ఇద్దరూ ఇద్దరే.. దొందూ దొందే!
posted on Jun 12, 2024 @ 3:37PM
తెలుగు రాష్ట్రాలలో నెలల వ్యవధిలో కొత్త ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయి. గత ఏడాది డిసెంబర్ లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగగా ఆ ఎన్నికలలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ సర్కార్ పరాజయాన్ని మూటగట్టుకుని ప్రతిపక్షానికి పరిమితమైంది. ఆ తరువాత మేలో ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికలలో అధికార వైసీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవలసిన విషయం ఏమిటంటే.. చంద్రబాబుకు వ్యతిరేకంగా ఈ ఇద్దరూ 2019 ఎన్నికలలో సమష్టిగా పని చేశారు.
ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు ఓటమికి తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ చేయగలిగిందే కాకుండా చేయకూడనిది కూడా చేశారు. 2019 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఓటమి అనంతరం తెలంగాణ సీఎం హోదాలో చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చామంటూ వ్యాఖ్యానించారు. కేసీఆర్ చేసిన సాయానికి జగన్ క్విడ్ ప్రోకో కింది.. తెలంగాణ రాష్ట్రంలోని ఆంధ్రప్రదేశ్ ఆస్తులను అప్పనంగా రాసిచ్చేశారు. సెక్రటేరియెట్ లో ఏపీకి చెందిన బ్లాక్ లను ఏకపక్షంగా తెలంగాణకు ఇచ్చేశారు. ఇక గత ఏడాది డిసెంబర్ లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేసీఆర్ కోసం జగన్ నాగార్జున సాగర్ డ్యాం వద్ద హై డ్రామాకు తెరలేపి తెలంగాణ సెంటిమెంట్ ఆ రాష్ట్రంలో మరోసారి రగిల్చేందుకు ప్రయత్నించారు. సరే ఆ విషయాలన్నీ పక్కన పెడితే.. అటు కేసీఆర్, ఇటు జగన్ లో కామన్ గా ఒక నాయకుడికి ఉండకూడని లక్షణాలు ఎన్నో ఉన్నాయి.
అహంకారం, అతిశయం, ఎవరైనా తమ మాట వినాలే తప్ప తామెవరి మాటా వినం అన్న వైఖరి ఇరువురిలోనూ ఉన్నాయి. ప్రత్యర్థులను శత్రువులుగా చూడటం, ప్రత్యర్థి పార్టీలను అణచివేయడం, వీలైతే నామరూపాల్లేకుండా చేసేయాతన్న తత్వం ఇద్దరిలోనూ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. వారి ఈ తీరు, ఈ వైఖరి, ఈ లక్షణాల కారణంగానే తిరుగులేని విజయాలను అందుకున్న ఇరువురూ కూడా తిరిగి లేవలేనంతగా పతనమయ్యారు. ఇప్పుడు తమతమ రాష్ట్రాలలో రాజకీయ ఉనికి కోసం పాటుపడాల్సిన పరిస్థితికి చేరుకున్నారు. అధికారంలో ఉన్నన్నాళ్లూ తమంత వారే లేరని చుట్టూ తిరిగిన సొంత పార్టీ నాయకులే ఇప్పుడు వారిని ధిక్కరిస్తున్నారు. పార్టీ ఓటమికి బాధ్యత, కారణం మీరేనంటూ నిందిస్తున్నారు. తెలంగాణలో అధికారంలో ఉండగా చేసిన తప్పిదాలు, తప్పులకు సంబంధించిన కేసులు కేసీఆర్ ను ఉక్కిరి బిక్కిరి చేయనున్నాయి. రానున్న రోజులలో ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ కు కూడా అదే పరిస్థితి ఎదురు కానుంది.
అయితే ఆయనపై ఇప్పటికే అక్రమాస్తుల కేసు విచారణలో ఉంది. ఇహ ఇప్పటి వరకూ సీఎం పదవి పేరు చెప్పి విచారణ నుంచి మినహాయింపు పొందిన ఆయన ఇక ముందు ప్రతీవారం కోర్టు మెట్లు ఎక్కక తప్పక పోవచ్చు. మొత్తం మీద కేసీఆర్, జగన్ ఇరువురూ కూడా తమ అహంకారం కారణంగానే ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుని అధికారం కోల్పోయారు.