తెలంగాణలో చంద్రబాబు ఎంట్రీ.. కాంగ్రెస్ లో కంగారు!
posted on Jul 9, 2024 @ 10:52AM
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన నాటినుంచి ఏపీ అభివృద్ధిపై దృష్టిపెట్టారు. ఇప్పటికే పలు రంగాల్లో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారు. అదే సమయంలో సంక్షేమాన్నీ విస్మరించడం లేదు. ఐదేళ్ల కాలంలో అభివృద్ధికి నోచుకోని ఏపీ ప్రజలు చంద్రబాబు దూకుడుతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పదహారు ఎంపీ స్థానాలతో కేంద్రంలో తెలుగుదేశం అత్యంత కీలక పాత్ర పోషిస్తోంది. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలో కొనసాగడానికి తెలుగుదేశం మద్దతు అత్యవసరం. దీంతో గతంలో ఎప్పుడూలేనంత ఉత్సాహం తెలుగుదేశం శ్రేణుల్లో కనిపిస్తోంది. బాబు విజన్ కు అనుగుణంగా ఏపీ ప్రగతికి, పురోగతికి కేంద్రం నుంచి అవసరమైన సహాయ సహకారాలు అందుతాయనీ, ఎందుకంటే మోడీ సర్కార్ కు తెలుగుదేశం మద్దతు కీలకమనీ అంటున్నారు. మొదటి నుంచి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఎలాంటి విబేధాలు లేకుండా అభివృద్ధి చెందాలనేది తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆకాంక్ష. ఏపీలో అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విభజన సమస్యల పరిష్కారంపై చంద్రబాబు దృష్టి కేంద్రీకరించారు. ఈ క్రమంలో ఇటీల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలను విడతల వారిగా పరిష్కరించుకోవాలని రెండు రాష్ట్రాల సీఎంలు నిర్ణయించారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. చంద్రబాబు తెలంగాణలో అడుగు పెట్టడంతో తెలంగాణలోని ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీతో పాటు కాంగ్రెస్ పార్టీ సైతం ఉలిక్కిపడుతున్నారు. తమ కాళ్ల కింద భూమి కదిలిపోతుందన్నంత కంగారు పడుతున్నారు.
ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత చంద్రబాబు నాయుడు ఇటీవల తొలిసారి తెలంగాణలో అడుగుపెట్టారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలతో సమావేశం అయ్యారు. రాష్ట్ర నలు మూలల నుంచి భారీ సంఖ్యలో తెలుగుదేశం కార్యకర్తలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలోపేతంపై దృష్టిపెడతానని, మంచిరోజులు రాబోతున్నాయని చంద్రబాబు వ్యాఖ్యానించడం తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. తెలంగాణలో చంద్రబాబు అడుగు పెడుతున్నారంటే బీఆర్ఎస్ నేతల్లో ఆందోళన ఉంటుంది. ఎందుకంటే, తెలంగాణలో తెలుగుదేశం బలోపేతం అయితే బీఆర్ఎస్ పార్టీకి ఆదరణ తగ్గుతుందని ఆ పార్టీ నేతల భయం. ఈ భావనతోనే చంద్రబాబు తెలంగాణ రాజకీయాలపై ఎప్పుడు ప్రస్తావించినా బీఆర్ఎస్ నేతలు ప్రెస్‌మీట్లు పెట్టి చంద్రబాబు వస్తున్నారు.. మళ్లీ తెలంగాణ, ఏపీ కలిసిపోతాయంటూ రాష్ట్ర ప్రజలను రెచ్చగొట్టడం పరిపాటిగా మారుతూ వస్తుంది. చంద్రబాబును తెలంగాణకు శత్రువుగా చూపించడంలో బీఆర్ఎస్ అప్పట్లో సఫలమైంది.
