ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులకు చుక్కెదురు
posted on Jun 12, 2024 @ 6:36PM
పదేళ్ల బిఆర్ఎస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేసి దేశ వ్యాప్తంగా అభాసుపాలైంది. ఈ కేసులో ఇరుక్కున్న అధికారులు కెసీఆర్, కెటిఆర్ కనుసన్నల్లో పని చేసిన వారే. పదేళ్ల తర్వాత అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ కేసును సీరియస్ గా తీసుకుంది. బిఆర్ఎస్ హాయంలో బాధితుడైన మాజీ టిడిపి నేత రేవంత్ రెడ్డి ప్రస్తుతం ముఖ్యమంత్రి హోదాలో ఫోన్ ట్యాపింగ్ నిందితులపై ఉక్కుపాదం మోపారు.
తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులు భుజంగరావు, తిరుపతన్నలకు నాంపల్లి కోర్టులో చుక్కెదురైంది. వారి బెయిల్ పిటిషన్లను న్యాయస్థానం బుధవారం కొట్టివేసింది. తమను రాజకీయ దురుద్దేశంతో అరెస్ట్ చేశారని, తమపై ఎలాంటి సాక్ష్యాలు లేవని పిటిషనర్లు భుజంగరావు, తిరుపతన్నల తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు.
అయితే, ఛార్జిషీట్ దాఖలు చేశామని, మరింత విచారించాల్సి ఉందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు తెలిపారు. కాబట్టి వారికి బెయిల్ ఇవ్వవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ బెయిల్ పిటిషన్లపై మంగళవారం వాదనలు పూర్తయ్యాయి. నాంపల్లి కోర్టు తీర్పును నేటికి వాయిదా వేసింది. ఈరోజు న్యాయమూర్తి వారి పిటిషన్లను కొట్టివేస్తూ ఆదేశాలు జారీ చేశారు.