అమెరికాలో మోసం.. తెలుగువాళ్ళ అరెస్టు!
posted on Jul 9, 2024 @ 12:15PM
అమెరికాలో నలుగురు తెలుగువాళ్ళని పోలీసులు అరెస్టు చేశారు. నకిలీ కంపెనీలు సృష్టించి, కొంతమందితో బలవంతంగా పనిచేయించుకున్న నేరం మీద వీరిని అరెస్టు చేశారు. అమెరికాలోని వివిధ ప్రాంతాల్లో దాదాపు వందమందికి పైగా వీరి ఆధ్వర్యంలో పనిచేస్తున్నట్టు తెలిసింది. పోలీసులు జరిపిన సోదాల్లో ఒక్క ఇంట్లోనే పదిహేను మంది పనిచేస్తున్నట్టు గుర్తించారు.
ప్రిన్స్.టన్‌లోని గిన్స్.బర్గ్ లేన్‌లో ఒక ఇంట్లో అనుమానాస్పద కార్యకలాపాలు జరుగుతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. సంతోష్ కట్కూరికి చెందిన ఆ ఇంట్లో పోలీసులు సోదాలు జరిపారు. ఆ ఇంట్లో మొత్తం 15 మందితో సంతోష్ కట్కూరి భార్య ద్వారక పని చేయిస్తున్నట్టు తేలింది. వీరంతా బలవంతంగా పనిచేస్తున్నట్టు పోలీసులు విచారణలో వెల్లడైంది. పోలీసులు అక్కడ నుంచి ల్యాప్‌టాప్‌లు, సెల్‌ఫోన్లు, ప్రింటర్లు, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత జరిపిన దర్యాప్తులో ప్రిన్స్.టన్, మెలిసా, మెకెన్సీ ప్రాంతాల్లో కూడా బాధితులను గుర్తించారు. ఎలక్ట్రానిక్ పరికరాలను క్షుణ్ణంగా తనిఖీ చేసిన పోలీసులు వీరు అక్రమంగా కంపెనీలు ఏర్పాటు చేసి కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని తేల్చారు. సంతోష్, ద్వారకతోపాటు చందన్ దాసిరెడ్డి, అనిల్ మాలెని అరెస్టు చేశారు.