తెలంగాణ ఆర్టీసీ బస్సులలో డిజిటల్ పేమెంట్లు!
posted on Jul 12, 2024 @ 10:57AM
ఇక తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ బస్సుల్లో ‘చిల్లర ఇవ్వండి’, ‘చిల్లర లేదు’... అనే మాటల వినిపించవు. ఎందుకంటే, తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో త్వరలో డిజిటల్ పేమెంట్ విధానం అందుబాటులోకి రాబోతోంది. ఆగస్టు నాటికి హైదరాబాద్ నగరంలో, సెప్టెంబర్ నాటికి తెలంగాణ రాష్ట్రమంతటా ఈ విధానాన్ని అమల్లోకి తేవాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఈ మేరకు కండక్టర్లకు కొత్త టిక్కెట్ ఇష్యూయింగ్ మిషన్లు (టిమ్)లు అందించడానికి సన్నాహాలు చేస్తోంది. కొత్త టిమ్‌లలో టిక్కెట్ ధరకు క్యూఆర్ కోడ్ క్రియేట్ అవుతుంది. ప్రయాణికులు ఫోన్ ద్వారా పేమెంట్ చేసేయవచ్చు.
తెలంగాణ ఆర్టీసీలో తొమ్మిది వేలకు పైగా బస్సులు వున్నాయి. ఈ బస్సులు ప్రతి రోజూ 55 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. కొత్తగా జారీ చేయబోతున్న టిమ్‌లతో డెబిట్ కార్డు, క్యూఆర్ కోడ్ స్కానింగ్ ద్వారా చెల్లింపులు చేయవచ్చు. ‘మహాలక్ష్మి’ పథకం పెట్టిన తర్వాత బస్సులలో ఎక్కే మహిళల సంఖ్య భారీగా పెరిగింది. త్వరలో మహిళలకు స్మార్ట్ కార్డులు జారీ చేయబోతున్నారు. వాటిని స్వైప్ చేసి ‘జీరో’ టిక్కెట్ పొందాల్సి వుంటుంది.
బయటకి వెళ్ళిన బస్సులు సాయంత్రం తిరిగి వచ్చే వరకు ఏ బస్సులో ఎంత ఆదాయం వుంది, ఏ బస్సు ఎక్కడ వుంది అనే విషయం డిపో అధికారులకు తెలిసే అవకాశం ఇప్పటి వరకు లేదు. కొత్త టిమ్‌ల ద్వారా బస్సు ఎక్కడ వుంది, సిబ్బంది పనితీరు, ఎంత ఆదాయం వచ్చింది.. అనే పూర్తి వివరాలు ఎప్పటికప్పుడు డిపో అధికారులు తెలుసుకునే అవకాశం ఏర్పడుతుంది. ప్రయాణికుల సంఖ్యను పెంచుకోవడానికి డిపో నుంచే కండక్లర్లకు సూచనలు ఇచ్చే వీలు కూడా వుంది. హైదరాబాద్‌లో పైలెట్ ప్రాజెక్టులో భాగంగా దిల్‌సుఖ్‌నగర్, బండ్లగూడ డిపోలలోని 74 బస్సులకు కొత్త టిమ్స్ ఇచ్చారు. హైదరాబాద్ నుంచి దూరప్రాంతాలకు వెళ్ళే కొన్ని బస్సులో కూడా టిమ్స్ వాడకం ప్రారంభమైంది.