విడదల రజిని మీద శ్రీరెడ్డి బూతు పురాణం!

ఇంతకాలం తెలుగుదేశం, జనసేన నాయకుల మీద బూతుపురాణం విప్పుతూ, అందరూ చెవుల్లో దూది పెట్టుకోవాల్సిన పరిస్థితి తెచ్చిన అచ్చతెలుగు మహిళామణి శ్రీరెడ్డి ఇప్పుడు వైసీపీ నాయకుల మీద తన ప్రతాపం చూపిస్తోంది. ఈ ఎన్నికలలో తెలుగుదేశం కూటమి గెలిస్తే వైజాగ్ బీచ్‌లో బట్టలు విప్పుకుని తిరుగుతానని గతంలో శ్రీరెడ్డి ప్రకటించింది. కూటమి ఘన విజయం సాధించిన నేపథ్యంలో వైజాగ్ బీచ్‌ల్లో కుర్రకారు శ్రీరెడ్డి ఎప్పుడు వస్తుందా... తాను చెప్పిన విప్పుడు కార్యక్రమం ఎప్పుడు చేస్తుందా అని ఎదురుచూస్తున్నారు. కానీ, తాను చెప్పిన విప్పుడు కార్యక్రమాన్ని పక్కన పెట్టి, తన సొంత పార్టీ అయిన వైసీపీ నాయకుల మీదే బూతుపురాణం విప్పుతోంది. వైసీపీ ఓడిపోయినప్పటి నుంచి సోషల్ మీడియాలో శ్రీరెడ్డి కారం తిన్న కాకిలా అరుస్తోంది. ఎందుకు అరుస్తోందో, ఎవరిని తిడుతోందో ఎవరికీ అర్థంకాని పరిస్థితి. లేటెస్ట్.గా శ్రీరెడ్డి సైబరాబాద్ మొక్క విడదల రజినిని టార్గెట్ చేసింది. విడదల రజని మీద బూతులు ప్రయోగిస్తూ రెచ్చిపోయింది. వైసీపీ ఈ ఎన్నికలలో ఓడిపోవడానికి విడదల రజని కూడా ఒక కారణం అని శ్రీరెడ్డి ఆరోపించింది. విడదల రజనిని ఎంకరేజ్ చేయొద్దురా మొర్రో తాను ఎప్పటినుంచో చెబుతున్నా వినలేదని శ్రీరెడ్డి బాధపడిపోయింది. అక్కడితో ఆగకుండా.. విడదల రజనిని అనకూడని మాట కూడా అనేసింది.. విడదల రజిని ఒక ‘వ్యాంప్’ అనేసింది. వామ్మో... మరీ ఇంతలా తిట్టాల్సినంత మేటర్ ఈ ఇద్దరి మధ్య ఏం జరిగిందో ఏంటో! ఇప్పుడు శ్రీరెడ్డి బూతుపురాణం మీద విడదల రజిని ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి..

చెయ్యెత్తి డౌన్ డౌన్ ‘కొట్టు’ సత్యనారాయణా!

ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం జగన్ ను ఇంద్రుడు, చంద్రుడు అంటూ పొగిడి ఆకాశానికెత్తేసిన వారు ఇప్పుడు పార్టీ పతనానికి, తమ ఓటమికి కారణం జగనే అంటూ వేలెత్తి చూపుతున్నారు. మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, పలువురు మాజీ ఎమ్మెల్యేలు ఇప్పటికే జగన్ ను నిందించారు. తాజాగా మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణా అదే బాట పట్టారు. వైసీపీ ఓటమికి ప్రధాన కారణం జగన్ తీరేనని అన్యాపదేశంగానైనా తన అనుచరుల వద్ద కుండ బద్దలు కొట్టేశారు. పార్టీలో ప్రజా ప్రతినిథులు, కార్యకర్తలకు పూచిక పుల్లెత్తి విలువ కూడా ఇవ్వకుండా ఐప్యాక్’ అనే ఓ పనికిమాలిన సంస్థని తీసుకొచ్చి నెత్తిన పెట్టుకోవడం వలననే ఎన్నికలలో ఓడిపోయామని చెప్పారు. పార్టీలో ఉండేవారికి దక్కాల్సిన సముచిత గౌరవం, ప్రాధాన్యం ఇవ్వలేదన్నది పార్టీలోని ప్రతి ఒక్కరి అభిప్రాయం అని అందరి తరఫునా తానే చెప్పేశారు.  ఐప్యాక్ కి రాజకీయాలతో సంబంధం ఏమిటి? నా రాష్ట్రంతో ఏ మాత్రం సంబంధం లేని విద్యాధికులను ఎక్కడ నుంచో పట్టుకొచ్చి మా నెత్తిన కూర్చోబెట్టి జగన్ దిద్దుకోలేని తప్పు చేశారని కొట్టు సత్యానారాయణ ఇప్పుడు గళమెత్తుతున్నారు. అలా బయట నుంచి వచ్చిన ఐప్యాక్ ప్రతినిథులు వారి కౌపీన సంరక్షణార్థం తమపై జగన్ కు తప్పుడు నివేదికలిస్తే వాటిని పట్టుకుని తమను దూరం పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.   విశాఖని రాజధాని అంటూ ఐదేళ్లు ఉత్తుత్తి మాటలు చెప్పడం కూడా పార్టీ ఓటమికి కారణంగా ఆయన చెప్పుకొచ్చారు.  అలాగే వాలంటీర్ల కారణంగా పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులకు ప్రజలతో ప్రత్యక్ష సంబధాలు కట్ అయిపోయాయనీ వాపోయారు. ఇక  ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామ రెడ్డి  సీఎంవోలో ఉండే అధికారులు కూడా ఎమ్మెల్యేలు, జగన్ మధ్య దూరం పెంచడానికి ఇతోథికంగా దోహదపడ్డారని, ఆ కారణంగానే ప్రజా సమస్యలు పరిష్కారానికి నోచుకోక పార్టీ పట్ల ప్రజలు ఆగ్రహంతో రగిలిపోవడానికి కారణమైందని అన్నారు.  ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఎవరిని అడిగినా జగన్‌ ప్రభుత్వ వైఫల్యాలు, అనాలోచిత నిర్ణయాలు, అవినీతి, అక్రమాలు, అరాచకాలా గురించి ఏదో ఒకటి చెప్పగలరు. అన్ని తప్పులు చేసిన జగన్‌ ఇంకా తనను ఎవరో మోసం చేశారని చెప్పుకోవడం తనను తాను మోసం చేసుకోవడమే అవుతుంది. 

తెలంగాణలో రెట్టింపైనా  హైదరాబాద్ ఓటమి... అంతర్మథనంలో బిజెపి అధిష్టానం

తెలంగాణలో నాలుగు స్థానాలు ఉన్న బిజెపి రెట్టింపు సంఖ్యలో అభ్యర్థులను గెలిచినప్పటికీ  హైదరాబాద్ పరాజయానికి గల కారణాలను అన్వేషించ పనిలో అధిష్టానం ఉంది. దేశ వ్యాప్తంగా హైప్ క్రియేట్ చేసిన హైదరాబాద్ లోకసభ నియోజకవర్గంలో  అట్టర్ ప్లాప్ గా ఓడిపోవడానికి కారణాలు ఏమిటి అనే విషయంలో ఆ పార్టీలో చర్చనీయాంశమైంది. మాధవిలత గెలిచి తీరుతుందని రెండు ఎగ్జిట్ పోల్ సర్వేలు తప్పితే మిగతా అని సర్వేల్లో ఓడిపోతుందని తేల్చేశాయి. ఈ సర్వేల ఫలితాలే నిజమయ్యాయి. బిజెపి పెద్దలు ఈ విషయాన్ని ఎందుకు తెలుసుకోలేకపోయారు అనేది ప్రస్తుతం చర్చనీయాంశమైంది. కేవలం సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుని హైప్ క్రియేట్ చేసిన మాధవిలత ఓడిపోవడం ఖాయమని కాంగ్రెస్ నేత కాల్వ సుజాత ముందు నుంచే చెబుతున్నారు. సనాతన సంప్రదాయాన్ని ప్రమోట్ చేసుకుని ఆమె బిజెపి టికెట్ కొట్టేసిందని, హైదరాబాద్ ఓటర్లు చాలా తెలివైన వారని ఆమె చెబుతున్నారు. మాధవిలత మజ్లిస్ పార్టీకి గట్టి ఫైట్ కూడా ఇవ్వలేకపోయారు. మజ్లిస్ అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీకి వచ్చిన ఓట్లలో సగం మాత్రమే మాధవిలతకు పోలయ్యాయి. మూడు లక్షలకు పైగా వోట్లతో అసదుద్దీన్ గెలుపొందడం వల్ల బిజెపి శ్రేణులు నిరాశ చెందాయి.  గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రాజాసింగ్ హైదరాబాద్ లోకసభ నియోజకవర్గ ప్రచారంలో భూతద్దం పెట్టి వెతికినా కనిపించలేదు. దేశ వ్యాప్తంగా ఏ  రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగినా స్టార్ క్యాంపెయినర్ గా ఉండే రాజాసింగ్ హైదరాబాద్ లోకసభ నియోజకవర్గ ప్రచారంలో మాత్రం పాల్గొనకపోవడాన్ని అధిష్టానం లెక్కలో తీసుకుంది. అంతే కాదు  బిజెపిలో హిందుత్వ వాదులు,  అభివృద్ది, సంక్షేమాన్ని 40 ఏళ్లుగా  విస్మరించిన మజ్లిస్ తో విసిగి వేసారిపోయిన వాళ్లు  హైదరాబాద్ లోకసభ టికెట్ ఆశించి భంగపడ్డారు. వీరిలో బిజెపి మహిళా మోర్చా అధికారప్రతినిధి నడింపల్లి యమునా పాఠక్ ఒకరు. విద్యాధికురాలైన ఈమెకు  బిజెపిలో మంచి ఇమేజి ఉంది. బిజెపి పెద్దలకు చిరపరిచితురాలైన యమునాపాఠక్ కు మాధవిలత దెబ్బకు అధిష్టానం మొండి చేయి చూపింది.  సామాజిక కార్యక్రల్లో చురుకుగా ఉండే ఎలాంటి పబ్లిసిటీ లేకుండానే యమునాపాఠక్ దేశ వ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు. మానవ సేవయే మాధవ సేవ అనే సిద్దాంతాన్ని ఆమె బలంగా నమ్ముతారు. హైదరాబాద్ టికెట్ యమునా పాఠక్ కి అని తొలుత ప్రచారం జరిగినప్పటికీ చివరి క్షణాల్లో ఈ టికెట్ మాధవిలత ఎగరేసుకుపోయింది.    యమునా పాఠక్ పూర్వికులు దేశ స్వాతంత్యోద్యమంలో కీలకపాత్ర పోషించారు. ఉమ్మడి  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి ఎన్ టి ఆర్  నడింపల్లి వంశీయులకు పెద్ద పీట వేశారు.  యమునాపాఠక్ సేవలను   గుర్తించి బిజెపి అధిష్టానం  విదేశాలలో జరిగే అంతర్జాతీయ సదస్సులు, సమావేశాలకు   ఇండియా తరపున ఆమె పేరును సిఫారసు  చేసిన సందర్బాలు అనేకం.  దశాబ్దాల తరబడి పార్టీని నమ్ముకుని పని చేస్తున్న బిజెపి శ్రేణులను మాధవిలత కలుపుకుని పోకపోవడం వల్లే మాధవిలత పరాజయం చెందింది. ఇప్పటి వరకు ఇంత భారీ మెజారిటీలో బిజెపి ఓడిపోవడం ఇదే మొదటిసారి.  హైదరాబాద్ లో  కోలుకోలేని దెబ్బకు మాధవిలత ప్రధాన కారణమని పరిశీలకులు  వ్యాఖ్యానిస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వారికి టికెట్లు ఇవ్వకుండా బిజెపి అధిష్టానం జాగ్రత్త పడాలని  నెటిజన్లు అంటున్నారు. మాధవిలత ఓవర్ యాక్షన్ వల్లే బిజెపి ఓటమి చవి చూసిందన్న వాదన తెరమీదకు వస్తుంది. ముస్లిం మహిళల హిజాబ్ తీసేయాలని పోలింగ్ బూత్ లో ఆమె  చేసిన విన్యాసం బెడిసి కొట్టింది. ఎన్నికల కమిషన్ కూడా సీరియస్ గా తీసుకుని మాధవిలత మీద కేసు నమోదు చేయాలని పురమాయించడం గమనార్హం. 

అయోధ్యకు బీజేపీ రాంరాం!

