పోసాని అరెస్ట్.. నెక్స్ట్ ఎవరు?.. జగన్ కు ఇక జైలు యాత్రలే!
posted on Feb 27, 2025 5:21AM
వైసీపీ హయాంలో అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజలను, టీడీపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టారో.. వారిని వదిలే ప్రసక్తే లేదు.. వెయిట్ అండ్ వాచ్.. మార్క్ మై వర్డ్స్.. టైం.. డేట్ కూడా రాసుకోండి అంటూ మంత్రి నారా లోకేశ్ మండలిలో ప్రతిపక్ష సభ్యులను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. తద్వారా త్వరలో మరికొంత మంది వైసీపీ నేతలు అరెస్టు కాబోతున్నారని లోకేశ్ క్లియర్ కట్ గా చెప్పారు. దీంతో వైసీపీ నేతలు వణికిపోతున్నారు. ఎవరు ఎప్పుడు కటకటాల పాలుకావాల్సి వస్తుందోనని భయపడుతున్న పరిస్థితి. ఇప్పటికే వల్లభనేని వంశీపై వరుసగా కేసుల మీద కేసులు నమోదౌతున్నాయి. సిట్ విచారణ కొనసాగుతుంది. ఇప్పట్లో వంశీ బయటకు వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. తాజాగా.. సినీ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళిని పోలీసులు అరెస్టు చేశారు.
పోసాని కృష్ణ మురళిని రాయచోటి పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం రాత్రి హైదరాబాద్ లోని రాయదుర్గం మైహోం భూజా అపార్ట్ మెంట్స్ లో ఉంటున్న పోసానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తరువాత ఆయన్ను ఏపీకి తరలించారు. అరెస్టు సమయంలో పోలీసులతో పోసాని వాగ్వివాదానికి దిగారు. బనీన్, నిక్కర్ మీదనే హడావుడి చేశాడు. డ్రెస్ వేసుకుని రావాలని చెప్పినా వినకుండా ఆయన ఓవరాక్షన్ చేస్తుండటంతో.. అతి కష్టంమీద పోలీసులు పోసానిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. గురువారం (ఫిబ్రవరి 27) రాజంపేట కోర్టులో పోసానిని హాజరుపరిచే అవకాశం ఉంది. పోసానిపై గతంలో కేసులు నమోదయ్యాయి. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. చంద్రబాబు, పవన్, లోకేశ్‌పై అనుచిత విమర్శలు చేశారని స్థానికుల ఫిర్యాదు మేరకు 196, 353(2), 111 రెడ్‌విత్ 3(5) సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో వారెంట్ ఇచ్చినప్పటికీ పోసాని స్పందించలేదు. దీంతో బుధవారం రాత్రి సంబేపల్లి ఎస్ఐ రాయదుర్గం చేరుకొని పోసానిని అరెస్టు చేశారు
వైసీపీ ప్రభుత్వంలో ఏపీఎఫ్‌టీవీడీసీ చైర్మన్‌గా పోసాని కృష్ణ మురళి పనిచేశారు. ఆ సమయంలో చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్‌తోపాటు నారా లోకేశ్ ను అసభ్యకరంగా దూషించారు. వారి ఇంట్లో పిల్లల్ని, తల్లిదండ్రుల్ని కూడా వదిలి పెట్టకుండా దూషించాడు. దీంతో ఏపీలోని పలు స్టేషన్‌లలో ఆయనపై కేసులు నమోదయ్యాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కూడా ఆయన పలు సందర్భాల్లో అభ్యంతరకర భాషతో కూటమి నేతలను దూషించారు. ఇటీవల కాలంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడిపైనా అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయనపై బాపట్ల, అనంతపురం, పల్నాడు జిల్లా నరసరావుపేట, చిత్తూరు జిల్లా యాదమరి, తిరుపతి జిల్లా పుత్తూరులో పోలీసులకు ఫిర్యాదులు అందాయి. మొత్తంగా ఏపీ వ్యాప్తంగా పలు అంశాలపై పోసానిపై 11 కేసులు నమోదయ్యాయి. ఇదిలా ఉంటే.. రెండు నెలల క్రితం పోసాని మీడియా సమావేశం పెట్టి తనకు జ్ఞానోదయం అయ్యిందనీ, ఇకపై రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. దీంతో కూటమి ప్రభుత్వం తనను వదిలేస్తుందని పోసాని భావించినట్లున్నారు. కానీ, బండబూతులు తిట్టి రాజకీయాలు వదిలేశానంటే వదలరని పోలీసులు ఆయనను అరెస్టు చేయడంతో క్లారిటీ వచ్చేసినట్లయింది.
