వల్లభనేని వంశీపై మరో మూడు కేసులు
posted on Feb 27, 2025 @ 10:43AM
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై మరో మూడు కేసులు నమోదయ్యాయి. వైసీపీ హయాంలో వంశీపాల్పడిన భూదందాలు, కబ్జాలు, మోసాలు, దౌర్జన్యాలు, అన్యాయాలు, అక్రమాలు అన్నీ ఒక్కటొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. బాధితులు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదులు చేస్తున్నారు. జగన్ హయాంలో గన్నవరం నియోజకవర్గంలో వంశీ ఆదింది ఆట.. పాడింది పాట అన్నట్లుగా పెత్తనం చెలాయించారు. అప్పట్లో ఆయనకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేయడానికే జనం భయపడే పరిస్థితి ఉండేది. ఒక వేళ ఎవరైనా ఫిర్యాదు చేసినా పోలీసులు కేసులు నమోదు చేసే పరిస్థితి లేదు. ఇప్పుడు జగన్ అధికారం కోల్పోయిన తరువాత అప్పట్లో వంశీ అరాచకాలకు, అక్రమాలకు బాధితులైన వారు ముందుకు వచ్చి ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే వంశీపై కృష్ణా జిల్లాలో మరో మూడు కేసులు నమోదయ్యాయి. ఆత్మకూరు, వీరవల్లి పోలీస్ స్టేషన్ లతోపాటు గన్నవరం పోలీస్ స్టేషన్ లో ఈ కేసులు నమోదు అయ్యాయి.
ఆత్మకూరులో ఓ పొలం వివాదంలో వంశీ ఆదేశాలతో ఆయన అనుచరుల పేరుతో దౌర్జన్యంగా పొలం రిజిస్ట్రేషన్ చేయించారని, ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారనీ బాధితుడు చేసిన ఫిర్ాయదు మేరకు ఆత్మకూరు పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే తన భూమి వంశీ కబ్జా చేశారంటూ ఓ న్యాయవాది ఫిర్యాదుపై కేసు నమోదైంది. అలాగే గన్నవరం నియోజకవర్గంలోని మర్లపాలెం మండలంలోని పానకాల చెరువులో అక్రమంగా మైనింగ్ తవ్వకాలు చేశారని, ఇలా చేయడం వల్ల ప్రభుత్వ ఆదాయానికి నష్టం జరిగిందని అందిన ఫిర్యాదు మేరకు గన్నవరం పోలీసులు మరో కేసు నమోదు చేశారు.
ఇప్పటికే గన్నవరం తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదు దారుడిని కిడ్నాప్ చేసి బెదిరించిన కేసులో వంశీని ఈనెల 13న పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వంశీ విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే.