స్విమ్మింగ్ పూల్‌లో కరెంట్ షాక్.. 16 మందికి గాయాలు!
posted on Jul 12, 2024 @ 9:57AM
స్విమ్మింగ్ పూల్‌లోకి దిగిన 16 మందికి కరెంట్ షాక్ కొట్టి గాయాలయ్యాయి. గాయాలైన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా వుంది. హైదరాబాద్ శివార్లలో వున్న జల్‌పల్లిలో గురువారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. హైదరాబాద్‌లో్ని ఆగాపురలో నివాసం వుండే మూడు కుటుంబాలకు చెందిన 56 మంది జల్‌పల్లిలోని ఒక ఫామ్‌హౌస్‌కి వెళ్ళారు. సాయంత్రం సమయంలో ఫామ్‌హౌస్‌లో వున్న స్విమ్మింగ్ పూల్‌లో 16 మంది దిగారు. అందరూ ఈత కొడుతూ వుండగా నీటిలోకి ఒక్కసారిగా విద్యుత్ సరఫరా అయింది. దాంతో పూల్ చివరి భాగంలో వున్న ఆరుగురు మహిళలు, ఐదుగురు పిల్లలు, ముగ్గురు యువకులకు గాయాలయ్యాయి. కొలను మధ్యలోనే వున్న పర్వేజ్ (19), ఇంతియాజ్ (22) రెండు నిమిషాలపాటు కరెంట్ షాక్‌కి గురయ్యారు. దాంతో వీరికి తీవ్ర గాయాలు అయ్యాయి. వీరిద్దరి పరిస్థితి విషమంగా వున్నట్టు తెలుస్తోంది. స్విమ్మింగ్ పూల్ లోపల లైటింగ్ కోసం ఏర్పాటు చేసిన వైరింగ్ తెగిపోవడం వల్ల ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.