కంగన కొత్త వివాదం... ఆధార్!
posted on Jul 12, 2024 @ 11:29AM
సినీ నటిగా ఎన్నో వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన కంగనా రనౌత్ ఇప్పుడు బీజేపీ ఎంపీగా కూడా వివాదాల బాటలో పయనిస్తున్నారు. కంగన తన హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నియోజకవర్గం ప్రజల ముందు వుంచిన డిమాండ్ మీద ప్రతిపక్షాలు విమర్శలు కురిపిస్తున్నాయి. తన నియోజకవర్గం ప్రజలు తనను కలవటానికి వచ్చినప్పుడు ఆధార్ కార్డును తప్పనిసరిగా తెచ్చుకోవాలని కంగన డిమాండ్ చేస్తున్నారు. ‘‘నన్ను కలవటానికి వచ్చే నా నియోజకవర్గ ప్రజలు తమ దగ్గర ఆధార్ కార్డు తప్పనిసరిగా వుంచుకోవాలి. అలాగే, నన్ను ఎందుకు కలవాలని అనుకుంటున్నారో ఆ అంశాన్ని ఒక కాగితం మీద రాసి ఇవ్వాలి. దాని వల్ల ఎలాంటి అసౌకర్యానికి తావు వుండదు’’ అని కంగన సూచించారు. దీని మీద కాంగ్రెస్ నాయకుడు, హిమాచల్ ప్రదేశ్ మంత్రి విక్రమాదిత్య సింగ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘‘మనం ప్రజా ప్రతినిధులం. రాష్ట్రంలో ప్రతి వర్గానికి చెందిన ప్రజలని కలవాల్సిన బాధ్యత మనమీద వుంది. మనల్ని కలవటానికి ప్రజలు ఆధార్ కార్డు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ప్రజల్ని కంగన అలా డిమాండ్ చేయడం కరెక్ట్ కాదు’’ అని ఆయన వ్యాఖ్యానించారు. విక్రమాదిత్య సింగ్ మీదే మండి నియోజకవర్గం నుంచి కంగన విజయం సాధించారు.