సార్వత్రిక ఎన్నికలలో విజయానికి సోపానంగా దోహదం చేస్తుందన్న ఆశతో అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికన నిర్మించి ఎన్నికలకు ముందే అంటే ఈ ఏడాది జనవరిలో అట్టహాసంగా ప్రారంభించి ఆ ఆలయంలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ చేసింది  మోడీ ప్రభుత్వం. బాల రాముడి విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా దేశ వ్యాప్తంగా సంబరాలు జరిగాయి. హిందువుల ఐక్యత, దశాబ్దాల కల సాకారం అయ్యిందని బీజేపీ సంబరపడిపోయింది. అదొక ఎన్నికల అంశంగా తమ ఘన విజయానికి దోహదపడుతుందని ఆశించింది. కట్ చేస్తే తాజాగా జరిగిన ఎన్నికలలో బీజేపీకి రామమందిర నిర్మాణం, బాలరాముడి ప్రతిష్ట అంశం పెద్దగా ఉపయోగపడలేదు. అయోధ్య రామంందిర నిర్మాణాన్ని ఎన్నికల అంశంగా జనం అస్సలు భావించలేదు. గుర్తించ లేదు. పేకాట పేకాటే తమ్ముడు తమ్ముడే అన్నట్లుగా రామ మందిర నిర్మాణం రామమందిర నిర్మాణమే. ఎన్నికలు ఎన్నికలే అన్నట్లుగా జనం స్పందన ఉంది.  రామమందిర నిర్మాణం కారణంగా బీజేపీకి గంపగుత్తగా హిందువుల ఓట్లన్నీ పడిపోతాయని ఆశించిన బీజేపీకి నిరాశే మిగిలింది. 2014, 2019 ఎన్నికలలో ఘన విజయాలు నమోదు చేసిన బీజేపీకి ఈ సారి సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాన్ని జనం ఇవ్వలేదు. నియంత్రణ, చెక్ ఉండాల్సిందే అన్నట్లుగా భాగస్వామ్య పక్షాల దయాదాక్షిణ్యాలు లేకుండా ప్రభుత్వ మనుగడ కష్టం అయ్యేలా తీర్పు ఇచ్చారు. రామమందిరం నిర్మించిన అయోధ్యలోనే బీజేపీని ఓడించారు. అయితే బీజేపీ మాత్రం అయోధ్యపై కక్ష కట్టింది. అయోధ్య ప్రజలు ద్రోహం చేశారని భావిస్తోంది. వారికి కృతజ్ణత లేదని కోపం పెంచేసుకుంది. అయోధ్య ప్రాంత అభివృద్ధికి గత పదేళ్లుగా బీజేపీ సర్కార్ చేసిన కృషి, యావత్ ప్రపంచం దృష్టినీ ఆకర్షించేలా నిర్మించిన రామమందిరం , విమానాశ్రయ నిర్మాణం ద్వారా ఒక ఆధునిక పర్యాటక కేంద్రంగా అయోధ్య రూపురేకలను మారిస్తే ఆ నియోజకవర్గ ప్రజలు బీజేపీ అభ్యర్థిని ఓడించడాన్ని బీజేపీ జీర్ణించుకోలేకపోతోంది.  బీజేపీ సామాజిక మాధ్యమంలో బాయ్ కాట్ అయోధ్య అంటూ పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. కొందరు అతివాద బీజేపీ నేతలు అయోధ్యలోని హిందువులను ద్రోహులుగా అభివర్ణిస్తూ పోస్టులు పెడుతున్నారు.  అభివర్ణిస్తూ పోస్టులు పెడుతున్నారు. దరిమిలా ఎన్నికల ఫలితాలకు ముందు వరకూ సగటున లక్ష నుంచి లక్షన్నర వరకూ అయోధ్య సందర్శనకు వచ్చే పర్యాటకుల సంఖ్య గణనీయంగా పడిపోయింది.  దీంతో అయోధ్యకు వచ్చే పర్యాటకుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఎన్నికల ఫలితాల ముందు వరకూ అయోధ్యలో ఈ రిక్షావాలాల సంపాదన రోజులు ఏడెనిమిది వందలుగా ఉండేది. ఇప్పడది 250 రూపాయలకు పడిపోయింది. దీనిని బట్టే అయ్యోధ్య సందర్శనకు వచ్చే పర్యాటకుల సంఖ్య ఎంతగా తగ్గిపోయిందో అర్ధమౌతుంది. అంతే కాకుండా బీజేపీ మద్దతుదారులు అయోధ్య ఆర్థిక ప్రగతిని దెబ్బకొట్టే విధంగా సామాజిక మాధ్యమంలో పోస్టులు పెడుతున్నారు. రామమందిర సందర్శనకు వచ్చే పర్యాటకులకు అయోధ్యలో స్థానిక వ్యాపారుల వద్ద నుంచి ఏమీ కొనవద్దని పిలుపునిస్తున్నారు. అయోధ్యలో బీజేపీని ఓడించిన అయోధ్య వాసులు అభివృద్ధి ఫలాలను అందుకోవడానికి అనర్హులని అంటూ పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేస్తున్నారు. బీజేపీ తీరు అయోధ్య ఆధ్యాత్మిక వాతావరణం, ఆర్థిక ప్రగతిపై ప్రతికూల ప్రభావం చూపుతోంది.  

ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష నేతగా చంద్రబాబు ఏకగ్రీవ ఎన్నిక

ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నేతృత్వంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం కొలువుదీరడానికి అన్ని లాంఛనాలూ పూర్తయ్యాయి. మంగళవారం (జూన్ 11) ఉదయం విజయవాడ  ఏ కన్వెన్షన్ సెంటర లో జరిగిన ఎన్డీయే కూటమి శాసన సభ్యుల సమావేశం కూటమి శాసనసభాపక్ష నేతగా తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబును ఏకగ్రీవంగా ఎన్నుకుంది. తొలుత చంద్రబాబు పేరును జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రతిపాదించగా, సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదించారు.  ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష నేతగా తనను ఎన్నుకున్నందుకు చంద్రబాబు సభ్యులకు కృతజ్ణతలు తెలిపారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాలన్న ధృఢ సంకల్పంతో ప్రజలు చొరవ చూపి కూటమికి అఖండ విజయాన్ని అందించారని ఆయన పేర్కొన్నారు. ప్రజాతీర్పును నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని చంద్రబాబు అన్నారు.  అత్యున్నత ఆశయాల కోసం మూడు పార్టీలూ ఏకమయ్యాయన్నారు. ఈ విజయంలో పవన్ కల్యాణ్ కృషిని చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించి ప్రశంసించారు. జనసేన అధినేత ఈ ఎన్నికలలో వంద శాతం ఫలితాలు సాధించారని చెప్పరు. 21 అసెంబ్లీ స్థానాలలో పోటీ చేసిన జనసేన ఆ 21 స్థానాలలోనూ విజయం సాధించిందని చెప్పారు. అసెంబ్లీలో విపక్ష హోదా కూడా దక్కనంత ఘోరమైన ఓటమిని జనం వైసీపీకి ఇచ్చారని చెప్పిన చంద్రబాబు. కూటమి ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేస్తుందని భరోసా ఇచ్చారు. ప్రజాసమస్యలపై అర్థవంతమైన చర్చలకు వేదికగా ఏపీ అసెంబ్లీ నిలవాలని ఆకాంక్షించారు.  

17 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ఆంధ్రప్రదేశ్ లో ఐదేళ్ల అరాచక పాలన తరువాత ప్రజా ప్రభుత్వం కొలువుదీరనుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు బుధవారం (జూన్ 12) న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కేబినెట్ కూర్పు మంత్రులకు శాఖల కేటాయింపుపై ప్రస్తుతం చంద్రబాబు దృష్టి సారించారు. ఆ వెంటనే అంటే ఈ నెల 17 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. అంతకు ముందు కేబినెట్ సమావేశంలో కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సీఎంగా ప్రమాణ స్వీకారం చేయగానే మెగా డీఎస్పీపై చంద్రబాబు సంతకం చేస్తారు. ఇప్పటికే ఈ విషయాన్ని ఆయన పలు సందర్భాలలో చెప్పారు. ఇక రెండో సంతకం కచ్చితంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు ఫైల్ పైనేనని తెలుగుదేశం కూటమి వర్గాలు గట్టిగా చెబుతున్నాయి. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉపసంహరణ బిల్లును ఈ అసెంబ్లీ సమావేశాలలోనే ఆమోదించే అవకాశాలు ఉన్నాయి. ఇక పోతే 17 నుంచి నాలుగు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశాలున్నాయి. తొలి రోజు అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం, రెండో రోజు స్పీకర్ ఎన్నిక ఉంటుంది. మిగిలిన రెండు రోజులూ కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది.  

