ఏపీ బడ్జెట్ ఎప్పుడు?
posted on Jul 9, 2024 @ 2:36PM
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఎప్పుడన్నదానిపై క్లరిటీ రాలేదు. ఈ నెల 22 నుంచి ఐదు రోజుల పాటు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశాలు కనిపించడం లేదు. అయితే మరి కొంత కాలం పాటు తాత్కాలిక బడ్జెట్ కోసం అర్డినెన్స్ తీసుకువచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.
రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం కొలువుదీరి నెలరోజులు అయ్యింది. గత ఐదేళ్ల పాలనలో జగన్ తన ఆర్థిక అరాచకత్వంతో రాష్ట్రాన్ని దివాళా అంచున నిలిపారు. అంతే కాకుండా ఇష్టారీతిగా నిధుల మళ్లింపు, ఎక్కడ నుంచి ఏది తాకట్టు పెట్టి తెచ్చారో తెలియని విధంగా జగన్ సర్కార్ చేసిన అప్పులతో ప్రస్తుతం ఏ శాఖ పరిస్థితి ఎలా ఉంది అన్న విషయం ఆకళింపు చేసుకోవడానికీన, ఆయా శాఖల ఆర్థిక పరిస్థితిపై ఒక అవగాహనకు రావడానికి ఆయా శాఖల మంత్రులకు కొంత సమయం పడుతుంది. దీంతో ఇప్పటికిప్పుడు పూర్తి స్థియి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం లేదని ప్రభుత్వం భావిస్తోంది.
అందుకే పూర్తి స్థాయి బడ్జెట్ కు బదులుగా ఓటాన్ అక్కౌంట్ బడ్జెట్ ప్రవేశ పెడితే ఎలా ఉంటుందన్న విషయాన్ని చంద్రబాబు సర్కార్ తీవ్రంగా పరిశీలిస్తోంది. వివిధ శాఖల్లోని ఆర్థిక పరిస్థితిపై మంత్రులకు పూర్తి స్పష్టత రావడానికి కొంత సమయం పడుతుంది. దీంతో ఇప్పటికప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టడానికి బదులుగా తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపెడితే ఎలా ఉంటుంది..? అనే అంశంపై ఆర్థిక శాఖ సమాలోచనలు జరుపుతోంది. ఈ పరిస్థితుల్లో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను కొనసాగిస్తూ ఆర్డినెన్స్ తీసుకువచ్చి, ఆ తరువాత రెండు మూడు నెలల సమయం తీసుకుని పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాలని యోచిస్తున్నది. అంతే కాకుండా ఈ నెల మూడో వారంలో కేంద్ర విత్తమంత్రి నిర్మలాసీతారామన్ లోక్ సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయింపులు ఎలా ఉన్నాయన్నది చూసి, వాటిని కూడా పరిగణనలోనికి తీసుకుని అప్పుడు పూర్తి స్థాయి బడ్జెట్ ను సర్వజనామోదయోగ్యంగా ఉండేలా ప్రవేశపెట్టాలని చంద్రబాబు యోచిస్తన్నట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం.
ఏది ఏమైనా ఈ నెల 22 నుంచి ఐదు రోజుల పాటు జరిగే అసెంబ్లీ సెషల్ లో రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టే అవకాశాలు ఇసుమంతైనా లేవని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఓటాన్ అక్కౌండ్ బడ్జెట్ తో సరిపెట్టేసి కొంత వ్యవధి తీసుకుని పూర్తి స్థాయి బడ్జెట్ ను అన్న శాఖలకూ, అన్ని వర్గాల ప్రజలకూ సమ ప్రాధాన్యత ఇస్తూ రూపొందించాలని ప్రభుత్వం భావిస్తున్నది. అయితే ఈ విషయంలో మరంత క్లారిటీ రావాల్సి ఉంది. ఏది ఏమైనా చంద్రబాబు నిర్ణయం మేరకే ఏపీ బడ్జెట్ ప్రవేశ పెట్టేదెన్నడు అన్నది ఆధారపడి ఉంటుంది. ఈ నెల 16న జరగనున్న కేబినెట్ భీటీలో బడ్జెట్ పై పార్తి క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు.