సీబీఎన్.. 30 రోజులలోనే రాష్ట్ర ముఖచిత్రం మార్పు.. ఆ వేగం అనితర సాధ్యం!
posted on Jul 13, 2024 @ 9:58AM
జగన్ ఐదేళ్ల పాలనలో పొరుగు రాష్ట్రాలకు హేళనలకు గురైన ఆంధ్రప్రదేశ్ ను తాను సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన నెల రోజులలోనూ అభివృద్ధికి ఆనవాలుగా మార్చేశారు చంద్రబాబు. అరకొర సంక్షేమం వినా, అభివృద్ధి ఊసే లేకుండా అద్వానంగా మారిన రాష్ట్రాన్ని తాను అధికారపగ్గాలు చేపట్టిన 30 రోజుల వ్యవధిలో అడుగడుగునా అభివృద్ధి ఆనవాలు కనిపించేలా మార్చేశారు చంద్రబాబు. రాజకీయ పరిశీలకులు సైతం చంద్రబాబు వేగం అనితర సాధ్యం అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి అధికారం చేపట్టినప్పటి నుంచీ ఎన్నికల వాగ్దానాల అమలుతో పాటు, రాష్ట్ర అభివృద్ధికి కూడా వేగంగా అడుగులు పడుతున్నాయి. ఐదేళ్ల విధ్వంస పాలన కారణంగా ప్రజలు ఎదుర్కొన్న కష్టాలను సాధ్యమైనంత త్వరగా కడతేర్చాలన్న లక్ష్యంతో పాలన సాగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆ దిశగా వేగంగా చర్యలు తీసుకుంటున్నారు. జనం ఆయన వేగం అనితర సాధ్యం అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పదవీ బాధ్యతలు చేపట్టిన నెల రోజులలో ఆయన ప్రజలకు ప్రయోజనం చేకూర్చేలా, రాష్ట్ర ప్రగతిని పరుగులు పెట్టించేలా మొత్తం 30 కార్యక్రమాలను చేశారు. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా 15, 347 టీచర్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అలాగే ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానం మేరకు పెంచిన వృద్ధాప్య, వితంతు పింఛన్లను అరియర్స్ తో ఒకటో తేదీనే అందజేశారు. అదే విధంగా దివ్యాంగ పించన్ ను రెట్టింపు చేసి అంటే గతంలో 3000 ఉన్న పించన్ ను 6000కు పెంచి అందజేశారు. వృద్ధాప్య పించన్లను ప్రభుత్వోద్యోగుల ద్వారా ఇంటి వద్దనే పంపిణీ చేశారు. ఇక రాష్ట్రంలో తీవ్ర ఆందోళనకు కారణమై ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేశారు. ఉచిత ఇసుక విధానాన్ని అమలులోకి తీసుకు వచ్చారు. గతంలో బంగారం కంటే ప్రియంగా మారిన ఇసుక ఇప్పుడు లోడింగ్, రవాణా చార్జీలు చెల్లించి ఉచితంగా పొందవచ్చు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 183 అన్న క్యాంటీన్లను ఆగస్టు 15 నుంచి ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశారు. ఇక గంజాయి, డ్రగ్స్ కట్టడికి పటిష్టమైన చర్యలు తీసుకున్నాయి. ఎర్రచందనం స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపారు. రాజధాని అమరావతి పనులను పరుగులెత్తిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు పనులను పున: ప్రారంభించారు. స్కిల్ సైన్సెస్ పై కసరత్తు ఆరంభమైంది. తల్లికి వందనం పథకం కింద ఒక ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే వారందరినీ ఆర్థిక దన్ను అందించే కార్యక్రమానికి మార్గదర్శకాలు విడుదల చేశారు.
పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను కృష్ణలోకి మళ్లించి కృష్ణా డెల్టాకు నీరు విడుదల చేశారు. జగన్ బొమ్మతో ఉన్న పట్టాదారు పాసుపుస్తకాల స్థానంలో రాజముంద్రతో పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీకి సర్వం సిద్ధం చేశారు. మహిళల భద్రతకు పెద్ద పీట వేశారు. అత్యాచార నిందితులకు కఠిన చర్యలు తప్పవన్న స్పష్టమైన హచ్చరిక చేశారు. రెండేళ్లల్లో అంటే 2026 నాటికి భోగాపురం విమానాశ్రయాన్ని పూర్తి చేయాలని సంకల్పించడమే కాకుండా అందుకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. కేంద్ర మంత్రి రామ్మోహననాయుడిచే 2026 నాటికి భోగాపురం విమానాశ్రయం పూర్తి అవుతుందన్న ప్రకటన చేయించారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమలలో గత ఐదేళ్ల కాలంలో భ్రష్టుపట్టిపోయిన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు తిరుమలలో ప్రక్షాళన కార్యక్రమం ఆరంభమైంది. కేంద్రం నుంచి అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు అనుమతి మంజూరయ్యిందంటే అందుకు చంద్రబాబు ఒత్తిడే కారణమనడంలో సందేహం లేదు. గత ఐదేళ్లలో ఎన్నడూ లేని విధంగా ఒకటో తేదీనే ఉద్యోగులకు వేతనాలు అందించారు.
జగన్ హయాంలో పారిశ్రామికంగా ఒక్కటంటే ఒక్క అడుగు పడలేదు సరికదా, రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలు పొరుగురాష్ట్రాలకు తరలిపోయాయి. అటువంటిది చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 30 రోజులలోనే రాష్ట్రానికి 70వేల కోట్ల పెట్టుబడితో బీపీసీఎస్ సంస్థ ముందుకు వచ్చింది. అలాగే అమరావతిలో ఎక్స్ఎల్ఆర్ఎల్ విద్యాసంస్థ ఏర్పాటుకు ముందుకు వచ్చింది.
ఇక ఇరిగేషన్ రంగంలో కూడా ప్రగతి, పురోగతి స్పష్టంగా కనిపిస్తోంది. ఐదేళ్ల తరువాత తొలి సారిగా పలాసకు సాగునీరు అందింది. అలాగే ఐదేళ్ల తరువాత పురుషోత్తపట్నం నీళ్లు పిఠాపురానికి అందాయి. ఒకే ఒక్క వాట్సప్ కాల్ తో పాతిక మంది దివ్యాంగ విద్యార్థులకు ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలలో జారిపోయాయనుకున్న సీట్లు తిరిగి వచ్చాయి. ఇంటర్ విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు అందాయి.
విజయవాడ తూర్పు బైపాస్ కు కేంద్రం అనుమతి మంజూరు చేసింది. తెలంగాణతో దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న విభజన సమస్యల పరిష్కారినికి ముందడుగు పడింది. ఇక సామాన్యుడికి భారంగా మారిన నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణకు చర్యలు ప్రారంభమయ్యాయి. రైతు బజార్లలో కందిపప్పును చౌక ధరకు విక్రయిస్తున్నారు. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమాలను పరుగులు పెట్టిస్తూనే.. కేంద్రం నుంచి సహకారం విషయంలో కూడా చంద్రబాబు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. సీఎం హోదాలో రెండు రోజుల పాటు హస్తినలో పర్యటించిన ఆయన ప్రధాని, హోంమంత్రి సహా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. రాష్ట్ర సమస్యలపై చర్చించారు. కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.