షాలకు చెందిన వారు.  

పాకిస్థాన్ మరో ఓటమి.. ఆరుపరుగుల తేడాతో టీమ్ ఇండియా చేతిలో పరాజయం

ఐసీసీ మెగా టోర్నమెంట్లలో పాకిస్థాన్ పై విజయాల సంప్రదాయాన్ని భారత్ కొనసాగిస్తోంది. టి20 వరల్డ్ కప్ లో భాగంగా ఆదివారం (జూన్ 9)న పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో టీమ్ ఇండియా ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది.  ఐసీపీ టోర్నీలలో పాకిస్థాన్, టీమ్ ఇండియా మధ్య మ్యాచ్ అంటే అదో మహాసంగ్రామంగా, రెండు దేశాల మధ్య యుద్ధంగా క్రికెట్ అభిమానులు భావిస్తారు. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య యాషెస్ సిరీస్ కు మించి భారత్ పాక్ మధ్య మ్యాచ్ పై ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఆసక్తి కనబరుస్తారు. అటువంటి మ్యాచ్ లో   టీమిండియా బౌలర్లు అద్భుత ప్రదర్శన చేసి పాక్‍ను కుప్పకూల్చారు. స్వల్ప స్కోరును కాపాడి జట్టును గెలిపించారు. బ్యాటింగ్‍కు కష్టంగా ఉన్న పిచ్‍పై సాగిన ఈ లో స్కోరింగ్ గేమ్‍లో టీమ్ ఇండియా గొప్పగా పోరాడి అద్భుత విజయం సాధించింది.   న్యూయార్క్‌లోని నసావూ స్టేడియంలో జరిగిన మ్యాచ్‍లో టీమిండియా బౌలర్లు సమష్టిగా సత్తా చాటి పాకిస్థాన్‍ను మట్టికరిపించారు.  భారత బ్యాటర్లు విఫలమై 119 స్కోరుకే టీమ్ ఇండియా చాపచుట్టేస్తే.. ఆ స్వల్ప స్కోరును పాకిస్థాన్ ఛేదించే అవకాశం ఇవ్వకుండా బౌలర్లు జట్టకు విజయాన్ని అందించారు.  ఓటమి తప్పదనుకున్న దశ నుంచి జట్టు గెలుపు సంబరాలు చేసుకునేలా చేశారు. భారత స్టార్ పేసర్ జస్‍ప్రీత్ బుమ్రా 4 ఓవర్లలో కేవలం 14 పరుగులే ఇచ్చి మూడు వికెట్లతో సత్తా చాటాడు. 15వ ఓవర్, 19వ ఓవర్లో చెరో మూడు పరుగులు మాత్రమే ఇచ్చి మ్యాచ్‍ను మలుపుతిప్పాడు. టీమిండియా గెలుపులో ప్రధాన పాత్ర పోషించాడు  హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు పడగొట్టాడు. అర్షదీప్ సింగ్, అక్షర్ పటేల్ చెరో వికెట్ తీశారు. మహమ్మద్ సిరాజ్ వికెట్ తీయకున్నా 4 ఓవర్లలో 19 పరుగులే ఇచ్చి రాణించాడు. భారత బౌలర్ల విజృంభణతో పాకిస్థాన్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 113 పరుగులే చేసి పరాజయం పాలైంది. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ (13)ను ఐదో ఓవర్లో ఔట్ చేసి భారత్‍కు బ్రేక్ ఇచ్చాడు బుమ్రా. అయితే, మరో ఓపెనర్ మహమ్మద్ రిజ్వాన్ (31) నిలకడగా ఆడాడు. ఉస్మాన్ ఖాన్ (13)ను అక్షర్ పటేల్ పదో ఓవర్లో ఔట్ చేయగా.. ధాటిగా ఆడిన ఫకర్ జమాన్ (13)ను పాండ్యా పెవిలియన్‍కు పంపాడు. నిలకడగా ఆడిన ఓపెనర్ మహమ్మద్ రిజ్వాన్‍ను 15వ ఓవర్లో బుమ్రా బౌల్డ్ చేశాడు. దీంతో మ్యాచ్ మలుపు తిరిగింది. చివరి ఐదు ఓవర్లలో గెలిచేందుకు పాకిస్థాన్ 37 పరుగులు చేయాల్సి వచ్చింది. ఆ తరుణంలో భారత బౌలర్లు మళ్లీ విజృభించారు. 16వ ఓవర్లో అక్షర్ పటేల్ రెండు పరుగులే ఇచ్చాడు. దీంతో పాక్ ఒత్తిడిలో కూరుకుపోయింది. 17వ ఓవర్లో షాదాబ్ ఖాన్ (4)ను హార్దిక్ ఔట్ చేశాడు. జస్‍ప్రీత్ బుమ్రా 19వ ఓవర్లో కేవలం 3 పరుగులే ఇచ్చాడు. ఇఫ్తికార్ (5)ను ఔట్ చేశాడు. దీంతో పాక్ ఓటమి అంచులకు చేరింది. చివరి ఓవర్లో పాక్‍కు 18 పరుగులు అవసరమయ్యాయి. అర్షదీప్ వేసిన ఆఖరి ఓవర్లో 11 పరుగులు రాగా.. 6 రన్స్ తేడాతో భారత్ గెలిచింది. చివరి ఓవర్ తొలి బంతికి ఇమాద్ వసీం (15)ను అర్షదీప్ ఔట్ చేయగా.. నాలుగు, ఐదు బంతులకు ఫోర్లతో నసీమ్ షా (10 నాటౌట్) కాస్త టెన్షన్ పెట్టాడు. అయితే, చివరి బంతిని అర్షదీప్ కట్టడి చేశాడు. దీంతో టీమిండియా విజయం సాధించింది. అంతకు ముందు  తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 19 ఓవర్లలో 119 పరుగుకు ఆలౌటైంది.  రిషబ్ పంత్ 31 బంతుల్లో 42 పరుగులు (ఆరు ఫోర్లు) రాణించాడు.   అక్షర్ పటేల్ కూడా 18 బంతుల్లో 20 పరుగులతో పర్వాలేదనిపించాడు. పంత్, అక్షర్ కీలకమైన భాగస్వామ్యం నెలకొల్పారు. వీరిరువురూ మినహా మిగిలిన బ్యాటర్లు విఫలమయ్యారు.   విరాట్ కోహ్లీ (4), రోహిత్ శర్మ (13), సూర్యకుమార్ యాదవ్ (7), శివమ్ దూబే (3) త్వరగా ఔటయ్యారు. హార్దిక్ పాండ్యా (7) ఎక్కువ సేపు నిలువకపోగా.. రవీంద్ర జడేజా (0) డకౌట్ అయ్యాడు. చివర్లో అర్షదీప్ సింగ్ (9), మహమ్మద్ సిరాజ్ (7 నాటౌట్) విలువైన పరుగులు చేశారు. పాకిస్థాన్ పేసర్లు నసీమ్ షా, హరీస్ రవూఫ్ చెరో మూడు వికెట్లు తీసుకోగా.. మహమ్మద్ ఆమిర్ రెండు తీశాడు. షహీన్ అఫ్రిది ఓ వికెట్ పడగొట్టాడు. ఆరంభంలో వాన వల్ల మ్యాచ్ ఆలస్యంగా ఆరంభమైంది. అయితే, పూర్తి ఆట సాధ్యమైంది.  ఐసీసీ టోర్నీల్లో పాకిస్థాన్‍పై భారత్ ఆధిపత్యం కొనసాగింది. టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో ఇప్పటి వరకు ఇరు జట్లు 8సార్లు తలపడగా.. భారత్ 7సార్లు విజయం సాధించింది.