ఇక దేశ నిర్మాణంపై దృష్టి: ఆర్ఎస్ఎస్ 

ఆర్ఎస్ఎస్ కార్యకర్త అయిన ప్రధాని నరేంద్ర మోడీ ముచ్చ టగా మూడోసారి ప్రధాని కావడం ఆర్ఎస్ఎస్ లో ఆనందోత్సహాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్ఎస్ఎస్ దిశానిర్దేశంలో పని చేసే బిజెపి మరో ఐదేళ్లు అధికారంలో కొనసాగడానికి చేపట్టాల్సిన కార్యాచరణను సిద్దం చేసింది.  లోక్‌సభ ఎన్నికలు, పార్లమెంట్ నిర్వహణపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్  చీఫ్ మోహన్ భగవత్ తొలిసారి స్పందించారు. ఎన్నికలు ముగిసిపోయాయని, ఇక దేశ నిర్మాణంపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. ఎన్నికలు యుద్ధం కాదని, పోటీ మాత్రమేనని వ్యాఖ్యానించారు. ఎన్నికలు ఏకాభిప్రాయం కోసం జరిగే ప్రక్రియ అని అన్నారు. పార్లమెంటుకు రెండు పార్శ్వాలు  ఉంటాయని, కాబట్టి ఏ ప్రశ్ననైనా రెండు కోణాల్లో పరిగణించ వచ్చునని సూచించారు. ప్రతి సమస్యకు రెండు వైపులా ఆలోచించాలని, ఒక పార్టీ ఒక వైపు ప్రస్తావిస్తే.. ప్రతిపక్ష పార్టీ మరొక కోణాన్ని ప్రస్తావించాలని అన్నారు. ఈ ప్రక్రియ ద్వారా మాత్రమే సరైన నిర్ణయానికి చేరుకోగలమని భగవత్ అన్నారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాల ప్రాముఖ్యతను ఆయన నొక్కిచెప్పారు. నాగ్‌పూర్‌లో జరిగిన ఆర్ఎస్ఎస్ కార్యక్రమంలో ఆయన ఈ మేరకు మాట్లాడారు. ఈ మేరకు నూతన ప్రభుత్వం, ప్రతిపక్షాలకు ఆయన సలహాలు ఇచ్చారు.  ప్రతి ఐదేళ్లకోసారి ప్రజాతీర్పు వస్తుందని, అయితే ఈ ప్రజా నిర్ణయం ఎందుకు వస్తుంది? కారణాలు ఏంటి? అనే అంశాలు ఆర్ఎస్ఎస్‌కు సంబంధించినవి కావని భగవత్ వ్యాఖ్యానించారు. ‘‘ప్రతి ఎన్నికలలో ప్రజాభిప్రాయాన్ని మెరుగైన రీతిలో అర్థం చేసుకోవడానికి సంఘ్ పని చేస్తుంది. ఈసారి కూడా అదే పని చేసింది. ఎన్నికల ఫలితాల విశ్లేషణలోనే ఆగిపోలేదు. నేతలను ఎందుకు ఎన్నుకుంటారు? వివిధ అంశాలపై ఏకాభిప్రాయంతో పార్లమెంట్‌కు వెళ్లడానికి ఎన్నుకుంటారు. ఏకాభిప్రాయం మన సంప్రదాయం. ఆ దిశగా పురోగతి కనిపిస్తోంది. ఎన్నికల ప్రక్రియ యుద్ధం కాదు.. పోటీ మాత్రమే’’ మోహన్ భగవత్ వ్యాఖ్యానించారు.

తనపై హత్యాయత్నం జరిగింది... పోలీసులకు ఫిర్యాదు చేసిన రఘురామ 

వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో తనపై జరిగిన కస్టోడియల్‌ టార్చర్‌పై మాజీ ఎంపీ, ఉండి ఎమ్మెల్యే రఘరామకృష్ణరాజు గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీస్‌ కస్టడీలో తనపై హత్యాయత్నం జరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ ఘటనకు సీఐడీ మాజీ చీఫ్‌ సునీల్‌ కుమార్‌, ఐపీఎస్‌ అధికారి సీతారామాంజనేయులు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, అప్పటి సీఐడీ అడిషనల్‌ ఎస్పీ విజయ్‌ పాల్‌ బాధ్యులని తెలిపారు. అలాగే, తన గాయాలపై గుంటూరు జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డా.ప్రభావతి కోర్టుకు తప్పుడు నివేదిక ఇచ్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్‌ను విమర్శిస్తే చంపేస్తానని సునీల్‌ కుమార్‌ బెదిరించారని తెలిపారు. తన ఫిర్యాదుపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరారు. పిచ్చోడి చేయిలో రాయి వుంటే ఎవరి తలనైనా పగలగొట్టుచ్చు . రఘురామ కృష్ణరాజు విషయంలో కూడా అదే జరిగింది. అధికారం కోసమే తన తండ్రి వైఎస్ఆర్ ఉన్న పార్టీని వదిలేసి తండ్రి పేరు వచ్చేలా వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించిన జగన్ 2019లో అధికారంలోకి రాగానే  ఒక్కొక్కరిని టార్గెట్ చేశారు. జగన్ అరాచకాలను, అకృత్యాలను నిలదీసిన రఘురామకృష్ణ రాజును ప్రజా ప్రతినిధి అని కూడా  వైఎస్ ఆర్ ప్రభుత్వం టార్చర్ చేసింది. అతనిపై  2021 మే 14వ తేదీన తాను హైదరాబాద్‌లోని తన నివాసంలో పుట్టిన రోజు సందర్భంగా కుటుంబసభ్యులతో వేడుకలు జరుపుకుంటున్న సమయంలో ఏపీ సీఐడీ పోలీసులు ఆయన ఇంటిపై విరుచుకుపడ్డారని రఘురామకృష్ణరాజు ఫిర్యాదులో పేర్కొన్నారు. తనను అరెస్టు చేసిన తర్వాత గుంటూరులోని సీబీసీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి తరలించారని తెలిపారు. తన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నప్పటికీ, వైద్య సహాయం, భోజనం సైతం ఏర్పాటు చేయలేదని తెలిపారు. అరెస్ట్ చేసిన తరువాత తనను రబ్బర్ బెల్ట్ మరియు లాఠీతో కొట్టడంతోపాటు శారీరక వేధింపులకు గురి చేశారని ఫిర్యాదులో రఘురామ వెల్లడించారు. అదే రోజు రాత్రి 11:30 గంటల ప్రాంతంలో అప్పటి సీబీసీఐడీ., డీజీ శ్రీ పివి సునీల్ కుమార్ ఐపీఎస్ సీతారామాంజనేయులుతో పాటుగా పోలీసు తనను చిత్రహింసలకు గురిచేసినట్లు రఘురామ తన ఫిర్యాదులో వెల్లడించారు. గతంలో ప్రధానికి సైతం ఫిర్యాదు చేసిన రఘురామ కృష్ణరాజుపై వైఎస్ ఆర్ ప్రభుత్వం కక్ష్య గట్టింది రాష్ట్ర ప్రభుత్వంపై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారంటూ... గతంలో ఏపీ సీఐడీ  రఘురామను అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. అనంతరం పోలీసు కస్టడీలో తనను హింసించినట్లు అప్పట్లో రఘురామకృష్ణరాజు ఆరోపించారు. ఈ నేపథ్యంలో తాజాగా ఇద్దరు అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ అప్పట్లో ప్రధానికి రఘురామ లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది. అప్పట్లో వైఎస్సార్సీపీ విధానాలను ఆయన ప్రశ్నించడంతో ఆయనపై కక్షగట్టి కస్టోడియల్ టార్చర్ చేసింది వైఎస్ ఆర్ ప్రభుత్వం. స్వంత పార్టీపై విమర్ళల నేపథ్యంలో ఆయనపై కేసులు పెట్టారనే ఆరోపణలు సైతం వచ్చాయి. తాజాగా టీడీపీ ఎమ్మెల్యే అయిన రఘురామకృష్ణరాజు జగన్ చేసిన పాపాల చిట్టా ఒక్కోటి విప్పాలని డిసైడ్ అయ్యారు.  గతంలో ఆయనను  ఓసారి సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో తనపై హత్యాయత్నం జరిగిందంటూ రఘురామకృష్ణరాజు తాజాగా గుంటూరు పోలీసులను ఆశ్రయించారు. కస్టడీలో తనను అంతమొందించేందుకు ప్రయత్నించారని గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేశారు.  ఇటీవలే రాష్ట్రంలో అడుగుపెట్టిన రఘురామ... టీడీపీలో చేరి ఉండి అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి విజయం సాధించారు.స్వ రాష్ట్రంలో తాను ఎంచుకున్న కూటమి విజయం చెందడంతో రఘరామకృష్ణ రాజు జగన్ భరతం పడతారని సర్వత్రా వినపడుతుంది. 

