మళ్లీ కవిత మెడకు లిక్కర్ ఉచ్చు
posted on Feb 26, 2025 @ 1:25PM
ఢిల్లీ లిక్కర్ స్కాంలో తీగలాగితే డొంక కదులుతోంది. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా అసెంబ్లీ వేదికగా కాగ్ రిపోర్ట్ ను బయటపెట్టారు. ఢిల్లీలో బిజెపి ప్రభుత్వం అధికారంలో రాగానే తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే కాగ్ రిపోర్ట్ బయటపెట్టడంతో లిక్కర్ స్కాం మరో మారు చర్చకు దారి తీసింది. ఈ స్కాంలో చిక్కుక్కున్నఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ , మాజీ డిప్యూటి సిఎం మనీష్ సిసోడియా ఇప్పటికే బెయిల్ పై విడుదలైన సంగతి తెలిసిందే. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కెసీఆర్ కూతురు కవిత ఈ లిక్కర్ స్కాంలో కింగ్ పిన్ . సౌత్ గ్రూప్ కు చెందిన కవిత అప్పటి ఆప్ ప్రభుత్వాన్ని ప్రభావితం చేశారు. ఇటీవల జరిగిన ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ ఓడిపోవడానికి లిక్కర్ స్కాం ప్రధాన కారణం. ఢిల్లీ లిక్కర్ పాలసీపై 166 పేజీల కాగ్ రిపోర్ట్ లో రెండువేల కోట్ల స్కాం జరిగినట్టు ముఖ్యమంత్రి రేఖా గుప్తా వెల్లడించారు. నవంబర్ 2021 నుంచి సెప్టెంబర్ 2022 వరకు ఢిల్లీలో నూతన మద్యం విధానం కొనసాగింది. ఈ స్కాం వెలుగులోకి రావడంతో ఢిల్లీ లిక్కర్ పాలసీ రద్దయ్యింది. అప్పటి నుంచి తెలంగాణ పాలిటిక్స్ హీటెక్కాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో లిక్కర్ స్కాం ప్రచార అంశంగా మారిపోయింది. తెలంగాణలో వరుసగా మూడోసారి అధికారంలో రావాలనుకున్న బిఆర్ఎస్ కుప్పకూలడానికి లిక్కర్ స్కాం ముఖ్య భూమిక వహించింది. బిజెపి, బిఆర్ఎస్ దోస్తీ బలపడటానికి లిక్కర్ స్కాం ఓ టూల్ మాదిరిగా మారిపోయింది. ఎన్నికల ఫలితాల్లో బిఆర్ఎస్ ఓడిపోవటంతో బిజెపి కూడా దూరమైంది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి బిఆర్ ఎస్ కు తగిన సంఖ్యాబలం కూడా లేదు. 10 మంది బిఆర్ ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అధికారానికి పదేళ్లు దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి కవిత లిక్కర్ స్కాం రాజకీయ మైలేజీ ఇచ్చింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి లిక్కర్ స్కాం ఓ కారణమనే చెప్పాలి. లిక్కర్ స్కాంలో ఇరుక్కున్న కవితను రిలీజ్ చేయడానికి బిజెపి కవితకు సపోర్ట్ చేయలేదు. బిఆర్ ఎస్ రాజకీయంగా దెబ్బతినడమే కారణమైంది. . అదే సమయంలో బిజెపి కూడా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మంచి మెజారిటీతో తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తోంది. పర్యవసనాంగా కవిత తీహార్ జైల్లో ఉచలు లెక్కపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. కవితకు బెయిల్ లభించకపోవడంతో బిఆర్ఎస్ ను బిజెపి లో విలీనం దిశగా చర్చలు జరిగాయి. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటీఆర్ విలీన ప్రతిపాదనను ఆమోదం పలికినప్పటికీ బిఆర్ ఎస్ వ్యవస్థాపకులు కెసీఆర్ మాత్రం వెనకడుగు వేయడంతో కవిత జైల్లో పర్మినెంట్ ఖైదీ అని ప్రచారం జరిగింది. ఎట్టకేలకు కోర్టు బెయిల్ ఇవ్వడంతో కవిత బయటకొచ్చారు. గత దసరాకు ముందే ఆమె ఇంటికి వచ్చినప్పటికీ బతకమ్మ వేడుకలకు బ్రాండ్ అంబాసిడర్ అయిన కవిత గైనకాలజీ సమస్యలతో ఇంటికే పరిమితమయ్యారు. తీహార్ జైలు నుంచి విడుదలయ్యాక కవిత క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. కార్ రేస్ స్కాంలో అన్న కెటీఆర్ అరెస్ట్ తప్పదని ప్రచారం జరగడంతో కవిత మళ్లీ యాక్టివ్ అయ్యారు. రేవంత్ సర్కార్ పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తూ వచ్చారు. కవిత ఆరోపణలతో బిజెపి బిఆర్ఎస్ బంధం మళ్లీ బలపడిందనే ప్రచారం జరుగుతోంది. తెలంగాణ ఎంఎల్ సి ఎన్నికల్లో బిజెపి లాభపడే విధంగా బిఆర్ ఎస్ పావులు కదిపింది. కాంగ్రెస్ ను మట్టికరిపించడానికి బిఆర్ఎస్ కీలకమైన ఎంఎల్ సి ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. బిఆర్ఎస్ తటస్థం కావడంతో బిజెపి రాజకీయ ప్రయోజాలు మరింత బలపడ్డాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి లాభపడే విధంగా బిఆర్ఎస్ పావులు కదుపుతోంది. ఢిల్లీ బిజెపి బిఆర్ఎస్ ను శత్రువుగా పరిగణిస్తే కేంద్ర నాయకత్వం మాత్రం చూసి చూడనట్టు వ్యవహరిస్తుందని అర్థం చేసుకోవాలి. కవితను అడ్డు పెట్టుకుని బిజెపి తన రాజకీయ ప్రయోజనాలను కాపాడుకుంటోంది.