మండలిలో లోకేశ్ స్ట్రాంగ్ వార్నింగ్ తరువాత చాలా మంది వైసీపీ నేతలు రహస్య ప్రాంతాలకు వెళ్లి తలదాచుకుంటున్నారని ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వంశీ అరెస్టు తరువాత ఎవర్ని అరెస్టు చేస్తారోనని వైసీపీ నేతలు భయంతో వణికిపోతున్నారు. అయితే ముందుగా పోసాని వంతు వచ్చింది. పోసానిని అరెస్టు చేసిన తరువాత నెక్ట్స్ ఎవరు..? అనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. అయితే, ఈసారి పక్కాగా కొడాలి నాని అరెస్టు ఉంటుందని వైసీపీ నేతలు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే కొడాలి నానిపై పోలీసులు దృష్టిసారించినట్లు తెలుస్తోంది. గతంలో ఆయనపై కేసులు, ప్రస్తుతం పలు స్టేషన్‌లలో ఆయనపై నమోదైన కేసుల వివరాలను సేకరిస్తున్నారట. దీంతో కొడాలి నానిసైతం హైదరాబాద్ తోపాటు బెంగళూరు వంటి నగరాల్లోనే ఎక్కువగా ఉంటున్నారని టాక్ నడుస్తోంది. ఇటీవల వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి వంశీని పరామర్శించేందుకు విజయవాడ జైలుకు వెళ్లారు. ఆ సమయంలో జగన్ వెంట కొడాలి నాని ఉన్నాడు. మరుసటి రోజు గుంటూరు మిర్చి యార్డుకు జగన్ వెళ్లిన సమయంలోనూ కొడాలి నాని ఉన్నాడు. ఆ వెంటనే కొడాలి నాని తన అనుచరులకు కూడా చెప్పకుండా రహస్య ప్రాంతానికి వెళ్లిపోయినట్లు టాక్ నడుస్తోంది. వైసీపీ నేతలు సైతం అధిక శాతం మంది పోసాని తరువాత కొడాలి నాని అరెస్టు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
పోసాని కృష్ణమురళి అరెస్టుతో జగన్ మోహన్ రెడ్డి మళ్లీ బెంగళూరు నుంచి ఏపీకి రావాల్సిన పరిస్థితి తలెత్తింది. అధికార మదంతో హద్దులు మీరి ప్రవర్తించిన వైసీపీ నేతలను పోలీసులు అరెస్టులు చేసి జైళ్లకు పంపిస్తున్నారు. ఈ క్రమంలో జగన్ బెంగళూరు నుంచి నేరుగా జైలుకు వెళ్లి వైసీపీ నేతలను పరామర్శిస్తున్నారు. ఇటీవలే విజయవాడ జైలుకెళ్లి వల్లభనేని వంశీతో జగన్ ములాఖత్ అయ్యాడు. ప్రస్తుతం పోసాని మురళీ కృష్ణ కోసం జగన్ మళ్లీ బెంగళూరు నుంచి నేరుగా జైలుకెళ్లి పరామర్శించే అవకాశం ఉంది. అంతే ముందు ముందు జగన్ మరిన్ని జైలు యాత్రలు చేయాల్సిన పరిస్థితి వస్తుందని వైసీపీ వర్గాల్లో టాక్ నడుస్తున్నది.