ఇక మారవా జగన్? ఛీ కొడుతున్న వైసీపీ శ్రేణులు!?
posted on Jul 9, 2024 @ 10:25AM
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి రాజకీయ అనుభవలేమి కొట్టిచ్చినట్లు కనిపిస్తోంది. ఐదేళ్లు ప్రతిపక్ష నేతగా.. మరో ఐదేళ్లు సీఎంగా పనిచేసినప్పటికీ రాజకీయంగా జగన్ ఏ మాత్రం పరిణితి చెందలేదని వైసీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జగన్ ఇలానే ఉంటే రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనుమరుగు కావటం ఖాయమని కుండ బద్దలు కొట్టేస్తున్నారు. మరికొందరు వైసీపీ నేతలయితే.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి నాయకత్వ లక్షణాలు జగన్ లో ఉంటాయని ఇన్నాళ్లు ఆయన వెంట నడిచామని.. కానీ, అధికారంలో ఉన్పప్పుడూ.. ప్రస్తుతం అధికారం కోల్పోయిన తరువాత కూడా జగన్‌లో రాజకీయ పరిణితి కనిపించడం లేదని బాహాటంగానే చెబుతున్నారు. ముఖ్యంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకల సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద జగన్ మోహన్ రెడ్డి ప్రవర్తనను చూసి వైసీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తల్లి, చెల్లిని దూరం చేసుకొని రాజకీయంగా దెబ్బతిన్నా జగన్ లో ఇంకా మార్పు రాలేదని అంటున్నారు. నిందితుడిని వెంట పెట్టుకొని ఎన్నాళ్లు రాజకీయం చేస్తావు జగన్ అంటూ ప్రశ్నిస్తున్నారు. నిన్ను నమ్ముకొన్నందుకు మా రాజకీయంగా భవిష్యత్ నాశనం చేశావు జగన్ అంటూ నిందిస్తున్నారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం ఆయన అభిమానులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అత్యధిక శాతం జగన్ మోహన్‌రెడ్డికి జైకొట్టిన విషయం తెలిసిందే. రాష్ట్ర విభజన తరువాత ఏపీలోని కాంగ్రెస్ శ్రేణులు జగన్ మోహన్ రెడ్డికే మద్దతుగా నిలిచారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఉనికి మాత్రంగా మిగిలిపోవడానికి ప్రధాన కారణం కూడా అదే. వైఎస్ఆర్ అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తల బలంతోనే 2019 ఎన్నికల్లో జగన్ అధికారంలోకి రాగలిగారు. జగన్ మోహన్ రెడ్డిని వైఎస్ఆర్ రాజకీయ వారసుడిగా భావించిన ఏపీ ప్రజలు ఆయనకు అధికారం కట్టబెట్టారు. అయితే జగన్ అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో వైఎస్ లెగసీని పూర్తిగా కోల్పోయారు. వైఎస్ పాలనతో జగన్ పాలనను పోల్చుకుని జనం ఆయనను ఛీకొట్టారు. జగన్ అభివృద్ధి అనే మాటను పూర్తిగా పక్కన పెట్టేశారు. ఆఖరికి రాష్ట్రానికి జీవనాడి వంటి పోలవరం ప్రాజెక్టును సైతం విస్మరించాడు. కేవలం ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు పెట్టి జైళ్లకు పంపించడం, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనను ప్రశ్నించి వారిపై కేసులు నమోదు చేస్తూ, దాడులు చేయిస్తూ తన ఐదేళ్లు అధికారాన్ని పూర్తిగా దుర్వినియోగం చేశారు. కష్టకాలంలో అండగా నిలిచిన తల్లి వైఎస్ విజయమ్మ, చెల్లి వైఎస్ షర్మిలను జగన్ దూరం చేసుకున్నారు. జగన్ తీరు వైఎస్ఆర్ అభిమానులను తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. ఐదేళ్లు జగన్ పాలనతో విసిగిపోయిన ప్రజలు జగన్‌లో వైఎస్ఆర్ రాజకీయ వారసత్వం ఏమాత్రం లేదని గ్రహించి 2024 ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించారు.
