తల్లికి వందనం, అన్నదాతా సుఖీభవ పథకాల అమలు ఎప్పటి నుంచంటే?
posted on Feb 27, 2025 9:11AM
ఐదేళ్ల జగన్ పాలన నుంచి ఆంధ్రప్రదేశ్ కు గత ఎన్నికలలో విముక్తి లభించింది. ఆర్థికంగా, అభివృద్ధి పరంగా.. ఒకటనేమిటి.. అన్ని విధాలుగా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన వైసీపీ పాలనపై ఆంధ్రప్రదేశ్ జనం తమ అభిప్రాయాన్ని ఓటు రూపంలో తెలియజేశారు. వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా గట్టి బుద్ధి చెప్పారు. అలాగే అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా చెప్పే చంద్రబాబుకు పట్టం కట్టారు. ఆయన నాయకత్వంలోని తెలుగుదేశం కూటమికి అపూర్వ విజయాన్ని అందించారు.
దీంతో రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా అధికార పగ్గాలు చేపట్టారు.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచీ ఆయన రాష్ట్రాన్ని గాడిలో పెట్టడంపైనే దృష్టి పెట్టారు. జగన్ హయాంలో గుంతలమయంగా, అధ్వానంగా మారిన రహదారులను మెరుగుపరచడం, అస్తవ్యస్థం అయిపోయిన ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దడం, రాష్ట్ర ఆదాయాన్ని పెంచేందుకు పెట్టుబడుల ఆకర్షణ వంటి విషయాలపైనే దృష్టి కేంద్రీకరించారు. ఎనిమిది నెలల కాలంలో రాష్ట్రంలో పరిస్థితులు ఓ మేరకు కుదుటపడ్డాయి అనుకున్న తరువాత ఆయన ఇప్పుడు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై దృష్టి సారించారు. ముఖ్యంగా సూపర్ షిక్స్ హామీల అమలుకు దాదాపుగా షెడ్యూల్ ప్రకటించేశారు. ఇప్పటికే అంటే అధికార పగ్గాలు అందుకోగానే ఆయన ఎన్నికల సమయంలో ఇచ్చిన హీమీ మేరకు వృద్ధాప్య పింఛన్లను చెప్పినట్లుగా పెంచి మరీ ఇస్తున్నారు. అలాగే దీపం2 పథకం కూడా అమలులోకి వచ్చింది. అదే విధంగా మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం పథకాన్ని ఈ ఉగాది నుంచి అమలు చేయనున్నట్లు ప్రకటించారు.
ఇక తాజాగా అసెంబ్లీ వేదికగా ఆయన మరో రెండు హామీల అమలును ప్రస్తావించారు. మే నెల నుంచీ తల్లికి వందనం పథకాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ పథకం కింద చదువుకుంటున్న పిల్లలు ఉన్న తల్లులందరికీ ఎంత మంది పిల్లలు అన్న దానితో సంబంధం లేకుండా ప్రతి బిడ్డకూ 15 వేల రూపాయలు అందించనున్నారు.
అలాగే రైతులకు అన్నదాత సుఖీభవ పథకాన్ని కూడా ఈ మే నెల నుంచే ప్రారంభించనున్నట్లు అసెంబ్లీ వేదికగా స్పష్టమైన ప్రకటన చేశారు. ఈ పథకం కింద రాష్ట్రంలోని రైతులందరికీ ఏడాదికి 20 వేల రూపాయలు అందుతుంది. ఇందులో 14 వేల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. ఇక ప్రధాన మంత్రి కిసాన్ యోజన కింద కేంద్రం అందించే 6వేల రూపాయలు కూడా కలిపి మొత్తం 20 వేలు అందుతాయి. ఈ సహాయాన్ని మూడు విడతలుగా అందిస్తారు. నగదు నేరుగా రైతు ఖాతాలోనే జమ అవుతుంది. ఇక రాష్ట్రంలో మత్స్య కారులకు ఆర్థిక మద్దతు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా త్వరలోనే అమలు చేస్తారు.
జగన్ హయాంలో ఆయన విధానాలు, ఆర్థిక అరాచకత్వం కారణంగా రాష్ట్రం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన సంగతి తెలసిందే. బటన్ నొక్కడమే పాలన అన్నట్లుగా ఆయన సాగించిన అరాచక పాలన కారణంగా రాష్ట్రం అన్ని విధాలుగా వెనుకబడిపోయింది.
అయితే సంక్షోభాలలోనే అవకాశాలు వెతుక్కోవాలని చెప్పే చంద్రబాబు.. రాష్ట్ర పాలనా పగ్గాలు చేపట్టిన తరవాత రాష్ట్రాన్ని గాడిలో పెట్టడంపై మొదటిగా దృష్టి సారించారు. ఇక నుంచి రాష్ట్ర ప్రగతి, ప్రజా సంక్షేమాన్ని జోడు గుర్రాళ్లా పరుగులెట్టించే దిశగా అడుగులు వేస్తున్నారు.