ప్రశాంతంగా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్
posted on Feb 27, 2025 @ 10:22AM
ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. గురువారం (ఫిబ్రవరి 27) ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. గట్టి బందోబస్తు నడుమ పోలింగ్ జరుగుతోంది. మార్చి 3వ తేదీన ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన ఉంటుంది. సమస్యాత్మక ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.ఆంధ్రప్రదేశ్ లో రెండు గ్రాడ్యుయేట్, ఒక టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ జరుగుతుండగా, తెలంగాణ లో రెండు ఉపాధ్యాయ, ఒక గ్రాడ్యుయేట్ స్థానానికి పోలింగ్ జరుగుతోంది.
గుంటూరు, కృష్ణా జిల్లాలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలో ఉదయం ఎనిమిది గంటల నుంచే ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి తరలి వస్తున్నారు. ఈ ఎన్నికలో ప్రధాన అభ్యర్థులు ఆలపాటి రాజేంద్రప్రసాద్, సిట్టింగ్ ఎమ్మెల్సీ లక్ష్మణ రావు గుంటూరులో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి లోకేష్ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం 33 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో,3,47,116 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంది. అయితే శివరాత్రి జాగారం ఎఫెక్ట్ తో, చాలా ప్రాంతాల్లో పోలింగ్ మందకొడి సాగుతోంది.... మద్యాహ్నం నుండి పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉంది ..