బాబోయ్... 514 కోట్ల భారీ మోసం..!
posted on Jul 8, 2024 @ 8:07PM
మనం మనం ఒకటే అని చెప్పి, తన సామాజికవర్గానికే చెందిన వారిని మాయచేసి 514 కోట్ల రూపాయల భారీ మోసం చేసిన మోసగాడిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. అధిక వడ్డీ ఆశచూపి ధన్వంతరి ఇంటర్నేషనల్ ఫౌండేషన్ నిర్వాహకులు భారీ మోసానికి పాల్పడ్డారు. ఈ ఫౌండేషన్ ఛైర్మన్ కమలాకర్ శర్మ బాధితుల నుంచి 514 కోట్ల రూపాయల డిపాజిట్లను సేకరించాడు. తన దగ్గర పెట్టుబడులు పెట్టిన కొంతమంది ప్లాట్లను ఇస్తానని చెప్పి మోసం చేశాడు. కమలాకర్ శర్మ చేతిలో మొత్తం 4 వేల మంది మోసపోయారని పోలీసులు గుర్తించారు. బాధితులందరూ మోసగాడి సామాజివర్గానికి చెందినవారే కావడం గమనార్హం. మన అనుకున్నవాడే తమను మోసం చేశాడని అర్థం చేసుకున్న బాధితులందరూ హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి, కమలాకర్ శర్మను అరెస్టు చేశారు. ఏదో చిన్న మోసం అనుకుంటే, అది 514 కోట్ల రూపాయల మోసం అని తమ విచారణలో తేలిందని పోలీసులు చెప్పారు. ధన్వంతరి ఫౌండేషన్ పేరు మీద వున్న ఆస్తులను పోలీసులు జప్తు చేశారు. అనంతరం దాదాపు 2 వందల మంది బాధితులతో సీసీఎస్ డీసీపీ శ్వేతారెడ్డి సమావేశం నిర్వహించారు. జప్తు చేసిన ఆస్తులను విక్రయించి నగదు డిపాజిట్లు చెల్లించే ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.