టీటీడీ ఈవో ధర్మారెడ్డీ నీకిక ‘సెలవు’!

తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డిని వారం రోజులు సాధారణ సెలవుపై వెళ్లాల్సిందిగా సీఎస్ నీరభ్ ప్రసాద్ ఆదేశించారు. జగన్ అడుగులకు మడుగులొత్తుతూ.. పదే పదే ఎక్స్టెన్షన్లతో టీటీడీ ఈవోగా కొనసాగుతున్న ధర్మారెడ్డిపై పలు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయనను వారం రోజులు సాధారణ సెలవుపై పంపారని చెబుతున్నారు. అయితే ఆయన తిరుపతి దాటి వెడితే వెళ్లొచ్చు కానీ, రాష్ట్రం దాటి వెళ్లడానికి వీల్లేదని నీరభ్ ప్రసాద్ స్పష్టంగా ఆదేశించారు. అసలు ఇంత హఠాత్తుగా ధర్మారెడ్డిని సెలవుపై పంపడానికి కారణమేమిటి?  చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అనంతరం తిరుమల పర్యటనకు వెళ్లనున్నారు. ఆయన తిరుమలేశుని సందర్శన సమయంలో ధర్మారెడ్డి టీటీడీ ఈవోగా విధులలో ఉంటే ప్రొటోకాల్ ప్రకారం చంద్రబాబుకు ఆయన స్వాగతం పలకాల్సి ఉంటుంది. అయితే ఈవో ధర్మారెడ్డి వ్యవహార శైలిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న చంద్రబాబు ఆయన స్వాగతించడాన్ని పెద్దగా ఇష్టపడే అవకాశాలు లేవు. అది గ్రహించే సీఎస్ ఆయనను విధుల నుంచి తప్పుకుని సెలవుపై వెళ్లాల్సిందిగా ఆదేశించి ఉంటారని అంటున్నారు.  బుధవారం (జూన్12)న చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అనంతరం అదే రోజు ఆయన తిరుపతి వెడతారు. ఆ మరునాడు అంటే (జూన్ 13) గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఈ నేపథ్యంలో ధర్మారెడ్డిని సెలవుపై వెళ్లాల్సిందిగా సీఎస్ ఆదేశాలు జారీ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇప్పటికే జగన్ కు తైనాతీలుగా వ్యవహరించిన పలువురు అధికారులను విధుల నుంచి పక్కన పెట్టిన సంగతి తెలిసిందే. జగన్ చెప్పినట్లల్లా చేసిన జవహర్ రెడ్డిని సెలవుపై వెళ్లాల్సిందిగా స్వయంగా చంద్రబాబే మౌఖికంగా ఆదేశించిన సంగతి తెలిసిందే. 

తెలుగుదేశం గూటికి మాజీ మంత్రి మల్లారెడ్డి!?

తెలంగాణలోనూ తెలుగుదేశంలోకి చేరికలు పెరుగుతున్నాయి. తెలంగాణ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలలో పోటీకి దూరంగా ఉన్న తెలుగుదేశం.. త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికలలో పోటీకి సై అనడంతో  తెలంగాణ తెలుగుదేశం శ్రేణులలో ఆనందోత్సాహాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి త్వరలో తెలుగుదేశం గూటికి చేరనున్నట్లు గట్టిగా వినిపిస్తోంది. ఆయన తన ముఖ్య అనుచరులు సన్నిహితులతో గత రెండు రోజులుగా ఆత్మీయ సమావేశాలు నిర్వహించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ భేటీలలో ఆయన తెరాసను వీడి తెలుగుదేశం గూటికి చేరాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.   2014 వరకు మల్లారెడ్డి తెలుగుదేశంలో ఉన్న సంగతి తెలిసిందే.    రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే బీఆర్ఎస్‌లో చేరి మంత్రిగా పనిచేశారు.  ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం తెలంగాణలో క్రియాశీలంగా వ్యవహరించాలన్న నిర్ణయానికి రావడంతో మల్లారెడ్డి మళ్లీ  సొంత గూటికి చేరాలన్న యోచనలో ఉన్నట్లు ఆయన వర్గీయులు చెబుతున్నారు.  

నాగార్జున వర్సిటీలో వైఎస్ విగ్రహం తొలగింపు

జగన్ మెప్పు కోసం నిబంధనలు తుంగలోకి తొక్కి, విశ్వవిద్యాలయ పవిత్రతకూ పంగనామాలు పెట్టి కొందరు వీసీలు చేసిన దుశ్చర్యలను ఇప్పుడు విద్యార్థులు, అధికారులు సంయుక్తంగా సరిదిద్దుతున్నారు. అందులో భాగంగానే గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో  ఏర్పాటు చేసిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని సోమవారం (జూన్ 10) తొలగించారు. నాడు సకల విలువలకూ తిలోదకాలిచ్చి, సమాజానికి విద్యావంతులను అందించే విశ్వవిద్యాలయ ప్రాంగణంలో రాజకీయ నాయకుల విగ్రహాల ప్రతిష్ఠ వద్దని ఎంత మంది నెత్తీ నోరూ బాదుకుని చెప్పినా వినకుండా వీసీ రాజశేఖర్ జగన్ మెప్పు కోసం ప్రాపకం కోసం వర్సిటీ నిధులను వ్యయం చేసి మరీ వైఎస్ విగ్రహాన్ని యూనివర్సిటీ ప్రాంగణంలో ప్రతిష్ఠించారు. నాటి ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. అప్పటి నుంచీ వర్సిటీ ప్రాంగణంలోని వైఎస్ విగ్రహాన్ని తొలగించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తూనే ఉన్నారు. అయితే అధికారం అండతో, ప్రభుత్వ దన్నుతో వీసీ రాజశేఖర్ పెడచెవిన పెట్టారు. అంతే  కాదు వీసీ రాజశేఖర్ అప్పటి ప్రభుత్వ ప్రాపకం కోసం పాకులాడి సరస్వతీ నిలయం లాంటి నాగార్జున విశ్వవిద్యాలయాన్ని రాజకీయ చర్చలకు వేదికగా మార్చేశారు. విశ్వవిద్యాలయంలో మూడు రాజధానులకు అనుకూలంగా సమావేశాలు, చర్చలు నిర్వహించారు. అంతేనా వైసీపీ ప్లీనరీ కోసం వర్సిటీ ప్రాంగణంలో పార్కింగ్ స్థలాన్ని కూడా కేటాయించారు. ఇప్పుడు జగన్ సర్కార్ ఘోరంగా ఓటమి పాలై ప్రభుత్వం మారిన నేపథ్యంలో విద్యార్థులు ఒక్కసారిగా తమ గళాన్ని విప్పారు. వీసీపై చర్యలకు డిమాండ్ చేస్తున్నారు. వర్సిటీ ప్రాంగణంలోని వైఎస్ విగ్రహాన్ని తొలగించాలని గట్టిగా పట్టుబట్టారు. ఈ నేపథ్యంలో వీసీ రాజశేఖర్ విద్యార్థులతో రెండు దఫాలుగా చర్చలు జరిపి రెండు రోజులలో విగ్రహాన్ని తొలగిస్తామని విద్యార్థులకు హామీ ఇచ్చారు. అయితే అందుకు అంగీకరించని విద్యార్థులు తక్షణమే విగ్రహాన్ని తొలగించాలని పట్టుబట్టారు. దీంతో విధిలేని పరిస్థితుల్లో వీసీ రాజశేఖర్ అప్పటికప్పుడు పొక్లెయిన్ తెప్పించి విగ్రహాన్ని తొలగించారు.    

తెలుగుదేశం విజయం ఖాయమని జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడో చెప్పారు!

జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యక్ష రాజకీయాల్లో లేనప్పటికీ తెలుగు రాజకీయాల్లో ఆయన పేరు తరచూ వినిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు తెలుగుదేశం అఘండ విజయం తరువాత కూడా రాజకీయ వర్గాల్లో ఎన్టీఆర్ పేరు విస్తృతంగా చర్చకు వస్తోంది. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఆయన హాజరౌతారా లేదా అన్న చర్చ పొలిటికల్, సినీ సర్కిల్స్ లో పెద్ద ఎత్తున జరుగుతోంది. అదలా ఉంచితే  జూనియర్ ఎన్టీఆర్ కి పాలిటిక్స్ పై మంచి అవగాహన ఉందనీ, ప్రస్తుత రాజకీయాలను ఆయనెంతో శ్రద్ధగా గమనిస్తుంటారనీ ఆయన సన్నిహిత వర్గాలు చెబుతుంటాయి. అంతే కాదు ఓ ఏడాది ముందే ఆయన ఆంద్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ కచ్చితంగా అధికారంలోకి వస్తుందని బల్లగుద్ది మరీ చెప్పారని ఆయన సన్నిహితులు గుర్తు చేసుకుంటున్నారు.     ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అన్న విషయాన్ని   జూనియర్ ఎన్టీఆర్ సరిగ్గా అంచనా వేశారని ఆయన సన్నిహితుల నుంచి వినిపిస్తున్న మాట. తమిళనాడులో డీఎంకే పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని జూనియర్ ఎన్టీఆర్ ముందుగానే చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే డీఎంకే అధికారంలోకి వచ్చింది. ఇక తెలంగాణలో కాంగ్రెస్ గెలుస్తుందని  జూనియర్ ఎప్పుడో చెప్పారట.  ఆయన అంచనా వేసినట్టుగానే తెలంగాణలో హస్తం పార్టీ జెండా ఎగరేసింది.  అంతే కాదు   ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం విజయబావుటా ఎగురవేయడం ఖాయమని ఆయన అప్పుడే చెప్పారట. ఇప్పుడు ఆ విషయాన్నే ఎన్టీఆర్ సన్నిహితులు గుర్తు చేస్తున్నారు.   జూనియర్ కొంతకాలంగా తెలుగుదేశానికి దూరంగా ఉంటున్నాడు. తెలుగుదేశం శ్రేణులు సైతం కొన్ని విషయాల్లో తారక్ పై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అలాంటిది ఏపీలో తెలుగుదేశం పార్టీదే అధికారమని ఎన్టీఆర్ తన సన్నిహితులతో చాలా కాలం కిందటే చెప్పడం, దానిని ఆయన సన్నిహితులు ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా వైరల్ చేయడం చూస్తుంటే.. జూనియర్ మళ్ళీ తెలుగుదేశానికి దగ్గరయ్యే అవకాశాలున్నాయన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది.  

చంద్ర‌బాబు ప్ర‌మాణ స్వీకారానికి జూనియర్ ఎన్టీఆర్.. నిజమేనా?

అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో స‌రికొత్త చ‌రిత్ర ఆవిష్కృత‌మైంది. గ‌తంలో ఎన్న‌డూలేని విధంగా ఏపీ ప్ర‌జ‌లు అధికార పార్టీకి గ‌ట్టి గుణ‌పాఠం చెప్పారు. ఇందుకు ప్ర‌ధాన కార‌ణం.. సీఎంగా జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఐదేళ్లు అరాచ‌క పాల‌నే. అధికార మ‌దం త‌ల‌కెక్కి సీఎం జ‌గ‌న్ తో స‌హా వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌ల‌పై, ప్ర‌భుత్వ తీరును ప్ర‌శ్నించిన సామాన్య ప్ర‌జ‌ల‌పైనా దాడులు చేశారు. అక్ర‌మ కేసులు పెట్టి జైళ్ల‌కు  పంపించారు. దీనికితోడు రాష్ట్రంలో ఐదేళ్ల‌లో ఎక్క‌డా అభివృద్ధి ఆన‌వాళ్లు క‌నిపించ‌లేదు. దీంతో జ‌గ‌న్ పాల‌న‌పై విసుగెత్తిన ప్ర‌జ‌లు ఓటు ద్వారా గ‌ట్టి గుణ‌పాఠం చెప్పారు. తెలుగుదుశం కూట‌మికి భారీ మెజార్టీతో విజ‌యాన్ని క‌ట్ట‌బెట్టారు. చంద్ర‌బాబు సీఎం అయితేనే ఏపీ అభివృద్ధి ప‌థంలో న‌డుస్తుంద‌న్న బలమైన నమ్మకాన్ని, విశ్వాసాన్ని చాటారు. స్ప‌ష్ట‌మైన‌ ప్ర‌జా తీర్పుతో చంద్ర‌బాబు నాయుడు బుధవారం(జూన్ 12న)  ముఖ్య‌మంత్రిగా  ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు. గన్నవరం పరిధిలోని కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద సీఎం ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.  సీఎంగా తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు ప్ర‌మాణ స్వీకారోత్స‌వ కార్య‌క్ర‌మానికి ప్రధాని మోదీతో పాటు వివిధ రాష్ట్రాల గవర్నర్లు, ప‌లు రాష్ట్రాల‌ ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రుల‌తోపాటు సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన ప్ర‌ముఖులు, రాజకీయ ప్రముఖులు హాజ‌రు కానున్నారు. ఈ క్ర‌మంలో నంద‌మూరి కుటుంబ స‌భ్యుడైన జూనియ‌ర్ ఎన్టీఆర్ కు చంద్ర‌బాబు ప్ర‌మాణ స్వీకారోత్స‌వ కార్య‌క్ర‌మానికి ఆహ్వానం అందిందా అనే అంశంపై సినీ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతుంది. ఒక‌వేళ ఆహ్వానం అందితే జూనియ‌ర్ ఎన్టీఆర్  చంద్ర‌బాబు ప్ర‌మాణ స్వీకారోత్స‌వ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌వుతారా అనే అంశంపైనా ఏపీ రాజ‌కీయాల్లో చ‌ర్చ జ‌రుగుతుంది. ఏపీలో కూట‌మి ఘ‌న విజ‌యం త‌రువాత జూనియ‌ర్ ఎన్టీఆర్ స్పందించారు.  ప్రియ‌మైన చంద్ర‌బాబు మావ‌య్య‌కి ఈ చారిత్రాత్మ‌క‌మైన విజ‌యాన్ని సాధించినందుకు నా హృద‌య‌పూర్వ‌క శుభాకాంక్ష‌లు. మీ విజ‌యం ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి ప‌థ‌ంలో న‌డిపిస్తుంద‌ని ఆశిస్తున్నానంటూ  ట్వీట్ చేశారు. ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన బాల‌కృష్ణ బాబాయి, నారా లోకేశ్‌, భ‌ర‌త్, పురందేశ్వ‌రి అత్త‌కి నా శుభాకాంక్ష‌లు అంటూ  పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్వీట్ కు చంద్ర‌బాబు, నారా లోకేశ్ రిప్లై ఇచ్చారు. అయితే, ఎన్టీఆర్ ట్వీట్ పై తెలుగుదేశంలోని   ఓ వ‌ర్గం ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నది.  చంద్రబాబును జగన్ సర్కార్ అన్యాయంగా, అక్రమంగా అరెస్టు చేసినప్పుడు, లోకేష్ పై అక్రమ కేసులు బనాయించినప్పుడు స్పందించని జూనియర్ ఎన్టీఆర్‌.. కూట‌మి విజ‌యం త‌రువాత స్పందించ‌డంపై విమ‌ర్శ‌లు చేస్తున్నారు. దీంతో తెలుగుదేశంలోని ఓ వ‌ర్గం, జూనియ‌ర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మ‌ధ్య సోష‌ల్ మీడియాలో వార్ న‌డుస్తుంది.  గత కొన్నేళ్లుగా తెలుగుదేశం పార్టీకీ, నందమూరి, నారా ఫ్యామిలీకి జూనియ‌ర్‌ ఎన్టీఆర్ దూరంగా ఉంటూ వ‌స్తున్నారు. చంద్రబాబు అరెస్ట్ అయిన సందర్భంలో కానీ, ఎన్నికల సందర్భంలో కానీ ఎన్టీఆర్ జోక్యం చేసుకోలేదు. తన సినిమాలు తాను చేసుకుంటూ రాజకీయాలకు దూరంగా ఉన్నారు.  వైసీపీకి చెందిన నేత, గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ, కొడాలి నాని చంద్ర‌బాబు స‌తీమ‌ణి నారా భువ‌నేశ్వ‌రిపై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే. ఆ స‌మ‌యంలో తెలుగుదేశం శ్రేణుతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌జ‌లు వంశీ, నానిల తీరుపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వారికి ద‌గ్గ‌రి వ్య‌క్తిగా పేరున్న జూనియ‌ర్ ఎన్టీఆర్ మాత్రం వంశీ, నానికి వ్య‌తిరేకంగా ఎలాంటి వ్యాఖ్య‌లు చేయ‌లేదు. ఆడ‌వారిపై అనుచిత వ్యాఖ్య‌లు చేయ‌డం స‌రికాదంటూ మాత్ర‌మే  ట్వీట్ చేశారు. జూనియ‌ర్ ఎన్టీఆర్ అనుచ‌రులుగా పేరున్న వంశీ, కొడాలి నానిల‌కు ఎన్టీఆర్ ఎలాంటి హెచ్చ‌రిక‌లు చేయ‌క‌పోవ‌డంతోపాటు, క‌నీసం వారి పేరు కూడా ఎత్త‌క‌పోవ‌టం తెలుగుదేశం శ్రేణుల‌ను ఆగ్ర‌హానికి గురిచేసింది. దీంతో తెలుగుదేశంలోని ఓ వ‌ర్గం ఎన్టీఆర్ తీరును సోష‌ల్ మీడియాలో త‌ప్పుబ‌డుతూ వ‌స్తున్నది.  నంద‌మూరి కుటుంబానికి చెందిన చైతన్య కృష్ణ  ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ ఎన్టీఆర్ గురించి కీల‌క విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టారు. ఫ్యామిలీ అంటే సంతోషాన్ని పంచుకోవడం కాదు.. బాధను కూడా పంచుకోవాలి. జూనియర్ ఎన్టీఆర్‌ని ప్రమాణ స్వీకారానికి పిలిస్తే వస్తారో లేదో నాకు తెలియదు. ఎందుకంటే.. ఈమధ్య ఎన్టీఆర్‌ ఫ్యామిలీ ఫంక్షన్స్‌కి రావడం లేదు. నందమూరి ఫ్యామిలీ ఫంక్షన్స్‌కి రావడం మానేశారు. తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలకు కూడా హాజరుకావడం లేదు. పిలిచినా రావడం లేదు కాబట్టి పిలుస్తారో లేదో   తెలియదని  నందమూరి చైతన్య కృష్ణ చెప్పుకొచ్చారు. తెలుగుదేశం త‌ర‌పున ఎన్టీఆర్‌కు ఆహ్వానం అందినా ఆయ‌న వ‌చ్చే అవకాశాలు లేవన్న చ‌ర్చ రాజ‌కీయ వ‌ర్గాల్లో జ‌రుగుతుంది.  తెలుగుదేశం ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు చంద్ర‌బాబు కుటుంబం అనేక ఇబ్బందులు ఎదుర్కొంది. అలాంటి స‌మ‌యంలో స్పందించ‌ని ఎన్టీఆర్‌.. ఇప్పుడు సీఎంగా చంద్ర‌బాబు ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యే అవ‌కాశాలు త‌క్కువ‌ని విశ్లేష‌కులు పేర్కొంటున్నారు.

కేంద్ర మంత్రులు.. శాఖలు.. పూర్తి వివరాలు ఇవిగో!