కేంద్రమంత్రిగా పెమ్మసాని ప్రమాణం

కేంద్రమంత్రిగా గుంటూరు పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. తొలిసారిగా పార్లమెంట్ సభ్యుడిగా గెలిచిన పెమ్మసానికి కేంద్ర మంత్రి పదవి దక్కడం విశేషం.  పెమ్మసాని చంద్రశేఖర్ తండ్రి సాంబశివరావు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవారు. పెమ్మసాని చంద్రశేఖర్ ఎంసెట్‌లో 27వ ర్యాంక్ సాధించి, ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదివారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదవడానికి అమెరికా వెళ్ళిన ఆయన అక్కడ కూడా అత్యధిక మార్కులు సాధించారు. అమెరికాలో డాక్టర్‌గా పనిచేసిన ఆయన అతి తక్కువకాలంలోనే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. అమెరికాలో లైసెన్సింగ్ ఎగ్జామ్స్.కి హాజరయ్యే విద్యార్థుల లకోసం ‘యూ వరల్డ్’ పేరుతో ఆన్‌లైన్ శిక్షణ సంస్థను స్థాపించి ఘన విజయం సాధించారు. తన సంస్థను వేల కోట్ల రూపాయల విలువైన సంస్థగా ఎదిగేలా చేశారు.  మొదటి నుంచీ తెలుగుదేశం పార్టీతో అనుబంధం వున్న పెమ్మసాని చంద్రశేఖర్ 2014లోనే నరసరావుపేట పార్లమెంట్ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేయాల్సింది. అయితే రాజకీయ పరిణామాల నేపథ్యంలో రాయపాటి సాంబశివరావు పోటీ చేశారు. 2024 ఎన్నికలలో పెమ్మసాని గుంటూరు స్థానం నుంచి భారీ మెజారిటీతో విజయం సాధించారు.  పెమ్మసాని పుట్టిన ఊరు బుర్రిపాలెం. తల్లిదండ్రులు సువర్చల, పెమ్మసాని సాంబశివరావు, భార్య డాక్టర్ రత్నశ్రీ, కుమారుడు పెమ్మసాని అభినవ్, కుమార్తె పెమ్మసాని సహస్ర.

మూడోసారి ప్రధానిగా మోదీ మార్కు కేబినెట్

భారత ప్రధానిగా ఆదివారం నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు.  మాజీ ప్రధాని నెహ్రూ వరుసగా మూడు పర్యాయాలు ప్రధాని పదవి అధిరోహించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి సామాన్యుల నుంచి అతిరథ మహారథులు, వివిధ దేశాధినేతలు హాజరయ్యారు. అయితే మోదీ మంత్రి వర్గంలో ఎవరికి ఏయే పదువులు ఇస్తారు అనే విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది.  ఈ విషయంపై ఇప్పటికే ఎన్​డీఏ మిత్రపక్ష నేతలతో బీజేపీ నేతలు సంప్రదింపులు జరిపి లిస్ట్ ఫైనలైజ్ చేశారు. . ఈ కార్యక్రమానికి సామాన్యుల నుంచి అతిరథ మహారథులు, వివిధ దేశాధినేతలు హాజరయ్యారు. మోదీతోపాటు పలువురు ఎంపీలతో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రమాణం చేయించారు. సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిని విజయతీరాలకు చేర్చిన నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయన చేత ప్రమాణం చేయించారు. దీంతో భారత తొలి ప్రధాని జవహర్‌ లాల్‌ నెహ్రూ రికార్డును మోదీ సమం చేశారు. దిల్లీలోని రాష్ట్రపతి భవన్​లో ఆదివారం సాయంత్రం అంగరంగా వైభవంగా జరిగిన పట్టాభిషేక వేడుకలో మోదీతోపాటు పలువురు నేతలు కూడా ప్రమాణస్వీకారం చేశారు. 2014లో మోదీ తొలిసారి ప్రధానిగా ఎన్నికయ్యారు. 2019లోనూ విజయం సాధించి తిరుగులేని నేతగా ఎదిగారు. 2024 ఎన్నికల్లోనూ ఎన్డీయేకు 293 స్థానాలు దక్కడంతో మళ్లీ ప్రధానిగా పగ్గాలు చేపట్టే అవకాశం లభించింది. ప్రధాని ప్రమాణస్వీకార మహోత్సవానికి తెలుగు రాష్ట్రాల నుంచి తెదేపా అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌ హాజరయ్యారు. ఈసారి ఐదుగురు తెలుగు ఎంపీలకు కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కింది. మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి దాదాపు 8వేల మంది దేశ, విదేశీ ప్రముఖులతో పాటు సార్క్‌ సభ్య దేశాల నేతలు హాజరయ్యారు. శ్రీలంక అధ్యక్షుడు రణిల్‌ విక్రమ్‌ సింఘే, మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు, నేపాల్‌ ప్రధాని పుష్ప కమల్‌ దహల్‌ ప్రచండ, మారిషస్‌ ప్రధాని ప్రవింద్‌ కుమార్‌, భూటాన్‌ ప్రధాని తోబ్గే, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, సీషెల్స్ ఉపాధ్యక్షుడు అహ్మద్ అఫీఫ్ విచ్చేశారు.మోదీ ప్రమాణస్వీకారోత్సవ వేడుక వేళ దిల్లీవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు అధికారులు. స్థానిక పోలీసులతోపాటు కీలక ప్రాంతాల్లో పారామిలిటరీ బలగాలు, ఎన్‌ఎస్‌జీ కమాండోలు, డ్రోన్లు, స్నైపర్లను మోహరించారు. దిల్లీని రెండు రోజుల పాటు నో ఫ్లై జోన్‌గా ప్రకటించారు. రాష్ట్రపతి భవన్​ లోపల, బయట మూడు అంచెల భద్రతను ఏర్పాటు చేశారు.

భారత ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం

భారతదేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు. మోడీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి తెలుగు రాష్ట్రాల నుంచి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఈసారి ఐదుగురు తెలుగు రాష్ట్రాల ఎంపీలకు కేంద్ర మంత్రివర్గంలో స్థానం లభించింది. మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి దాదాపు 8 వేల మంది దేశ, విదేశ ప్రముఖులతోపాటు సార్క్ సభ్య దేశాల నేతలు హాజరయ్యారు. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, జేడీయూ అధినేత నితీష్ కుమార్, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ, సినీ నటుడు షారుక్ ఖాన్, రజనీకాంత్‌తోపాటు ఆధ్యాత్మికవేత్త చిన్నజీయర్ స్వామి, పలు పీఠాధిపతులు పాల్గొన్నారు.