జగన్‌కి వాతలు పెట్టిన రేవంత్‌రెడ్డి!
posted on Jul 8, 2024 @ 8:58PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీకి కూడా రాకుండా పారిపోయిన వైఎస్ జగన్‌కి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాటలతో వాతలు పెట్టారు. సోమవారం నాడు విజయవాడలో వైఎస్ రాజశేఖరరెడ్డి 75వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్‌రెడ్డి, పరోక్షంగా అనిపించినప్పటికీ ప్రత్యక్షంగానే జగన్ మీదకి మాటల బాణాలు వదిలారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ‘‘చాలామంది వైఎస్ రాజశేఖరరెడ్డి పేరు మీద అన్ని రకాల లాభాలు పొందారు. వాళ్లు మాత్రం వైఎస్సార్ బాటలో నడవటం లేదు. కుటుంబ సభ్యులుగా వారసత్వం రాదు.. ఆశయాలను మోసినప్పుడే వారసత్వం వస్తుంది. పేద ప్రజలకు అండగా నిలవాలని, రాహుల్ గాంధీ దేశానికి ప్రధానమంత్రి కావాలని వైఎస్సార్ ఆశయాలుగా పెట్టుకున్నారు. ఆయన ఆశయాలను మోస్తున్న వారినే మనం వారసులుగా గుర్తించాలి. వైఎస్సార్ పేరు మీద రాజకీయ వ్యాపారం చేస్తున్నవాళ్ళు ఆయన వారసులు కాదు.. వైఎస్సార్ ఆశయాల సాధనలో నడుస్తున్న షర్మిలే ఆయన వారసురాలు’’ అని రేవంత్ రెడ్డి అన్నారు.
ఏపీలో షర్మిలే ప్రతిపక్ష నాయకురాలు
‘‘ఏపీలో ప్రతిపక్షం లేదు.. ఉన్నదంతా పాలకపక్షమే. ఏపీలో బీజేపీ అధికారంలో వుంది. బీజేపీ అంటే, బాబు, జగన్, పవన్... ప్రతిపక్షమే లేని ఈ రాష్ట్రంలో షర్మిల ప్రతిపక్ష నాయకురాలిగా పనిచేస్తారు. ప్రతిపక్ష బాధ్యతని నిర్వహించాల్సిన వారు ఆ బాధ్యతని వదిలేశారు. ఆ బాధ్యతను షర్మిల స్వీకరించారు. వైఎస్సార్ వారసురాలు షర్మిల మాత్రమే.. రాజశేఖరరెడ్డి వారసత్వాన్ని కొనసాగించేది షర్మిల మాత్రమే. 2009 నుంచి షర్మిల పోరాటం చేస్తున్నారు. ఆమెకు కూడా ఒక మంచి సందర్భం వస్తుంది. 2029లో రాహుల్ గాంధీ ప్రధాని అవుతారు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి షర్మిల ముఖ్యమంత్రి అవుతారు’’ అని రేవంత్ రెడ్డి అన్నారు.