ఓటమి తరువాత కూడా జగన్ మోహన్ రెడ్డి తన తీరును మార్చుకోకపోవటంతో ఇక మారవా జగన్ అంటూ వైసీపీ శ్రేణులే ఛీ కొడుతున్నాయి. రాజకీయంగా పరిణితి చెందిన నేత అంటే.. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా వాటిని తనకు అనుకూలంగా మార్చుకుంటూ, ప్రజల తీర్పును గౌరవిస్తూ.. పార్టీని నమ్ముకున్న కార్యకర్తల బాగోగులను దృష్టిలో పెట్టుకొని ముందడుగు వేయాలి. అలాంటి లక్షణాలు కలిగిన నేత పార్టీ అధ్యక్షుడిగా ఉంటే ఆ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ బలంగా ఉంటుంది. కానీ, ప్రస్తుతం జగన్ మోహన్ రెడ్డిని చూస్తుంటే వైసీపీ శ్రేణులకు ఆ భావన కనిపించడం లేదట. పార్టీ పుంజుకుంటుందన్న భరోసా కలగడం లేదు. అధికారంలోఉన్నప్పుడు ఎలా ఉన్నా చెల్లిపోతుంది. ఓడిపోయిన తరువాత కూడా జగన్ తన విధానాన్ని మార్చుకోకపోవటంతో వైసీపీ నేతలు సైతం అసహనం వ్యక్తం చేస్తున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమికి వైఎస్ షర్మిల కూడా ప్రధాన కారణం. వైసీపీ కష్టకాలంలో ఉన్నప్పుడు షర్మిల రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేసి పార్టీని బలోపేతం చేశారు. కానీ, అధికారంలోకి వచ్చిన తరువాత జగన్ షర్మిలను పూర్తిగా పక్కన పెట్టారు. అంతేకాదు.. తల్లి విజయమ్మను సైతం విస్మరించాడు. దీంతో వారిద్దరూ వైసీపీని వీడడం.. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరి ఏపీ అధ్యక్ష బాధ్యతలను చేపట్టడం వైసీపీ ఓటమికి బీజం పడినట్లయింది. దీనికితోడు బాబాయ్ వివేకానందరెడ్డి హత్యకేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్న అవినాశ్‌రెడ్డిని జగన్ వెనుకేసుకొనిరావటం వైఎస్ఆర్ అభిమానుల్లో ఆగ్రహానికి కారణమైంది. దీంతో మెజార్టీ శాతం వైఎస్ఆర్ అభిమానులు ఇటీవల ఎన్నికల్లో వైసీపీకి దూరమయ్యారు. ఎన్నికల్లో ఓటమితో జగన్ తీరులో మార్పు వస్తుందని వైసీపీ నేతలు భావించారు. కానీ, ఇడుపులపాయలో జరిగిన వైఎస్ఆర్ జయంతి వేడుకల్లో జగన్ తీరులో ఏమాత్రం కనిపించలేదు.
వైఎస్ షర్మిల వచ్చేవరకు వేచిఉండకుండానే జగన్ వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించి వెళ్లిపోయారు. దీనికితోడు విజయమ్మ జగన్ రెడ్డిని హత్తుకొని కన్నీరుపెట్టుకున్న సమయంలో ఆమెను ఓదార్చే ప్రయత్నం చేయకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీంతో విజయమ్మ వైఎస్ఆర్ ఘాట్ వద్దే ఉండి ఏడుస్తుంటే.. కుటుంబ సభ్యులు ఆమెను ఓదార్చాల్సి వచ్చింది. దీనికి తోడు వివేకా హత్యకేసులో కీలక ముద్దాయిగా ఉన్న వైఎస్ అవినాశ్ రెడ్డిని వదిలి పెట్టకుండా వెంటపెట్టుకోవడం వైఎస్ఆర్ అభిమానులతోపాటు వైసీపీ శ్రేణుల్లోనూ ఆగ్రహాన్ని కలిగించింది. తాజా పరిణామాలపై కొందరు వైసీపీ నేతలు బహిరంగంగానే జగన్ తీరు పట్ల విమర్శలు గుప్పిస్తున్నారు. శ్రేణులైతే జగన్ ఇక మారడు అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.