బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మాటలకు అర్థాలు వేరులే!
posted on Jul 12, 2024 @ 10:21AM
‘ఆడవారి మాటలకు అర్థాలు వేరులే...’ అనే పాటని ఇప్పుడు కాస్తంత మార్చుకుని.. ‘బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మాటలకు అర్థాలు వేరులే...’ అని రాగాలు తీయాల్సిన పరిస్థ్థితి వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ త్వరలో ఖాళీ అవబోతోంది. కేసీఆర్ కుటుంబం, ఆ కుటుంబానికి వీర విధేయుల్లా వుండే ఇద్దరు ముగ్గురు తప్ప మిగతా ఎమ్మెల్యేలందరూ త్వరలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధంగా వున్నారు. ఇప్పటికే కొంతమంది కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుని ప్రశాంతంగా వున్నారు. కాకపోతే వెరైటీ ఏంటంటే, కాంగ్రెస్ పార్టీలో చేరినవారందరూ గతంలో ‘‘మేం బీఆర్ఎస్‌ని వదిలిపెట్టం.. మా కంఠంలో ప్రాణం వున్నంతవరకూ బీఆర్ఎస్‌లోనే వుంటాం’’ అని స్టేట్‌మెంట్లు ఇచ్చిన వాళ్ళే. ఏ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయినా మీడియా ముందుకు వచ్చి, నేను బీఆర్ఎస్‌లోనే వుంటా... నేను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానని పుకార్లు క్రియేట్ చేసే వాళ్ళ మీద కేసు పెడతా’ అని స్టేట్‌మెంట్ గనుక ఇచ్చారంటే, త్వరలో వారు బీఆర్ఎస్‌లో చేరబోతున్నారన్న విషయాన్ని జనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే, ఆ తర్వాత సదరు నాయకులు ఎలాగూ కాంగ్రెస్‌లోకి జంప్ అవుతారు. అప్పుడు షాక్ అవకుండా వుండొచ్చు.
ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, హైదరాబాద్ నగరంలో వున్న పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు... పలువురు అనే మాటకంటే, దాదాపు అందరూ అనడం బెస్ట్.. అవును.. దాదాపు అందరూ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ బాటలో వున్నారు. ఆల్రెడీ ఇద్దరు జాయిన్ అయ్యారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా పార్టీ మారబోతున్నారని వార్తలు వచ్చాయి. దాంతో ఆయన చాలా సీరియస్ అయిపోయారు. నేనేంటి, కాంగ్రెస్ పార్టీలో చేరేదేంటి? నీతి, నిజాయితీలకు ప్యాంటూ చొక్కా వేస్తే నాలాగే వుంటుంది అన్నంత రేంజ్‌లో మాట్లాడారు. తన పార్టీ మార్పు వార్తలని తీవ్రంగా ఖండించారు. మీడియా ముందు ఆయన ఆవేశం చూసి చాలామంది అయ్యో.. నిజమేనేమో అనుకున్నారు. అలా రెండ్రోజులు గడిచాయో లేదు.. ఆయనే స్వయంగా నేను కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నానని ప్రకటించారు. ఇలా వుంటాయి రాజకీయ నాయకుల వ్యవహారాలు.
తన పార్టీ ఖాళీ అయిపోతోందని అర్థం చేసుకున్న కేసీఆర్, ఆమధ్య తన ఎమ్మెల్యేలందర్నీ పిలిపించుకుని, పార్టీ మారొద్దని హితవు పలికారు. అప్పుడు ఎమ్మెల్యేలందరూ ‘‘ఛ.. ఛ.. అలాంటిదేమీ లేదు దొరా’’ అని పెద్దాయనకి హామీ ఇచ్చి వచ్చారు. అలా హామీ ఇచ్చి వచ్చిన వారిలో ఇప్పటికే ఆరుగురు కాంగ్రెస్‌లో చేరారు. మిగతావాళ్ళు మంచి ముహూర్తం కోసం వేచి చూస్తున్నారు.