చింతా పులుపూ రెండూ చచ్చిన వైసీపీ
posted on Jun 13, 2024 @ 10:19AM
పాతాళానికి పడిపోయినా.. మాదే పై చేయి అన్నట్లుంది వైసీపీ నాయకుడు విజయసాయి రెడ్డి తీరు. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలలో ఘోరంగా ఓడిపోయి, ఆ పార్టీ అగ్రనేతలంతా కకావికలైపోయారు. పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటి వరకూ జగన్ గొంతుకగా నోరెట్టుకు పడిపోయిన సజ్జల ఎక్కడున్నారో తెలియడం లేదు. ఆయన మాటా వినిపించడం లేదు. మనిషీ కనిపించడం లేదు.
ఇక బొత్స సత్యనారాయణ, కొట్టు వంటి నేతలు తమ పార్టీ అధినేత నిర్వాకం వల్లే ఘోరంగా ఓడిపోయామని చెప్పకనే చెప్పేస్తున్నారు. ఇప్పటి వరకూ ప్రత్యర్థుల పై బూతులతో విరుచుకుపడిన కొడాలి నాని.. తెలుగుదేశం వాళ్లు దాడులకు పాల్పడుతున్నారు బాబోయ్ అని బేల అరుపులు అరుస్తున్నారు. రోజా, వల్లభనేని వంశీ వంటి వారు పార్టీ పరాజయం తరువాత ఇప్పటి వరకూ గొంతు విప్పిన దాఖలాలు లేవు.
ఇప్పుడు నెల్లూరు లోక్ సభ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఘోర పరాజయం పాలైన విజయసాయి రెడ్డి మాత్రం మీడియా ముందుకు వచ్చి.. పార్లమెంటులో మేం చాలా బలంగా ఉన్నాం. మా దయాదాక్షిణ్యాలు ప్రధాని మోడీకి చాలా అవసరం అన్న లెవల్ లో మాట్లాడుతున్నారు. ఔను సరిగ్గా ఇవే మాటలు కాకపోయినా.. తెలుగుదేశం పార్టీకి పార్లమెంటులో ఉన్నంత బలం మాకూ ఉందనీ, మా అవసరం కూడా మోడీకి ఉందని నమ్మబలకడానికి ప్రయత్నిస్తున్నారు. వాస్తవానికి రాజ్యసభలో వైసీపీకి 11 మంది సభ్యులు ఉన్నారు. తాజాగా లోక్ సభకు ఎన్నికైన వారు నలుగురు. అంటే విజయసాయి ఇప్పుడు చెబుతున్నట్లు వైసీపీకి పార్లమెంటులో 15 మంది సభ్యులు ఉన్నారు. నిజమే. అందుకే మోడీ మా మాట కూడా వింటారనీ, విని తీరుతారని విజయసాయి రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం కు 16 మంది సభ్యులు ఉంటే మాకు 15 మంది ఉన్నారు. మేం ఏం తక్కువ అని డాంబికాలు పోతు న్నారు.
రాష్ట్రంలో అధికారం కోల్పోయాం కానీ, పార్లమెంటులో బలంగా ఉన్నాం అని చెప్పుకుంటున్నారు. ఇంత చెబుతున్న ఆయన మోడీ అడిగినా అడగకున్నా రాష్ట్ర, దేశ ప్రయోజనాల కోసం ఎన్డీయే ప్రవేశ పెట్టే అన్ని బిల్లులకూ బేషరతుగా మద్దతు ఇస్తామంటూ అన్యాపదేశంగా మోడీని శరణు వేడుతున్నారు. ఆదుకోండి స్వామీ అంటూ కాళ్లా వేళ్లా పడుతున్నారు. మేం మీతోనే ఉన్నాం గుర్తించండి అంటూ బతిమలాడుతున్నారు.