కేంద్ర మంత్రివర్గంలో మంత్రులకు శాఖలను ప్రకటించారు. శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యుడు కింజరాపు రామ్మోహన్ నాయుడికి పౌర విమానయాన శాఖ క్యాబినెట్ మంత్రిత్వశాఖ లభించింది. అలాగే గుంటూరు పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్‌కి సహాయ మంత్రిగా గ్రామీణాభివృద్ధి, కమ్యునికేషన్స్ శాఖలు లభించాయి. నరసాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాసవర్మకి భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రి హోదా లభించింది. తెలంగాణకు చెందిన బీజేపీ ఎంపీలు కిషన్ రెడ్డికి బొగ్గు, గనుల శాఖ క్యాబినెట్ మంత్రి హోదా, బండి సంజయ్ కుమార్‌కి హోంశాఖ సహాయ మంత్రి హోదా దక్కాయి. కేంద్ర మంత్రివర్గ సమగ్ర స్వరూపాన్ని పరిశీలిస్తే, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి పదవితోపాటు మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్, పెన్షన్స్, డిపార్ట్.మెంట్ ఆఫ్ ఆటమిక్ ఎనర్జీ, డిపార్ట్.మెంట్ ఆఫ్ స్పేస్, ఆల్ ఇంపార్టెంట్ పాలసీ ఇష్యూస్, ఇతరులకు కేటాయించిన అన్ని శాఖల బాధ్యతలు నిర్వర్తిస్తారు. క్యాబినెట్ మంత్రులు - శాఖలు 1. రాజ్‌నాథ్ సింగ్ (రక్షణ శాఖ), 2, అమిత్ షా (హోమ్ అఫైర్స్, సహకార శాఖ), 3. నితిన్ జైరామ్ గడ్కరీ (రోడ్ ట్రాన్స్.పోర్ట్, హైవేస్), 4. జె.పి.నడ్డా (హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్), 5. శివరాజ్ సింగ్ చౌహాన్ (వ్యవసాయ శాఖ, రౌతు సంక్షేమం, గ్రామీణాభివృద్ధి), 6. నిర్మలా సీతారామన్ (ఫైనాన్స్, కార్పొరేట్ ఎఫైర్స్), 7. సుబ్రహ్మణ్యం జయశంకర్ (విదేశీ వ్యవహారాలు), 8. మనోహర్ లాల్ (హౌసింగ్, పట్టణ వ్యవహారాలు, పవర్), 9. హెచ్.డి.కుమారస్వామి (భారీ పరిశ్రమలు, ఉక్కు), 10. పీయూష్ గోయెల్ (కామర్స్, ఇండస్ట్రీ), 11. ధర్మేంద్ర ప్రధాన్ (విద్యాశాఖ), 12. జితన్ రామ్ మాంఝీ (మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్‌ప్రైజెస్), 13. రాజీవ్ రతన్ సింగ్ (పంచాయితీరాజ్, ఫిషరీస్, యానిమల్ హస్బెండరీ, డైరీ), 14. సర్బానంద సోనేవాల్ (పోర్ట్స్, షిప్పింగ్, వాటర్ వేస్), 15. వీరేంద్రకుమార్ (సోషల్ జస్టిస్, ఎంపవర్‌మెంట్), 16. కంజరాపు రామ్మోహన్ నాయుడు (పౌర విమానయానం), 17. ప్రహ్లాద్ జోషి (వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ, న్యూ అండ్ రినవబుల్ ఎనర్జీ), 18. జువాల్ ఓరమ్ (గిరిజన సంక్షేమం), 19. గిరిరాజ్ సింగ్ (టెక్స్.టైల్స్), 20. అశ్విని వైష్ణవ్ (రైల్వేస్, సమాచార ప్రసార శాఖ, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ), 21. జ్యోతిరాదిత్య సింధియా (కమ్యునికేషన్లు, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి), 22. భూపేందర్ యాదవ్ (పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పులు), 23. గజేంద్ర సింగ్ షెకావత్ (సాంస్కృతిక, పర్యాటక), 24. అన్నపూర్ణా దేవి (మహిళ, శిశు సంక్షేమం), 25. కిరెన్ రిజిజు (పార్లమెంట్ వ్యవహారాలు, మైనారిటీ వ్యవహారాలు), 26. హర్దీప్ సింగ్ పూరి (పెట్రోలియం, నేచురల్ గ్యాస్), 27. మన్సుఖ్ మాండవీయా (కార్మిక, ఉపాధి, యువజన సర్వీసులు, క్రీడలు), 28. జి.కిషన్ రెడ్డి (బొగ్గు, గనులు), 29. చిరాగ్ పాశ్వాన్ (ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు), 30. సి.ఆర్.పాటిల్ (జలశక్తి). సహాయ మంత్రులు (ఇండిపెండెంట్ ఛార్జ్) 1. రావ్ ఇంద్రజీత్ సింగ్ (గణాంకాలు, ప్రోగ్రామింగ్ ఇంప్లిమెంటేషన్, ప్లానింగ్, కల్చర్), 2. జితేంద్ర సింగ్ (సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎర్త్ సైన్సెస్, ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్, పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్సెస్, పెన్షన్స్, ఆటమిక్ ఎనర్జీ, స్పేస్), 3. అర్జున్ రామ్ మేఘవాల్ (లా అండ్ జస్టిస్, పార్లమెంటరీ ఎఫెర్స్), 4. జాదవ్ ప్రతాప్ రావ్ గణ్‌పత్ రావ్ (ఆయుష్, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం), 5. జయంత్ చౌదరి (స్కి్ల్ డెవలప్‌మెంట్, ఎంట్రప్రిన్యూర్‌షిప్, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్),  సహాయ మంత్రులు 1. జితిన్ ప్రసాద (కామర్స్, ఇండస్ట్రీ, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ), 2. శ్రీపాద్ ఎస్సో నాయక్ (పవర్, న్యూ, రినవబుల్ ఎనర్జీ), 3. పంకజ్ చౌదరి (ఫైనాన్స్), 4. కిషన్ పాల్ (సహకారశాఖ), 5. రామ్‌దాస్ అథవాలే (సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్‌మెంట్), 6. రామ్‌నాథ్ ఠాకూర్ (వ్యవసాయం, రైతు సంక్షేమం),7. నిత్యానంద్ రాయ్ (హోమ్ ఎఫైర్స్), 8. అనుప్రియా పటేల్ (ఆరోగ్యం, కుటుంబ వ్యవహారాలు, కెమికల్ అండ్ ఫర్టిలైజర్స్), 9. వి.సోమన్న (జలశక్తి, రైల్వేస్), 10. డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ (గ్రామీణాభివృద్ధి, కమ్యునికేషన్లు), 11. ఎస్.పి.సింగ్ బఘేల్ (ఫిషరీస్, యానిమల్ హస్బెండరీ, పంచాయితీరాజ్), 12. శోభా కరాందలాజి (మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్‌‌ప్రైజెస్, లేబర్ అండ్ ఎంప్లాయిమెంట్), 13. క్రితవర్ధన్ సింగ్ (ఎన్విరాన్‌మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ ఛేంజ్, విదేశీ వ్యవహారాలు), 14. బి.ఎల్.వర్మ (వినియోగదారుల వ్యవహారాలు, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్, సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్‌మెంట్), 15. శంతను ఠాకూర్ (పోర్ట్స్, షిప్పింగ్, వాటర్ వేస్), 16. సురేష్ గోపి (పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాసెస్, టూరిజం), 17. డాక్టర్ ఎల్.మురుగన్ (ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్‌కాస్టింగ్, పార్లమెంటరీ వ్యవహారాలు), 18. అజయ్ తమ్తా (ట్రాన్స్.పోర్ట్ అండ్ హైవేస్), 19. బండి సంజయ్ కుమార్ (హోమ్ ఎఫైర్స్), 20. కమలేష్ పాశ్వాన్ (రూరల్ డెవలప్‌మెంట్), 21. భగీరథ్ చౌదరి (వ్యవసాయం, రైతు సంక్షేమం), 22. సతీష్ చంద్ర దూబే (బొగ్గు, గనులు), 23. సంజయ్ సేథ్ (డిఫెన్స్), 24. రవ్‌నీత్ సింగ్ (ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్, రైల్వేస్), 25. దుర్గాదాస్ ఉయ్‌కీ (ట్రైబల్ వెల్ఫేర్), 26. రక్షా నిఖిల్ ఖాడ్సే (యువజన సర్వీసులు, క్రీడలు), 27. సుకాంతా మజుందార్ (ఎడ్యుకేషన్, ఉత్తరాది రాష్ట్రాల సంక్షేమం), 28. సావిత్రీ ఠాకూర్ (మహిళ, శిశు సంక్షేమ శాఖ), 29. తొఖాన్ సాహు (హౌసింగ్ అండ్ అర్బన్ ఎఫైర్స్), 30. రాజ్ భూషణ్ చౌదరి (జలశక్తి), 31. భూపతిరాజు శ్రీనివాసవర్మ (భారీ పరిశ్రమలు, ఉక్కు), 32. హర్ష్ మల్హోత్రా (కార్పొరేట్ ఎఫైర్స్, రోడ్ ట్రాన్స్.పోర్ట్, హైవేస్), 33. నిముబెన్ జయంతిభాయ్ బంభానియా (వినియోగదారుల వ్యవహారాలు, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్), 34. మురళీధర్ మొహోల్ (సహకారశాఖ, పౌర విమానయాన శాఖ), 35. జార్జ్ కురియన్ (మైనారిటీ వ్యవహారాలు, ఫిషరీస్, యానిమల్ హస్బెండరీ, డైరీ), 36. ప్రతిభా మార్గరిటా (విదేశీ వ్యవహారాలు, టెక్స్.టైల్స్).