పోసాని సతీమణికి జగన్ ఫోన్ పరామర్శ
posted on Feb 27, 2025 @ 10:54AM
కేసుల భయంతో వైసీపీ నేతలు వణికిపోతున్నారు. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో మొదలైన అరెస్టుల పర్వం కొనసాగుతూనే ఉంది. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై వరుసగా నమోదవుతున్న కేసులతో ఆయనకు ఇప్పట్లో బెయిల్ లభించే అవకాశం లేదంటున్నారు. తాజాగా.. సినీ నటుడు, వైసీపీ నేత, బూతుల సామ్రాట్ పోసాని కృష్ణమురళిని పోలీసులు అరెస్టు చేశారు. వైసీపీ ప్రభుత్వంలో ఏపీఎఫ్‌టీవీడీసీ చైర్మన్‌గా పోసాని కృష్ణ మురళి పని చేశారు. ఆ సమయంలో చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్‌తో పాటు నారా లోకేశ్ ను అసభ్యకరంగా దూషించారు. వారి ఇంట్లో పిల్లల్ని, తల్లిదండ్రుల్ని కూడా వదిలి పెట్టకుండా దూషించారు. దీంతో ఏపీలోని పలు స్టేషన్‌లలో ఆయనపై కేసులు నమోదయ్యాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కూడా ఆయన పలు సందర్భాల్లో అభ్యంతరకర భాషతో కూటమి నేతలను దూషించారు.
ఇటీవల కాలంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడిపైనా అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయనపై బాపట్ల, అనంతపురం, పల్నాడు జిల్లా నరసరావుపేట, చిత్తూరు జిల్లా యాదమరి, తిరుపతి జిల్లా పుత్తూరులో పోలీసులకు ఫిర్యాదులు అందాయి. మొత్తంగా ఏపీ వ్యాప్తంగా పలు అంశాలపై పోసానిపై 11 కేసులు నమోదయ్యాయి. ఇదిలా ఉంటే.. రెండు నెలల క్రితం పోసాని మీడియా సమావేశం పెట్టి తనకు జ్ఞానోదయం అయ్యిందనీ, ఇకపై రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. దీంతో కూటమి ప్రభుత్వం తనను వదిలేస్తుందని పోసాని భావించినట్లున్నారు. కానీ, బండబూతులు తిట్టి రాజకీయాలు వదిలేశానంటే వదలరని పోలీసులు ఆయనను అరెస్టు చేయడంతో క్లారిటీ వచ్చేసినట్లయింది.
అదలా ఉంటే పోసాని వైసీపీకి గుడ్ బై చెప్పినప్పటికీ జగన్ ఆయనపై ప్రేమ కనపరుస్తుండటం హాట్‌టాపిక్‌గా మారింది. పోసాని కృష్ణమురళి అరెస్ట్ ను ఖండించిన జగన్ హైదరాబాద్ లోని ఆయన భార్య పోసాని కుసుమలతతో గురువారం ఫోన్ లో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వ పాలన నిరంకుశంగా సాగుతోందని, ఈ అరెస్ట్ విషయంలో పోసాని కృష్ణమురళికి వైసీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పార్టీ తరుఫున న్యాయ పరంగా సహాయం అందిస్తామని, ఇప్పటికే పార్టీకి సంబంధించిన సీనియర్ న్యాయవాదులకు ఈ వ్యవహారాన్ని అప్పగించామని తెలిపారు. మామూలుగా పార్టీలో ఉన్న వారికి కూడా జగన్ పెద్దగా ప్రాధాన్యత ఇవ్వరు. అలాంటిది వైసీపీకి రిజైన్ చేసిన పోసానిపై అంత ప్రేమ కనబరుస్తుండటం ఆ పార్టీ వర్గాలనే ఆశ్చర్యపరుస్తోందట.