22 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. జగన్ హాజరయ్యేనా?
posted on Jul 9, 2024 @ 11:28AM
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 22 నుంచి ప్రారంభం కానున్నాయి. ఐదు రోజుల పాటు జరిగే ఈ సమావేశాలలో తొలి రోజు గవర్నర్ అబ్దుల్ నజీన్ ప్రసంగిస్తారు. ఇలా ఉండగా ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తరువాత జరుగుతున్న తొలి అసెంబ్లీ సమావేశాలు కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇటీవలి ఎన్నికలలో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న వైసీపీ పార్టీకి సభలో ఆ పార్టీ అధినేత జగన్ తో కలిసి కేవలం 11 మంది సభ్యలు మాత్రమే ఉన్నారు. కాగా అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం సందర్భంగా జగన్ వ్యవహరించిన తీరును గమనించిన వారెవరూ ఆయన అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే అవకాశాలున్నాయని భావించడం లేదు.
జగన్ వినతిని మన్నించి సాధారణ ఎమ్మెల్యే అయినా ఆయనకు మంత్రుల తరువాత ప్రమాణ స్వీకారం చేసే అవకాశాన్ని చంద్రబాబు ఉదారంగా ఇచ్చారు. అయినా కూడా జగన్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత సభలో కూర్చోకుండానే వెళ్లిపోయారు. ఆ తరువాత కూడా తనకు సభలో అవమానం జరిగిందన్నట్లుగా మాట్లాడారు. అక్కడితో ఆగకుండా కేవలం 11 మంది సభ్యుల బలమే ఉన్నప్పటికీ తమ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలనీ, తనను ప్రతిపక్ష నేతగా గుర్తించాలనీ కోరుతూ స్పీకర్ కు లేఖ రాశారు. ఆ లేఖపై స్పీకర్ ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు అది వేరే సంగతి కానీ, జగన్ తీరు చూస్తుంటే... సభలో తనకు గౌరవం లభించడం లేదు కనుక హాజరు కాలేనని చెప్పుకోవడానికి ముందు నుంచే ప్రయత్నాలు ప్రారంభించేశారని అనుకోవలసి ఉంటుంది.
ఆయన తీరు చూస్తుంటే సభకు హాజరయ్యే అవకాశాలు ఇసుమంతైనా లేవనే పరిశీలకులు అంటున్నారు. అదీ కాక ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అడుగుపెట్టడాన్ని అవాయిడ్ చేయడానికి ఆయన కడప నుంచి లోక్ సభకు పోటీ చేసే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు కూడా చెబుతున్నారు. అంటే కడప లోక్ సభ స్ధానం నుంచి అవినాష్ చేత రాజీనామా చేయించి ఉప ఎన్నికలో తాను పోటీ చేయాలని జగన్ భావిస్తున్నట్లు సామాజిక మాధ్యమంలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాను ఖాళీ చేసిన పులివెందుల స్థానం నుంచి అవినాష్ ను నిలబెట్టాలని జగన్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. అది నిజమా కాదా అన్నది పక్కన పెడితే అసెంబ్లీ సమావేశాలకు జగన్ డుమ్మా కొట్టేందుకే ఎక్కువ అవకాశాలున్నయన్నది మాత్రం ఎక్కువ మంది నమ్ముతున్నారు.
గతంలో తాను సభానాయకుడిగా అంటే ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో విపక్ష సభ్యుల పట్ల ప్రవర్తించిన విధంగానే ఇప్పుడు అధికార పక్ష నేతలు తన పట్ల ప్రవర్తిస్తారన్న భయమే అందుకు కారణమని అంటున్నారు. అయినా అసలు ఇప్పటి వరకూ వైసీపీ ఎమ్మెల్యేలు జగన్ ను తమ పార్టీ శాసన సభాపక్ష నేతగానే ఎన్నుకోలేదు. అంటే జగన్ కు అసెంబ్లీకి హాజరయ్యే ఉద్దేశమేలేదనడానికి ఇదే తార్కానమని పరిశీలకులు అంటున్నారు. చూడాలి మరి 22 నుంచి ఆరంభమయ్యే అసెంబ్లీ సమావేశాలకు జగన్ హాజరౌతారా లేదా?