నాలుగు వడ్డిస్తేగానీ పిన్నెల్లి దారిలోకి రాడు..!
posted on Jul 9, 2024 @ 11:06AM
ఈవీఎం, పగలగొట్టడం, సీఐ మీద రాయితో దాడి చేయడం నేరాల మీద రిమాండ్‌లో వున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలీసులు తమదైన శైలిలో నాలుగు వడ్డిస్తే తప్ప నోట్లోంచి నిజం బయటకి వచ్చేట్టు లేదు. ప్రస్తుతం ఆయన అందరికీ తెలిసిన నిజాలను కూడా అబద్ధాలుగా చెప్పే పనిలో తెలివితేటల ప్రదర్శన చేస్తున్నారు. ఈ తెలివితేటలు ఎంత ముదిరిపోయాయంటే, ‘‘నేనసలు ఈవీఎం పగలగొట్టలేదు’’ అని చెప్పే రేంజ్‌కి వెళ్ళిపోయాయి. ‘‘పోలింగ్ రోజున పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రానికి నేను వెళ్ళలేదు. ఈవీఎంని పగలగొట్టలేదు. నంబూరి శేషగిరిరావు ఎవరో నాకు తెలియదు. ఆరోజు నావెంట గన్‌మన్లు’’ లేరు అంటూ పోలీసుల విచారణలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చెప్పారు.
పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎంను ధ్వంసం చేయడమే కాకుండా, అడ్డొచ్చిన తెలుగుదేశం పోలింగ్ ఏజెంట్ నంబూరి శేషగిరిరావు మీద పిన్నెల్లి దాడి చేశారు. ఈ ఘటన మీద కేసు నమోదైంది. మర్నాడు పరామర్శల పేరుతో కారంపూడిలో భారీగా అల్లర్లకు పాల్పడటమే కాకుండా, విధుల్లో వున్న సీఐ నారాయణస్వామి మీద రాయితో దాడి చేశారు. ఈ ఉదంతం మీద కూడా కేసు నమోదైంది. ఈ కేసులకు సంబంధించి నెల్లూరు సెంట్రల్ జైల్లో వున్న పిన్నెల్లి నుంచి మరింత సమాచారం రాబట్టడం కోసం కోర్టు అనుమతితో సోమవారం నాడు పల్నాడు జిల్లా గురజాల డీఎస్సీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఈ విచారణలో పిన్నెల్లి ఈ రకమైన వింత సమాధానాలు చెబుతున్నారు. ప్రపంచమంతా చూసిన సంఘటన, ఆయన పార్టీ నాయకుడు జగన్ కూడా ఒప్పుకుంటున్న సంఘటన పిన్నెల్లి ఈవీఎం పగులగొట్టిన సంఘటన. ఇప్పుడు పిన్నెల్లి తానసలు పోలింగ్ కేంద్రానికి వెళ్ళలేదని, ఈవీఎం పగులగొట్టలేదని అంటున్నారంటే ఆయన ఎంతకి తెగించారో అర్థమైపోతోంది. పోలీసులు తమదైన శైలిలో నాలుగైదు వడ్డిస్తే తప్ప పిన్నెల్లి నోట్లోంచి నిజాలు వచ్చేట్టు లేవు.