శివరాత్రి రోజే శివాలయంలో శివలింగం చోరీ
posted on Feb 27, 2025 8:43AM
ఓ వైపు దేశం అంతా శివరాత్రి ఉత్సవాలు జరుపుకుంటుంటే.. అదే అదునుగా ఓ దేవాలయంలో శివలింగాన్ని చోరీ చేశాడో ప్రబుద్ధుడు. శైవక్షేత్రాలన్నిటా భక్తులు భక్తిశ్రద్ధలతో శివుడిని కొలుచుకునే మహా శివరాత్రి పర్వదినం రోజు గుడిలో ఉన్న శివలింగాన్ని ఎత్తుకు పోయిన ఘటన గుజరాత్‌లోని ద్వారక జిల్లాలో జరిగింది.
ద్వారక జిల్లాలోని కళ్యాణ్‌పూర్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన హర్సిద్ధి మాతాజీ ఆలయానికి సమీపంలో ఉన్న శ్రీ భిద్భంజన్ భవనీశ్వర్ మహాదేవ్ ఆలయంలో బుధవారం (ఫిబ్రవరి 26) తెల్లవారు జామున జరిగింది. అత్యంత పురాతనమైన ఈ ఆలయంలో శివలింగం చోరీకి గురికావడం సంచలనం సృష్టించింది. బుధవారం తెల్లవారు జామున పూజారి ఆలయం తలుపులు తెరవగా.. గుడిలో శివలింగం మాయమైనట్లు వెలుగులోకి వచ్చింది.
శతాబ్దాల నాటి ఆ ఆలయంలోని శివలింగం అతి పురాతనమైంది. ఈ శివలింగాన్ని మహాదేవుడి విశ్వశక్తికి నిదర్శమని భక్తుల నమ్మకం. అలాంటి పురాతన రాతి శివలింగం చోరీకి గురికావడం భక్తులలో ఆందోళనను నింపింది. ఆలయ పూజారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.