కేజ్రీవాల్‌కి సుప్రీం కోర్టు బెయిలు.. అయినా జైల్లోనే!
posted on Jul 12, 2024 @ 11:44AM
ఢిల్లీ మద్యం విధానానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కి సుప్రీంకోర్డు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో తన అరెస్టును సవాల్ చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది. అయితే, ఈడీ కేసులో మధ్యంతర బెయిల్ లభించినప్పటికీ, ఆయన సీబీఐ కేసులో కూడా అరెస్టు అయినందున తీహార్ జైల్లోనే వుండనున్నారు.
మద్యం కుంభకోణం కేసులు ఢిల్లీ హైకోర్టు ఏప్రిల్ 9న ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ కేజ్రీవాల్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఈడీ, కేజ్రీవాల్ వాదనలు విన్న ద్విసభ్య ధర్మాసనం మే 17న తీర్పు రిజర్వ్ చేసింది. తాజాగా ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వెలువరించింది. ఈ సందర్భంగా ధర్మాసనం ‘‘ముఖ్యమంత్రి బాధ్యతల నుంచి కేజ్రీవాల్ వైదొలగే విషయంలో కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇవ్వడం లేదు. ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధిగా ఆయన ముఖ్యమంత్రి హోదాలో వున్నారు. అరెస్టు చేశారు కాబట్టి ముఖ్యమంత్రి పదవిలో వుండాలా, దిగిపోవాలా అనే నిర్ణయం ఆయనదే’’ అని వ్యాఖ్యానించింది. కేజ్రీవాల్ అరెస్టు వ్యవహారంలో ఈడీకి వున్న అధికారాలు, పాలసీలపై కోర్టు కొన్ని ప్రశ్నలు వేసింది. ఆ తర్వాత సీఎం పిటిషన్‌పై విచారణను విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది.