స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరేనా?
posted on Jun 13, 2024 @ 10:02AM
చంద్రబాబు కేబినెట్ కూర్పు పాత కొత్తల మేలు కలయికగా ఉందన్న ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అదే సమయంలో కొందరికి కేబినెట్లో స్థానం లేకపోవడం పట్ల ఒకింత అసంతృప్తి కూడా వ్యక్తం అవుతున్నది. ముఖ్యంగా సీనియర్ నాయకుడు రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి కేబినెట్ బెర్త్ లభించకపోవడం పట్ల ఉమ్మడి తూర్పుగోదావరి తెలుగుదేశం క్యాడర్ లో తీవ్ర నిరాశ వ్యక్తం అవుతున్నది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు ఆయనకు స్పీకర్ పదవి కట్టబెట్టే అవకాశాలున్నాయన్న చర్చా జోరందుకుంది.
ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన వేళ అసెంబ్లీ స్పీకర్ ఎవరన్న అంశంపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. స్పీకర్ పదవి ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజును వరించే అవకాశాలున్నాయని కేబినెట్ కూర్పు ముందు వరకూ అందరూ భావించారు. అయితే కేబినెట్ కూర్పు తరువాత అనూహ్యంగా మరి కొందరి పేర్లు కూడా తెరమీదకు వచ్చాయి. గతానికి భిన్నంగా సీనియర్లతో పాటు జూనియర్లకు తన మంత్రివర్గంలో చంద్రబాబు అవకాశం కల్పించడంతో మంత్రి పదవులు ఆశించిన పలువురు సీనియర్లకు అవకాశం దక్కలేదు. సామాజిక, ప్రాంతీయ సమీకరణాలతో చాలామంది సీనియర్లను అనివార్యంగా పక్కన పెుట్టాల్సి వచ్చింది.
ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ స్పీకర్ పదవికి రేసులో రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేరు ముందువరుసలోకి వచ్చింది. నిజానికి, బుచ్చయ్య చౌదరికి మంత్రివర్గంలో బెర్త్ ఖాయమనే అంతా అనుకున్నారు. అయితే సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఆయనకు అవకాశం దక్కలేదు. పార్టీలో ఆయన సీనియారిటీ దృష్ట్యా చంద్రబాబు స్పీకర్ గా ఆయన పేరును పరిశీలిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అలాగే కిమిడి కళా వెంకటరావు, నక్కా ఆనంద్ బాబు, రఘురామకృష్ణం రాజు పేర్లు కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి.