అవి జగన్ ఓట్లు కావు.. షర్మిల
posted on Jul 13, 2024 @ 10:49AM
ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో వైసీపీ అత్యంత ఘోరమైన, అవమానకరమైన ఓటమిని చవి చూసిన సంగతి తెలిసిందే. 2019 ఎన్నికలలో 151 స్థానాలలో ఆ పార్టీకి తిరుగులేని విజయాన్ని కట్టబెట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయన ఐదేళ్ల పాలనా వైభోగాన్ని చూసి ఇక దయచేయండి అని మర్యాద కూడా లేకుండా చెప్పారు. కుల, మత, వర్గ, ప్రాంతీయ బేధాలు లేకుండా రాష్ట్రం మొత్తం ఒకే విధమైన తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు సారాంశం, అధికారానికే కాదు, కనీసం విపక్షంగా కూడా ఉండేందుకు వైసీపీని అంగీకరించం అన్నదే.
ఇంతటి ఘోర ఓటమి తరువాత కూడా వైసీపీ తమకు 39శాతం మంది ప్రజలు మద్దతుగా ఉన్నారంటూ గొప్పలు చెప్పుకుంటున్నారు. కళ్లు మూసి తెరిచేసరికి ఐదేళ్లూ పూర్తవుతాయి, మళ్లీ మనదే అధికారం అంటే వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ ఇంకా జనాలను, తమ పార్టీ నేతలు, క్యాడర్ ను నమ్మించడానికి చూస్తున్నారు. ఇప్పటికే పలువురు మాజీ మంత్రులు పక్క చూపులు చూస్తున్నారు. పార్టీ నుంచి వైదొలగడానికి అవకాశం కోసం చూస్తున్నారు. ఆ విషయాన్ని దాపరింకం లేకుండా బాహాటంగానే చెప్పేస్తున్నారు. అయినా జగన్ మాత్రం 40 శాతం మంది మద్దతు ఉందన్న భ్రమల్లో ఉన్నారు. ఆ భ్రమలన్నీ పటాపంచలైపోయేలా షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జగన్ ముఖ్యమంత్రిగా ఉండాలా లేదా అన్న విషయంపైనే జరిగాయనీ, జనం జగన్ ను నిర్ద్వంద్వంగా తిరస్కరించి చంద్రబాబుకు పట్టం కట్టారని షర్మిల చెప్పారు.
వైసీపీకి వచ్చిన 39శాతం ఓట్లు కూడా కాంగ్రెస్ పార్టీవేననీ, అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ బలహీనంగా ఉండటంతో అవి వైసీపీకి పడ్డాయనీ వివరించారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు వద్దు అనుకున్న వారు మాత్రమే జగన్ కు ఓటేశారు తప్ప వాళ్లెవరూ జగన్ ను నమ్మడం లేదనీ, విశ్వసించడం లేదనీ షర్మిల అన్నారు. ఇటీవలి ఎన్నికలలో జగన్ పార్టీకి ఓటేసిన వాళ్లంతా కాంగ్రెస్ నుంచి అటువైపు వెళ్లిన వాళ్లే. వాళ్లంతా మా వాళ్ళు. మా వాళ్లను మేం రాబట్టు రాబట్టుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశారు. జగన్ పార్టీకి ఓటేసిన 39శాతం మందీ కాంగ్రెస్ వారేనని ఆమె తెలిపారు. అది మా ఓటు బ్యాంకు. 2029లో ఆ విషయం అందరికీ అర్ధమౌతుందని చెప్పారు. అంటూ షర్మిల వివరించారు.