2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడును తెలంగాణ ద్రోణిగా ముద్రవేసి కేసీఆర్ అధికారంలోకి వచ్చారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా చంద్రబాబు ప్రస్తావనను తెరపైకి తెచ్చే బీఆర్ఎస్ పార్టీకి.. 2023 ఎన్నికల్లో చంద్రబాబు ఆ అవకాశాన్ని ఇవ్వలేదు. ఆ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పోటీ నుంచి తప్పుకుంది. దీంతో బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి తెలుగుదేశం క్యాడర్ తమ వంతు పాత్ర పోషించింది. ఇటీవల జరిగిన ఎంపీ ఎన్నికల్లోనూ తెలుగుదేశం శ్రేణులు కాంగ్రెస్ పార్టీకే మద్దతుగా నిలిచారు. అయితే, ఏపీలో మళ్లీ తెలుగుదేశం అధికారంలోకి రావడంతో తెలంగాణలోని బీఆర్ఎస్ నేతలతో పాటు.. కాంగ్రెస్ పార్టీలోని కొందరు నేతలూ ఆందోళన చెందుతున్నారు. వాస్తవానికి, చంద్రబాబు తెలంగాణలో తెలుగుదేశం బలోపేతంపై దృష్టిపెడితే కాంగ్రెస్ పార్టీ మేలే జరుగుతుంది. ఎందుకంటే.. రాష్ట్రంలో తెలుగుదేశం ఎంతగా బలోపేతం అయితే అంతగా బీఆర్ఎస్ ఓటు బ్యాంకుకు గండిపడుతుంది. తద్వారా కాంగ్రెస్ పార్టీ మరింత బలపడుతుంది. కానీ, కాంగ్రెస్ లోని కొందరు నేతలు చంద్రబాబు తెలంగాణ రాజకీయాలపై దృష్టిపెట్టడాన్ని వ్యతిరేకిస్తూ, తెలంగాణకు మళ్లీ అన్యాయం జరుగుతుందన్నట్లు మాట్లాడారు. కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి ఓ అడుగు ముందుకేసి.. తిరిగి తెలంగాణ వాదులు, ఉద్యమకారులు పోరాట ప్రస్థానానికి కదలటం నిశ్చయమైన భవిష్యత్ వాస్తవం.. అంటూ పేర్కొనడం కాంగ్రెస్ శ్రేణులసైతం ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
తెలంగాణలో రాజకీయాలు చేయడానికి చంద్రబాబుకు హక్కులేదన్నట్లుగా కొందరు కాంగ్రెస్ నేతలు మాట్లాడటం పట్ల తెలుగుదేశం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీరు అన్నట్లు చంద్రబాబు తెలంగాణ వ్యతిరేకి అయితే.. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం ఎందుకు కలిసి పోటీచేశాయి. 2023 ఎన్నికల్లో తెలుగుదేశం కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వటం నిజం కాదా అని ప్రశ్నిస్తున్నారు. పలువురు కాంగ్రెస్ నాయకులు తెలుగుదేశం జెండా పట్టుకుని ర్యాలీలలో పాల్గొనడం వాస్తవం కాదా అని ప్రశ్నిస్తున్నారు. బీజేపీ డైరెక్షన్ లో చంద్రబాబు, పవన్ పని చేస్తున్నారని.. తెలంగాణలో తెలుగుదేశం బలపడితే వచ్చే ఎన్నికల్లో మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని, తద్వారా కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుందన్న వాదనను కొందరు కాంగ్రెస్ నేతలు తెరపైకి తీసుకువస్తున్నారు. వాస్తవానికి తెలంగాణలో బీజేపీ, జనసేన, తెలుగుదేశం కలిసి పోటీచేస్తే బీఆర్ఎస్ పార్టీ ఉనికే ప్రమాదంలో పడుతుంది. ఆ మూడు పార్టీల కలయిక వల్ల కాంగ్రెస్ ఓటు బ్యాంకుకు వచ్చే నష్టం ఏమీ ఉండదు. అయితే కాంగ్రెస్ లోని కొందరు నాయకులు తెలంగాణలో చంద్రబాబు ఎంట్రీని వ్యతిరేకించడానికి ప్రధాన కారణం కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి బలోపేతం అవుతారన్న దుగ్ధతోనే అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మొత్తానికి తెలంగాణలో తెలుగుదేశంబలోపేతంపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో రచ్చ రేపుతున్నాయి.